కొబ్బరి చిప్పలతో... కొత్త బ్యాటరీలు!

నగరాల్లోనే కాదు- పట్టణాల్లోనూ ఇన్వర్టర్ల వినియోగం పెరుగుతోంది. వాటితోపాటూ ఇంటింటా సౌరవిద్యుత్తు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి

Updated : 24 Mar 2024 18:57 IST

నగరాల్లోనే కాదు- పట్టణాల్లోనూ ఇన్వర్టర్ల వినియోగం పెరుగుతోంది. వాటితోపాటూ ఇంటింటా సౌరవిద్యుత్తు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక, స్కూటర్‌ నుంచి బస్సుల దాకా అన్నీ ఇప్పటికే ‘ఈవీ’లుగా మారుతున్నాయి. వీటన్నింటికీ బ్యాటరీ అవసరం తప్పనిసరి కదా! లెడ్‌-యాసిడ్‌, లిథియం-అయాన్‌ ఇలా బ్యాటరీ రకం ఏదైనా సరే- వాటి సామర్థ్యాన్ని 125 శాతం పెంచేస్తోంది ‘కాంక్రి’ అనే స్టార్టప్‌. అదీ... ఖాళీ కొబ్బరి చిప్పలతో! వాటికీ బ్యాటరీలకీ లింకేమిటని ఆశ్చర్యపోతున్నారు కదా... అయితే కాంక్రి గురించి మీరు తెలుసు కోవాల్సిందే!

 భవిష్యత్తులో ఒక్క ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(ఈవీ) మాత్రమే కాదు- ఇంటింటికీ సౌరవిద్యుత్తు వాడకం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ కరెంటుని నిల్వ చేయడానికి బ్యాటరీల అవసరమూ పెరుగుతుంది. అలా 2030 కల్లా మనదేశంలో 680 గిగా వాట్ల మేరకు ‘గ్రిడ్‌’ బ్యాటరీ స్టోరేజీ పెరుగుతుందట. ఇప్పటికే ఏటా 80 గిగా వాట్ల వంతున కొత్త బ్యాటరీలు వస్తున్నాయట! పెట్రోలు, నేలబొగ్గుకి ప్రత్యామ్నాయ ఇంధనంగా వీటిని తెస్తున్నారన్న విషయం మనకు తెలుసు. కానీ- ఈ బ్యాటరీల తయారీలోనూ ఎంతోకొంత పర్యావరణ విధ్వంసం ఉంటోంది. మన ఇళ్ళలోని ఇన్వర్టర్‌లలో ఉపయోగించే ‘లెడ్‌ యాసిడ్‌’ బ్యాటరీల్లో గ్రాఫైట్‌ అనే పదార్థాన్ని వాడతారు. ఇక ‘ఈవీ’ల్లో వాడే ఆధునిక బ్యాటరీల్లో గ్రాఫైట్‌తోపాటూ లెడ్‌, లిథియం అనే లోహాల్ని ఉపయోగిస్తారు. సమస్యేమిటంటే... ఈ గ్రాఫైట్‌, లెడ్‌, లిథియం- వీటన్నింటినీ నేలని తవ్వి తీయాల్సిందే! ఆ మేరకు పర్యావరణానికి ముప్పు ఏర్పడ్డట్టే. అందుకే వాటికీ ఓ ప్రత్యామ్నాయం చూపించాలనుకున్నారు అక్షయ్‌ జైన్‌, మహీ సింగ్‌ అనే యువజంట. అందుకు ఖాళీ కొబ్బరి చిప్పల్ని ఎంచుకున్నారు!

సింగపూర్‌లో వచ్చిన ఐడియా!

అక్షయ్‌, మహీ- ఇద్దరిదీ రాజస్థాన్‌లోని జైపూర్‌. ఒకే స్కూల్లో చదివారు. బీటెక్‌లో కాలేజీలు మారినా మనసులు కలిశాయి. ముందు అక్షయ్‌ సింగపూర్‌ వెళ్ళి అక్కడి జాతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో చేరాడు. రెండేళ్ళ తర్వాత మహీ కూడా అక్కడి నన్యాంగ్‌ వర్సిటీలో మాస్టర్స్‌ చేయడానికి వచ్చింది. అక్కడ చదువుతున్నప్పుడే ఇద్దరూ పర్యావరణహిత ఇంధనాలపైన ఆసక్తి పెంచుకున్నారు. కాగితాలు, జుట్టు, రబ్బరు, ప్లాస్టిక్‌... ఇలా 15 రకాల వ్యర్థాలతో ఎరువుల్ని తయారుచేయడానికి ప్రయత్నించారు. వాటన్నింటినీ కాదనుకుని చివరికి- కొబ్బరి చిప్పలపైన దృష్టిపెట్టారు. వాటిని కాల్చి- ఆ కాల్చిన పొడి నుంచి ‘నానో కార్బన్స్‌’ అనే అతిసూక్ష్మ, నల్లటి పొడిని వేరు చేసే ఓ విధానాన్ని కనిపెట్టాడు అక్షయ్‌ జైన్‌. దానిపైన పేటెంట్‌ కూడా తీసుకున్నాడు. కొబ్బరి చిప్పలోని గట్టిదనానికి తగ్గట్టే ఈ ‘నానో కార్బన్స్‌’కీ మన్నిక ఎక్కువని నిరూపించాడు. వీటిని బ్యాటరీల్లో వాడొచ్చన్న విశ్వాసంతో- అజయ్‌, మహీ జంట మళ్ళీ భారత్‌కి వచ్చారు!

ఇలా చేస్తారు...

భారత్‌కి వచ్చాక పలు బ్యాటరీ కంపెనీల మెట్లు ఎక్కారు అజయ్‌, మహీలు. తమ నానో కార్బన్స్‌ని ‘లెడ్‌ ఆసిడ్‌’ బ్యాటరీల్లో గ్రాఫైట్‌కి బదులుగానూ, ఆధునిక లిథియం-అయాన్‌ బ్యాటరీల్లో లెడ్‌, లిథియంలకి ప్రత్యామ్నాయంగానూ ఉపయోగించవచ్చని చెప్పారు. అంతేకాదు, తమ ఆవిష్కరణలోని ప్రత్యేకత వల్ల బ్యాటరీ సామర్థ్యం 125 శాతం మేరకు పెరుగుతుందనీ నిరూపించారు. ఎంత మంచి ఆవిష్కరణ అయితేనేం- మొదట్లో వీళ్ళనెవరూ నమ్మలేదు. కనీసం ప్రయోగాలకి ల్యాబుని అందించడానికీ వెనకాడారు. దాంతో- తమకున్న అతితక్కువ వనరులతోనే రోజుకి ‘ఒక్క గ్రాము’ నానో కార్బన్‌ని తయారుచేసి సంతృప్తి పడేవాళ్ళు అక్షయ్‌-మహీలు. అలా ఒకటీరెండూ కాదు ఏడేళ్ళపాటు నిరీక్షించాల్సి వచ్చింది ఇద్దరూ!

ఆ తర్వాతే...

2020 తర్వాత ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాలకి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టాయి. దాంతో బ్యాటరీల అవసరం పెరిగింది. అప్పుడే కంపెనీలు
వీళ్ళ ఆవిష్కరణని సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించాయి. తమ ల్యాబుల్ని వాడుకోవడానికి అనుమతీ ఇచ్చాయి. అలా వాళ్ళు పెద్ద ఎత్తున నానో కార్బన్స్‌ను
తయారుచేశాకే ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ ్స’ వీళ్ళ పద్ధతి సురక్షితమేనంటూ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దాంతో ‘కాంక్రీ’ పేరుతో 2020లో స్టార్టప్‌ని ఏర్పాటుచేశారు. పదేళ్ళ వాళ్ళ కష్టానికి ఫలశ్రుతిగా అన్నట్టు ఇటీవల కేంద్ర ఇంధన వనరుల శాఖ ప్రతిష్ఠాత్మక ‘నేషనల్‌ ఎనర్జీ ఎఫిషియంట్‌ ఇన్నొవేషన్‌’ అవార్డుని అందించింది.
ప్రస్తుతం లారెస్‌, ల్యూమినస్‌ సహా దేశంలోని పలు బ్యాటరీ కంపెనీలు వీళ్ళ నానో కార్బన్స్‌తో సరికొత్త బ్యాటరీలు తయారుచేస్తున్నాయి. ఒకప్పుడు రోజూ ‘ఒక్క గ్రాము’ మాత్రమే నానో కార్బన్స్‌ తయారుచేస్తూ సంతృప్తి పడ్డ అక్షయ్‌, మహీలు- ఇప్పుడు ఆయా కంపెనీల కోసం రోజూ 2000 కిలోల మేరకు తయారుచేసి అందించే
పారిశ్రామికవేత్తలయ్యారు! అంతేకాదు, వందలాది రైతుల నుంచి కొబ్బరి చిప్పల్ని సేకరిస్తూ వాళ్ళకి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగానూ మారారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..