సిసింద్రీ

రంగరాజపురానికి చెందిన సోమయ్య పెద్ద భూస్వామి. ఏమాత్రం అవకాశం దొరికినా.. జనాల్ని మోసం చేయాలని చూసేవాడు. చిన్నచిన్న చేబదుళ్లు తీసుకుని, వాటిని చెల్లించేవాడు కాదు.

Published : 30 Mar 2024 23:44 IST

 

ఉడకని పప్పులు!

రంగరాజపురానికి చెందిన సోమయ్య పెద్ద భూస్వామి. ఏమాత్రం అవకాశం దొరికినా.. జనాల్ని మోసం చేయాలని చూసేవాడు. చిన్నచిన్న చేబదుళ్లు తీసుకుని, వాటిని చెల్లించేవాడు కాదు. ఇచ్చిన వాళ్లు తిరిగి అడిగితే.. ‘ఆ మాత్రం వంద, రెండు వందల రూపాయలకు ఆగలేవా?!’ అని ఎదురు ప్రశ్నించేవాడు. తన జేబులోంచి మాత్రం రూపాయి కూడా బయటకు తీసేవాడు కాదు.  నడి వేసవిలో ఒకసారి తన బంధువులతో కలిసి వెళ్తుంటే వీరయ్య కొబ్బరిబొండాల కొట్టు కనిపించింది. అక్కడ ఆగి కొబ్బరి నీళ్ళు తాగాడు. చుట్టాలకూ ఇప్పించాడు. మొత్తం నాలుగువందల రూపాయలైంది. సోమయ్య జేబులు వెతుక్కున్నట్లు నటించి.. ‘అయ్యో.. నా మతిమరుపు పాడుగానూ! డబ్బులు పాత చొక్కాలో ఉండిపోయాయి. వీళ్లను బస్సు ఎక్కిద్దామన్న తొందర్లో.. నేను మరో చొక్కా వేసుకుని వచ్చాను. బంధువులను అడిగితే బాగోదు. అయినా నీ డబ్బు ఎక్కడి పోతుందిలే. ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు నాకు గుర్తుచెయ్యి’ అని ముందుకు కదలబోయాడు. అతడి గురించి తెలిసిన వీరయ్య, ముల్లును ముల్లుతోనే తీయాలనుకున్నాడు. ‘అయ్యా.. నాకు మాత్రం ఎక్కడ గుర్తుంటుంది. ఓ పని చేస్తాను. బాకీ సొమ్ము మొత్తం ఈ గోడ మీద రాస్తాను. అది చూసినప్పుడల్లా మీ బాకీ నాకు జ్ఞాపకం వస్తుంది. మీకు గుర్తు చేస్తాను’ అన్నాడు. వీరయ్య సమాధానానికి సోమయ్య అవాక్కయ్యాడు. ఇంతలోనే వీరయ్య ఓ బొగ్గుముక్క తీసుకుని గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు. ‘అంతలేసి అక్షరాలతో నా పేరు, బాకీ సొమ్ము రాస్తున్నావు. జనమంతా అది చూస్తారు. నాకెంత అమర్యాద’ అన్నాడు. నేనేమీ చేసేది లేదన్నట్లు ఓ చూపు చూసి.. వీరయ్య ఇంకా రాస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదనుకుని.. ‘అరరే.. డబ్బులు ప్యాంట్‌ జేబులో పెట్టానోయ్‌. ఇదిగో నీ నాలుగువందలు. వెంటనే గోడ మీద ఆ రాతలు తుడిపించు’ అన్నాడు. నాలుగువందలు తీసుకున్న వీరయ్య.. తన దగ్గరున్న పని కుర్రాడితో ఆ రాతలు చెరిపించాడు. ‘ప్చ్‌.. ఈ వీరయ్య మహా ఘటికుడు. నా పప్పులు ఇతని దగ్గర ఉడకలేదు’ అని మనసులో అనుకుని ముందుకు కదిలాడు సోమయ్య.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..