రాయలవారి రాతిగోడ!

పూర్వం శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలించేవారు. ఆ సమయంలో రాజ్యానికి శత్రువుల బెడద తీవ్రంగా ఉండేది. రాజ్యాన్ని వారి బారి నుంచి రక్షించుకునేందుకు చక్కని సలహాలూ సూచనలూ ఇవ్వాలని ఆస్థానంలోని వారినీ సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన, దృఢమైన రాతి గోడ నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు.

Published : 17 Mar 2024 01:23 IST

పూర్వం శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలించేవారు. ఆ సమయంలో రాజ్యానికి శత్రువుల బెడద తీవ్రంగా ఉండేది. రాజ్యాన్ని వారి బారి నుంచి రక్షించుకునేందుకు చక్కని సలహాలూ సూచనలూ ఇవ్వాలని ఆస్థానంలోని వారినీ సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన, దృఢమైన రాతి గోడ నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. ఇది రాయలవారికీ సమ్మతంగా అనిపించడంతో దాన్ని వెంటనే అమలుపరిచారు. గోడ పూర్తైన కొన్ని రోజులకు సైన్యాధికారి దాన్ని ఫిరంగిగుళ్లతో కాల్పించాడు. కానీ గోడకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. దాని మన్నిక, దృఢత్వం శ్రీకృష్ణదేవరాయల వారికి ఎంతో నచ్చింది. ‘శత్రుమూకలు ఇకపై ఈ గోడను దాటి, లోపలికి ప్రవేశించలేవు. మన భద్రతకు ఇక ఏ ఢోకా లేదు... నిశ్చింతగా ఉండొచ్చు’ అని సైన్యాధికారిని పొగిడారు. కానీ తెనాలి రామలింగడికి ఆ మాటలు ఎందుకో నచ్చలేదు. ఒకరోజు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాయలవారితో మారువేషంలో వెళ్లే అవకాశం తెనాలికి దక్కింది. ఇద్దరూ చుట్టూ కట్టిన రాతి గోడ ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్లి, అక్కడే ఉన్న సైనికులతో ‘మేం వర్తకులం. పక్క రాజ్యం నుంచి వస్తున్నాం. మాకు మీ రాజధానిలో పని ఉంది. వెంటనే లోపలకు వెళ్లాలి’ అని అడిగారు. ‘అస్సలు కుదరదు. పై అధికారి అనుమతి లేనిదే లోనికి పంపడం సాధ్యం కాదు’ అని వారు చెప్పారు. ఇది విన్న రాయలవారు ఎంతో సంతోషించారు. కానీ తెనాలి.. ఆ పక్కనే ఉన్న పై అధికారిని కలిసి వంద బంగారు నాణేలు లంచంగా ఇచ్చి.. తామిద్దరినీ వెంటనే లోపలకు పంపేలా చూడమన్నాడు. ‘భటులారా! ఈ ఇద్దరినీ లోపలకు పంపించండి’ అని ఆ పై అధికారి ఆజ్ఞాపించాడు. జరిగింది చూసి ఆశ్చర్యపోతున్న రాయలవారితో.. ‘ప్రభూ.. అధికారుల్లో లంచగొండితనం ఉంటేే, గోడ ఎంత దృఢంగా ఉన్నా.. ప్రయోజనం శూన్యం. నిజాయతీపరులైన అధికారులే మన సామ్రాజ్యానికి అసలు సిసలు బలం’ అన్నాడు తెనాలి. మరుసటి రోజే ఆ అధికారిని విధుల్లోంచి తొలగించారు రాయలవారు. అప్పటినుంచీ అధికారులను నియమించేటప్పుడు కేవలం శారీరక దారుఢ్యాన్నే ప్రామాణికంగా తీసుకోకుండా వాళ్ల నిజాయతీనీ పరీక్షించడం ప్రారంభించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..