నక్క జిత్తులు.. ఒంటె ఎత్తులు!

అనగనగా ఓ నదిని ఆనుకుని చిట్టడవి ఉండేది. ఆ వనంలోని ఒంటెతో అన్ని జంతువులూ స్నేహంగా ఉండేవి. అది నక్కకు నచ్చలేదు. దీంతో ఒంటెపైన అక్కసు పెంచుకుంది. ఓ రోజు ఒంటె దగ్గరికి వెళ్లి.. ‘మిత్రమా..!

Updated : 12 May 2024 00:53 IST

నగనగా ఓ నదిని ఆనుకుని చిట్టడవి ఉండేది. ఆ వనంలోని ఒంటెతో అన్ని జంతువులూ స్నేహంగా ఉండేవి. అది నక్కకు నచ్చలేదు. దీంతో ఒంటెపైన అక్కసు పెంచుకుంది. ఓ రోజు ఒంటె దగ్గరికి వెళ్లి.. ‘మిత్రమా..! మన అడవిలో నా బోటి జీవులకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ నది ఆవల తీరంలో చాలా కుందేళ్లూ, ఉడతలూ, మిడతలూ, చేపలూ, పీతలూ ఉన్నాయట. నాకు ఈత రాదు కాబట్టి.. నన్ను నువ్వే తీసుకెళ్లాలి. అయినా నాకేమీ ఊరికే సహాయం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చక్కని చెరకు తోటలున్నాయి. వాటిని నీకు చూపిస్తానులే’ అంది నక్క. ఒంటె సరేనని దాన్ని తన వీపుపైన ఎక్కించుకుని నది అవతలి తీరానికి తీసుకెళ్లింది. నక్కకు అక్కడ కడుపునిండా తిండి దొరికింది. ఒంటెకు చెరకు తోటనూ చూపించింది. కానీ.. అది తింటుండగా కావాలని ఊళ పెట్టింది. అది విన్న రైతులు ఒంటెను కర్రలతో చితకబాదారు. అతికష్టం మీద తప్పించుకొని నది ఒడ్డు వరకు పారిపోయి వచ్చిందది. అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది. వెంటనే ఒంటెపైకి ఎక్కి కూర్చుంది. ‘బాగా తిన్నావా మిత్రమా! రా.. ఇక మనం మన అడవికి వెళ్లిపోదాం’ అంది అది. ఒళ్లంతా దెబ్బలతో ఉన్న ఒంటె, అతికష్టంగా ఈదసాగింది. నది మధ్యలోకి రాగానే ఒంటె, నక్కతో.. ‘అవునూ.. ఇంతకూ నువ్వు ఎందుకు ఊళ పెట్టావు?’ అని అడిగింది. ‘ఓ.. అదా.. కడుపు నిండగానే అలా అరవడం అలవాటు. లేకపోతే నాకు అజీర్తి చేస్తుంది’ అంది నక్క. ‘ఓహో అలాగా... సరేకానీ, ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపునిండా తినలేకపోయాను. సరిగా తిననప్పుడు నీళ్లలో పల్టీలు కొట్టడం నాకు అలవాటు. లేకపోతే నాకు మైకం వస్తుంది’ అంది ఒంటె. ‘అమ్మో.. ఇప్పుడు నువ్వు పల్టీలు కొడితే ఎలా? నేను మునిగిపోతాను. అసలే నాకు ఈత కూడా రాదు’ అంది నక్క. ‘అయ్యో.. కానీ, నేనేం చేయలేను’ అంది ఒంటె. అప్పటికి కానీ నక్కకు బుద్ధి రాలేదు. వెంటనే క్షమాపణలు అడగాలనుకుంది. కానీ ఈలోపే ఒంటె పల్టీలు కొట్టడంతో నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి, మునిగిపోయింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..