బీర్బల్‌ సమయస్ఫూర్తి!

ఒక రోజు అక్బర్‌ చక్రవర్తి తన ఏకాంత మందిరంలో సేద తీరుతున్నాడు. ఎందుకో పాదుషాకు ఒకింత అసహనంగా చిరాగ్గా అనిపించింది. తనకు కాస్త సాంత్వన కావాలనిపించింది.

Published : 03 Mar 2024 01:01 IST

ఒక రోజు అక్బర్‌ చక్రవర్తి తన ఏకాంత మందిరంలో సేద తీరుతున్నాడు. ఎందుకో పాదుషాకు ఒకింత అసహనంగా చిరాగ్గా అనిపించింది. తనకు కాస్త సాంత్వన కావాలనిపించింది. చక్రవర్తికి వెంటనే బీర్బల్‌ గుర్తుకు వచ్చాడు. అక్బర్‌కు అలసటగా అనిపించిన అనేక సందర్భాల్లో బీర్బల్‌ తన హాస్యచతురత, సమయస్ఫూర్తి, తెలివితేటలతో అలరించేవాడు. అందుకే ఇప్పుడు కూడా బీర్బల్‌ను పిలిపించాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆదేశం మేరకు వెంటనే బీర్బల్‌ హాజరయ్యాడు. అనేక విషయాల గురించి అతనితో చర్చించిన తర్వాత అక్బర్‌ మదిలో ఓ ఆలోచన మెదిలింది. పనిలో పనిగా బీర్బల్‌ తెలివితేటలకు ఎప్పటిలాగే మరోసారి పరీక్ష పెట్టాలను కున్నాడు. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ‘బీర్బల్‌.. నీకు వెయ్యి వరహాలు ఇస్తాను... చక్రవర్తినైన నన్ను వెంటనే ఈ గది నుంచి బయటకు పంపగలవా?’ అని ప్రశ్నించాడు. ‘జహాపనా.. అపచారం.. అపచారం.. మీరు మా చక్రవర్తులు. మిమ్మల్ని గది నుంచి బయటకు పంపలేను.. కానీ ఒకసారి మీరు బయటకు వెళితే మాత్రం కొన్ని క్షణాల్లోనే తిరిగి మిమ్మల్ని లోపలకు తీసుకురాగలను’ అన్నాడు. ఆ సమాధానం అక్బర్‌కు చాలా విచిత్రంగా అనిపించింది. బీర్బల్‌ ఓడిపోయాడు. గెలుపు తనదే అనుకున్నాడు. ‘సరే నేను బయటకు వెళ్తాను. ఎలా లోపలకు తీసుకురాగలవో చూస్తాను’ అంటూ గదిలోంచి బయటకు వెళ్లాడు. అలా బయటకు వెళ్లిన అక్బర్‌ను ఎంతసేపటికీ లోపలకు పిలవలేదు బీర్బల్‌. ముందు తాను అడిగినట్లుగానే బీర్బల్‌ తనను తెలివిగా బయటకు పంపించాడనే విషయం అప్పటికికానీ అక్బర్‌కు అర్థం కాలేదు. బీర్బల్‌ తెలివితేటలను అభినందిస్తూ.. వెయ్యివరహాలతో పాటు మరెన్నో కానుకలిచ్చి సత్కరించాడు అక్బర్‌.












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..