సిసింద్రీ

అ వంతీపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ, విదేశాల నుంచి పేరుమోసిన వంటగాళ్లను రప్పించాడు.

Published : 19 May 2024 00:22 IST

అసలైన రుచి!

వంతీపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ, విదేశాల నుంచి పేరుమోసిన వంటగాళ్లను రప్పించాడు. మొదట్లో వారు చేసిన వంటలను మూడుపూటలా కడుపునిండా తినేవాడు. కానీ... కొంతకాలానికే రాజుకు అవి రుచిగా అనిపించలేదు. దీంతో... తనకు నచ్చేలా వంటచేసే వంటవాడు కావాలని దండోరా వేయించాడు. మరుసటి రోజు- రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు, మహేంద్రవర్మ వద్దకు వెళ్లాడు. ‘ప్రభూ! నేను ఓ దుంపల పులుసు చేస్తాను. అది మహా రుచిగా ఉంటుంది. కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. వాటిని కోసిన వెంటనే వండాలి. మీరూ నాతోపాటు రావాల్సి ఉంటుంది’ అన్నాడు. దానికి రాజు సరేనని, తన అంగరక్షకులతోపాటు నరేంద్రుడిని అనుసరించాడు. కాస్త దూరం గుర్రాల మీద వెళ్లిన తర్వాత... ముందున్న దారంతా పొదలూ రాళ్లూ రప్పలతో నిండి ఉంది. చేసేది లేక వారంతా గుర్రాలు దిగి నడక ప్రారంభించారు. కాసేపటి తర్వాత... ‘నరేంద్రా! నేనిక నడవలేను. ఇప్పటికే నాకు ఆయాసం వస్తోంది. పైగా విపరీతంగా ఆకలి వేస్తోంది’ అన్నాడు రాజు. ‘ప్రభూ! మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి. నేనెళ్లి తీసుకొస్తాను’ అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు. పొదల చాటుకు వెళ్లి, తనతోపాటు రహస్యంగా తెచ్చిన బంగాళాదుంపలతో పులుసు చేసి, అన్నం వండి వడ్డించాడు. ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్రవర్మ ఆవురావురుమంటూ తినేశాడు. ‘అద్భుతం... ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు. ఇంతకీ ఇవేం దుంపలు’ అన్నాడు రాజు. ‘ప్రభూ! మన్నించండి... ఇవి కేవలం బంగాళాదుంపలు. మీరు బాగా నడవడం వల్ల అలసిపోయారు. పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టే ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది. అదే శారీరక శ్రమ చేయకుండా, ఆకలి లేనప్పుడు... ఎంత చక్కని వంట తిన్నా, రుచిగా అనిపించదు’ అన్నాడు. అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్రవర్మ వెనువెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు. తిండితోపాటు వ్యాయామానికీ ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్నా... పరమాన్నంలా అనిపించసాగింది. తర్వాత నరేంద్రుడిని తన ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకున్నాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..