ఆత్మీయుల జ్ఞాపకార్థం...ఆపన్నులకు సేవ!

క్యాన్సర్‌తో కుటుంబసభ్యుల్ని పోగొట్టుకున్నారు వీరంతా. దూరమైన ఆత్మీయుల జ్ఞాపకంగా మంచి పనులు చేయాలని భావించి సంపాదనంతా సేవకే ఉపయోగిస్తున్నారు... ఈ మానవతామూర్తులు ఎవరూ... ఏం చేస్తున్నారూ అంటే...

Published : 20 Apr 2024 23:41 IST

క్యాన్సర్‌తో కుటుంబసభ్యుల్ని పోగొట్టుకున్నారు వీరంతా. దూరమైన ఆత్మీయుల జ్ఞాపకంగా మంచి పనులు చేయాలని భావించి సంపాదనంతా సేవకే ఉపయోగిస్తున్నారు... ఈ మానవతామూర్తులు ఎవరూ... ఏం చేస్తున్నారూ అంటే...


సాయం కోసం చెరకురసం!

వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా చెరకు రసం అమ్మేవాళ్లు కనిపిస్తుంటారు. మండే ఎండల్లో చల్లచల్లని చెరకు రసం విక్రయాలు వ్యాపారులకు భలే లాభసాటిగా ఉంటాయి. మణిపూర్‌కు చెందిన నలభైతొమ్మిదేళ్ల లోకేంద్ర మాత్రం అలా ఆలోచించలేదు. చెరకు రసం అమ్మగా వచ్చిన ప్రతి రూపాయినీ తనకోసం కాకుండా క్యాన్సర్‌ రోగులకోసం ఉపయోగిస్తున్నాడు. క్యాన్సర్‌ బారిన పడి, నాలుగేళ్లపాటు టాటా మెమోరియల్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూసింది లోకేంద్ర భార్య. ఆ సమయంలో క్యాన్సర్‌ బాధితుల బాధల్ని చూసి చలించిపోయిన ఆయన- భార్య మరణించాక మణిపూర్‌లో ఆస్తులన్నీ అమ్మేశాడు. ముంబయికి మకాం మార్చి చెరకు రసం అమ్ముతున్నాడు. వచ్చిన డబ్బును అక్కడ ఏర్పాటు చేసిన ఓ హుండీలో వేయించుకుని నెలకోసారి బయటకు తీసి క్యాన్సర్‌ బాధిత కుటుంబాలకు అందిస్తుంటాడు. మొదట్లో కేవలం శుక్రవారం వచ్చిన డబ్బును మాత్రమే సేవకు అందించేవాడు. ప్రస్తుతం నెల సంపాదనంతా క్యాన్సర్‌ రోగుల కుటుంబాలకే వెచ్చిస్తున్న లోకేంద్ర.. ఈ పదేళ్లలో కోటి రూపాయలపైనే దానం చేశాడు. పిల్లలు లేని తను క్యాన్సర్‌ రోగులనే కన్నబిడ్డలుగా భావిస్తానంటాడు.


ఆమె గుర్తుగా విద్యాదానం!

చిన్నతనంలో బాగా చదువుకోవాలనుకున్నాడు అసోంలోని అభయపురియాకు చెందిన ప్రోతప్‌ సైకియా. కానీ, పేదరికం వల్ల కూలి పనులకు పరిమితం కావాల్సి వచ్చింది. కొన్నాళ్లకు పాన్‌ షాపు తెరిచి, అక్కడే అసోం సిల్కు, పరిమళద్రవ్యాలను కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు. చిన్న దుకాణంలో ప్రోతప్‌ తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్‌లో గిరాకీ పెరగడంతో లాభాలు రాసాగాయి. క్రమంగా వ్యాపారాన్ని వృద్ధి చేస్తూనే ఆస్తుల్నీ కూడబెట్టుకున్నాడు. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక ప్రోతప్‌ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె జ్ఞాపకార్థంగా నలుగురికీ సాయపడాలని నిర్ణయించుకున్నాడు ప్రోతప్‌. సొంతూరులోనే నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన ఆరెకరాల పొలంలో మూడేళ్ల క్రితం ఓ స్కూలును కట్టించాడు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లూ, కంప్యూటర్‌- రోబోటిక్‌ ల్యాబ్‌లూ, ప్రత్యేకంగా మ్యూజిక్‌, యోగా క్లాస్‌రూమ్‌లనూ ఏర్పాటు చేయించి ఆ ప్రాంతంలోని పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ సుమారు 300 మంది విద్యార్థులు అక్కడ చదువుకోవడంతోపాటు రెండుపూటలా ఆకలి తీర్చుకుంటున్నారు. అలానే ఆ పిల్లల తల్లిదండ్రులకు ప్రోతప్‌ నెలవారీ సరకులను కూడా అందిస్తుంటాడు. విద్యార్థుల బాధల్ని తీర్చిన ఆయన ప్రస్తుతం అక్కడే ఓ హాస్పిటల్‌ను కూడా నిర్మిస్తున్నాడు.


రోగుల్ని ఆదరిస్తూ...

దిల్లీకి చెందిన హర్మల గుప్తా... కార్పొరేట్‌ ఉద్యోగిని. కొన్నేళ్ల క్రితం ఆమె తల్లి క్యాన్సర్‌తో కన్నుమూసింది. కొంతకాలానికి హర్మల కూడా ఆ జబ్బు బారినపడి ఆసుపత్రిలో చేరింది. ఆ సమయంలో క్యాన్సర్‌ రోగులతోపాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో చూసింది. చికిత్స తీసుకుని.. క్యాన్సర్‌ నుంచి బయట పడ్డాక ఆమె ఓ ఎన్జీఓను స్థాపించి- ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్‌ రోగులకు మందులూ, పోషకాహారం అందించడం మొదలుపెట్టింది. వారంలో రెండు రోజులు రోగుల ఇళ్లకే వైద్యుల్నీ, నర్సుల్నీ పంపి చికిత్సతోపాటు పరీక్షలు కూడా చేయిస్తోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనివారికి బెడ్లూ, వీల్‌ఛైర్లూ, వాకర్లూ కూడా అందిస్తున్న హర్మల కార్పొరేట్‌ ఉద్యోగం చేస్తూనే తన సంపాదనంతా రోగులకు ఖర్చు పెడుతోంది. ముప్ఫై మంది వలంటీర్లతో దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మేరఠ్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్‌, బటిండా నగరాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ... క్యాన్సర్‌ రోగుల కుటుంబ సభ్యులకు ఇంట్లోనే జీవనోపాధిని కూడా చూపుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..