ఎండ వేళ చల్లగా కుల్ఫీ, లస్సీ

ఎండలు పెరిగేకొద్దీ ఐస్‌క్రీమ్‌, లస్సీ, కుల్ఫీ... ఇలా చల్లని పదార్థాలనే తినాలని అనిపించడం సహజం. అలాగని వాటిని ఎప్పుడూ బయటినుంచి కొనుక్కోవడంలో మజా ఏముంటుంది చెప్పండీ... అందుకే ఈసారి ఇంట్లోనే చేసుకుని రుచి చూసేద్దామా...

Published : 04 May 2024 23:05 IST

ఎండలు పెరిగేకొద్దీ ఐస్‌క్రీమ్‌, లస్సీ, కుల్ఫీ... ఇలా చల్లని పదార్థాలనే తినాలని అనిపించడం సహజం. అలాగని వాటిని ఎప్పుడూ బయటినుంచి కొనుక్కోవడంలో మజా ఏముంటుంది చెప్పండీ... అందుకే ఈసారి ఇంట్లోనే చేసుకుని రుచి చూసేద్దామా...


మ్యాంగో కస్టర్డ్‌ షేక్‌

కావలసినవి: చిక్కని పాలు: లీటరు, కస్టర్డ్‌పొడి: రెండు టేబుల్‌స్పూన్లు, కాచి చల్లార్చిన పాలు: పావుకప్పు, చక్కెర: పావుకప్పు, యాలకులపొడి: పావుచెంచా, సబ్జాగింజలు: చెంచా (పావుకప్పు నీళ్లల్లో నానబెట్టుకోవాలి), ఉడికించిన సగ్గుబియ్యం: అరకప్పు, మామిడిపండు గుజ్జు: కప్పు, మామిడిపండు ముక్కలు: కప్పు, బాదం పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, పిస్తా పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: ముందుగా కాచి చల్లార్చిన పాలల్లో చక్కెర పొడి, కస్టర్డ్‌ని కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద గిన్నె పెట్టి పాలు పోయాలి. అవి వేడెక్కుతున్నప్పుడు కస్టర్డ్‌ మిశ్రమాన్ని వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. మధ్యమధ్య కలుపుతూ ఉండి పాలు కాస్త చిక్కగా అయ్యాయనుకున్నాక దింపేయాలి. ఈ కస్టర్డ్‌ మిశ్రమం పూర్తిగా చల్లారాక మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ మరోసారి కలుపుకోవాలి. దీన్ని గంటసేపు ఫ్రిజ్‌లో పెడితే చాలు... చల్లచల్లని మ్యాంగో కస్టర్డ్‌ షేక్‌ రెడీ.


బనానా చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌

కావలసినవి: చల్లని అరటిపండ్లు: మూడు (ముక్కల్లా కోయాలి), తీయని బాదంపాలు: అరకప్పు, పీనట్‌ బటర్‌: టేబుల్‌స్పూను, చాక్లెట్‌పొడి: టేబుల్‌స్పూను, చాక్లెట్‌చిప్స్‌: పెద్ద చెంచా.  

తయారీ విధానం: అరటిపండు ముక్కలు, బాదంపాలు, పీనట్‌బటర్‌, చాక్లెట్‌పొడిని మిక్సీజార్‌లో వేసుకుని క్రీమ్‌ తరహాలో వచ్చేలా మిక్సీపట్టాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుని మరోసారి గిలకొట్టి.. చాక్లెట్‌ చిప్స్‌ కలిపి రెండు
గంటలసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది గట్టిపడ్డాక బయటకు తీసి కప్పుల్లో వడ్డించాలి. 


మలాయి కుల్ఫీ

కావలసినవి: చిక్కని పాలు: లీటరు, తాజా క్రీమ్‌: అరకప్పు, చక్కెర: పావుకప్పు, కండెన్స్‌డ్‌మిల్క్‌: పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, కుంకుమపువ్వు రేకలు: చిటికెడు (కాసిని పాలల్లో నానబెట్టుకోవాలి), బాదంపలుకులు: పావుకప్పు, పిస్తా పలుకులు: పావుకప్పు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు క్రీమ్‌, కండెన్స్‌డ్‌మిల్క్‌, చక్కెర వేసి కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక యాలకులపొడి, కుంకుమపువ్వు పాలు, బాదం, పిస్తా పలుకులు వేయాలి. మధ్యమధ్య కలుపుతూ ఉండి.. ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఆ తరువాత కుల్ఫీమౌల్డ్స్‌లో ముప్పావువంతు వరకూ వేసుకుని బాగా గట్టిపడేవరకూ డీప్‌ఫ్రీజర్‌లో పెట్టి తీస్తే చాలు.


రోజ్‌లస్సీ

కావలసినవి: పాలు: నాలుగున్నర కప్పులు, చక్కెర: అరకప్పు, ఫలూదా సేమియా: పావుకప్పు, నానబెట్టిన సబ్జా గింజలు: రెండు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి: చెంచా, రూఅఫ్జా లేదా రోజ్‌ సిరప్‌: నాలుగు టేబుల్‌స్పూన్లు, వెనిల్లా ఐస్‌క్రీమ్‌: నాలుగు స్కూప్స్‌, జీడిపప్పు, బాదం పలుకులు: రెండూ కలిపి పావుకప్పు.

తయారీ విధానం: నాలుగుకప్పుల పాలను గిన్నెలో తీసుకుని స్టవ్‌మీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు సేమియా వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక మిగిలిన పాలల్లో మొక్కజొన్నపిండిని కలిపి మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇవి మరుగుతున్నప్పుడు చక్కెర కూడా వేసి కలిపి దింపేయాలి. పాలు పూర్తిగా చల్లారాక రోజ్‌సిరప్‌ లేదా రూఅఫ్జా, సబ్జా గింజలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి కలిపితే చాలు. దీన్ని రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టి... గ్లాసుల్లో పోసే ముందు వెనిల్లా ఐస్‌క్రీమ్‌ అలంకరిస్తే సరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..