ఆ కాలనీలో... ఎవరికీ కిచెన్లు ఉండవు!

‘మా తర్వాత... వీళ్లని ఎవరు చూసుకుంటారు?’- మానసిక ఎదుగుదలలేని పిల్లల తల్లిదండ్రుల్ని నిత్యం వేధించే ప్రశ్న ఇది. అందుకు సమాధానం వెతికే క్రమంలో దేశంలో ఇంకెక్కడా లేని విధంగా ఓ సరికొత్త కాలనీని నిర్మించుకున్నారు వాళ్లు! సుమారు యాభైమంది తల్లిదండ్రులు కలిసి ఒకే కమ్యూనిటీగా మారారు.

Updated : 30 Oct 2022 03:43 IST

ఆ కాలనీలో... ఎవరికీ కిచెన్లు ఉండవు!

‘మా తర్వాత... వీళ్లని ఎవరు చూసుకుంటారు?’- మానసిక ఎదుగుదలలేని పిల్లల తల్లిదండ్రుల్ని నిత్యం వేధించే ప్రశ్న ఇది. అందుకు సమాధానం వెతికే క్రమంలో దేశంలో ఇంకెక్కడా లేని విధంగా ఓ సరికొత్త కాలనీని నిర్మించుకున్నారు వాళ్లు! సుమారు యాభైమంది తల్లిదండ్రులు కలిసి ఒకే కమ్యూనిటీగా మారారు. ఎనిమిదిన్నర ఎకరాల ప్రాంగణంలో తమ సంతానానికి స్వతంత్రంగా బతకడం నేర్పుతూనే... అతిపెద్ద ఉమ్మడి కుటుంబంలా జీవిస్తున్నారు. ‘క్లాప్స్‌’ అనే ఆ స్పెషల్‌ కాలనీ విశేషాలివి...

ఆటిజమ్‌, మెంటల్‌ రిటార్డేషన్‌, సెరెబ్రల్‌ పాల్సీ, డౌన్స్‌ సిండ్రోమ్‌... ఇవన్నీ ్జకొత్తగా మనదేశంలో పుట్టుకొచ్చిన సమస్యలు కావు. కాకపోతే, ఒకప్పటి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ పిల్లల్ని కాపాడుకునేది. తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా కుటుంబంలోని మిగతా సభ్యులకీ వాళ్ళ సమస్యలపట్ల కావాల్సినంత అవగాహన ఉండేది.

తల్లిదండ్రులు కాలంచేస్తే బాబాయిలో, అన్నదమ్ములో వాళ్ళని చూసుకునేవాళ్లు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన నేటి పరిస్థితుల్లో ఈ పిల్లల బాధ్యత తల్లిదండ్రులకి తప్ప ఇంకెవరికీ పట్టట్లేదు. నగరాల్లోని అపార్ట్‌మెంట్‌ సంస్కృతిలో ఈ పిల్లలు ఇంట్లోని నాలుగు గదుల మధ్యే ఉండాల్సిన పరిస్థితి. చుట్టుపక్కలవాళ్ళు తమ పిల్లలతో ఈ మానసిక సమస్య ఉన్న చిన్నారుల్ని కలవనివ్వరు.  ఆ పరిస్థితుల్లో- వృద్ధాప్యంలో తల్లిదండ్రుల శక్తి సన్నగిల్లితే వీళ్ళనీ, ఆ పిల్లల్నీ ఎవరు చూసుకోవాలి? కాస్త దయ తలచిన బంధువులు ముందుకు రావొచ్చుకానీ... వాళ్ళకి ఈ పిల్లల అవసరాలపైన అవగాహన ఉండదు కదా?! ఈ పరిస్థితుల్ని ముందుగా ఊహించే ఓ కాలనీని నిర్మించుకున్నారు ఆ తల్లిదండ్రులు. కమ్యూనిటీ లివింగ్‌ అసోసియేషన్‌ ఫర్‌ పేరెంట్స్‌ ఆఫ్‌ స్పెషల్‌ సిటిజన్స్‌(క్లాప్స్‌) అని దీనికి పేరు పెట్టుకున్నారు. చెన్నైకి దగ్గర తిరువళ్ళూరులో ఎనిమిదిన్నర ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేసుకున్నారు.

ఓ ఉమ్మడి కుటుంబంలా...

అది 2016వ సంవత్సరం... చెన్నై నగరంలోని మందైవెలిలో ఉన్న వి-ఎక్సెల్‌ థెరపీ కేంద్రానికి తమ పిల్లల్ని తీసుకుని వస్తుండేవారు ఆ తల్లిదండ్రులు. ఆ క్రమంలో- తమ బాధల్నీ భవిష్యత్తు భయాల్నీ పరస్పరం పంచుకోసాగారు. వాటికి పరిష్కారంగానే అందరూ కలిసి ఇలా ఒకే కుటుంబంలా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఓ అసోసియేషన్‌గా దానికోసం ప్రణాళికలు రచించారు. చెన్నై పరిసరప్రాంతమైన తిరువళ్ళూరులోని నెయ్వేలి(ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది)లో ఎనిమిదిన్నర ఎకరాల స్థలాన్ని కొన్నారు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటూ ప్రకృతి రమణీయత మధ్య కాలనీ నిర్మాణం పూర్తిచేసి నివాసానికి వచ్చారు. ఒక్కొక్కరికీ సుమారు 65 లక్షల రూపాయలదాకా ఖర్చయ్యిందట. 48 కుటుంబాల కోసం డబుల్‌, ట్రిపుల్‌ బెడ్రూమ్‌ అపార్ట్‌మెంట్లున్నాయిక్కడ. ఇక్కడున్న ఏ ఫ్లాట్‌లలోనూ వంటగదులుండవు. అందరికీ కలిపి ఉమ్మడి కిచెన్‌లోనే వంట చేస్తారు. ఇక్కడున్న పెద్ద డైనింగ్‌హాలులోనే ఓ కుటుంబంలా అందరూ కలిసే తింటారు.

వాళ్ళకి ఇక్కడ...

తల్లిదండ్రులున్న అపార్ట్‌మెంట్‌కి కాస్త దూరంలో మరో అపార్ట్‌మెంట్‌లోనే మానసిక వికలాంగ పిల్లలుంటారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇక్కడే ఉండాలన్నది నియమం. తల్లిదండ్రులు లేకుండా స్వతంత్రంగా జీవించడం నేర్చుకోవడానికే ఇలా చేస్తున్నారు. మరీ ఏడ్చి ఇబ్బందిపెడుతుంటే... తల్లిదండ్రులు వాళ్ళతో కాసేపు గడుపుతారు. ఇక్కడ 30 మంది పిల్లలకి ఎవరికివారికే ప్రత్యేక ఫ్లాట్‌లున్నాయి. ఇందులో ప్రతి ఇద్దరికీ ఒక కేర్‌టేకర్‌ ఉంటారు. ప్రస్తుతం 20 నుంచి 40 ఏళ్ళ వయసున్న మానసిక వికలాంగులు ఇందులో ఉంటున్నారు! వీళ్ళకి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆక్యుపేషనల్‌ థెరపీ, బిహేవియరల్‌ థెరపీలకి సంబంధించిన తరగతులూ ఓ వ్యాయామశాలా జ్యువెలరీ ఆర్ట్‌ నేర్చుకునే శిక్షణశాలా ఏర్పాటుచేశారు. ఇలా శిక్షణ ఇచ్చేవాళ్ళ కోసం ప్రత్యేక గృహాలనూ ఈ తల్లిదండ్రులు నిర్మించారు. దాంతోపాటూ ఇక్కడ 24 గంటలూ సేవలందించే ఆసుపత్రిని కూడా ఏర్పాటుచేసుకున్నారు. ఈ తల్లిదండ్రుల్లో ఉన్న ఐదుగురు వైద్యులు... ఇక్కడ సేవలందిస్తున్నారు. 

భవిష్యత్తే కీలకం...

మానసిక సమస్య ఉన్న ప్రతి వ్యక్తిపైన కేవలం అతని తల్లిదండ్రులు మాత్రమే కాకుండా... మరో దంపతులూ శ్రద్ధతీసుకునే పద్ధతిని పాటిస్తున్నారు ఇక్కడ. వీళ్ళని ‘ఫాస్టర్‌ పేరెంట్స్‌’ అంటున్నారు. ఆ చిన్నారికున్న సమస్యా, అతని మూడ్‌ స్వింగ్స్‌, వాడాల్సిన మందులూ వంటి వాటిపైన వీళ్ళకీ అవగాహన ఉంటుంది.  అసలు తల్లిదండ్రులకి ఏదైనా సమస్య వస్తే... వీళ్ళు చూసుకోవాలన్నది దీని లక్ష్యం. ఇక్కడున్న తల్లిదండ్రులకి వయసైపోతే... ఓ ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌లానూ ‘క్లాప్‌’ ప్రాంగణం ఉపయోగపడేలా కేర్‌టేకర్‌లని ఏర్పాటుచేసుకున్నారు. ఒకవేళ వీళ్ళు కన్నుమూస్తే..? వీళ్ళకున్న ఆస్తిపైన... ట్రస్టు ఏర్పాటుచేస్తారు. ఆ ట్రస్టు ద్వారా ఆ మానసిక వికలాంగ వ్యక్తిని చూసుకునే బాధ్యతని ఆ అపార్ట్‌మెంట్‌కి కొత్తగా వచ్చే ఓనర్‌కి ఇస్తున్నారు. మానసిక వికలాంగులకి సేవలందించే ఇన్‌స్టిట్యూట్‌లలో భాగంగా తల్లిదండ్రులు ఉండటం ఇదివరకే ఉందికానీ తల్లిదండ్రులే సకల వసతులతో కూడిన ఓ కమ్యూనిటీని ఏర్పాటుచేసుకోవడం మనదేశంలో ‘క్లాప్స్‌’తోనే మొదలని చెప్పాలి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు