ఇల్లు... సర్దకపోతే సమస్యే

చీటికీ మాటికీ ఇంట్లో వాళ్లతో గొడవపడుతున్నారా?అయితే ఒకరోజు కాస్త ఓపిక చేసుకుని ఇల్లంతా శుభ్రంగా ఎక్కడివక్కడ సర్దండి. ఆఫీసులో చికాగ్గా ఉండి పని సరిగ్గా చేయలేకపోతున్నారా?అయితే ఒకసారి డెస్క్‌ని నీట్‌గా సర్దుకోండి.

Updated : 23 Feb 2024 16:17 IST

చీటికీ మాటికీ ఇంట్లో వాళ్లతో గొడవపడుతున్నారా?అయితే ఒకరోజు కాస్త ఓపిక చేసుకుని ఇల్లంతా శుభ్రంగా ఎక్కడివక్కడ సర్దండి. ఆఫీసులో చికాగ్గా ఉండి పని సరిగ్గా చేయలేకపోతున్నారా?అయితే ఒకసారి డెస్క్‌ని నీట్‌గా సర్దుకోండి. పనైపోయిన కాగితాలన్నీ తీసి పారేయండి.శుభ్రతకీ మన ప్రవర్తనకీ ఏమిటీ సంబంధం అంటారా? చాలానే ఉందంటున్నారు పరిశోధకులు. మనం ఎదుర్కొంటున్న పలు చికాకులకు కారణం మన పరిసరాలేనని వాళ్ల అధ్యయనాల్లో తేలిందట మరి. నమ్మబుద్ధి కావట్లేదా... అయితే ఇది చదవండి.

వ్యక్తి పగలంతా పనిచేసి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉండేది. అసలే చిన్న ఇల్లు. ఎప్పుడు చూసినా పిల్లలు అల్లరి చేస్తూ ఉండేవారు. వారిని అదుపు చేయలేక భార్య ఈసురోమంటూ తిరుగుతుండేది. ఇంట్లో తనకి ప్రశాంతతే కరవైందని బాధపడుతూ అతడు ఒక సాధువు దగ్గరికి వెళ్లాడు. ‘అయ్యా నాకు భార్యాబిడ్డలూ తలదాచుకోను నీడా ఉన్నప్పటికీ మనశ్శాంతి మాత్రం లేదు’ అని వాపోయాడు. ఆ సాధువు ‘నేను చెప్పినట్లు చేస్తావా’ అని అడిగాడు. చేస్తానని హామీ ఇచ్చాడు ఆ వ్యక్తి.‘అయితే అరడజను కోళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వారం తర్వాత రా’ చెప్పాడు సాధువు.పిల్లల గోలే భరించలేకుండా ఉంటే మళ్లీ కోళ్ల గోలేంటీ అనుకున్నా సాధువుకు మాటిచ్చాడు కాబట్టి సరే అనిచెప్పి వెళ్లి కోళ్లను తెచ్చి ఇంట్లో పెట్టాడు. పిల్లల్ని కోప్పడితే ఒక పక్కన కూర్చునేవారు. ఈ కోళ్లు అస్సలు బెదరకపోగా అరుస్తూ కాళ్లకు అడ్డం వస్తూ ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేస్తూ విసిగించేస్తున్నాయి. ఎలాగో ఓపిక పట్టి వారం అవగానే సాధువు దగ్గరకు వెళ్లాడు.ఈసారి ఆయన వారానికొకటి చొప్పున ఒక కుక్కనీ పిల్లినీ ఆవునీ కూడా తెచ్చి ఇంట్లో ఉంచుకోమని చెప్పాడు. ‘అమ్మో...’ అనబోయి ఇచ్చిన మాట గుర్తొచ్చి నీరసంగా తలవూపి అలాగే చేశాడు. ఇంట్లో అసలు నిలబడడానికీ చోటుండేది కాదు. వాటి అరుపులూ వాసనలూ భరించలేక తల పగిలిపోయేది. ఇంటిల్లిపాదీ రోగిష్టివాళ్లలా తయారయ్యారు. మూడు వారాలూ మూడు యుగాల్లా గడిచాయి. నిద్రా తిండీ కరవై నీరసంగా సాధువు దగ్గరకు వెళ్లాడు. ‘అయ్యా...’ అంటూ సాధువు కాళ్లమీద పడ్డాడు.

‘ఇప్పుడు వారానికోటి చొప్పున వాటన్నిటినీ పంపించేయ్‌’ చెప్పాడు సాధువు.అతడు సంతోషంగా ఇంటికెళ్లి ముందుగా కోళ్లనూ తర్వాత మిగిలినవాటినీ ఇంట్లోనుంచి వెళ్లగొట్టేశాడు. భార్యాబిడ్డలతో కలిసి ఆడుతూపాడుతూ ఇంటిని శుభ్రం చేసుకున్నాడు. అప్పుడు ఇల్లు విశాలంగా, భార్య అందంగా, పిల్లలు ఆనందంగా కన్పించారతనికి. ఈ పని ముందే చేస్తే సాధువు దగ్గరికి వెళ్లే అవసరమే ఉండేది కాదు కదా... అనుకున్నాడు.

ఆ వ్యక్తి పాతతరం వాడు కాబట్టి మనశ్శాంతిని వెతుక్కుంటూ సాధువు దగ్గరికి వెళ్లాడు, ఇప్పటివాళ్లు షాపింగ్‌కి వెళ్తున్నారు. అవసరమైనవీ లేనివీ కొని ఇళ్లను నింపేస్తున్నారు. అదేమంటే- పోయేది మా డబ్బే కదా అనుకుంటున్నారు కానీ అంతకన్నా విలువైనవి చాలా కోల్పోతున్నామని గుర్తించడం లేదు... అంటున్నారు పరిశోధకులు.

మోయలేని భారం

మనలో చాలామందికి మల్టీటాస్కింగ్‌ చేయడం అలవాటు. కళ్లు ఉడికే కూర మీదా, చేతులు పిల్ల జడమీదా, మనసు మామగారు వేసుకోవాల్సిన మాత్ర మీదా... లగ్నమై ఉంటాయి. ఇలాంటి వాళ్లు ఆఫీసులోనూ అంతే. చుట్టూ పదిరకాల ఫైళ్లు పెట్టుకుని పది చేతులున్నట్లు పనిచేయబోతారు. పనులు పూర్తిచేయడంలో ఉన్న శ్రద్ధ వీరికి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో లేదా అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో పెట్టుకోవడంలో ఉండదు. వారి దృష్టిలో అది టైమ్‌ వేస్ట్‌ పని. కానీ మన మెదడు అలా మల్టీటాస్కింగ్‌ చేయడానికి తయారవలేదు. అది ఒక్క పనిమీదే దృష్టి పెట్టగలుగుతుంది. ఆ పని కూడా ఎప్పుడు బాగా చేస్తుందంటే- పరిసరాలన్నీ శుభ్రంగా, వస్తువులన్నీ పొందిగ్గా సర్ది ఉన్నప్పుడు. ఎప్పుడైతే పరిసరాలు అలా లేవో అప్పుడు మెదడు ఒత్తిడికి లోనవుతుంది. ఏకాగ్రత తగ్గి చేయాల్సిన పనిని సమర్థంగా చేయలేదు. అంతేకాదట... ఆ ఒత్తిడి జీవితానికి సంబంధించి మరెన్నో విషయాలనీ ప్రభావితం చేస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఊహించని విధంగా ఇళ్లలో చెత్త సమస్య మనిషి మీద దీర్ఘకాల ప్రభావం- అదీ పలురూపాల్లో చూపుతోందని వాళ్ల పరిశోధనల్లో వెల్లడైంది.

  • ఇరుకుగా, చిందరవందరగా ఉన్న ఇళ్లలో నివసించే మహిళల్లో కార్టిసోల్‌(స్ట్రెస్‌) హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతోంది. అది అలాగే కొనసాగితే కుంగుబాటుకి దారితీస్తోంది.
  • ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతేనే కాదు, ఉంచుకున్నానో లేదోనన్న ఆందోళన కూడా కొందరిలో ఒత్తిడిని పెంచుతుంది. ఇంటి శుభ్రత స్త్రీల బాధ్యతేనన్న భావన సమాజంలో స్థిరపడిపోవడంతో ఎవరైనా వస్తున్నారనగానే ‘అయ్యో ఇల్లు సర్దలేదే, వాళ్లేమనుకుంటారో’నని ఆందోళనకు గురవుతారు. కడిగిందే కడుగుతూ తుడిచిందే తుడుస్తూ మరింత ఒత్తిడికి లోనవుతారు. ఇది ఓసీడీకి దారితీస్తుంది.
  • ఈ చెత్త ప్రభావం స్త్రీలమీద ఉన్నంతగా పురుషుల మీద ఉండదట. పరిసరాలతో సంబంధం లేకుండా వారు తమ పనిచేసుకోగలరనీ, కొందరు మాత్రమే స్త్రీలలాగా ఇబ్బంది పడతారనీ ఓ అధ్యయనం చెబుతోంది.
  • ఇంటి శుభ్రతకి సంబంధించి ఒత్తిడి లాంటివే కాక, ఓసీడీ, రకరకాల వస్తువుల్ని దాచిపెట్టే హోర్డింగ్‌ డిజార్డర్‌, మేజర్‌ డిప్రెసివ్‌ డిజార్డర్‌, అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌, యాంక్జయిటీ డిజార్డర్‌... లాంటి తీవ్ర మానసిక సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంది.
  • చిందరవందరగా ఉన్న పరిసరాల్లో జీవించేవారికి అనవసరంగా ఖర్చుపెట్టే గుణం ఎక్కువట. పనికిరాని వస్తువుల్ని కొని చెత్తను ఇంకా పెంచుకుంటారట.
  • ఇరుగ్గా ఉండే ఇల్లు తీవ్ర శ్వాస సమస్యలకీ ఎలర్జీలకీ కారణమవుతుంది.
  • అస్తవ్యస్తంగా ఉన్న ఇంటి వాతావరణం ఆహారపుటలవాట్లనీ ప్రభావితం చేస్తుంది. స్థూలకాయులమీద చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. చక్కగా సర్దిన ఇంట్లో ఉన్నవారికన్నా చిందరవందరగా ఉన్న ఇంట్లో ఉన్నవారు రెండురెట్లు ఎక్కువ చిరుతిళ్లు తిన్నారట. అదీ జంక్‌ ఫుడ్‌ని ఎంచుకున్నారట. అలాంటి ఇళ్లలో నివసించేవారిలో 77శాతం స్థూలకాయులేనని తేల్చింది మరో అధ్యయనం.
  • ఇంటిని చక్కగా ఉంచుకునే అలవాటు లేనివారు తమ ఆఫీసునీ అలాగే ఉంచుతారట. పనిచేసే డెస్క్‌ని నీట్‌గా పెట్టుకోనివాళ్లకు ప్రమోషన్‌ ఇవ్వలేమని 28శాతం మేనేజర్లు చెప్పారట. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ తమ విద్యార్థులమీదే ప్రయోగం చేసింది. కేవలం పరిసరాలు మెదడుని వ్యాకులపరచడం వల్ల విద్యార్థుల ఆలోచనా సామర్థ్యం, సందర్భానికి తగినట్లుగా స్పందించే వేగం ఎన్నో రెట్లు తగ్గిపోతున్నాయట.
  • ఇల్లు శుభ్రంగా లేకపోతే అనుబంధాలూ దెబ్బతింటాయట. మనసు చికాగ్గా ఆందోళనగా ఉండడం వల్ల విసుక్కోవడం, ప్రతిదానికీ కోపం తెచ్చుకోవడం ఎక్కువై పోట్లాటలకు దారితీస్తుంది.
  • ప్రేమించే మనుషుల మధ్య తృప్తిగా జీవిస్తూ ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉంటే ఇవేమీ అడ్డురాకపోవచ్చు... అన్న సందేహమూ వచ్చింది పరిశోధకులకు. దాంతో ఆ కోణంలో నుంచి కూడా అధ్యయనం చేస్తే ఏ ఆనందమూ, ఎంతటి విశిష్ట వ్యక్తిత్వమూ కూడా ఈ చెత్త తాలూకు ప్రభావానికి అతీతం కాదని తేలింది. దాంతో ఇప్పుడిక పరిశోధకులు పెరుగుతున్న డిమెన్షియా, ఆల్జీమర్స్‌ సమస్యలకూ దీనికీ కూడా సంబంధం ఉందేమోనని అధ్యయనం చేస్తున్నారు.

అసలు ఇలా ఎందుకు జరుగుతుందీ అంటే...

మెదడు... యుద్ధభూమి!

ఆఫీసులో పనిచేసేటప్పుడైనా, ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నా... చుట్టూ పది రకాల వస్తువులున్నాయనుకోండి. అప్పుడు మన చూపు- చేసే పనిమీదో చూసే టీవీమీదో నిలవదు. ఉదాహరణకు- టీవీనే చూస్తున్నారనుకుందాం. వారం క్రితం ఫ్రెండ్‌ దగ్గర తీసుకుని సగం చదివిన పుస్తకం టీవీ పైన కనిపిస్తుంది. పిల్లల టైయ్యో బెల్టో టీవీ వెనకనుంచి తొంగి చూస్తూ ఉంటుంది. ఆఫీసు నుంచి వస్తూ తెచ్చిన కూరగాయల సంచీ ఆ పక్కనే ఉన్న టీపాయ్‌ మీద, పొద్దున తాగిపెట్టిన టీ గ్లాసులు సోఫా కింద,  దివాను మీద ఉతికిన బట్టల కుప్ప, సగం తెరిచి ఉన్న అల్మారాలోనుంచి ముట్టుకుంటే పడిపోయేలా ఉన్న పిల్లల పుస్తకాలు... టీవీలో దృశ్యంతో పాటు లాంగ్‌షాట్‌లో ఇవన్నీ కళ్లకు కన్పిస్తూనే ఉంటాయి. మెదడు అన్నిటి గురించీ ఆలోచిస్తుంది. పుస్తకం రెండు రోజుల్లో చదివి ఇస్తానని చెప్పారు, ఆకు కూర శుభ్రం చేసి రాత్రికి వండాలి, రేప్పొద్దుటికి కూరలు కోసి పెట్టుకోవాలి, బట్టలు ఇస్త్రీకి ఇవ్వాలి, పిల్లల అల్మారా సర్దడం ఇవాళ అయ్యే పని కాదు, లేచినప్పుడు ఆ తలుపన్నా సరిగ్గా వేయాలి... ఇలా ఆలోచిస్తూ ఏ పనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక మెదడులో ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు కొన్నాళ్లకు అలవాటుగా మారిపోతే మెల్లమెల్లగా చికాకు మొదలై ఒత్తిడీ యాంగ్జయిటీ... దశలు దాటి డిప్రెషన్‌కి దారితీస్తాయి. కొందరికి మెదడు స్పందించడం మానేసి అసలు ఎంత చెత్త ఉన్నా పట్టనట్లు నిర్లిప్తంగా ఉండేలా చేస్తుందట.ఇదేదో కల్పించి చెబుతున్న కథ కాదు, 2016లో అచ్చం ఇలాంటి అధ్యయనమే చేశారు కొందరు మనస్తత్వ నిపుణులు. థియేటర్‌లో తెరకి చుట్టూ రకరకాల వస్తువులను ఉంచి సినిమా ప్రదర్శించారు. అది చూసిన ప్రేక్షకులు నటీనటుల భావోద్వేగాలను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయారట. అదే చుట్టూ ఏమీ లేకుండా చూసినవాళ్లు చక్కగా విశ్లేషించారట. నిజానికి మెదడుని మనం ఇంత కష్టపెట్టాల్సిన అవసరం లేదు. అది కోరుకునేదల్లా సింపుల్‌గా ఎక్కడి వస్తువు అక్కడ ఉండడం. తరతరాలుగా మనమే దానికి అలా తర్ఫీదు ఇచ్చి తయారుచేసుకున్నాం. ఇప్పుడేమో ఇంటినిండా సామాను చేర్చి దాన్ని అయోమయానికి గురిచేస్తున్నాం... అంటున్నారు మానసిక నిపుణులు. మరి ఈ సమస్యకి వాళ్లేం పరిష్కారం చెబుతున్నారూ...

పనులు పంచుకోండి!

పైన చెప్పిన ఉదాహరణే చూద్దాం. పుస్తకాన్ని- చెప్పినట్లుగా రెండురోజుల్లో చదివి ఇచ్చేయాలి. కూరగాయలు తేగానే ఆ పూటకు కావలసినవి తీసుకుని మిగతావి ఫ్రిజ్‌లో పెట్టేయొచ్చు. పిల్లలు ఎవరి వస్తువులు వాళ్లు పొందిగ్గా సర్దుకోవడం, తాగిన టీ కప్పులు వెంటనే సింకులో పెట్టేయడం, ఆరిన బట్టల్ని తీయగానే మడత పెట్టడం... ఇవేవీ రోజులూ నెలలూ పట్టే పనులు కావు. అయినా ఇళ్లు అలా ఎందుకుంటాయంటే...

పద్ధతి నచ్చదు: కొంతమందికి క్రమశిక్షణగా ఉండడం, పద్ధతిగా పనిచేయడం నచ్చదు. బద్ధకంతో ఎక్కడివక్కడ వదిలేస్తూ ఉంటారు. ఒక్కసారి టైమ్‌లేదని వాయిదా వేయడం అలవాటైపోతే పనులన్నీ పేరుకుపోయి ఇంటికి భారంగా తయారవుతాయి. ఎప్పటి పని అప్పుడు చేసుకోమని పెద్దలు చెప్పేది అందుకే.

పారేయరు: మనుషులకు ఒక కొత్త వస్తువు కొనుక్కుంటే వచ్చే ఆనందం కన్నా పాత వస్తువు పారేసేటప్పుడు కలిగే బాధ ఎక్కువని సైకాలజిస్టులు తేల్చారు. అందుకే కొందరి ఇళ్లలో పాత న్యూస్‌పేపర్ల గుట్టలూ తెగిపోయి పనికిరాని చెప్పుల జతలూ కాళ్లు విరిగిపోయిన కుర్చీలూ కనిపిస్తుంటాయి. అలాంటివన్నీ ఎప్పటికప్పుడు బయటపారేయాలి. ఏడాదిపాటు వాడని వస్తువు ఏదీ ఇంట్లో ఉండకూడదనేది నియమంగా పెట్టుకుంటే చాలు- ఇల్లు శుభ్రమవుతుంది.

పంచుకోరు: కొందరికి పనులు చెప్పి చేయించడం రాక అన్ని పనులూ తామే చేస్తారు. కొందరికి ఒళ్లొంగక తప్పించుకు తిరుగుతుంటారు. మరికొందరికి తీసిన
వస్తువును తీసిన చోటే పెట్టే అలవాటు ఉండదు. అన్నిటికీ ఒకటే పరిష్కారం- పనుల్ని పంచుకోవడం. ఒక్కరే మల్టీటాస్కింగ్‌ చేయకూడదు. అందరూ అన్ని పనులూ పంచుకుని చేసుకుంటే ఎప్పటి పనులు అప్పుడు అయిపోయి ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది.

షోకేసు కాదు: కొందరు మరీ చాదస్తంగా చేతులకు చీపురు కట్టా తడి బట్టా కట్టుకుని తిరుగుతున్నట్లుంటారు. దుమ్ము పడకముందే తుడుస్తుంటారు. అది ఓసీడీ అవుతుంది. ఇల్లు సౌకర్యంగా శుభ్రంగా ఉంటే చాలు. అంతేకానీ కడిగిన అద్దంలా తళతళలాడాలనే పర్ఫెక్షనిజం అవసరం లేదు.

ఇవ్వలేరు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య- ప్రజలు బట్టల మీద పెడుతున్న ఖర్చు. చాలామందికి కొత్తవి కొనడమే కానీ పాతవి ఏంచేయాలో తెలియడం లేదు. వాడని, ఉపయోగపడని దుస్తులను ఎవరికైనా ఇచ్చేయాలి. విలువైన వాటిని ప్రి ఓన్డ్‌ సైట్స్‌లో అమ్మేయొచ్చు, కాదంటే అనాథాశ్రమంలో ఇవ్వొచ్చు. రీసైక్లింగ్‌కి అందజేయొచ్చు. అందుకు ప్రాణం ఒప్పక ఇంట్లోనే ఉంచుకోవడమూ సమస్యకు కారణమే.

జమచేస్తారు: కొందరికి పాత జ్ఞాపకాలను గుర్తుచేసే వస్తువుల్ని చుట్టూ ఉంచుకోవడం ఇష్టం. కొందరికేమో ఎప్పుడే అవసరం వస్తుందోనని పెద్దమొత్తంలో సరకులు కొని పెట్టుకోవడం ఇష్టం. ఇల్లు ఇరుగ్గా ఉన్నా సరే వాటిని అలాగే ఉంచుకుంటారు. యేల్‌ యూనివర్సిటీ ఇలాంటివారిపై ఓ అధ్యయనం చేసింది. వాటిని వదిలించుకోవాల్సివస్తే వాళ్ల మెదడులో శారీరక నొప్పులను సూచించే కణాలు తీవ్రమైనబాధకి లోనవుతాయట. అలాంటివారు వాటిని కనీసం పద్ధతి ప్రకారం అమర్చుకుని, ఇల్లు ఇరుగ్గా కనబడకుండా, చాలినంత గాలీ వెలుతురూ రావడానికి అవి అడ్డుకాకుండా చూసుకోవాలి. దుమ్మూ ధూళీ చేరి ఇబ్బంది పెట్టకుండానూ చెదలు పట్టకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.

అదొక కళ!

ఇల్లన్నాక చెత్త చేరకుండా ఉండదు. చిన్న పిల్లలుంటే ఇంటినిండా చిందరవందరగా బొమ్మలు పడివుంటాయి. కాస్త పెద్ద పిల్లలైతే పుస్తకాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. స్కూలు నుంచి వచ్చి యూనిఫామ్‌ని తలా ఓపక్కకీ గిరాటేసి మర్నాడు వెతుక్కోవడం... చాలామందికి అలవాటే. ఇక, కాలేజీ పిల్లలున్నారంటే- వాళ్ల వార్డురోబు తలుపు తెరవాలంటేనే భయమేస్తుంది. మంచంమీద ఉతికినవీ విడిచినవీ దుస్తులు పోగులు పడి ఉంటాయి. పైన చెప్పినట్లు ఇంటిల్లిపాదీ శుభ్రతలో తమవంతు పాత్ర పోషిస్తే ఈ దృశ్యాలేవీ కనపడవు. అలాగే రెండు మూడు నెలలకోసారి ఒక్కో గదికీ ఒక రోజు చొప్పున కేటాయించి అనవసరంగా ఉన్న వస్తువుల్ని తీసేయడం కూడా అలవాటు చేసుకోవాలి. విదేశాల్లో సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఆర్గనైజర్‌(ఇల్లు సర్దిపెట్టేవాళ్లు) అనేది ఎప్పటినుంచో ఉన్న వృత్తి. వీళ్ల సేవలు అందుకునేవాళ్ల ప్రధాన సమస్య ఇంట్లో చెత్త పేరుకుపోవడమేనట. వాళ్లు వచ్చి పనికిరాని వస్తువులన్నీ తీసేసి ఇంటిని చక్కగా సర్దివెళ్తారట. ఈ పనినే జపాను వారు ఒక కళగా సాధన చేస్తారు. క్లీనింగ్‌ కన్సల్టెంట్‌గా పేరొందిన మేరీ కోండో ఈ అంశంపై ‘ద లైఫ్‌ ఛేంజింగ్‌ మ్యాజిక్‌ ఆఫ్‌ టైడీయింగ్‌ అప్‌’ అనే పుస్తకం రాసింది. న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌గా ఎంపికైన ఈ పుస్తకం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌ ‘టైడీయింగ్‌ ఆప్‌ విత్‌ మేరీ కోండో’ అని ఒక సిరీస్‌ని రూపొందించి ప్రసారం చేసింది. ఇంటిని ఒక్కసారి పద్ధతిగా సర్దుకున్నామంటే ఆ తర్వాత మళ్లీ మళ్లీ సర్దే అవసరమే రాదనీ శుభ్రం చేసుకుంటే సరిపోతుందనీ అంటుంది మేరీ కోండో. నిజమే కదా..!


మినిమలిజం... విరుగుడు!

మనుషులకు వస్తువుల పట్ల పెరుగుతున్న మోజునూ రకరకాల వస్తువులతో ఫర్నిచరుతో ఇంటిని నింపుతున్న వైనాన్నీ గమనించి విసిగిపోయిన కొందరు ఇప్పుడిప్పుడే మినిమలిజంవైపు మళ్లుతున్నారు. ‘అడుసు తొక్కనేల కాలు కడగనేల’ అన్న సూత్రాన్ని బాగా ఒంట పట్టించుకున్న వీళ్లు ఇంటి నిండా చెత్త చేర్చనేల, దాన్ని సర్దుకుంటూ సమయం వృథా చేయనేల... అనుకుంటూ అవసరానికి మించి ఒక్క వస్తువునూ ఇంట్లోకి చేరనీయడం లేదు. ‘అప్పుడే ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, పరిసరాలు మన అదుపులోనే ఉన్నట్లనిపిస్తుంది. టైమూ డబ్బూ వృథా కావు. అన్నిటినీ మించి మనసుకెంతో తేలికగా హాయిగా ఉంటుంది...’ అంటారు మినిమలిస్టులు.


పరిసరాలు శుభ్రంగా ఉంటే...

ఫీసైనా ఇల్లయినా మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా, వస్తువులను ఒక క్రమ పద్ధతిలో సర్దుకుని ఉంచుకుంటే అవి మన ఆరోగ్యాన్నీ పనితీరునూ ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధనలు రుజువు చేశాయి.

  • పరిశుభ్రమైన వాతావరణంలో చురుగ్గా శ్రద్ధగా పనిచేస్తారు, పనిభారంగా అనిపించదు. దాంతో ఉత్పాదకత పెరుగుతుంది.
  • ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా శుభ్రమైన పరిసరాలు దాన్ని తగ్గిస్తాయి.
  • నీటుగా ఉన్న డెస్క్‌ ఉద్యోగుల పని సామర్థ్యాన్ని పెంచడమే కాదు, పై అధికారులకు వారిపట్ల సదభిప్రాయం కలిగిస్తుంది.
  • పరిసరాలు శుభ్రంగా ఉంటే శ్వాస, చర్మ సంబంధిత ఎలర్జీలు రావు.
  • గది పొందిగ్గా ఉన్నప్పుడు పిల్లలు ఏకాగ్రతతో చదువుతున్న సబ్జెక్టుమీద దృష్టి పెట్టగలుగుతారు.
  • మానసిక సమస్యలతో బాధపడుతున్నవాళ్లకి పరిశుభ్రమైన పరిసరాలు ప్రశాంతతనిస్తాయి. సమస్య తీవ్రతను తగ్గిస్తాయి.
  • ఇల్లు నీట్‌గా ఉంటే మంచి నిద్ర పడుతుంది. తరచూ అనారోగ్యాలు దరిచేరవు.
  • పొందిగ్గా సర్దిన ఇంట్లో ఉండేవాళ్లు జీవితం పట్ల సంతృప్తిగా ఉంటారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..