బుజ్జి మేక తెలివి!

అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది. అది ఒక రోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్లింది. ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే.

Published : 04 May 2024 23:13 IST

నగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది. అది ఒక రోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్లింది. ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే. అందుకే అది మందతో కలిసి ఉండకుండా, అటు, ఇటూ గెంతుతూ అడవి లోపలికి వెళ్లిపోయింది. దాన్ని ఒక పెద్దపులి చూసింది. వెంటనే ముందుకు దూకింది. ఊహించని ఈ పరిణామానికి మేకపిల్ల గజగజా వణికిపోయింది. కానీ తెలివైంది కనుక, వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. పైకి గంభీరంగా నటిస్తూ... ‘పెద్దపులి బాబాయ్‌... పెద్దపులి బాబాయ్‌... నేను నీకూ, నాకూ సంబంధించిన ఓ నాలుగు నిజాలు చెబుతాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే, ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా?’ అంది. ‘ఏంటీ... పెద్దపులినైన నాకూ, మేకపిల్లవైన నీకూ సంబంధించిన నిజాలా? ఏంటో చెప్పు చూద్దాం?’ అంది అది కాస్త ఆసక్తిగా. ‘‘ఏంలేదు బాబాయ్‌... నువ్వు నీతోటి పెద్దపులులతో... ‘ఇవాళ నేనొక మేక పిల్లను చూశాను. కానీ దాన్ని చంపకుండా వదిలేశాను..’ అని చెబితే అవి అస్సలు నమ్మవు. నిజమేనా’’ అంది బుజ్జిమేక. ‘అవును... నిజమే అంది’ పెద్దపులి. ‘‘నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్లి... ‘ఈ రోజు నేనొక పెద్దపులికి చిక్కాను. కానీ అది ఏమీ చేయకుండా వదిలేసింది’ అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా!’ అని అంది మేకపిల్ల. ‘అవును..’ అని తలాడించింది పెద్దపులి. ‘నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే... నువ్వు నన్ను వదిలేయాలి కదా..’ అంది బుజ్జిమేక. ‘అవును’ అంది పులి. ‘మరి నేను ఇక వెళ్లిపోనా..’ అంది మేకపిల్ల. ‘వెళ్దువుకానీ... ఆ నాలుగో నిజం ఏంటో కూడా చెప్పు’ అంది పెద్దపులి.

‘బాబాయ్‌... నీకు ఇప్పుడు ఆకలి లేదు. నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు. అందుకే నేను కబుర్లు చెబుతున్నా, నన్ను చంపకుండా... చక్కగా వింటున్నావు!’ అంది మేకపిల్ల. దాంతో పెద్దపులికి నవ్వొచ్చింది... తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది. ‘నిన్ను చంపనులే... ఇక పో!’ అంది పెద్దపులి. ‘హమ్మయ్య! గండం గడిచింది’ అని మనసులో అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగుపరుగున వెళ్లిపోయి, మందలో కలిసింది. ఆ తర్వాత అది ఇంకెప్పుడూ మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు