సిసింద్రీ

అనగనగా సీతాపురం అనే గ్రామం. అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగూరి వారపుసంతకు తన కుమారుడు శేఖర్‌ను తీసుకుని బయలుదేరాడు.

Published : 21 Apr 2024 00:25 IST

లోకం తీరు

నగనగా సీతాపురం అనే గ్రామం. అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగూరి వారపుసంతకు తన కుమారుడు శేఖర్‌ను తీసుకుని బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పుడు సామగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదనూ తీసుకువెళ్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్లిన తర్వాత... వారి గ్రామానికే చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ‘ఏమయ్యా... ఇంత ఎండలో నీ కొడుకును నడిపిస్తున్నావు. ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా! దాని మీద పిల్లాడిని కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లొచ్చు కదా!’ అన్నారు. దీంతో రంగయ్య శేఖర్‌ను గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరి కొంత దూరం వెళ్లాక... వయసులో కాస్త పెద్దాయన ఎదురయ్యాడు. ‘నువ్వు కుర్రోడివి అయి ఉండి... ఎంచక్కా గాడిద మీద కూర్చున్నావు. మీ నాన్నగారినేమో ఈ ఎండలో నడిపిస్తున్నావు. నీకు కాస్త కూడా తెలివి లేదా?’ అన్నాడాయన. ‘అవును నిజమే..’ అనుకుని శేఖర్‌ గాడిద దిగి, వాళ్ల నాన్నను కూర్చోబెట్టాడు. అలా కొంతదూరం వెళ్లాక... మరో ఇద్దరు ఎదురై... ‘చూడు ఆ వ్యక్తి నిర్వాకం. వయసులో పెద్దవాడై ఉండీ... గాడిద మీద ఊరేగుతున్నాడు. పిల్లాడిని మాత్రం నడిపిస్తున్నాడు. అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరూ దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా!’ అన్నారు. ‘సరే అని... ఇద్దరూ గాడిద మీద కూర్చుని ముందుకు సాగుతున్నారు. ‘మీకసలు మానవత్వం ఉందా? ఇద్దరూ కలిసి గాడిదను చంపేసేలా ఉన్నారే’ అని గట్టిగా అరిచారు ఎదురుగా వస్తున్న కొందరు పాదచారులు. ‘అయ్యో... నిజమే కదా... గాడిద ఇద్దర్ని ఎలా మోయగలదు’ అనుకుని తండ్రీకొడుకులిద్దరూ దాని మీద నుంచి కిందకు దిగారు. అదిబాగా అలిసిపోయి కనిపించేసరికి... ఓ పెద్ద గోనెసంచిలో దాన్ని కూర్చుండబెట్టి, గట్టి కర్రకు కట్టి ఇద్దరూ తమ భుజాల మీద మోయడం ప్రారంభించారు. అలా కొంత దూరం నడిచాక... ‘హే... చూడండి... గాడిదను మనుషులు మోస్తున్నారు’ అని మరికొందరు వీళ్ల దగ్గరకు వచ్చి బిగ్గరగా నవ్వారు. ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోంచి గెంతి... పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఇంత. ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలూ వినకుండా... మన పని మనం చేసుకుంటే సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రీకొడుకులు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..