ఆ పుస్తకం రాస్తా!

చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపుల తోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుందిలా...

Updated : 28 Apr 2024 03:35 IST

చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపుల తోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుందిలా...


చదువు

స్కూల్‌డేస్‌లో సమ్మర్‌ క్యాంపులకు వెళుతూ యాక్టింగ్‌, పెయింటింగ్‌, డాన్స్‌ వంటివి నేర్చుకునేదాన్ని. టెన్త్‌ తరవాత హోమ్‌ స్కూలింగ్‌ పద్ధతిలో ఇంటర్‌ చదువుకుంటూనే... పెయింటింగ్‌, సాహిత్యం క్లాసులకు హాజరయ్యేదాన్ని. ఆసక్తి కొద్దీ హైదరాబాద్‌లోని పలు థియేటర్‌ గ్రూప్స్‌తో కలిసి నాటకాలు వేశా. లయోలా కాలేజీలో మాస్‌ కమ్యూనికేషన్స్‌ చేస్తున్నప్పుడు... ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన నాగ్‌ అశ్విన్‌ని కలిశా. నా గురించి చెప్పడంతో ఆఫీసుకొచ్చి ఆడిషన్‌ ఇవ్వమన్నారు. అలా ‘జాతిరత్నాలు’ సినిమాకి ఎంపికయ్యా.


మొదటి సినిమా

నేను చిన్నప్పట్నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగా. తెలుగులో చూసిన మొదటి సినిమా ‘వర్షం’. అందులో త్రిష నటనకీ, అందానికీ ఫిదా అయిపోయి ఆమెకి అభిమానిగా మారా. హీరోల విషయానికొస్తే ఫహాద్‌ ఫాజిల్‌కి వీరాభిమానిని.


డ్రీమ్‌ రోల్‌

సైకో పాత్రలో నటించా లనుంది. నా దృష్టిలో ప్రతికూల పాత్రల్లో నటించడమే అసలైన సవాలు.


అల్లరి

చిన్నప్పుడు దొంగతనం చేయాలని కోరికగా ఉండేది. ఫ్రెండ్స్‌ని బలవంత పెట్టి, ఒక రోజు సూపర్‌మార్కెట్‌కి వెళ్లి చిప్స్‌ ప్యాకెట్లూ చాక్లెట్లూ తీసుకుని బ్యాగులో పెట్టుకున్నాం. బ్యాగుతో నేను బయటకు బాగానే వచ్చాను కానీ మా ఫ్రెండ్స్‌ మాత్రం దొరికిపోయారు. ఆ రోజు వాళ్లంతా నన్ను చూసిన చూపు ఇంకా ఇప్పటికీ గుర్తుంది.


బలాలు

నన్ను నేను ప్రేమించుకుంటా, గౌరవించుకుంటా. ప్రతిరోజూ నాకోసం నేను కొంత సమయం కేటాయించుకుంటా. తక్కువ మాట్లాడతా, ఎక్కువ పని చేస్తా.


బలహీనత

ఏ పనీ పూర్తి చేయను. అన్నీ మధ్యలో ఆపేస్తుంటా. ఓ పుస్తకం తీశాననుకోండి... సగం చదివి పక్కన పెట్టేస్తా. ఏదైనా నేర్చుకోవాలనుకుంటా.. కొన్నిరోజులకే అదీ మానేస్తుంటా.


కోరిక

నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. వెళ్లిన ప్రతిచోటా ఆహారం, సంప్రదాయాల గురించి తెలుసుకుని వివరంగా రాసుకోవడం అలవాటు. ఆ  విశేషాలతో ఓ పుస్తకం రాయాలనేది నా కోరిక.


డాన్స్‌ ఇష్టం

ఇంట్లో అందరికీ కళలంటే చాలా ఇష్టం. నాకు మాత్రం నటన, డాన్స్‌ అంటే ఎంతో ఆసక్తి. కథక్‌, హిప్‌హాప్‌, బెల్లీ, ఫ్రీస్టయిల్‌, వెస్టర్న్‌ డాన్స్‌లు వచ్చు. సినిమాల్లో అల్లు అర్జున్‌, ఐశ్వర్యారాయ్‌, మాధురీ దీక్షిత్‌లు డాన్స్‌ చేస్తుంటే అలా చూస్తుండి పోవాలనిపిస్తుంది.


స్ఫూర్తి

సినిమాలతోపాటు కళలకీ ప్రాధాన్యమిచ్చే అమితాబ్‌ బచ్చన్‌ నాకు స్ఫూర్తి. ఆయన గురించి తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలని పిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ కష్టపడుతుంటారు. తీరిక దొరికితే కేబీసీలో ఆయన చెప్పే ఆసక్తికర విషయాలు చూస్తుంటా.


ఆహారం

నాకు ఓల్డ్‌ సిటీ స్ట్రీట్‌ ఫుడ్‌ చాలా ఇష్టం. బిర్యానీ, గాజర్‌ హల్వా, డబల్‌ కా మీఠా, గులాబ్‌జామూన్‌ ఎంతిష్టమో. చూస్తే తినకుండా అసలు ఉండలేను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు