కథలతో... పెద్దలకీ లాలీజో!

‘అమ్మా! ఓ కథ చెప్పవూ...’ అంటూ గారాలుపోయిన జ్ఞాపకాలేవో చుట్టుముడతాయేమో! పేదరాశి పెద్దమ్మ కథల్లోని నీతిసారమేదో గుర్తుకొస్తుందేమో! మాయల ఫకీరు ప్రాణరహస్యం మాటేదో మదిలో మెదులుతుందేమో!

Published : 05 May 2024 00:50 IST

‘అమ్మా! ఓ కథ చెప్పవూ...’ అంటూ గారాలుపోయిన జ్ఞాపకాలేవో చుట్టుముడతాయేమో! పేదరాశి పెద్దమ్మ కథల్లోని నీతిసారమేదో గుర్తుకొస్తుందేమో! మాయల ఫకీరు ప్రాణరహస్యం మాటేదో మదిలో మెదులుతుందేమో!- కారణం ఏదైతేనేం ‘ఆప్‌’లో కథలు వింటూ కునుకుతీసేవాళ్ళ సంఖ్య పెరుగుతోందిప్పుడు. సంగీతం, ధ్యానం, ప్రకృతి సవ్వడులతో నిద్ర తెప్పించే ఆప్‌లు ఇదివరకే ఉన్నాయి. వాటికి కథల్నీ జోడిస్తూ కొత్త అనుభూతుల్ని పంచేవి ఇప్పుడొస్తున్నాయి... కొత్త ఊహాలోకాల్లోకి తీసుకెళ్ళి జోకొడుతున్నాయి!

రాకేశ్‌ని ఈ మధ్యే ఓ కొత్త ప్రాజెక్టుకోసం టీమ్‌ లీడ్‌గా ఎన్నుకున్నారు. హోదా పెరిగిందన్న ఆనందం, తానేమిటో నిరూపించుకోవాలన్న ఉత్సాహం, కొత్త సవాళ్ళ సంక్షోభం- వెరసి అతనిలో ఒత్తిడిగా మారాయి. రాత్రి పదకొండుకల్లా నిద్రకి ఉపక్రమించినా- ఆలోచనల రొదతో 12 వరకూ కునుకు పట్టేది కాదు. మధ్యలో ఏ నాలుగ్గంటలకో మెలకువ వచ్చి- ఆపై నిద్రరాక ఇబ్బందిపడేవాడు. మళ్ళీ ఎప్పటికో నిద్రపట్టి, తొమ్మిదిన్నరకి మెలకువ వచ్చి, టిఫిన్‌ తినడానికి టైమ్‌లేక ఆఫీసుకెళ్ళేవాడు. రోజూ ఇదే వరసగా మారి- అతనికి పేగు అల్సర్‌ ఏర్పడింది. డాక్టర్లు అల్సర్‌కి చికిత్స ఇస్తున్నారు కానీ- నిద్రలేమికి మందులు వద్దన్నారు. ధ్యానంలాంటివి ప్రయత్నించమన్నారు. అందుకోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా అతనికి ‘నీంద్‌’ ఆప్‌ కనిపించింది. చిన్నప్పుడు తాతయ్య చెప్పిన పరమానందయ్య శిష్యుల కథలూ, పదో తరగతిలో చదివిన ‘బారిష్టర్‌ పార్వతీశం’ నవలా భాగాలూ- వంటివాటితో నిద్రతెప్పిస్తామన్న వాళ్ళ హామీలు చూసి ఆశ్చర్యపోయాడు. డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. మొదటిరోజు 15 నిమిషాల ‘పరమానందయ్య...’ కథ పూర్తవ్వకముందే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఏడుకి మెలకువ వస్తే-హాయిగా ఫీలయ్యాడు. అలా మరో వారంలోనే గాఢనిద్రకి దగ్గరకాగలిగాడు.

కోట్లలోనే...

రాకేశ్‌ వాడిన ‘నీంద్‌’ ఒక్కటే కాదు... ప్రపంచవ్యాప్తంగా కథలతో నిద్రతెప్పించే ఆప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయిప్పుడు. వీటి మార్కెట్‌ విలువ ఈ ఏడాదికి సుమారు తొమ్మిదివేల కోట్ల రూపాయలు. 2031 నాటికల్లా అది సుమారు 22 వేల కోట్ల రూపాయలకి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. చదువూ, కెరీర్‌, మానవ సంబంధాలు, జీవన శైలి, వినోద మాధ్యమాలు- కారణం ఏదైనా సరే నేటి ఆధునిక మానవుని నిద్ర తగ్గింది. కొత్తగా వీటికి కరోనా ప్రభావం కూడా తోడైంది. కొవిడ్‌ బాధితుల్లో 40 శాతం మందికి ఈ సమస్య ఉందని చెబుతున్నారు. ‘నీంద్‌’ ఆప్‌ సృష్టికర్త సురభి జైన్‌ కూడా వారిలో ఒకరట. కరోనా నుంచి బయటపడ్డ ఏడాదిదాకా నిద్రలేమితో బాధపడ్డ ఆమెకి ‘వైసా స్లీప్‌’ అన్న ఆప్‌ ఎంతో ఉపయోగపడిందట. ఈ ఆప్‌లో అమెరికాకి చెందిన మిషెల్లీ హాట్‌లింగ్‌ అనే ‘మెడిటేషన్‌ ఆర్టిస్ట్‌’ పెద్దల కోసం చెప్పే నిద్ర కథలు ఉంటాయి. ఇలాంటి ఆప్‌ని భారతీయ కథలతో ఎందుకు తీసుకురాకూడదన్న ఆలోచనతోనే సురభి నీంద్‌(హిందీలో నిద్ర అని అర్థం)ని రూపొందించారు. హిందీతోపాటూ తెలుగు, తమిళం, మరాఠి, ఇంగ్లిషు భాషల్లో ఉన్న ఈ నిద్ర కథల ఆప్‌కి ఇప్పుడు ఐదు లక్షలమంది చందాదారులున్నారు. ఆయా భాషల్లోని జానపద కథల్ని- స్థానిక వాయిస్‌ ఆర్టిస్టులతో చెప్పిస్తూ చక్కటి నాణ్యతతో నీంద్‌ని తీర్చిదిద్దుతోంది సురభి. ‘అలోరా స్లీప్‌’ అప్‌ కూడా ఇలాంటిదే. సుమారు 20 లక్షల డౌన్‌లోడ్‌లున్నాయి దీనికి. ఈ రెండింటికన్నా ముందే మార్కెట్‌లోకి వచ్చిన ‘వైసా స్లీప్‌’ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘ది బెస్ట్‌ ఆప్‌’గా గుర్తింపు పొందింది. ఇదంతా చదివి ‘అసలు ఎలక్ట్రానిక్‌ తెరలతో నిద్ర చెడుతోందని నిపుణులు చెబుతుంటే- వీటితో నిద్రెలా పడుతుంది?’ అని సందేహం రావొచ్చు. అందుకు జవాబుగా- ‘నిద్రని చెడగొట్టే ‘బ్లూరేస్‌’ని వెదజల్లని రీతిలోనే మా ఆప్‌లని రూపొందిస్తున్నాం. అందరూ చెడుచేస్తుందంటున్న సాంకేతికతని మేం మంచి కోసం వాడుతున్నాం..’ అంటున్నారు వీటి సృష్టికర్తలు.

ఎలా పనిచేస్తాయంటే...

నిద్రలేమికి- కునుకు పట్టకపోవడం కన్నా ఆలోచనలు రొదపెట్టడమే ప్రధాన కారణం. కాబట్టి- ఈ ఆప్‌లు కథల ద్వారా మన ఆలోచనల్ని పక్కకు మళ్ళించడానికి ప్రయత్నిస్తాయి. అందుకే- క్షణక్షణం ఉత్కంఠరేపే కథలు కాకుండా ఆహ్లాదకర వర్ణనలూ, హాస్య సంభాషణలున్న ఇతివృత్తాల్ని ఈ ఆప్‌ల కోసం ఎంచుకుంటున్నారు. మంద్రంగా, నాటకీయంగా, మన పక్కన ఆత్మీయులొకరు కూర్చుని చెబుతున్నట్టే వీటిని రికార్డు చేస్తున్నారు. ముందుగా మన శరీర భాగాల్ని- ధ్యానంలోలాగా- మానసికంగా రిలాక్స్‌ చేయించి ఆ తర్వాత మెల్లగా కథలోకి తీసుకెళుతున్నారు. కథకుల కంఠం వినా- మన చుట్టూ అలముకునే వింత నిశ్శబ్దం(వైట్‌ నాయిస్‌), ప్రకృతి సవ్వడులు మనల్ని కొత్త లోకాల్లో విహరించేలా చేస్తాయి. అట్నుంచటు గాఢనిద్రలోకి తీసుకెళతాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..