ఇక్కడ... స్వామి విగ్రహం మెత్తగా ఉంటుంది!

ఆధ్యాత్మిక ఆనందానికీ, ప్రకృతి సౌందర్యానికీ ప్రతీకగా నిలిచే పర్వతాల మధ్య స్వయంభువుగా కొలువుదీరిన దేవదేవుడే లక్ష్మీనరసింహుడు. హేమాచల లక్ష్మీ నరసింహుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వామిని దర్శించుకుంటే... సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Published : 19 May 2024 00:18 IST

ఆధ్యాత్మిక ఆనందానికీ, ప్రకృతి సౌందర్యానికీ ప్రతీకగా నిలిచే పర్వతాల మధ్య స్వయంభువుగా కొలువుదీరిన దేవదేవుడే లక్ష్మీనరసింహుడు. హేమాచల లక్ష్మీ నరసింహుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వామిని దర్శించుకుంటే... సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామి ఉగ్రరూపంతో కనిపించినా... మానవ శరీరాన్ని పోలినట్లుగా మెత్తగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

దండకారణ్యంలో... ప్రశాంతమైన వాతావరణంలో, గోదావరీ నదీ తీరంలో హేమాచల శిఖరంపైన స్వయంభువుగా వెలిశాడు పుట్టు నరసింహస్వామి.  ఈ ఆలయం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ఉంది. నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి దాదాపు పది అడుగుల్లో దర్శనమిస్తున్నాడు. ఈ హేమాచలాన్ని నవ నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనదిగా పేర్కొంటారు.

స్థలపురాణం

స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడనడానికి పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం నుంచి ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే... ఓసారి భరద్వాజ, అంగీరస మహర్షులు గోదావరి నది ఆద్యంతాలను తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడకు చేరుకున్నారట. ఈ ప్రాంతంలో సేదతీరుతున్న సమయంలో స్వామి కలలో కనిపించి ఇక్కడి కొండల్లో తాను ఉన్నానని తెలియజేశాడట. దాంతో మహర్షులు తమ శిష్యగణంతో కలిసి ఇక్కడున్న కొండల్ని గునపంతో తొలవడం మొదలుపెట్టారట. కాసేపటికి స్వామి విగ్రహం బయటపడినా తవ్వే క్రమంలో గునపం స్వామి నాభికి తగలడంతో నెత్తురును పోలిన ద్రవం స్రవించిందట. దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టారట. అప్పటినుంచీ నేటివరకూ స్వామి నాభి నుంచి రక్తం లాంటి స్రావం వస్తూనే ఉందనీ.. దాన్ని నియంత్రించేందుకే ఎప్పటికప్పుడు చందనాన్ని పూతగా వేస్తారనీ అంటారు. 

మానవ శరీరాన్ని పోలినట్లుగా...

లక్ష్మీనరసింహస్వామి కొండరాళ్ల మధ్య వెలసినా... విగ్రహ రూపంలోనే దర్శనమిచ్చినా తాకితే మాత్రం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. అదే విధంగా స్వామి ఛాతీపైన వెంట్రుకలూ కనిపిస్తాయి. ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి విగ్రహాన్ని స్వయంగా తాకి మరీ చూపిస్తారు అర్చకులు. అలా నొక్కినప్పుడు సొట్టపడినట్లుగానూ కనిపిస్తుంది. స్వామి నాభి నుంచి వచ్చే స్రావాన్ని నియంత్రించేందుకు రాసే చందనానికి ఔషధగుణాలు ఉంటాయి. సంతానం లేనివారికీ రకరకాల అనారోగ్యాలతో బాధపడేవారికీ ఈ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు.

శిఖతో దర్శనమిచ్చే హనుమంతుడు...

స్వామి వారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకే ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిలు నారసింహుడి గర్భాలయానికి ఇరువైపులా కొలువుదీరారని చెబుతారు. నరసింహస్వామి రూపాన్ని కళ్లారాచూసి కిందకు వచ్చే భక్తులు ఆ తరువాత పంచముఖి ఆంజనేయస్వామినీ, నవగ్రహాలనీ, జగన్మాతనీ దర్శించుకుంటారు. ఆలయానికి కాస్త దూరంలో శిఖావట్‌ ఆంజనేయస్వామి మందిరం ఉంటుంది. స్వామి ఇక్కడ కొప్పుతో దర్శనమిస్తాడు. హేమాచలానికి క్షేత్రపాలకుడు శంభులింగేశ్వర స్వామి. ఈ ఊళ్లోనే శంభులింగేశ్వర స్వామి మందిరాన్నీ దర్శించుకుంటే హేమాచల ఆలయ దర్శనం పూర్తయినట్లుగా చెప్పొచ్చు. అలాగే... ఈ కొండలమధ్య జాలువారే చింతామణి జలపాతం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

ఆధ్యాత్మికతతోపాటూ పర్యటక ప్రాంతంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని అయిదున్నరగంటలకే మూసేస్తారు. సాయంకాలాల్లో స్వామి ఇక్కడ సంచరించేందుకు రావడమే అందుకు కారణమని చెబుతారు అర్చకులు. ప్రతి శని, ఆదివారాలు స్వామికి నిర్వహించే తైలాభిషేకంతోపాటు... నారసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక వేడుకలూ, అధ్యయనోత్సవాలూ, పర్వదినాలను పురస్కరించుకుని జరిపే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో ఆలయానికి చేరుకుంటారు.

 అక్కెనపెల్లి వేంకటేశ్వర్లు, న్యూస్‌టుడే మంగపేట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..