Allu Arjun: అల్లు అర్జున్‌ తగ్గేదేలే!

‘ఐదు లక్షలు ఇస్తామంటే నాలుగు లక్షలు సాలంటావేంటీ తెలివి తక్కువగా...’ ‘అది కూలీ... ఇది వాటా... యజమానినైపోలా...’- ఇది సినిమాలో పుష్ప లెక్క. మరి సూపర్‌స్టార్లూ నటసార్వభౌములూ ఎందరో ఉన్న తెలుగు సినిమాకి అవార్డుల్లో వాటా గురించి తెలియదా పుష్పకి..? అందుకే తగ్గేదేలేదన్నాడు

Updated : 03 Sep 2023 08:12 IST

‘ఐదు లక్షలు ఇస్తామంటే నాలుగు లక్షలు సాలంటావేంటీ తెలివి తక్కువగా...’ ‘అది కూలీ... ఇది వాటా... యజమానినైపోలా...’- ఇది సినిమాలో పుష్ప లెక్క. మరి సూపర్‌స్టార్లూ నటసార్వభౌములూ ఎందరో ఉన్న తెలుగు సినిమాకి అవార్డుల్లో వాటా గురించి తెలియదా పుష్పకి..? అందుకే తగ్గేదేలేదన్నాడు. ఏళ్ల తరబడి ఊరించిన ఉత్తమనటుడి అవార్డునే పట్టి తెచ్చేశాడు..! అభిమానులందరినీ పార్టీ చేసుకోమన్నాడు. పట్టుమని పాతిక సినిమాలతోనే స్టైలిష్‌ స్టార్‌నుంచి ఐకాన్‌ స్టార్‌గా మారిన బన్నీ ప్రయాణం ఏ కెరియర్‌ని ఎంచుకున్నవాళ్లకైనా పాఠాలు చెబుతుంది. 

అల్లు అర్జున్‌ 2.0 ఈ సినిమా ఎప్పుడొచ్చిందీ అంటారా... ఇప్పుడు మనం చూస్తున్నది అతడి రెండో అవతారాన్నే. స్టైలిష్‌ స్టార్‌గా బన్నీని చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇటీవల వచ్చిన పుష్ప-2 ఫస్ట్‌ లుక్‌లో గంగ జాతరలో స్త్రీ వేషంలో ఉన్న అర్జున్‌ని చూసి అవాక్కయ్యారు అభిమానులు. అసలు పుష్ప పాత్రే ఒక సంచలనం అనుకుంటే పుష్ప-2 మరో సంచలనం. ఒక తెలుగు హీరో అదీ స్టైలిష్‌ స్టార్‌గా పేరొందిన హీరో... ఇంత డీగ్లామర్‌ పాత్ర చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి?

అది అల్లు అర్జున్‌కి పుష్కలంగా ఉంది. అతడు తనని తాను స్టార్‌ అనుకోడు. ఇమేజ్‌ చట్రంలో అస్సలు ఇరుక్కోడు. హీరోలా నటించాలనుకోడు. నటించి హీరో అవ్వాలనుకుంటాడు. అందుకే... దర్శకుడు చెప్పిన పాత్రలో లీనమైపోతాడు. పాత్రకోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతాడు.

అలా చేశాడు కాబట్టే ‘పుష్ప’ అతడిని ఐకాన్‌ స్టార్‌గా మార్చేసింది. ‘పుష్ప’లో స్టైల్‌ ఉండదు, నటుడు ఉంటాడు. బన్నీకి స్టైలిష్‌ స్టార్‌ అని పేరు పెట్టింది సుకుమార్‌. కానీ ఇప్పుడతడు నటనలో మరో స్థాయికి చేరుకున్నాడు. ఆ సంగతి సుకుమార్‌కి ముందే తెలుసు. అందుకే ఈసారి ఐకాన్‌ స్టార్‌గా పరిచయం చేశాడు. ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ఇవ్వలేం- అన్నది గతంలో అల్లు అర్జున్‌ నటించిన ఒక సినిమా కాన్సెప్ట్‌. అర్జున్‌ కోసం పలు సినిమాలు నిర్మించి కొడుక్కి హీరోగా ఒక స్థానం ఇచ్చారు అల్లు అరవింద్‌. తనదైన నటనాకౌశలంతో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకుని జాతీయ ఉత్తమ నటుడి స్థాయికి అర్జున్‌ స్వయంగా ఎదిగాడు. కుటుంబ నేపథ్యం అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఆ తర్వాత ఎవరి ప్రయాణం వారిదేనని రుజువు చేశాడు. సినిమాల్లో నటిస్తానని కలలో కూడా అనుకోని వ్యక్తి ఇప్పుడు జాతీయ ఉత్తమనటుడి అవార్డు సాధించిన తొలి తెలుగువాడు ఎలా అయ్యాడో చూస్తే...

చదువు రాలేదని...
అర్జున్‌ చెన్నైలో పుట్టాడు. పద్దెనిమిదేళ్లు వచ్చేదాకా అక్కడే పెరిగాడు. అందుకే ఈ తెలుగబ్బాయికి తెలుగు రాదు, తమిళం వచ్చు. డైలాగుల్ని ఇంగ్లిషులో రాసుకుని చెబుతాడు. స్కూలు కబడ్డీ టీమ్‌లో సభ్యుడిగా ఉండేవాడు. జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నాడు. పియానో సాధన చేశాడు. చదువు ఎలాగూ రావడం లేదు కాబట్టి భవిష్యత్తులో పియానో టీచరుగానైనా బతకవచ్చనుకునేవాడట. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ కార్యక్రమాల వల్లే బన్నీ డాన్స్‌కి తొలి గుర్తింపు వచ్చింది. చిరంజీవి కూడా ప్రోత్సహించేవారు. ఖాళీ దొరికినప్పుడల్లా పిల్లలందరినీ ఒకచోట చేర్చి డాన్స్‌ చేయించేవారు. అందరికన్నా బాగా చేయాలని ప్రాక్టీసు చేయడం వల్ల కొంతా, జిమ్నాస్టిక్స్‌ వల్ల శరీరం ఫిట్‌గా ఉండడం వల్ల కొంతా... మొత్తానికి డాన్స్‌లో బన్నీ పర్ఫెక్ట్‌ అయిపోయాడు.

బన్నీకి అన్నా తమ్ముడూ ఉన్నారు. వీళ్లు ముగ్గురూ, మేనత్తల పిల్లలు ఐదుగురితో కలిసి ఒకే కారులో స్కూలుకు వెళ్లి వచ్చేవారట. అల్లు అరవింద్‌ ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఆదివారం పిల్లలందరినీ మెరీనా బీచ్‌కి తీసుకెళ్లేవారు. ఉడ్‌ల్యాండ్స్‌- డ్రైవ్‌ ఇన్‌లో భోజనం పెట్టించి తీసుకొచ్చేవారు. ప్రివ్యూ థియేటర్లో చిరంజీవి సినిమాల్ని చూపించేవారు. ఎప్పుడన్నా ఓసారి సినిమా షూటింగ్‌లకూ తీసుకెళ్లేవారట. అలా వెళ్లినప్పుడే అనుకోకుండా ‘విజేత’ సినిమాలో చిన్న పిల్లవాడి పాత్ర అవసరమై బన్నీని తెరపై చూపించారు. బాల్యాన్ని కజిన్స్‌తో బాగానే ఎంజాయ్‌ చేసినా వాళ్లంతా చదువులో ముందుండటంతో బన్నీ కాస్త ఒత్తిడికి గురయ్యేవాడు. ఎలాగో కష్టపడి చదివి పదో తరగతి పాసయ్యాడు. ఒక లక్ష్యం కోసం కష్టపడితే ఫలితం ఉంటుందన్న తొలిపాఠాన్ని నేర్పింది ఆ విజయమే.

తొలి సంపాదన

అర్జున్‌ ఇంటర్‌కి వచ్చేసరికి దేశంలో కంప్యూటర్‌ బూమ్‌ నడుస్తోంది. తనేమో బొమ్మలు బాగా వేసేవాడు. దాంతో యానిమేషన్‌ కోర్సు చేయాలనుకున్నాడు. కొన్నాళ్లు హైదరాబాద్‌లోని ఒక సంస్థలో అప్రెంటిస్‌గా పనిచేశాడు. అప్పుడతని జీతం నెలకు రూ.3500. అదే తొలి సంపాదన. ఆ సమయంలోనే ‘డాడీ’ సినిమాలో డాన్స్‌ నేర్చుకునే ఒక కుర్రవాడితో చిన్న సన్నివేశం ఉంటే అది బన్నీతో చేయించారు చిరంజీవి. నిజానికి అప్పటికీ అతనికి సినిమా ఆలోచన లేదు. ఆర్నెల్లు పనిచేసి ఇక కెనడా వెళ్లి కోర్సు చేద్దామని అప్లికేషన్‌ పెట్టాడు. ఎలాగూ వెళ్లిపోతాను కదా, ఈలోపు సరదాగా ఒక సినిమా చేస్తే గుర్తుండిపోతుంది అనుకున్నాడు కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మొదలవకుండానే ఆగిపోయింది. ఆ సంఘటన మళ్లీ సినిమాల గురించి సీరియస్‌గా ఆలోచించేలా చేసింది.

ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ... ‘మా తాతయ్య ఆరోజుల్లో ధైర్యం చేయకపోయి ఉంటే ఈ రోజు మేమంతా ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. ఆయన రెండెకరాల పొలం ఉన్న చిన్న రైతు. ఆసక్తితో వీధి నాటకాలు వేస్తుంటే మద్రాసు వెళ్లి సినిమాల్లో ప్రయత్నించమని ఎవరో సలహా ఇచ్చారట. ఆయన వెళ్లారు కానీ అవకాశాల కోసం ఎవరిని అడగాలో తెలియక తిరిగొచ్చేశారు. పొలం అమ్మేసి మళ్లీ వెళ్లారు. చిన్న వేషం వచ్చింది. చేతిలో డబ్బులు అయిపోవడంతో మళ్లీ ఇంటిముఖం పట్టారు. ఒక వేషం వచ్చినప్పుడు అక్కడ అందుబాటులో ఉంటేనే మళ్లీ అవకాశాలు వస్తాయని రవిరాజా పినిశెట్టి తండ్రి శ్రీరామమూర్తి నచ్చజెప్పి 200 రూపాయలు ఇచ్చి మళ్లీ మద్రాసు పంపించారట. అలా ఓపిగ్గా వేచి వుంటే మెల్లగా అవకాశాలు వచ్చాయి. కుటుంబాన్ని మద్రాసు తీసుకెళ్లారు. ఆరోజు ఆయన రిస్క్‌ తీసుకుని మొదలుపెట్టిన ప్రయాణమది.

ఆ తర్వాత మా నాన్న చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. తర్వాత చిరంజీవిగారితో అనుబంధం, మమ్మల్ని ఆయన ప్రోత్సహించడం, హీరోగా నా ప్రయాణం మొదలవడం... జరిగిపోయాయి. ఇప్పుడిలా ఉన్నామంటే దీని వెనుక మూడుతరాల కృషి ఉంది. నేను యానిమేషన్‌ రంగంలోకి వెళ్లి కిందినుంచీ మొదలుపెట్టి ఒక స్థాయికి చేరుకోవాలంటే చాలా ఏళ్లు పట్టేది. తాతయ్య అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి, తనకంటూ ఓ స్థాయిని తెచ్చుకోవడానికి ఒక జీవితకాలం పట్టింది. మా నాన్న నిర్మాతగా సక్సెస్‌ కావడానికి తాతయ్య జర్నీ ఉపయోగపడింది. అలా రెండు తరాలు కష్టపడి కట్టిన ప్లాట్‌ఫారాన్ని వదిలేసి నేను ఫ్రెష్‌గా కొత్త వేదిక కట్టుకోవడమా, వాళ్లిద్దరూ నిర్మించిన ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించుకుంటే నా జర్నీ తేలికవుతుందా... అన్న ఆలోచన నన్ను రెండోవైపే మొగ్గేలా చేసింది’ అంటాడు అర్జున్‌.

తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పడం, ఆయన సలహామేరకు ముంబయి వెళ్లి కిశోర్‌ నమిత్‌కపూర్‌ యాక్టింగ్‌ స్కూల్లో కోర్సు చేసిరావడం, ఆ తర్వాత ‘గంగోత్రి’లో నటించడం వరసగా జరిగిపోయాయి. ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప’ వరకూ తెరమీద నటుడిగా అర్జున్‌ అందరికీ తెలుసు కానీ తెరవెనుక అతడేం చేస్తాడన్నది కొందరికే తెలిసిన విషయం.

సమయం... సాధన...
అర్జున్‌ సమయానికి విలువ ఇస్తాడు. కచ్చితంగా చెప్పిన టైమ్‌కి మేకప్‌తో సిద్ధంగా ఉంటాడు. మర్నాడు చిత్రించబోయే సన్నివేశం గురించి ముందురోజే తెలుసుకుని సంభాషణలతో సహా తయారుగా ఉంటాడు. యాస విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. పుష్పలో చిత్తూరు యాస కోసం నలుగురు సహాయకుల్ని పెట్టుకుని మరీ నేర్చుకున్నాడట. ప్రతి డైలాగ్‌నీ వందసార్లు పలికి చూస్తాడు. పెద్ద సీన్లని సింగిల్‌ టేక్‌లో తీసినా తడబాటు కనిపించదు. యాక్షన్‌ సన్నివేశాల కోసం కసరత్తు తప్పనిసరి. షూటింగ్‌ స్పాట్‌కి ఫైట్‌ మాస్టర్‌తో సహా వచ్చి ప్రాక్టీసు చేస్తాడు. తెరపైన సీన్‌ని పండించడమే లక్ష్యంగా కృషిచేస్తాడు.

డాన్స్‌ విషయమూ అంతే. తనకి బాగా వచ్చని ఊరుకోడు. పాటకు వారం పదిరోజుల ముందు నుంచే డాన్స్‌ ప్రాక్టీసు చేస్తాడు. ఇంకా ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తాడు. తనని చూసి నేర్చుకునేవారికి స్ఫూర్తినివ్వాలంటే తాను మరింత కష్టపడక తప్పదంటాడు.

తాత నటుడు, నాన్న నిర్మాత, మామయ్య మెగాస్టార్‌... ఇంట్లో ఎటు చూసినా సినిమానే. అలాంటి ఇంట పుట్టి పెరిగినవారికి ఆ వాతావరణం పట్ల ఒకలాంటి ఉదాసీనత రావడం సహజం. కానీ బన్నీ అలా కాదు, నిత్యనూతనంగా సినిమాను ప్రేమిస్తాడు. ప్రతి సినిమా కొత్తగా ఉండాలనుకుంటాడు కానీ కొత్తదనం కోసమే సినిమా ఒప్పుకోడు. ప్రేక్షకులను మెప్పిస్తుంది, బాగుంటుంది అనిపిస్తేనే ఒప్పుకుంటాడు. తనని నమ్మిన నిర్మాత బాగుండాలని కోరుకుంటాడు. సహనటుల నుంచి మంచిని నేర్చుకోడానికి సంకోచించడు. ప్రతి సినిమా కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తాడు. సినిమా కోర్‌ టీమ్‌ ఒక్కటై పనిచేస్తే ఫలితం బాగుంటుందని నమ్ముతాడు. బన్నీ దృష్టిలో ఫెయిల్యూర్‌ని హ్యాండిల్‌ చేయగలిగినవాడు కాదు, సక్సెస్‌ని హ్యాండిల్‌ చేయగలిగినవాడే స్టార్‌. 

ఫ్యామిలీ మ్యాన్‌ 

అల్లు అర్జున్‌ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌. ఇంట్లోవాళ్ల పుట్టినరోజులూ, ప్రత్యేక సందర్భాలనూ అస్సలు మిస్సవ్వడు. ఆ డేట్స్‌లో షూటింగు లేకుండా చూసుకుంటాడు. కుటుంబ సభ్యుల ఆనందం తనకి పాజిటివ్‌ ఎనర్జీనిస్తుందని నమ్ముతాడు. భార్యబిడ్డల గురించి ఎన్ని కబుర్లో చెబుతాడు. స్నేహను ఓ నైట్‌ క్లబ్‌లో చూశాననీ హుందాగా ఉన్న ఆమె ప్రవర్తన నచ్చి ప్రేమలో పడిపోయాననీ చెప్పే అర్జున్‌ ఇప్పటికీ ఆమెను అదే ఆరాధనతో చూస్తాడు. ఆనందమొచ్చినా, బాధొచ్చినా ఒకేలా బ్యాలన్స్‌డ్‌గా ఎలా ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు. తాను ప్రతిదానికీ ఎమోషనల్‌ అయిపోతానంటాడు. అర్హది కూడా తల్లి మనస్తత్వమేనట. పెళ్లయ్యాక తాను తల్లిదండ్రులతోనే కలిసి ఉంటానని స్నేహకి ముందే చెప్పాడట. అర్జున్‌కి అమ్మానాన్నలంటే విపరీతమైన ప్రేమ. తండ్రిని తలచుకుంటేనే ఉద్వేగానికి లోనవుతాడు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అనీ తమ అదృష్టం కొద్దీ ఆయన తమ తండ్రి అయ్యారనీ చెబుతాడు. ‘నాన్న నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన చాలా పరిణతితో ఆలోచిస్తారు. పక్కనే ఉండి మనం తప్పు చేస్తున్నా చేయనిస్తారు. తప్పు చేసి మనంతట మనం ఆ తప్పుని గ్రహించి సరిదిద్దుకోవాలన్నది ఆయన అభిప్రాయం. ఆ సమయం ఇస్తారు. చేసే తప్పుల్ని సహనంతో భరిస్తారు. అప్పటికీ మనలో మార్పు రాలేదంటే అప్పుడిక ఒక సలహా ఇస్తారు. అలా ఇచ్చారంటే నాకు అర్థమైపోతుంది, విషయం చాలా దూరం వచ్చిందని. వెంటనే సరిదిద్దుకుంటా’ అని చెబుతాడు.

బాగా చదవట్లేదని అమ్మ దిగులుపడేదనీ కోపంలో ఒకోసారి కొట్టేది కూడాననీ చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసుకుంటాడు అర్జున్‌. తాతయ్య కూడా ‘వీడు ఎలా బతుకుతాడో ఏమో’ అనుకునేవారట. అలా అనుకునే, తను చనిపోయాక పదిహేను లక్షల రూపాయల బీమా సొమ్ము అర్జున్‌కి వచ్చేలా రాశారట. ఆ డబ్బు తీసుకునే సమయానికి కజిన్స్‌ అందరిలో బన్నీనే ఎక్కువ సంపాదిస్తుండటం విశేషం.

తమ చిన్నప్పుడు పిల్లల్ని షూటింగ్‌లకు దూరంగా ఉంచేవారనీ సినిమాల ప్రభావం తమమీద పడకూడదన్నట్లు పెంచారనీ అది సరైన పద్ధతి కాదనీ అంటాడు అర్జున్‌. ‘నా వృత్తిని నేను గౌరవిస్తాను. నా పిల్లలూ గౌరవించాలి. నన్ను చూడడానికి వచ్చే అభిమానుల్నే కాదు, వాళ్లు నాకు అభిమానులు అవడం వెనక నేను చేస్తున్న కృషి కూడా నా పిల్లలకు తెలియాలి. అందుకే పిల్లల్ని అప్పుడప్పుడు సినిమా షూటింగులకు తీసుకువెళ్తుంటా. మా అబ్బాయి ప్రతి సినిమా చూస్తాడు’ అని చెప్పే అర్జున్‌ పిల్లలు తనలాగా ఇబ్బంది పడకూడదని తెలుగు నేర్పిస్తున్నాడు. ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడేలా చూస్తాడు.

నా ముద్ర ఉండాలి తోటి నటుల్ని మనసారా ప్రశంసించడానికి ఏమాత్రం సంకోచించడు అర్జున్‌. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చేసినప్పుడు విజయ్‌ దేవరకొండనీ, ‘శ్రీమంతుడు’ సినిమా సందర్భంగా  మహేశ్‌బాబునీ మనస్ఫూర్తిగా అభినందించాడు. ఒక్కో సినిమాతోనూ నటుడిగానే కాదు, వ్యక్తిగానూ ఎదిగిన అర్జున్‌ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు. తాను మరీ ఎక్కువ దూరం ఆలోచించననీ వేసే ఆ ఒక్క అడుగు గురించే ఆలోచిస్తాననీ చెబుతాడు. ఏది చేసినా ఒక స్థాయి ఉండాలనుకుంటాడు. ఇల్లు, ఆఫీసు, కారవాన్‌... అన్నిటినీ అద్భుతమైన ప్రమాణాలతో తీర్చిదిద్దుకున్నాడు. తన తత్వానికి సరిపడే బ్రాండ్ల ప్రకటనల్లోనే కనపడడానికి ఇష్టపడతాడు. తన పేరు చెప్పగానే ఏదో ఒక సేవారంగంలో తాను వేసిన ముద్ర గుర్తురావాలనీ... అందుకు గ్రౌండ్‌ వర్క్‌ సిద్ధంచేసుకుంటున్నాననీ చెబుతాడు.


సినిమాలు ఆపేదేలే!
సినిమాల్లోకి రావాలని కలలు కనలేదు కానీ వచ్చాక మాత్రం వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు అల్లు అర్జున్‌కి. అతను చెబుతున్న మరికొన్ని విశేషాలు...

  •  ఉన్నంత కాలం సినిమాలు చేస్తా.. అదే లక్ష్యం. సినిమా ఉన్నంత కాలం స్టూడియో కావాలి. అందుకే తాతగారి పేరు మీద స్టూడియో కట్టా.
  •  నా దృష్టిలో స్టైల్‌ అనేది యాటిట్యూడ్‌. అది మనసులో ఉంటేనే బయటకు కనిపిస్తుంది. ప్రత్యేకంగా దుస్తులు వేసుకోవడం వల్లనో డబ్బు వల్లనో రాదు.
  •   ఒక సినిమాలో చిరంజీవిగారు వేసుకున్న జాకెట్‌ బాగా నచ్చింది. ఆ జాకెట్‌ ఉందా మీ దగ్గర అని అడిగితే ‘లేదు, ఎవరో తీసుకున్నారు’ అన్నారు. మనకు అలాంటివి కూడా ఓ తీపి జ్ఞాపకం అవుతాయనే ఉద్దేశంతో నేను కాస్ట్యూమ్స్‌ దాచుకుంటున్నా. ఓ పదేళ్ల తరవాత అవే నాకు బోలెడు విషయాల్ని గుర్తు చేస్తాయి కదా.
  •  మొదట పది సినిమాలు చేసే వరకూ నాకో లక్ష్యం ఉండేది కాదు. ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా అన్నదేం ఆలోచించేవాడిని కాదు. కానీ, ఒక్క సంఘటన మాత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘దేశముదురు’ షూటింగ్‌లో భుజానికి గాయం అయితే మైనర్‌ సర్జరీ చేశారు.
  • ‘బద్రీనాథ్‌’ సమయంలో అదే చోట పెద్దదెబ్బ తగిలింది. ఈసారి మేజర్‌ ఆపరేషన్‌ చేయాలన్నారు. అది చేశాక ఏడెనిమిది నెలలు షూటింగులకి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలన్నారు.  అప్పటికి ‘జులాయి’ సినిమా చేతిలో ఉంది. పాటలు షూట్‌ చేయాలి. అలాగని ఆపరేషన్‌ వాయిదా వేయడానికి లేదు. అప్పుడనిపించింది.... జీవితం చాలా చిన్నది. నటిస్తున్నామా డబ్బులు వస్తున్నాయా అనికాకుండా  ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు చేయాలి అని. అప్పట్నించీ చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంచుకుంటున్నా.
  •  హిట్‌ వస్తే దాన్ని స్ప్రింగు బోర్డులా మలుచుకుని పైకి వెళ్లాలి తప్ప దాని మీదే కూర్చుని పార్టీ చేసుకోకూడదు. అదే నేను ఫాలో అవుతా.
  • ఏ పని చేసినా సంతోషంగా చేయాలి అప్పుడే దాని ఫలితం చాలా బాగుంటుంది. సెట్‌కి నేను హ్యాపీ మూడ్‌తో వెళతా.
  • వెళ్లగానే డైరెక్టర్‌, కోస్టార్లు, కెమెరామెన్‌ ఏ మూడ్‌లో ఉన్నారో గమనిస్తా. ఎవరైనా కాస్త డల్‌గా అనిపిస్తే వాళ్ల సమస్య తెలుసుకుని పరిష్కరించడానికి నేనేం చేయగలనో ఆలోచిస్తా.
  • ఒక సినిమా ఒప్పుకోగానే ముందు హెయిర్‌స్టైలిస్ట్‌తోనే ఎక్కువ టైమ్‌ గడుపుతాను. నా పాత సినిమాలకి ఏమాత్రం సంబంధంలేని లుక్‌ తీసుకురావాలని
  • రకరకాల ప్రయోగాలు చేస్తాను. నన్ను క్లోజప్‌లో చూసి కేవలం నా హెయిర్‌స్టైల్‌ని బట్టే ప్రేక్షకులు అది ఏ సినిమానో చెప్పగలగాలి. అదే నా టార్గెట్‌!

ఓ సినిమాలో హీరో లుక్‌ వెనక ఇంకెందరో ఉంటారు. అలాంటివాళ్లలో మొదటి వ్యక్తి... హెయిర్‌స్టైలిస్టేనని నమ్ముతాను.


ఆ సంఘటన మర్చిపోను!

నీతులు చెప్పడానికి కాదు, ఆచరించడానికి... అని నమ్మే అర్జున్‌ చాలా జాగ్రత్తగా ఉంటాడు. డ్రైవింగ్‌లో పొరపాట్లు చేయడు. రాంగ్‌రూట్‌లో వెళ్లడు. డ్రైవింగ్‌ సీటులో కూర్చున్న ప్రతిసారీ ఓ సంఘటన గుర్తు చేసుకుంటాడట. పందొమ్మిదేళ్ల వయసులో ఓ ఫ్రెండ్‌తో హోటల్‌కి వెళ్తే అక్కడ ఇద్దరి మధ్యా వాదన వచ్చిందట. దాంతో కోపంగాలేచి కారులో వెళ్లిపోతున్న ఆమెను ఆపే ప్రయత్నంలో వేగంగా వెళ్లి ముందున్న కారుని ఢీకొట్టాడట అర్జున్‌. వెంటనే కారాపి... ఢీకొట్టిన కారులోని వాళ్లకి ఏమీ అవ్వలేదని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని క్షమాపణ చెప్పాడట. వర్షం పడుతున్న ఆ సమయంలో కారు వెనక సీట్లో ఓ నిండు గర్భిణి కూర్చుని ఉందనీ  ఆమె తనని ఒక్క మాట కూడా అనకపోయినప్పటికీ ఆ కళ్లలో కన్పించిన కోపం మాత్రం తనకి ఎప్పటికీ గుర్తుంటుందనీ చెబుతాడు. అప్పటినుంచీ జాగ్రత్తగా డ్రైవ్‌ చేయడాన్ని అలవాటుగా చేసుకున్న అర్జున్‌ ‘అయామ్‌ దట్‌ ఛేంజ్‌’ అని ఒక షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశాడు. మన బాధ్యతల్ని మనం నిర్వర్తించడం కూడా దేశభక్తేననీ, మార్పు మనతోనే మొదలవ్వాలనీ చెబుతుందది.



టీచర్‌ కరుణ

‘ఓన్లీ కైండ్‌నెస్‌ ఈజ్‌ రిమెంబర్డ్‌ ఫర్‌ ఎవర్‌’ - అర్జున్‌ డైరీలో రాసుకున్న కొటేషన్‌ ఇది. దీని వెనకో కథ ఉంది. అర్జున్‌కి స్కూల్లో అంబిక అనే టీచర్‌ జాగ్రఫీ చెప్పేవారు. ఆ తర్వాత ఎంతోమంది టీచర్స్‌ని చూసినా అంబిక మాత్రం అర్జున్‌కి బాగా గుర్తుండిపోయారు. అందుకు కారణం- చదువులో వెనకబడి ఆత్మన్యూనతకు లోనవుతున్న అర్జున్‌ని ఆమె సముదాయించేవారు. ‘అర్జున్‌... చదువొక్కటే జీవితం కాదు. నీకంటూ దేవుడు ఏదో ఒక వరం ఇచ్చుంటాడు. అదేమిటో తెలుసుకో. అది గ్రహించిన మరుక్షణం నీకు తిరుగుండదు’ అని ధైర్యం చెప్పేవారు. అలా తనకి దేవుడిచ్చిన వరం డాన్స్‌ అని గ్రహించిన అర్జున్‌ దాన్ని ఎంతగానో మెరుగుపర్చుకున్నాడు. తన డాన్స్‌ని ఎవరైనా మెచ్చుకున్నప్పుడల్లా అంబికా టీచర్ని గుర్తుచేసుకుంటాడు. చదువులో వెనకుండే అబ్బాయిని తిట్టకుండా నీ సత్తా తెలుసుకోమని ప్రోత్సహించడానికి ఆమె గుండెలో ఎంత కరుణ ఉండాలి! అందుకే ఆమెని గుర్తుంచుకుని ఈ కొటేషన్‌ రాసుకున్నానని చెబుతాడు అర్జున్‌.   

త్రివిక్రమ్‌... బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో... అన్నీ హిట్లే. ఒక్కో సినిమా అర్జున్‌ కెరీర్‌ని ఒక్కో మెట్టు పైకి లేపింది.


నేర్చుకుంటాడు, ఆచరిస్తాడు...

త్రివిక్రమ్‌ బన్నీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటాడు. నేర్చుకున్నదాన్ని నిజజీవితానికి అన్వయిస్తాడు, ఆచరణలో పెడతాడు. ఈ విషయాన్ని అందరూ నేర్చుకుంటే బాగుంటుందనిపిస్తుంది. తను నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలు చదువుతాడు. తక్కువ చదివినా లోతుగా అర్థం చేసుకుంటాడు. అందుకే మామధ్య ఎన్నో కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఇద్దరం మాట్లాడుకోవడం మొదలెడితే గంటలు గడిచిపోతాయి.


ఆయనతో షూటింగ్‌ ఎంజాయ్‌ చేస్తా: - బన్నీ 

త్రివిక్రమ్‌లో నాకు చాలా నచ్చేది- తాను చెప్పినట్లే జరగాలని అనుకోరు. అవతలి వాళ్లు చెప్పింది వింటారు. అవసరమైతే తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఆ ఓపెన్‌ మైండ్‌ ఆయనలోని గొప్ప లక్షణం. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆయనతో షూటింగ్‌ ప్రాసెస్‌ని ఎంజాయ్‌ చేస్తాను. నాకు ఏ సమయంలో ఏ ఇబ్బంది వచ్చినా అర్థరాత్రి అయినా సరే ఆయనకు ఫోన్‌ చేయగలను. ఎక్కువ సినిమాలు కలిసి చేయగల కెమిస్ట్రీ త్రివిక్రమ్‌కీ నాకూ ఉంది. కొంతమంది దర్శకులు నటుల బలాల్ని ఉపయోగించుకుంటారు. కొందరు నటులకు కొత్తబలాన్ని ఇవ్వగలుగుతారు. త్రివిక్రమ్‌ రెండో రకం. ఆయనతో పనిచేస్తే మనల్ని మనం అర్థంచేసుకోవచ్చు. 

‘గంగోత్రి’ తర్వాత పూర్తి మేకోవర్‌తో ‘ఆర్య’గా అర్జున్‌ సత్తా చూపడానికి కారణం దర్శకుడు సుకుమార్‌. తాజాగా ‘పుష్ప’ కూడా ఆయనతో చేసిందే. వీరిద్దరూ ఒకరిని తలచుకుని ఒకరు ఎమోషనల్‌ అయిపోతారు.


తను నా దేవుడు...:  సుకుమార్‌

‘ఆర్య’ షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ తెప్ప పైనుంచి నీట్లో పడిపోయా. నాకు ఈత రాక మునిగిపోతుంటే బన్నీనే నీళ్లలోకి దూకి రక్షించాడు. ఆరోజు నుంచీ తను నాకు దేవుడు. బన్నీ ఒక కాంప్లెక్స్‌ నటుడు. వివిధ రకాల లేయర్లు మిక్స్‌ చేసి ఒక సీన్‌ ఎలా అల్లుకుంటామో, తన పాత్రలోని లేయర్స్‌ని అలా తన ముఖంలో అల్లుకుంటాడు. ‘ఆర్య’ సమయంలో నేను ఏం చెబితే అది చేశాడు. కానీ ‘పుష్ప’కు వచ్చేసరికి తనలో చాలా పరిణతి వచ్చింది. సినిమా కోసం తపన పడుతూ ఎన్నో ఇన్‌పుట్స్‌ ఇస్తుంటాడు.


ఆ నిర్ణయం వల్లే..:  అల్లు అర్జున్‌

‘ఆర్య’ సమయంలో మరికొన్ని కథలూ విన్నా. కానీ సుకుమార్‌తోనే నడవాలనుకున్నా. కాబట్టే ఈరోజు నటుడిగా ఈ స్థాయిలో ఉన్నా. వేరే దారి ఎంచుకుంటే నా కెరియర్‌ కచ్చితంగా ఇలా ఉండేది కాదు. నటుడిగా నిలదొక్కుకున్నాక రూ.85 లక్షలు పెట్టి ఓ స్పోర్ట్స్‌ కారు కొన్నా. దాని స్టీరింగ్‌ పట్టుకోగానే నా చేతికి ఈ కారు రావడానికి కారణం సుకుమార్‌ అనిపించింది. ‘తగ్గేదేలే’ అంటూ నన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందీ తనే. గుండె మీద చేయి వేసుకుని ఒక్క మాట చెప్పగలను ‘డార్లింగ్‌, నువ్వు లేకపోతే నేను లేను’ అని. ఈ జీవితంలో కుటుంబం తర్వాత నేను రుణపడి ఉండేది సుకుమార్‌కే.


తన గురించి ఇన్ని చెప్పిన అర్జున్‌ జాతీయ ఉత్తమనటుడిగా ఇప్పుడు అభిమానులకు ఏం చెబుతున్నాడో తెలుసా...‘గెలుపోటములూ అవార్డులూ శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండేది మన కృషి మాత్రమే. దాన్నే నమ్ముకుందాం..!’ రైట్‌ బన్నీ... మరోసారి శుభాభినందనలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..