గురువు చెప్పిన గుణపాఠం

పూర్వం సత్యానందుడి గురుకులంలో చాలా మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆయన ఎంతో మందిని పండితులుగా తీర్చిదిద్దాడు. కానీ విజయవర్మ, అజేయవర్మ అనే రాకుమారుల విషయంలో మాత్రం ఓ ఇబ్బంది ఎదురైంది.

Published : 24 Mar 2024 00:14 IST

పూర్వం సత్యానందుడి గురుకులంలో చాలా మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆయన ఎంతో మందిని పండితులుగా తీర్చిదిద్దాడు. కానీ విజయవర్మ, అజేయవర్మ అనే రాకుమారుల విషయంలో మాత్రం ఓ ఇబ్బంది ఎదురైంది. వారిద్దరూ ఏదైనా విద్యను నేర్చుకోవడం ప్రారంభించిన ఒకటి, రెండు రోజుల్లోనే... ‘గురువు గారూ మాకు ఈ విద్య అబ్బడం లేదు. మరోటి నేర్పండి’ అనేవారు. సత్యానందుడు వారిలో ఎలా అయినా మార్పు తేవాలను కున్నాడు. ఒకరోజు ఇద్దరినీ పిలిచి ఆశ్రమంలో మొక్కలు నాటడానికి గుంతలు తవ్వే పని అప్పగించాడు. వాళ్లు కాస్త తవ్వగానే... ‘ఇక్కడ మట్టి బాగాలేదు. అదిగో అక్కడ తవ్వండి’ అని మరోచోటు చూపించాడు. వారు గురువుగారు చెప్పిన చోట తవ్వడం ప్రారంభించగానే తిరిగి మరో చోట తవ్వమని ఆయన చెప్పాడు. ఇలా సత్యానందుడు ఓ నాలుగైదుసార్లు చేసేసరికి, ‘ఇలాగైతే గుంతలు తవ్వడం ఎలా పూర్తవుతుంది, మొక్కలు నాటడం ఎప్పుడు పూర్తవుతుంది’ అని శిష్యులు గురువుగారిని భయంభయంగానే అడిగారు. సత్యానందుడు నవ్వుతూ... ‘ఎందుకు పూర్తికాదు. భేషుగ్గా పూర్తవుతుంది. మీరు ఆ విద్య కొంత, ఈ విద్య కొంత నేర్చుకుంటూ... మీ విద్యాభ్యాసం ఎలా పూర్తి చేస్తారో... ఈ పని కూడా అలాగే పూర్తవుతుంది’ అన్నాడు. శిష్యులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని, తలలు కిందకు వంచుకున్నారు. ‘మీరు ఒక విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తారు. అది పూర్తికాకుండానే, కొన్ని రోజుల్లోనే మరోటి చదువుతారు. అలా అయితే మీ విద్యాభ్యాసం ఎప్పటికి పూర్తవుతుంది’ అని సత్యానందుడు ప్రశ్నించాడు. ‘మన్నించండి గురువర్యా! ఇక పై మీరు చెప్పినట్లే నడచుకుని, మా విద్యాభ్యాసం పూర్తి చేస్తాం’ అని విజయవర్మ, అజేయవర్మ మాటిచ్చారు. అప్పటి నుంచి వారు మధ్యలోనే దేన్నీ వదిలేయకుండా సంపూర్ణంగా విద్యలు నేర్చుకున్నారు. సత్యానందుడికి ప్రియశిష్యులుగా మారారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు