గంజాయి వనంలో ‘తులసి’ హెంప్‌

కోరుకున్నది ఇచ్చే శక్తి ఉన్న చెట్టుని ‘కల్పవృక్షం’ అంటాం. మరి... మనకి కావలసినవన్నీ అడగకుండానే ఇచ్చే చెట్టుని ఏమనాలి? అలాంటి చెట్టు ఒకటి ఉంటుందని ఊహించలేదు కాబట్టి పెద్దలు పేరేమీ పెట్టలేదేమో కానీ నిజంగానే ఉంది.

Updated : 22 Feb 2024 16:08 IST

కోరుకున్నది ఇచ్చే శక్తి ఉన్న చెట్టుని ‘కల్పవృక్షం’ అంటాం. మరి... మనకి కావలసినవన్నీ అడగకుండానే ఇచ్చే చెట్టుని ఏమనాలి? అలాంటి చెట్టు ఒకటి ఉంటుందని ఊహించలేదు కాబట్టి పెద్దలు పేరేమీ పెట్టలేదేమో కానీ నిజంగానే ఉంది. కూడూ గూడూ గుడ్డా అన్నిటికీ ముడిసరకును ఇవ్వగల శక్తి ఉన్న మొక్క- హెంప్‌. గంజాయి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఇప్పుడు ప్రపంచం పాలిట కల్పవృక్షంగా మారింది. మందులతో మొదలెట్టి వాతావరణ మార్పులకు పరిష్కారం వరకూ... అన్నిటికీ అదే అండాదండా కాబోతోంది.

ఒత్తిడీ తలనొప్పీ ఒళ్లునొప్పులూ... నొప్పేదైనా ఆ నూనె రాసుకుంటే క్షణాల్లో ఉపశమనం కలుగుతుందట. ట్యాబ్లెట్లూ క్యాప్య్సూల్సూ చాకొలెట్లూ... ఆరోగ్యాన్ని మాత్రల రూపంలో గుటుక్కున మింగేయొచ్చట. చర్మ సంరక్షణ, గుండె ఆరోగ్యం, వ్యాధి నిరోధకత... సమస్య ఏదైనా చెప్పండి. పోషకాహారం సిద్ధంగా ఉందట. ఆ గింజలు తిని పెరిగిన కోడి పెట్టే గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ మూడు రెట్లు ఎక్కువట. మాంసాహారం తినరా? అయినా పర్వాలేదు, ఐస్‌క్రీమ్‌ల మీద కాస్త ఆ పొడి చల్లుకోవచ్చు. జ్యూసుల్లోనూ కలుపుకోవచ్చు. దాంతో ఏకంగా కూరలే వండుకుంటున్నారు కొన్ని దేశాల్లో. ఇదీ అదీ అని కాదు, అసలు ఈ మ్యాజిక్‌ ఫుడ్‌కి ప్రపంచ మార్కెట్‌లో ఉన్న డిమాండు అంతా ఇంతా కాదు... అంటున్నారు నవతరం పారిశ్రామికవేత్తలు.

గంజాయి... నిషిద్ధ పంటగా అందరికీ తెలుసు. అయినా దాని సాగూ ఉత్పత్తులూ రవాణా కలిసి ‘డ్రగ్స్‌’ పేరుతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. పోలీసులను పరుగులు పెట్టిస్తూనే ఉన్నాయి. మత్తుమందుల రూపంలో మనుషుల్ని బానిసలుగా చేసుకుని శారీరక, మానసిక ఆరోగ్యాలను కబళిస్తున్నాయి. అయితే ఈ గంజాయి వనంలోనే తులసి మొక్కలాంటిదీ ఒకటుంది. దాన్నే ‘హెంప్‌’ అంటున్నారు. ఇవి రెండూ కూడా ‘కన్నబిస్‌ సటైవా’ కుటుంబానికే చెందినప్పటికీ సబ్‌ స్పీషీస్‌ వేరు. చూడడానికి దాదాపు ఒకేలా ఉంటాయి. రెండింటి ఆకుల్లోనూ ప్రధానంగా టెట్రా హైడ్రో కన్నాబినాల్‌ (టీహెచ్‌సీ), కన్నాబిడియోల్‌ (సీబీడీ) అనే రసాయనాలు ఉంటాయి. వాటి మోతాదులో తేడానే ఈ రెండు మొక్కల్నీ వేరు చేస్తోంది. సాధారణంగా గంజాయిగా పరిగణించే మొక్క ఆకుల్లో టీహెచ్‌సీ నాలుగైదు శాతం ఉంటుంది. ఆ రసాయనమే గంజాయి ఉత్పత్తుల్ని మాదకద్రవ్యాలుగా మారుస్తోంది. వాటిని తీసుకున్నపుడు మనిషి వాస్తవ ప్రపంచాన్ని మరిచి ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు. కానీ, హెంప్‌ ఆకుల్లో టీహెచ్‌సీ 0.3 నుంచి 1.5 లోపల మాత్రమే ఉంటుంది. ఈ మోతాదు ఎలాంటి మత్తునీ(సైకోయాక్టివ్‌ కాదు) కలిగించదు. పైగా ఇందులో సీబీడీ ఎక్కువుంటుంది. దానికెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆహారంగానూ ఔషధంగానూ మాత్రమే అయితే దీనిలాగే ఉపయోగపడే మరెన్నో మొక్కలున్నాయి కదా అంటారా? వాటితో పోలిస్తే హెంప్‌ది విశ్వరూపం. అది ఉపయోగపడని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే దాన్ని ‘ఇండస్ట్రియల్‌ హెంప్‌’ అంటున్నారు. ఎన్నో పరిశ్రమలకు ‘కార్బన్‌ నెగెటివ్‌ ముడిసరకు’గా పేరు తెచ్చుకుందీ హెంప్‌.

ఇంతింతై...

ఒకప్పుడు తూర్పు ఆసియా ప్రాంతంలో మాత్రమే గుబురు పొదలా పెరిగే ఈ మొక్క విలువ తెలుసుకున్న వ్యాపార ప్రపంచం ఇప్పుడు అన్ని దేశాల్లోనూ దీన్ని సాగుచేస్తోంది. ఇది ఐదారు నెలల్లోనే చేతికొచ్చే పంట. దట్టంగానూ, అచ్చం వెదురు లాగే చాలా వేగంగానూ పెరుగుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల్ని పెంచవచ్చు. మనిషి అవసరాలకు కావలసిన నారని ఇచ్చిన తొలి మొక్క ఇదేనట. యాభై వేల ఏళ్ల క్రితం నుంచే దీన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది. హెంప్‌ కాండం నుంచి తీసే నార (ఫైబర్‌) చాలా గట్టిగా ఉంటుంది. ఓడలకు అవసరమైన తాళ్లు పేనడానికి దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. ఇరవయ్యవ శతాబ్దం మొదటి దాకా ఈ పంటను ఎక్కువగానే పండించారు. గింజల్ని పశుపక్ష్యాదులకు ఆహారంగా వాడేవారు. ఆ తర్వాతే గంజాయికీ దీనికీ తేడా తెలియక రెండూ ఒకటేనని పొరబడి, కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచమంతటా నిషేధించారు. విదేశీ మద్యాన్ని మన దేశంలో ప్రవేశపెట్టడం కోసం బ్రిటిష్‌వాళ్లు కావాలని దీన్ని నిషేధించారని కొందరు అంటారు. కారణమేమైనా కానీ తిరిగి 1990వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా హెంప్‌ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం మొదలైంది. హెంప్‌ ఆకులూ పువ్వుల నుంచి తయారుచేసిన రసాలను పలుమార్లు పరీక్షించాక హానికరమైన పదార్థాలు లేవని ధ్రువీకరించి వాటిని ‘కొత్త ఆహారపదార్థాల జాబితా’లో చేర్చారు. ముఖ్యంగా వీటిల్లో ఉండే సీబీడీ నూనెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసింది. చికిత్సకన్నా నివారణ మంచిదన్న తెలివిడి పెరగడంతో కొద్ది కాలంలోనే హెంప్‌ వాడకం విస్తృతమైంది. దాని వేళ్లనుంచి మొదలెట్టి కాండమూ ఆకులూ పువ్వులూ గింజలవరకూ ప్రతి భాగమూ పనికొచ్చేదే. వాటన్నిటినీ వాడుకుంటే అన్ని విధాలా లాభాలేనంటోంది పారిశ్రామిక రంగం. ముఖ్యంగా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం ఈ హెంప్‌ సాగే అంటున్నారు నిపుణులు. కాలుష్యమూ, కర్బన వాయువులూ, భూమిలో కలవకుండా పలువిధాలుగా నష్టం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలూ, వాతావరణ మార్పుల వల్ల పంటలు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆకలి కేకలూ, దెబ్బతింటున్న ప్రజారోగ్యమూ, పట్టణాల్లోనూ పల్లెల్లోనూ పెరుగుతున్న నిరుద్యోగమూ, నానాటికీ తగ్గిపోతున్న భూసారమూ... ఈ సమస్యలన్నిటికీ అతి తక్కువ  ఖర్చుతో సమాధానం చెబుతోంది హెంప్‌. అదెలాగో చూద్దాం.

ఎన్నెన్నో లాభాలు

ఒకచోట పనికొస్తుంది, మరోచోట పనికిరాదని లేదు- హెంప్‌ని ఉపయోగించని రంగం లేదని ఢంకా బజాయించి చెప్పొచ్చు. దీనిలోని రసాయనాలను ఇప్పటికే పదివేలకు పైగా రూపాల్లో వాడుతున్నట్లు పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు.

పర్యావరణ హితం: హెంప్‌ సాగు పూర్తిగా కార్బన్‌ నెగెటివ్‌. దాని సాగులో, రవాణాలో ఉపయోగించే పరికరాలు విడుదల చేసే కర్బనం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ని ఈ మొక్క పీల్చుకుంటుంది. కాబట్టి చుట్టూ ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తుంది. రసాయనాలూ ఎరువులూ నీరూ లేకుండానే మూడు నెలల్లో నాలుగు మీటర్లు పెరిగే ఈ మొక్క పెద్ద చెట్లకన్నా రెట్టింపు కర్బనాన్ని పీల్చుకుంటుంది. ఏ పువ్వులూ లేని సీజన్‌లో తేనెటీగలకు ఆహారాన్నిస్తూ జీవవైవిధ్యానికి తోడ్పడుతుంది. సంవత్సరాల తరబడి కోతకి గురై, రసాయన ఎరువుల వాడకం వల్ల సారహీనమైన నేలనుంచి హానికారక రసాయనాలన్నిటినీ గ్రహించి కొత్త శక్తినిస్తుంది. అందుకే అణు విద్యుత్కేంద్రాల్లో ప్రమాదం జరిగినప్పుడు పరిసరాలను శుభ్రం చేయడానికి దీన్నే వాడుతున్నారు. కలుపు మొక్కల్నీ రానివ్వదు. బంజరు భూములను సాగుకు అనువుగా మలచుకోవడానికి ఉపయోగపడుతుంది. పంట రొటేషన్‌లో భాగంగా రైతులు దీన్ని పండిస్తే తర్వాత వేసే పంట దిగుబడి బాగా పెరుగుతుంది.

పోషకాలు: హెంప్‌ మొక్క మాంసకృత్తులకు మంచి వనరు. 1475నాటి పురాతన వంటల పుస్తకంలో సీబీడీ నూనె తయారీ విధానం ఉందట. సాధువులు ఈ ఆకుల రసాన్ని తాగేవారట. యూరోపియన్‌ దేశాల వంటల పుస్తకాల్లో దీన్ని కూరగాయగా పేర్కొన్న రుజువులూ ఉన్నాయి కాబట్టి ఇది కొత్త ఆహారపదార్థమేమీ కాదు, కొత్తగా మనం తెలుసుకున్నాం.. అంతే అంటున్నారు ఈతరం పారిశ్రామికవేత్తలు. దీని గింజలూ ఆకులూ పువ్వుల నుంచి ఫుడ్‌ సప్లిమెంట్స్‌ తయారుచేస్తున్నారు. అవి మనుషులకీ పెంపుడు జంతువులకీ కూడా బలవర్ధకమైన ఆహారం. కోళ్లకు ఆహారంలో 20శాతం హెంప్‌ గింజల్ని చేర్చినప్పుడు అవి పెట్టే గుడ్లలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయని తెలిసింది. ఇప్పుడీ హెంప్‌ ఎగ్స్‌కి విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. వందగ్రాముల హెంప్‌ గింజల్లో 586 కెలొరీలు ఉంటాయట. 31 శాతం ప్రొటీన్‌, 49 శాతం ఫ్యాట్‌ ఉంటాయి. పీచు, బి-విటమిన్లు, ఇనుమూ జింకూ మెగ్నీషియం లాంటి మినరల్సూ ఎక్కువే. కార్బోహైడ్రేట్లు నామమాత్రంగానే ఉంటాయి.

ఫైబర్‌: హెంప్‌ కాండం నుంచి వచ్చే నారతో ఎన్నో రకాల వస్తువుల్ని తయారుచేస్తున్నారు. అతినీలలోహిత కాంతి, నిప్పు, నీరూ లాంటివాటికి తట్టుకునే శక్తి ఉన్న ఈ ఫైబర్‌ రక్షణ రంగంలో బాగా ఉపయోగపడుతుంది. ఓడలకీ, వంతెనల నిర్మాణంలో ఉపయోగించే బలమైన తాళ్లు పేనడానికీ, తెరచాపలూ టెంట్ల తయారీకీ దీన్నే వాడుతున్నారు. అచ్చంగా నూటికి నూరుశాతం హెంప్‌ ఫైబర్‌తో వస్త్రాన్నీ నేయవచ్చు. అచ్చం లినెన్‌ లాగే మృదువుగా ఉంటుంది. అయితే దానికి అవిసె(లినెన్‌), నూలు, పట్టు దారాలతో కలిపి నేసిన వస్త్రానికి మంచి డిమాండు ఉంది. దీనికి యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలూ ఉండడంతో రోగులకు ఈ దుస్తులు ఎంతో హాయినిస్తాయంటున్నారు. ఇంకా ఫర్నిషింగ్‌, బూట్ల తయారీలోనూ హెంప్‌ ఫైబర్‌ని వాడుతున్నారు.

నూనె: హెంప్‌ గింజల నుంచి తయారుచేసిన నూనెలో 35 శాతం దాకా ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. వంటనూనెగానూ వాడుకోవచ్చు. ఈ నూనెల్ని ఇంకా ఆయిల్‌ బేస్డ్‌ పెయింట్లలోనూ, రకరకాల క్రీముల్లో మాయిశ్చరైజింగ్‌ ఏజెంట్‌గానూ, కలపకి వార్నిష్‌గానూ వాడతారు.

భవన నిర్మాణం: ఇంగ్లండ్‌లోని బాత్‌ యూనివర్సిటీకి చెందిన సైన్స్‌ మ్యూజియం భవనానికి సున్నమూ హెంప్‌ మిశ్రమంతో తయారైన పానెల్స్‌ వాడారు. దాంతో భవనం లోపల కూలింగ్‌, హీటింగ్‌ పరికరాలేవీ వినియోగించాల్సిన అవసరం రావట్లేదు. అటు విద్యుత్తు ఖర్చూ తగ్గింది, ఇటు పర్యావరణానికి మేలూ జరిగింది. ఒక్క ఇన్సులేషన్‌కే కాదు, భవననిర్మాణంలో ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న నిర్మాణ సామగ్రికన్నా ఇది ఎన్నో రెట్లు నాణ్యమైనది. గ్రీన్‌బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ వచ్చాక హెంప్‌కి గిరాకీ బాగా పెరిగింది. హెంప్‌తో తయారైన ఇన్సులేషన్‌ తేలిగ్గానూ ఉంటుంది, నాన్‌ టాక్సిక్‌ కూడా. నేల, పైకప్పు, గోడలు... దేనికైనా వాడొచ్చు. ఈ ఇన్సులేషన్‌ ధ్వని నియంత్రణకూ తోడ్పడుతుంది. కలప రూపంలోనే కాకుండా- కాంక్రీటు, ఇటుక కూడా హెంప్‌తో తయారుచేసి వాడుతున్నారు.

బయో ప్లాస్టిక్స్‌: హెంప్‌ నుంచి తయారైన ప్లాస్టిక్‌- ఉపయోగం విషయంలో మామూలు ప్లాస్టిక్‌లాగే ఉన్నా పారేసినాక భూమిలో కలిసిపోతుంది. పీవీసీకి, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌కీ ఇది మంచి ప్రత్యామ్నాయం.

కార్లలో: హెన్రీఫోర్డ్‌ ఒకసారి హెంప్‌ ప్లాస్టిక్‌ని ప్రధానంగా వాడి కారు తయారుచేశాడు. దానికి ఇంధనంగా కూడా హెంప్‌ నుంచి తయారుచేసిన నూనె (బయో డీజిల్‌)నే వాడాడు. ఆరోజుల్లో హెంప్‌ సాగు చాలినంత లేకపోవడంతో ఆ ప్రయోగం ఆగిపోయింది. అయితే ఇప్పటికీ ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీలో ప్లాస్టిక్‌ బదులు హెంప్‌ వాడుతున్నారు. ఆడి నుంచి బెంజ్‌ వరకూ అన్నిట్లోనూ దాదాపు ఇరవై కిలోల దాకా ఈ విడి భాగాలు ఉంటాయట. ఫిల్టర్‌ చేసిన హెంప్‌ నూనెతో డీజిల్‌ ఇంజిన్లు నడపవచ్చు.

కాగితం: హెంప్‌ కలప నుంచి కాగితం తయారుచేస్తున్నారు. సిగరెట్ల తయారీకీ బ్యాంకు నోట్లకీ ఫిల్టర్‌ పేపర్‌కీ దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఈ కాగితం ఎంత పాతదైనా రంగు మారదు. మామూలుగా అడవిలో చెట్లనుంచీ కన్నా హెంప్‌ నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాగితం వస్తుంది. మామూలు కాగితాన్ని మూడుసార్లు మాత్రమే రీసైకిల్‌ చేయగలం, దీన్ని ఎనిమిది సార్లు రీసైకిల్‌ చేయవచ్చు.

ఔషధం: క్యాన్సర్‌, కీళ్లనొప్పులు, మూర్ఛ తదితర వ్యాధులకు సంబంధించిన మందుల్లో హెంప్‌ని వాడుతున్నారు. క్యాన్సర్‌ చికిత్స తాలూకు బాధల ఉపశమనానికి ఈ నూనె ఎంతగానో తోడ్పడుతుందట. ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా దీన్ని ఉపయోగిస్తున్నందున హెంప్‌ సాగుని చట్టబద్ధం చేయాలన్న డిమాండు చాలాకాలంగా ఉంది.

ఒక్కో రాష్ట్రమూ...

మనదేశంలో హెంప్‌ సాగును పూర్తిగా చట్టబద్ధం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని జిల్లాల్లో వైద్య అవసరాలకోసం చాలాకాలంగా పండిస్తున్నారు కానీ మిగతా రాష్ట్రాలు దీని జోలికి పోలేదు. దాంతో ఇప్పుడిప్పుడే మార్పు మెల్లమెల్లగా చోటుచేసుకుంటోంది. 2017లో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హెంప్‌ పంటను పండించడానికి రైతులకు అనుమతి ఇచ్చి, ఆ పంట సాగును చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రం అయింది. పారిశ్రామిక ఉపయోగాలకోసం మాత్రమే దీన్ని పండిస్తామని హామీ ఇస్తూ రైతులు ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి లైసెన్సు తీసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది, పండిన పంటని కూడా మళ్లీ ప్రభుత్వానికే అమ్ముతారు. పల్లెల్లోని చిన్నకారు రైతులకు ఆర్థికంగా అండనివ్వడానికి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్డీపీఎస్‌) చట్టం ప్రకారం వైద్య, పారిశ్రామిక అవసరాలకు హెంప్‌ని సాగుచేసేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ ఆ అవకాశాలను పరిశీలిస్తోంది. హెంప్‌ గింజల్నీ, ఆ గింజల ఉత్పత్తుల్నీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఇండియా) 2021లో ఆహార పదార్థాల జాబితాలో చేర్చింది. హెంప్‌ సాగునీ, దాని ఉత్పత్తుల్నీ ప్రోత్సహించడానికీ, వాటి నాణ్యతా ప్రమాణాలను పరిరక్షించడానికీ ఇండియన్‌ ఇండస్ట్రియల్‌ హెంప్‌ అసోసియేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. ఈ రంగంలో ముప్పైకి పైగా అంకురసంస్థలు కృషిచేస్తున్నాయి.

ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ

ప్రపంచంలో హెంప్‌ ఉత్పత్తిలో మొదటినుంచీ చైనా అగ్రస్థానంలో ఉంది. దాదాపు 70శాతం హెంప్‌ అక్కడే పండుతోంది. రెండోస్థానం ఫ్రాన్స్‌ది. మరో ముప్పై దేశాలు కూడా కాస్తో కూస్తో హెంప్‌ని పండిస్తున్నాయి. గ్రాండ్‌వ్యూ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం 2020 నుంచి గ్లోబల్‌ హెంప్‌ మార్కెట్‌ సాలీనా 16శాతం చొప్పున పెరుగుతూ 2027 నాటికి లక్షా పాతికవేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. అందులో భారత్‌ వాటా పాయింట్‌ వన్‌ పర్సెంట్‌ మాత్రమేనట. ప్రపంచవ్యాప్తంగా హెంప్‌ ఉత్పత్తుల పట్ల పెరుగుతున్న ఆసక్తి చూస్తుంటే 2030 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరవచ్చని పారిశ్రామికవేత్తలు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతానికి మనదేశంలో వైద్యరంగంలో హెంప్‌ మార్కెట్‌ విలువ 730 కోట్ల వరకూ ఉండవచ్చట.

ఒకప్పుడు మనదేశ జీడీపీలో వ్యవసాయం వాటా దాదాపు 55శాతం ఉండేది. అది ఇప్పుడు 16కి పడిపోయింది. సాగు ఏమాత్రం లాభసాటిగా లేకపోవడంతో రైతులు పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వలసపోతున్నారు. వారికి ఉపాధి కల్పించడం ద్వారా ఈ వలసల్ని ఆపడానికీ బంజరు భూముల్ని సాగు చేయడం ద్వారా భూమిలేని పేదలను ఆర్థికంగా ఆదుకోడానికీ హెంప్‌ సాగు తోడ్పడుతుంది. అంతే కాదు, పరిశోధన చేసినకొద్దీ ఊహకందని రీతిలో దీని ప్రయోజనాలు బయటపడుతూనే ఉన్నాయి. పర్యావరణపరంగా, పారిశ్రామికంగా, ఆర్థికంగా... పాతిక వేల ప్రయోజనాలున్నాయని నిపుణులు హామీ ఇస్తున్న నేపథ్యంలో హెంప్‌ని ఈ తరపు కల్పతరువు అనడంలో తప్పేముంది..!


ఎవరేం తయారుచేస్తున్నారంటే...

మనదేశంలో గత దశాబ్దంలోనే హెంప్‌ ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు ఎన్నో ప్రారంభమయ్యాయి. అవి రకరకాల ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెచ్చాయి. రతన్‌ టాటాలాంటి వాళ్లు పెట్టుబడి పెట్టిన ‘బోంబే హెంప్‌ కంపెనీ(బొహెకొ)’ మొట్టమొదటిసారి హెంప్‌ ఫైబర్‌తో జీన్స్‌ తయారుచేసింది. తెలంగాణకు చెందిన ‘హెంప్‌ రిపబ్లిక్‌’, ‘హెంప్‌స్టర్‌’ లాంటివి- వస్త్రాలూ, నూనెలూ, పొడీ, పేపర్‌ ఉత్పత్తులూ, సబ్బులూ, షవర్‌ జెల్స్‌ లాంటి బాడీకేర్‌ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాయి. బెంగళూరుకి చెందిన ‘నమ్రత హెంప్‌ కంపెనీ’, ‘ఇండియా హెంప్‌ కంపెనీ’లు హెంప్‌ నూనెతో స్కిన్‌ అండ్‌ బాడీ కేర్‌ ఉత్పత్తుల్ని అందిస్తున్నాయి. భువనేశ్వర్‌కి చెందిన ‘వేది’, దిల్లీకి చెందిన ‘హెంప్‌స్ట్రీట్‌’ పూర్తిగా ఆయుర్వేద ఉత్పత్తుల్ని తయారుచేస్తుండగా, వైజాగ్‌కి చెందిన ‘గ్రీన్‌జామ్స్‌’ హెంప్‌ కాంక్రీట్‌ తయారు చేస్తోంది. ఫ్యాషన్‌, బాడీకేర్‌, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రముఖ బ్రాండ్లు కూడా ఇప్పుడు హెంప్‌ ఉత్పత్తులవైపు దృష్టి మళ్లించడం విశేషం.


‘హెంప్‌కార్ట్‌’లో దొరుకుతాయి!

హెంప్‌ ఉత్పత్తులను కొనుక్కోవాలంటే ఎలా, ఎక్కడ దొరుకుతాయీ, అసలు ఏమేం ఉత్పత్తులున్నాయీ అని సందేహించేవారి కోసం ‘హెంప్‌కార్ట్‌’ సిద్ధంగా ఉంది. ఆహారమూ సరకులూ ఆర్డర్‌ పెట్టడానికి స్విగ్గీ, జొమాటోలు ఉన్నట్లే కేవలం హెంప్‌ ఉత్పత్తులకోసం ప్రారంభించిన వెబ్‌సైట్‌ ఇది. హెంప్‌ని ముడిసరకుగా వాడి పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి ఎన్నో పరిశ్రమలు. ఆయా సంస్థల వివరాలూ అవి తయారుచేస్తున్న ఉత్పత్తులూ అన్నీ హెంప్‌కార్ట్‌లో చూడొచ్చు. కావాల్సిన వస్తువుల కోసం ఆర్డర్‌ పెట్టు కోవచ్చు. సౌందర్యపోషణకు పనికొచ్చే వాటి నుంచి ఔషధాల వరకూ అన్నీ ఇందులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..