సరైన ఎంపిక!

దేవగిరి రాజ్యాన్ని సదానందుడు పాలించేవాడు. అతనికి బంగారం, వజ్రాల ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఇతర రాజ్యాల నుంచి కూడా ఆభరణాలు తయారు చేసేవారిని రప్పించుకునేవాడు.

Published : 26 May 2024 00:09 IST


దేవగిరి రాజ్యాన్ని సదానందుడు పాలించేవాడు. అతనికి బంగారం, వజ్రాల ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఇతర రాజ్యాల నుంచి కూడా ఆభరణాలు తయారు చేసేవారిని రప్పించుకునేవాడు. వాటి కోసం ఎంత డబ్బు అయినా... ఖర్చు చేసేవాడు. ఓసారి, పక్క రాజ్యానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి... ఆభరణాలు అద్భుతంగా తయారు చేస్తాడని తెలిసి, అతన్ని పిలిపించాడు సదానందుడు. లక్షల్లో డబ్బు ఖర్చు చేసి... నచ్చినట్లుగా ఆభరణాలు చేయించుకున్నాడు. అంతే కాకుండా అతని పని బాగా నచ్చడంతో... ఆస్థానంలోనే ఉద్యానవన సంరక్షణ విభాగంలో ఉద్యోగం ఇచ్చాడు. ఇష్టం లేకపోయినా... మహారాజు మాట కాదనలేక కొలువులో చేరాడు సుబ్బయ్య. కానీ అతనికి ఆ పని తెలియకపోవడంతో... ఆ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది.

ఇంతలోనే సదానందుడి పుట్టినరోజు వచ్చింది. ఆరోజు సుబ్బయ్య ఆయన దగ్గరకు వెళ్లి... ‘మహారాజా! నేను  మీ కోసం ఎంతో కష్టపడి మీ బొమ్మ గీయించి తీసుకొచ్చాను... తీసుకోండి’ అంటూ అందించాడు. ఆ బొమ్మ చూసిన మహారాజుకి ఒక్కసారిగా కోపం వచ్చింది. ‘అసలు ఎవరీబొమ్మ గీసింది. నన్ను అవమానించడానికే ఇది తీసుకొచ్చావా?’ అని సుబ్బయ్య మీద అరిచాడు మహారాజు. అప్పుడతను... ‘నా కుమారుడు గీశాడు మహారాజా! తను పాటలు చాలా అద్భుతంగా పాడతాడు. అందుకే... గీయించాను’ అని బదులిచ్చాడు. ‘పాటలు బాగా పాడేవాళ్ళతో... పాటలు పాడించాలి. అంతే కానీ బొమ్మలు గీయిస్తారా?’ అని కోపంగా అన్నాడు రాజు. ‘మరి నగలు అందంగా చేస్తానని తెలిసినా మీరు నన్ను... ఆస్థానంలో వేరే పనికి నియమించడం కూడా సరైంది కాదు కదా మహారాజా!’ అన్నాడు సుబ్బయ్య. దాంతో తన పొరపాటు తెలుసుకున్న మహారాజు... సుబ్బయ్యను మళ్లీ తన రాజ్యానికి పంపించాడు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..