రామయ్యకు... భక్తితో!

జగదభిరాముడి కల్యాణాన్ని కళ్లారా చూసి తరించే వేడుకే శ్రీరామనవమి. ఆ కల్యాణోత్సవ విందులో పానకం - వడపప్పు ఎలాగూ ఉంటాయి కాబట్టి... అవి కాకుండా ఇంకేం చేయొచ్చని ఆలోచిస్తుంటే వీటిని చూసేయండోసారి. 

Published : 14 Apr 2024 00:26 IST

జగదభిరాముడి కల్యాణాన్ని కళ్లారా చూసి తరించే వేడుకే శ్రీరామనవమి. ఆ కల్యాణోత్సవ విందులో పానకం - వడపప్పు ఎలాగూ ఉంటాయి కాబట్టి... అవి కాకుండా ఇంకేం చేయొచ్చని ఆలోచిస్తుంటే వీటిని చూసేయండోసారి. 


అటుకుల పొంగలి

కావలసినవి: మందంగా ఉండే అటుకులు: పెద్ద కప్పు, బెల్లంపొడి: ముప్పావుకప్పు, నీళ్లు: అరకప్పు, పాలు: అరకప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు: పది, కిస్‌మిస్‌:
పది, ఉడికించిన పెసరపప్పు: పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా.

తయారీ విధానం: స్టవ్‌మీద గిన్నె పెట్టి పావుకప్పు నీళ్లు పోసి బెల్లంపొడి వేయాలి. బెల్లం కరిగి లేతపాకంగా మారుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ను వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మరో చెంచా నెయ్యి వేసి అటుకుల్ని వేయించుకోవాలి. రెండు నిమిషాలయ్యాక మిగిలిన నీళ్లూ పాలూ పోసి కలుపుతూ ఉండాలి. అటుకులు కాస్త మెత్తగా అవుతున్నప్పుడు చేసిపెట్టుకున్న బెల్లంపాకం, పెసరపప్పు ముద్ద, యాలకులపొడి, మిగిలిన నెయ్యి వేసి కలపాలి. పొంగలి దగ్గరకు అవుతున్నప్పుడు వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు వేసి దింపేయాలి.


రవ్వ బేసన్‌ లడ్డు

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, సెనగపిండి: అరకప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పు, నెయ్యి: పావుకప్పు, నీళ్లు: కప్పు, యాలకులపొడి: అరచెంచా, బాదంపలుకులు: టేబుల్‌స్పూను, కిస్‌మిస్‌: కొన్ని.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక
సెనగపిండిని వేయించి ఇందులో రవ్వ వేసి మరోసారి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద ఓ గిన్నె  పెట్టి నీళ్లు పోసి చక్కెర వేయాలి. చక్కెర కరిగి తీగపాకం వస్తున్నప్పుడు దింపేసి సెనగపిండి మిశ్రమంలో వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇందులో యాలకులపొడి, బాదంపలుకులు, కిస్‌మిస్‌ వేసి  కలిపి వేడి చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి.


వంకాయ బోండా

కావలసినవి: చిన్న వంకాయలు: అయిదారు, సెనగపిండి: కప్పు, కారం: అరచెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, వాము: చెంచా, వంటసోడా: చిటికెడు.

స్టఫింగ్‌కోసం: కొబ్బరితురుము: టేబుల్‌స్పూను, వేయించిన పల్లీలపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, చింతపండు గుజ్జు: చెంచా, కారం: అరచెంచా, దనియాలపొడి: అరచెంచా, జీలకర్రపొడి: అరచెంచా, ఉప్పు: తగినంత, వేయించిన నువ్వులపొడి: చెంచా.

తయారీ విధానం: ముందుగా స్టఫింగ్‌కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని కలిపి పెట్టుకోవాలి. వంకాయల్ని శుభ్రంగా కడిగి.. గుత్తివంకాయకు కోసినట్లుగా నాలుగు గాట్లు పెట్టుకుని నీళ్లలో వేసుకోవాలి. అలాగే సెనగపిండి, కారం, పసుపు, ఉప్పు, వాము, వంటసోడా ఓ గిన్నెలో వేసుకుని నీళ్లతో బజ్జీల పిండిలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు గాట్లు పెట్టుకున్న వంకాయల్ని కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడి చల్లారాక కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఈ వంకాయల్లో కూరి... ఆ తరువాత సెనగపిండి మిశ్రమంలో ముంచి... కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది.


బంగాళాదుంప వడ

కావలసినవి: ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, బియ్యప్పిండి: కప్పు, జీలకర్ర: చెంచా, నువ్వులు: అర టేబుల్‌స్పూను, కారం: అరచెంచా, అల్లంపేస్టు: అరచెంచా, పచ్చిమిర్చి పేస్టు: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి రెండు కప్పుల నీళ్లు పోయాలి. అందులో జీలకర్ర, నువ్వులు, కారం, అల్లంపేస్టు, పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, చెంచా నూనె వేసి కలపాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి దగ్గరకు వచ్చాక దింపేయాలి. ఇందులో బంగాళాదుంపల ముద్ద కూడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడల్లా అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే చాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..