కలలు చెప్పే కబుర్లెన్నో..!

మెలకువగా ఉన్నప్పుడు కలలు కంటే... వాటిని నెరవేర్చుకునేదాకా నిద్రపట్టదు. నిద్రలో కల వస్తే... దానికి అర్థం తెలిసేదాకా మనశ్శాంతి ఉండదు. పని చేయకుండా పగటి కలల్లో తేలడమూ ఆందోళనతో పీడకలలు తెచ్చుకోవడమూ... రెండూ మంచిది కాదు.

Updated : 25 Feb 2024 09:25 IST

మెలకువగా ఉన్నప్పుడు కలలు కంటే... వాటిని నెరవేర్చుకునేదాకా నిద్రపట్టదు. నిద్రలో కల వస్తే... దానికి అర్థం తెలిసేదాకా మనశ్శాంతి ఉండదు. పని చేయకుండా పగటి కలల్లో తేలడమూ ఆందోళనతో పీడకలలు తెచ్చుకోవడమూ... రెండూ మంచిది కాదు. అదెలా... కలలేమైనా మన కంట్రోల్లో ఉంటాయా అంటే- ఉంటాయనే అంటున్నారు శాస్త్రవేత్తలు. నిద్ర ఎంత అవసరమో కలలూ మనకి అంతే అవసరమని వారు ఢంకా బజాయించి చెబుతున్నారు. అంతేకాదు, వాటిని మనకి అనువుగా మలచుకోవచ్చనీ సూచిస్తున్నారు. ఆ కథా కమామిషు ఏమిటో చూద్దాం.

ర్వతారోహకుడైన వ్యక్తికి ఒక కల వచ్చింది. తానో పర్వతం పైపైకి ఎక్కుతున్నట్లూ, అలా ఎక్కుతుంటే ఎంతో ఆనందంగా ఉన్నట్లూ అనిపించింది. చివరికి శిఖరం పైకి చేరుకున్నాక కూడా వెనుతిరగ బుద్ధికాక ఇంకా అలాగే ముందుకు కాలు వేశాననీ అంతలో మెలకువ వచ్చిందనీ అతడు తన స్నేహితుడికి చెప్పాడు. అది విన్న స్నేహితుడు ఎందుకో కీడును శంకించి, ‘నువ్వు నా మాట విని కొంతకాలం ఈ కొండలెక్కడం ఆపకూడదూ...’ అన్నాడు. అతడు నవ్వేస్తూ ‘ఏంటీ కలల్ని నమ్ముతావా’ అని కొట్టిపడేశాడు.

మూణ్ణెల్ల తర్వాత అతడు మరోసారి పర్వతారోహణకు వెళ్లాడు. శిఖరాన్ని చేరాక దిగే దారి ఎంచుకోవడానికి బదులు ఏదో మైకంలో ఉన్నట్లు మరో అడుగు ముందుకు... గాల్లోకి వేశాడనీ అక్కడినుంచి అతడు అమాంతం కిందికి పడిపోయి చనిపోయాడనీ తోటి పర్వతారోహకులు అతడి స్నేహితుడికి సమాచారం ఇచ్చారు. తన స్నేహితుడైన కార్ల్‌ యుంగ్‌ మామూలు సైకాలజిస్టు అనుకున్నాడు కానీ కలల మీద పరిశోధన చేస్తున్న మానసిక శాస్త్రవేత్త అని ఆ పర్వతారోహకుడికి తెలియదు.

మనకి ఏదో చెప్పబోతున్నట్లు అన్పించే అలాంటి కలలు చాలామందికి వస్తుంటాయి. కాకపోతే కొందరు మాత్రమే వాటిని గుర్తిస్తారు. కళాకారులూ రచయితలూ శాస్త్రవేత్తలూ పలు సందర్భాల్లో తమకు వచ్చిన కలల గురించి చెప్పారు. అబ్రహం లింకన్‌ తన హత్య గురించి కలగన్నాడట. అటామిక్‌ వెయిట్‌ని బట్టి మూలకాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టొచ్చని తనకి కలలోనే తెలిసిందని పీరియాడిక్‌ టేబుల్‌ని రూపొందించిన రష్యా శాస్త్రవేత్త డిమిత్రి మెండెలెయెవ్‌ చెప్పాడు. బెంజీన్‌ రింగ్‌ నిర్మాణం తనకు కలలో కన్పించిందని ఆగస్త్‌ కెకూలె చెప్పగా, ప్రఖ్యాత ఆంగ్ల నవల ‘డాక్టర్‌ జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్‌’ కథావస్తువు కలలోనే స్ఫురించిందని రచయిత రాబర్ట్‌ లూయీ స్టీవెన్సన్‌ చెప్పాడు. అమెరికాలో ట్విన్‌ టవర్స్‌ ఘటన జరగడానికి ముందు చాలామంది పెను ఉపద్రవమేదో సంభవించనున్నట్లు కల వచ్చిందని సైకాలజిస్టులకు చెప్పారట. టైటానిక్‌ మునిగిపోతుందని కూడా కొందరు కలగన్నట్లు పరిశోధకుల రికార్డుల్లో నమోదయ్యింది.

మనసులో అణచిపెట్టుకున్న కోరికలే కలలుగా వస్తాయని సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ అంటే ఆ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లి కలల్ని మనకి వాస్తవాలను చెప్పే ‘పెద్ద మనిషి’గా పేర్కొన్నాడు స్వీడిష్‌ పరిశోధకుడు కార్ల్‌ యుంగ్‌. ఎనబై వేలకు పైగా కలల్ని విశ్లేషించిన ఆయన- పగలు మెలకువగా ఉన్నప్పుడు చూడలేని ఎన్నో విషయాల్ని కలల్లో చూడగలమంటాడు. మన భౌతిక మానసిక ఆరోగ్యాలకు కలలు చాలా అవసరమనీ కలలకు అర్థాలు చెప్పుకోవడం మనకి ఉత్సాహాన్నిస్తుందనీ చెప్పే యుంగ్‌, ‘ఇంట్యూషన్‌’ అనీ ‘సిక్త్స్‌సెన్స్‌’ అనీ మనం అనుకునేది కలలనుంచే వస్తుందంటాడు. అయితే మనిషిని కుదిపేస్తూ చాలా కాలం గుర్తుండే ‘బిగ్‌ డ్రీమ్స్‌’ అరుదుగా వస్తాయనీ తరచూ వచ్చేవి ‘కాంపెన్సేటరీ డ్రీమ్స్‌’ మాత్రమేననీ ఇవి మన అలవాట్లలోనూ వ్యక్తిత్వంలోనూ ఉన్న లోపాలను సవరించుకోవడానికి ఉపయోగపడతాయనీ అంటాడాయన. ఉదాహరణకు- తండ్రిగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించని ఒక వ్యక్తికి తరచూ తన బిడ్డలు తనని ద్వేషిస్తున్నట్లు కల వస్తుందట. అతడికి బాధ్యతలను గుర్తుచేయడమే ఆ కల ఉద్దేశమనీ ఇలాంటి కలల్ని విశ్లేషించుకుని తమ పరిస్థితిని చక్కదిద్దుకున్నవారు తప్పకుండా జీవితంలో అభివృద్ధి సాధిస్తారనీ, మానసికంగానూ వారి పరిధి విస్తరిస్తుందనీ అంటారు యుంగ్‌. కలల్ని అలా విశ్లేషించుకోవాలంటే ముందు అసలవేంటో తెలుసుకోవాలి.

కలత నిద్ర... కలల నిద్ర

రాత్రి ఏడెనిమిది గంటలు నిద్రపోతే అందులో గాఢనిద్ర రెండుగంటలకు మించదు. మిగిలిందంతా తేలికపాటి కలతనిద్రే. దీన్నే ఆర్‌ఈఎం(రాపిడ్‌ ఐ మువ్‌మెంట్‌) నిద్ర అంటారు. గాఢనిద్రలో కలలు అరుదుగా వస్తాయి. వచ్చినా మనకు తెలియదు. ఒక సైకిల్‌లా వచ్చే ఆర్‌ఈఎం నిద్రలోనే కలలు ఎక్కువగా వస్తాయి, గుర్తుంటాయి. బ్రెయిన్‌ ఇమేజింగ్‌ ద్వారా మెదడులో జరుగుతున్న యాక్టివిటీని రికార్డు చేయగలగడంతో ఏ సమయంలో కలలు వస్తున్నాయన్నది తెలుసుకోగలిగినప్పటికీ కలలు ఇంకా మనకి పూర్తిగా విడివడని మిస్టరీనే. నిద్రపోయే మనిషి కలలో ఏం చూస్తున్నాడో మరొకరికి తెలియదు. మెలకువ వచ్చేసరికి అతనికి కల గుర్తుండదు. గుర్తున్నా ఏదో అస్పష్టంగానే తప్ప కలలో చూసింది చూసినట్లు చెప్పలేరు. ఎందుకనీ అంటే- దానికి చాలా కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. సంతోషంగా నిద్రకు ఉపక్రమించిన వారికన్నా సమస్యలతో సతమతమవుతూ సరిగా నిద్ర పట్టనివారు కలలను బాగా గుర్తుపెట్టుకుంటారట. కొన్నిరకాల అనారోగ్యాలకు వాడే మందులూ, స్లీప్‌ ఆప్నియా లాంటి సమస్యలూ తేలికపాటి నిద్రను తగ్గించేస్తాయి. దాంతో కలలు వచ్చినా గుర్తుండవు. లైంగికత కూడా మరో కారణం. కౌమారంలో ఉన్న అమ్మాయిలకు గుర్తున్నంతగా అబ్బాయిలకు కలలు గుర్తుండవట. ఒక అధ్యయనంలో విటమిన్‌ బి6 సప్లిమెంట్‌ తీసుకున్నవాళ్లు కలల్ని బాగా గుర్తుపెట్టుకున్నారట. దాన్నిబట్టి తీసుకునే ఆహారం కూడా ఈ విషయంలో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సృజనాత్మకంగా ఆలోచించగలిగిన వాళ్లే కలల్ని ఎక్కువ శాతం గుర్తుచేసుకుని చెప్పగలరట. తరచుగా కలలు వచ్చేవాళ్లు ఒక పెన్నూ పుస్తకం పక్కనే పెట్టుకుని మెలకువ రాగానే గుర్తున్నది రాసుకుంటూ ఉంటే కలల్ని విశ్లేషించుకోవడం సులభమవుతుందంటారు పరిశోధకులు.

తెలిసిన ముఖమే...

కలల్లో కనిపించేవి మనకు తెలిసిన ముఖాలే అంటారు పరిశోధకులు. కాకపోతే మనం వాళ్లను గుర్తుపట్టకపోవచ్చు. మన కళ్లు చూడని కొత్త ముఖాలను ఆవిష్కరించుకునే శక్తి మెదడుకి లేదంటారు పరిశోధకులు. అధ్యయనాల్లో తేలిన మరికొన్ని విషయాలు...

 • సాధారణంగా కలల్లో సగానికి పైగా బాధ, భయం లాంటి నెగెటివ్‌ భావోద్వేగాలే ఉంటాయట.  
 • రెండేళ్లు నిండినప్పటినుంచి పిల్లలకు కలలు వస్తాయి. అందులో వాళ్లు పగలు చూసిన దృశ్యాలే కన్పిస్తాయి. కాస్త పెద్ద పిల్లలకు ఎక్కువగా జంతువులు కలలోకి వస్తాయట. ఏడెనిమిదేళ్లు నిండాక కల చిన్న సంఘటన రూపం సంతరించుకుంటుంది. అయితే పదేళ్లు దాటితే కానీ కలని లీలగా అయినా గుర్తుపెట్టుకుని చెప్పలేరు. పీడకల వచ్చి భయపడి ఏడుస్తూ లేచినా అదేమిటన్నది వాళ్లు చెప్పలేరు.
 • కలలన్నీ రంగుల్లోనే ఉండక్కర్లేదు. 1915-1950ల మధ్య చేసిన అధ్యయనాల్లో అత్యధికం బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలలే కాగా 1960ల తర్వాత రంగుల కలలు పెరిగాయట. అందుకు టీవీ, సినిమాలూ కారణం కావచ్చన్నది ఒక అభిప్రాయం.
 • స్త్రీ పురుషుల కలలు వేర్వేరుగా ఉంటాయి. స్త్రీల కలల్లో స్త్రీపురుషులు సమానంగా ఉంటే, పురుషుల కలల్లో 70శాతం పురుషులే ఉంటారు. స్త్రీల కలలు సుదీర్ఘంగా ఉంటే, పురుషుల కలలు దుడుగ్గా ఉంటాయట.
 • మెదడు పగలు మనం పనిచేసేటప్పటికన్నా రాత్రి కలలు కనేటప్పుడు ఎక్కువ చురుగ్గా ఉంటుందట. పైగా ఆరోజు పగటిపూట ఎంత ఎక్కువ, ఎంత కొత్త అనుభూతులకు లోనైతే ఆ రాత్రి మెదడు అంత ఎక్కువ చురుగ్గా ఉంటుందట.
 • ఒక వ్యక్తిని తరచూ కలల్లో చూస్తున్నారంటే- ఆ వ్యక్తిమీద మీకు అభిమానం ఉందనీ వారికి సంబంధించిన ఏదో సమస్య మిమ్మల్ని వేధిస్తోందనీ అర్థం. అది ప్రేమ కావచ్చు, పాత స్నేహం కావచ్చు.
 • పుట్టుకతో అంధులైనవారు కలల్ని చూడలేరు కానీ ఇతరత్రా మార్గాల ద్వారా అనుభూతి చెందుతారట. మధ్యలో అంధత్వం వచ్చినవారు అందరిలాగే కలలు కంటారు.
 • నిద్రలో నడిచే అలవాటున్నవారు కలల్లో చేసే పనుల్ని నిజంగా చేసిన సంఘటనలున్నాయి. చిత్రలేఖనం గురించి ఓనమాలు తెలియని వ్యక్తి నిద్రలో అద్భుతమైన పెయింటింగ్‌ వేసినటువంటి ఘటనలు నమోదయ్యాయి.
 • క్షీరదాలన్నీ కలలు కంటాయి.
 • జ్వరం వచ్చినప్పుడూ వాతావరణం వేడిగా ఉన్నప్పుడూ తక్కువ కలలు వస్తాయి. మనిషి పడుకునే పొజిషన్‌ కూడా కలల్ని ప్రభావితం చేస్తుంది. వెల్లకిలా పడుకుంటే పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ.
 • కలలు సృజనశక్తిని పెంచుతాయి. ఎక్కువ కలలు కనే కళాకారులు గొప్ప కళాఖండాల్ని సృష్టించినట్లు అమెరికన్‌ సైకలాజికల్‌ సొసైటీవారి పరిశోధనలో వెల్లడైంది.

కలల వల్ల లాభమే కానీ నష్టం లేదు, అయితే సగం కలలు నెగెటివ్‌గా ఉండి మనిషిని ఇబ్బంది పెడుతున్నాయన్నది వాస్తవం. కలలో చూసిన ఒక దృశ్యమో వ్యక్తో సంఘటనో కొన్నాళ్లపాటు వెంటాడి మనశ్శాంతి కరవయ్యేలా చేయడం, ఫలానా కల రాబోయే దుర్ఘటనకు సూచనేమో అని భావించి ఆందోళన చెందడం... చాలామందిలో జరుగుతుంటుంది. కాబట్టి అలాంటి కలలను మనకి అనువుగా మలచుకోలేమా అన్న ప్రశ్న సరికొత్త పరిశోధనలకు దారితీసింది. వాటి ఫలితమే ఇప్పుడు ‘ల్యూసిడ్‌ డ్రీమ్స్‌’గా బహుళ ప్రాచుర్యం పొందుతోంది.

కోరుకున్న కల

మన ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా ఊహల్లో తేలిపోవడాన్ని పగటి కలలు అంటాం. 96 శాతం మనుషులు రోజూ ఏదో ఒక విషయంలో పగటి కలలు కంటూనే ఉంటారట. శ్రుతి మించనంతవరకూ అవి మనసుకి ఎంతో మేలుచేస్తాయని మొట్టమొదటిసారి పగటి కలల మీద లోతుగా పరిశోధనలు చేసిన అమెరికన్‌ మానసిక శాస్త్రవేత్త జెరోమ్‌ సింగర్‌ అంటారు. ఈ పగటి కలల్నీ, ధ్యానం చేసేటప్పుడు ప్రధానంగా అవసరమైన ‘ఏకాగ్రత’నీ ఉపయోగించుకుని అభివృద్ధి చేసిన ‘ల్యూసిడ్‌ డ్రీమింగ్‌’ అనే విధానం ఇప్పుడు పెద్ద ఎత్తున ఆదరణ పొందుతోంది. పురాణాల్లో పేర్కొన్న యోగనిద్ర, బౌద్ధుల ధ్యాన నిద్రలను తలపించే ఈ విధానంపై స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సైకోఫిజియాలజీ పరిశోధకుడు స్టీఫెన్‌ లాబెర్గె పాతికేళ్లపాటు పరిశోధన చేశాడు. ఏమిటీ దీని ప్రత్యేకత అంటే- సాధనతో సాధ్యమయ్యే ఈ విధానంలో... కలకంటున్న వాళ్లు ఆ కలని స్పష్టంగా చూడటమే కాదు, అది కలేననీ మెలకువ వస్తే మాయమైపోతుందనీ వారికి తెలుస్తుంది. ఆ తర్వాత దశలో ఆ కలని తమకు నచ్చినట్లుగా కలలోని విషయాన్నీ పాత్రల్నీ కూడా మార్చుకోవచ్చు. తామే సూపర్‌ హ్యూమన్‌లాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్లిపోవచ్చు. ఆ అనుభూతి అద్భుతంగా ఉండి ఉత్సాహాన్నిస్తుంది. వందేళ్ల క్రితమే తన ‘స్టడీ ఆఫ్‌ డ్రీమ్స్‌’లో డచ్‌ రచయిత దీని గురించి రాసినప్పటికీ చాలా మంది నమ్మలేదు. గత దశాబ్దంలో దీనిమీద చాలా పరిశోధనలు జరిగాయి. సైకోథెరపిస్టులు ఇప్పుడు దీన్ని తమ చికిత్సలో ఒక భాగంగా మార్చుకుంటున్నారు.

ల్యూసిడ్‌ డ్రీమ్స్‌ వాటంతటవి అరుదుగా వస్తాయి. అందుకని సాధనతో వాటిని తెచ్చుకునే మార్గాలు చెబుతున్నారు పరిశోధకులు. అందుకుగాను పడకగదిని ఆహ్లాదకరంగా మార్చుకోవాలి. కల కనాలి అనుకున్న రోజున పగలంతా దాని గురించే ఆలోచించాలి, మాట్లాడాలి. టీవీ సినిమా... చూడకూడదు. ఇలా ఇష్టంగా, సన్నద్ధమై తెచ్చుకునే కలల గురించి ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో రాసుకోవాలి. కలలో కన్పించిన స్థలం, మనుషులు, వస్తువుల్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. కల వస్తున్నట్లు అన్పిస్తే- కలలో ఉన్నానా, మెలకువగా ఉన్నానా అని తమను తాము పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా కొన్నాళ్లు ప్రయత్నిస్తే కలలపై పట్టు వస్తుందనీ కోరుకున్నట్లుగా కలల్ని మలచుకోవచ్చనీ అంటున్నారు నిపుణులు. ఇంత కష్టపడి ఈ కలలు కనాల్సిన అవసరం ఏమిటీ అంటే...

 • పీడకలల నుంచి విముక్తి పొందవచ్చు. అభద్రతలూ భయాలూ పోతాయి.
 • ఆత్మవిశ్వాసమూ సృజనాత్మకతా పెరుగుతాయి.
 • యాంగ్జయిటీ తగ్గి నిద్ర నాణ్యత పెరుగుతుంది.
 • చాలాకాలంగా వేధిస్తున్న అనారోగ్యాలనుంచీ, మానసిక అశాంతినుంచీ ఉపశమనం పొందవచ్చు.
 • ఉత్సాహం, చురుకుదనం వస్తాయి. భావోద్వేగాల మీద అదుపు ఉంటుంది.
 • సరికొత్త ఆలోచనలతో సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం వస్తుంది.

ఇప్పటివరకూ ఉన్న డ్రీమ్‌ ఇంటర్‌ప్రెటర్‌ ఆప్‌(మన కలల గురించి చెబితే దానికి అర్థాలు చెప్పే ఆప్‌లు)లకు తోడు కొత్తగా ల్యూసిడ్‌ డ్రీమ్స్‌కి వ్యక్తుల్ని సన్నద్ధం చేయడానికి తోడ్పడేందుకు ఎన్నో ఆప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వాటికి కృత్రిమమేధ, ఏఆర్‌, వీఆర్‌ సాంకేతికతలను జోడిస్తూ వేరబుల్‌ పరికరాల్ని సైతం తెస్తున్నాయి స్టార్టప్‌లు. కలలు నక్షత్రాల్లాంటివి. వాటిని అందుకోలేం కానీ గమ్యం చేరేందుకు దారిచూపిస్తాయి... కాబట్టి కలలు కనండి, వ్యక్తిత్వాన్నీ తద్వారా భవిష్యత్తునీ తీర్చిదిద్దుకోండి అంటున్న నిపుణుల మాటల్లో అతిశయోక్తి లేదు కదా..!


ఆ కలలకు అర్థం ఏమిటంటే...

సాధారణంగా మనకు వచ్చే రకరకాల కలలకు మనకి మనమే ఏవో అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలను బట్టి పరిశోధకులు తరచుగా వచ్చే కొన్ని కలలకు అర్థాలను విశ్లేషించారు. దాని ప్రకారం...

పడిపోతున్నట్లు కల వస్తే: ఏదో ఒక విషయంలో జీవితం మీ అదుపు తప్పి పోతోందని అర్థమట. ఒక్కోసారి కొన్ని విషయాలను పట్టుకుని వేలాడవద్దు, వదిలేయమన్న సూచన కూడా కావచ్చట. ఆత్మన్యూనతా ఓటమి భయమూ కూడా అందుకు కారణం కావచ్చు.

చావు: చావు కలలోకి వస్తే దాన్ని పాజిటివ్‌గానే తీసుకోవాలంటారు శాస్త్రవేత్తలు. కొత్త మార్పు ఏదో చోటు చేసుకోబోతోందని అర్థం చెబుతున్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు అలాంటి కల వస్తే కోలుకుంటారని అర్థమట. అనుబంధంలో అభద్రతకు సూచన అని కూడా కొందరంటారు.

ప్రయాణం: ప్రయాణం చేస్తున్నట్లు కల వస్తే- ప్రస్తుత రొటీన్‌ పరిస్థితి పట్ల మీరు విసిగిపోయి వున్నారనీ తక్షణం మార్పు కోరుకుంటున్నారనీ తెలుసుకోవాలట.

తరుముతున్నట్లు: ఎవరో వెంటపడి తరుముతున్నట్లు కల వచ్చిందా... దేన్నో ఎదుర్కొనడం ఇష్టం లేక మీరు వాయిదా వేస్తున్నారన్న మాట. అది ఉద్యోగంలో అప్పజెప్పిన బాధ్యత కావచ్చు. వ్యక్తిగత జీవితంలో అనుబంధమే కావచ్చు.

పరీక్ష: వయసుతో నిమిత్తం లేకుండా పరీక్షలు రాస్తున్నట్లు కల వస్తే- ఇతరులు మిమ్మల్ని విమర్శిస్తున్నారనీ జడ్జ్‌ చేస్తున్నారనీ మీ మనసు భావిస్తోంది.

నగ్నత్వం: పదిమందిలో నగ్నంగా ఉన్నట్లు కల వస్తే దాన్ని భౌతికమైన నగ్నత్వంగా భావించవద్దనీ, మనసులో గూడు కట్టుకున్న అభద్రతో తెలియక చేసిన తప్పిదాలో ఆ దృశ్యాలకు మూలమనీ చెబుతున్నారు నిపుణులు.

కారు అదుపుతప్పినట్లు: కారు నడుపుతూ స్టీరింగ్‌ వదిలేసినట్లు కల వచ్చిందా? ఎవరో మీ స్వేచ్ఛనీ స్వాతంత్య్రాన్నీ నియంత్రిస్తున్నారన్న మాట. జీవితాన్ని మీ అదుపులోకి తీసుకోమన్న హెచ్చరికే ఆ కల. బస్సో రైలో మిస్సయినట్లు కలవస్తే అవకాశం చేజారుతుందన్న భయం కావచ్చు.

సెక్స్‌: లైంగిక కోరికల గురించి కలలు రావడానికి వేర్వేరు కారణాలుంటాయట. ఒంటరితనం, మనసైనవారి సాన్నిహిత్యాన్ని కోరుకోవడం లాంటివే కాక, అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి కృషి చేయాల్సిన అవసరాన్నీ చెబుతాయట ఇలాంటి కలలు.

గాలిలో ఎగిరిపోతున్నట్లు: ఎగరడం స్వేచ్ఛకు చిహ్నం. భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన... ఏ స్వేచ్ఛ అయినా కావచ్చు. దాన్ని కోరుకునేవాళ్లకు ఇలాంటి కలలు వస్తాయి. ఇష్టంలేని బంధం, ఇష్టంలేని ఉద్యోగం... ఏదైనా స్వేచ్ఛకు ప్రతిబంధకమే.

పాములు: కలలో పాములు కన్పించడం గురించి రకరకాల అభిప్రాయాలు ఉండగా ఎక్కువ మంది అంగీకరించింది మాత్రం అణచివేత, నిర్బంధం లాంటి పరిస్థితులకు సంకేతమనీ. ఉన్న పరిస్థితో, నమ్మిన వ్యక్తో మోసం చేసే అవకాశం ఉందనీ. పాముకాటు వేసినట్లు కల వస్తే ఏదో ముఖ్య విషయాన్ని మర్చిపోతున్నారని చెప్పడం. తీరని కోరికలకూ పాములు ప్రతీకలంటారు.

మునక: నీటిలో మునిగిపోతున్నట్లూ నోట్లో దంతాలన్నీ ఊడిపోయినట్లూ జుట్టు రాలిపోతున్నట్లూ అత్యవసర పరిస్థితిలో టాయ్‌లెట్‌ అందుబాటులో లేనట్లూ... ఇలాంటి కలల్ని స్ట్రెస్‌ డ్రీమ్స్‌ అంటారు. ఇవి నిత్యజీవితంలో ఆయా వ్యక్తులు ఎదుర్కొంటున్న ఒత్తిడినీ ఆందోళననీ సూచిస్తాయి. కలల్లో అధిక శాతం ఇవే ఉంటాయి. ఒత్తిడికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోగలిగితే ఇలాంటి కలలను నివారించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..