ఆవిష్కరణలు భళా!

వేసవి వచ్చిందంటే కార్చిచ్చులప్రమాదం పొంచి ఉంటుంది... సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ చెత్త జలచరాలకు ప్రాణగండంగా మారుతోంది... ఇక, ఏ పక్షవాతం లాంటిదో వస్తే జీవితం నాలుగు గోడలకే పరిమితం కాక తప్పదు...

Updated : 10 Mar 2024 02:12 IST

వేసవి వచ్చిందంటే కార్చిచ్చులప్రమాదం పొంచి ఉంటుంది... సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ చెత్త జలచరాలకు ప్రాణగండంగా మారుతోంది... ఇక, ఏ పక్షవాతం లాంటిదో వస్తే జీవితం నాలుగు గోడలకే పరిమితం కాక తప్పదు... ఇలాంటివే ఎన్నో సమస్యలూ, సమాజంతో పాటు మారుతున్న అవసరాలూ... వాటన్నిటికీ పరిష్కారాలు మా దగ్గర ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అవేమిటో మీరూ చూడండి..!


కార్చిచ్చును పసిగట్టేస్తుంది!

గత రెండు మూడేళ్లుగా కార్చిచ్చుల గురించి ఎన్నో వార్తలు చూశాం. అమెజాన్‌ అడవులతో సహా లక్షలాది ఎకరాల దట్టమైన వనాలు కాలి బూడిదైపోయాయి. భూమాతకి కోలుకోలేని నష్టం కలిగించాయి. ఆయా దేశాలకు ఆర్థికంగా పెనుభారమయ్యాయి. ఒక్క అమెరికానే 2021లో ఈ కార్చిచ్చులతో పోరాడడానికి 33 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఇలా ఏటికేడాదీ ఒక్కో దేశమూ బోలెడంత ధనాన్ని బూడిదలో పోస్తున్న నేపథ్యంలో ఒయాసిస్సులా వచ్చింది ఒక పరికరం. బెర్లిన్‌కి చెందిన డ్రైయాడ్‌ నెట్‌వర్క్స్‌ అనే సంస్థ తయారుచేసిన ‘సిల్వానెట్‌ వైల్డ్‌ఫైర్‌ సెన్సార్‌’ పరికరాల్ని అడవిలో చెట్లకు అక్కడక్కడా అమరుస్తారు. పరిసరాల్లో కార్చిచ్చు సంభవించినప్పుడు తొలిదశలో వెలువడే హైడ్రోజెన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ లాంటి గాలుల్ని సూక్ష్మ స్థాయిలోనే (పీపీఎం) ఈ పరికరం పసిగట్టి దానికి అనుసంధానించి ఉన్న కంప్యూటర్లకు సంకేతాలు పంపుతుంది. సిబ్బంది ఆ సమాచారాన్ని అందుకుని తక్షణం స్పందించి మంటల్ని ఆర్పేయడం తేలికవుతుంది. జీపీఎస్‌ సాయంతో నిప్పు ఎక్కడ రాజుకుందో కచ్చితమైన చోటును కూడా చూపిస్తుంది కాబట్టి సమయం వృథా కాకుండా సిబ్బంది అక్కడికి చేరుకోవచ్చు. వంద మీటర్ల పరిధికి ఒక పరికరం చొప్పున అమర్చితే చిన్నపాటి మంటని కూడా కనిపెట్టేస్తుంది. జర్మనీలో దీన్ని పరీక్షించి చూడగా సత్ఫలితాలనిచ్చింది. దాంతో సంస్థకి ఇప్పటికే కొన్ని లక్షల పరికరాలకు ఆర్డర్లు వచ్చాయట. సౌరశక్తితో పనిచేసే ఈ చిన్న పరికరానికి ఎలాంటి నిర్వహణ ఖర్చూ ఉండదు. తయారీలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించడంవల్ల కచ్చితమైన సమాచారాన్ని ఇస్తూ పదిహేనేళ్లపాటు సేవలందిస్తుంది. చిన్న పరికరంతో కోట్లాది రూపాయల నష్టాన్ని నివారించగలగడం గొప్ప విషయమేగా.


బ్రెయిన్‌ ఇంప్లాంట్‌తో పక్షవాతానికి చెక్‌!

ఒకసారి పక్షవాతం వస్తే దాన్నుంచి కోలుకోడానికి కొన్నేళ్లు పడుతుంది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా కోలుకోవడం సాధ్యంకాదు కూడా. కానీ న్యూరో టెక్నాలజీలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం అలాంటివారికి కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. నెదర్లాండ్స్‌కి చెందిన నలభయ్యేళ్ల ఓస్కాం క్రీడాకారుడు. ఒక ప్రమాదంలో అతని శరీరం పక్షవాతానికి గురైంది. పన్నెండేళ్లుగా చక్రాల కుర్చీలోనే కాలం గడుపుతున్నాడు. స్విస్‌ పరిశోధకులు తాము తయారుచేసిన ఎలక్ట్రానిక్‌ బ్రెయిన్‌ ఇంప్లాంట్‌ని- శస్త్రచికిత్స ద్వారా అతడి తలలో అమర్చారు. దాని నుంచి వచ్చే సంకేతాలను గ్రహించేందుకు తలచుట్టూ ఒక పరికరాన్ని ఉంచి దాని తాలూకు రిసెప్టరును వెన్నెముకకి అమర్చారు. తన కాళ్లమీద తాను లేచి నడవాలని అతణ్ణి మనసులో బలంగా కోరుకోమన్నారు. వాళ్లు అమర్చిన పరికరం డిజిటల్‌ బ్రిడ్జిలాగా పనిచేసి అతడి కోరిక నాడుల ద్వారా కాళ్లకు చేరింది. చక్రాల కుర్చీ నుంచి అతడు లేచి తడబడుతూ అడుగులు వేశాడు.
నెమ్మదిగా నడవగలిగాడు. ‘జీవితంలో అసలు మళ్లీ నడుస్తానని అనుకోలేదు’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ ఇంప్లాంట్‌ కోసం- ఆయా భాగాల్లోని ఎముక నుంచి చిన్నముక్క తీసి ఆ స్థానంలో ఎలక్ట్రోడ్స్‌ను అమరుస్తారట. ఇది వైర్లెస్‌ విధానంలో పనిచేసి వెన్నెముకను ప్రేరేపిస్తుంది. ఈ పరిశోధన మంచి ఫలితాన్నిచ్చిందనీ, సాధనతో నర్వ్‌ ఫైబర్స్‌ తిరిగి పెరుగుతున్నాయనీ, దీంతో నెర్వస్‌ సిస్టమ్‌ని రిపేరు చేయవచ్చనీ అంటున్నారు పరిశోధకులు. పరికరాన్ని మరింతగా అభివృద్ధి పరిచి త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటున్నారు. ‘ఆన్‌వర్డ్‌’ అనే డచ్‌ కంపెనీ ఈ సాంకేతికతను సిద్ధం చేసింది. చేతులూ వేళ్లూ... ఇలా శరీరంలో ఏ భాగం పెరాలిసిస్‌కి గురైనా ఆ సమస్యని పరిష్కరించేలా పరికరాలు రూపొందించాలన్నది తమ ఆశయమనీ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నామనీ అయితే కాళ్లకన్నా చేతులకు ఆ శక్తి తేవడం సంక్లిష్టమైన వ్యవహారమనీ చెబుతోంది ఈ కంపెనీ.


ఉంగరం... ఆరోగ్యం కోసం...

ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వేరబుల్‌ గ్యాడ్జెట్స్‌... అంటే ఒంటిమీద ధరించే వస్తువులకు మంచి డిమాండు ఉన్న రోజులివి. అందుకు స్మార్ట్‌ వాచీలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడిక ఉంగరాల వంతు. స్మార్ట్‌ ఉంగరాలూ ఒకటీ అరా మార్కెట్లోకి వచ్చినా వాటన్నిటికన్నా ఎక్కువ ఫీచర్లతో వచ్చి ఆకట్టుకుంటోంది ఈవీ రింగ్‌. మహిళల కోసం మొవానా హెల్త్‌ సంస్థ దీన్ని బంగారు, వెండి రంగుల్లోనే కాక రోజ్‌ గోల్డ్‌ కలర్‌లోనూ తయారు చేయడంతో చూడటానికి ఆభరణంలా అందంగా ఉన్న ఈ ఉంగరం ‘పర్సనలైజ్డ్‌ హెల్త్‌ మానిటర్‌’లా పనిచేస్తుంది. ఇందులోని మెడికల్‌ గ్రేడ్‌ సెన్సార్లు గుండె చప్పుడూ ఆక్సిజన్‌ స్థాయులతోపాటు ఆరోగ్యపరిస్థితికి అద్దం పట్టే పలు కీలక అంశాల్ని నమోదుచేస్తాయి. నెలసరి సమస్యల్నీ మూడ్‌ స్వింగ్స్‌నీ పరిగణనలోకి తీసుకుంటాయి. దాంతో ఈ ఉంగరాన్ని ధరిస్తే సంతాన సాఫల్యత అవకాశాల్ని చెబుతుంది. ఎన్ని గంటలు నిద్రపోయిందీ, అందులో నాణ్యమైన నిద్ర ఎంత అన్నదీ తెలుస్తుంది. రోజు మొత్తమ్మీద శారీరక వ్యాయామం ఎలా ఉంది, ఎన్ని కెలొరీలు ఖర్చు చేశారూ... అన్నదీ తెలుసుకోవచ్చు. కేవలం సమాచారం ఇచ్చి ఊరుకోదు. ‘మీ రోజువారీ సగటు కన్నా మరో వెయ్యి అడుగులు ఎక్కువ వేస్తే ఉల్లాసంగా ఉంటున్నారు. నెలసరిలో ఫలానా రోజున మీకు నిద్ర సరిగా ఉండడం లేదు. దానికి ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ తగ్గడమే కారణం. ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ ఆ సమయంలో ముఖ్యమైన మీటింగులు పెట్టుకోకపోవడమే మంచిది’ లాంటి సూచనలూ చేస్తుంది. లక్ష్యాలను సెట్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్న ఈ ఉంగరం కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో ఇన్నొవేషన్‌ అవార్డు అందుకుంది. ప్యూబర్టీతో మొదలుపెట్టి మెనోపాజ్‌, ఆ తర్వాత కూడా... అన్ని వయసుల మహిళలకూ ఉపయోగపడే ఈ ఉంగరాన్ని చేతినుంచి తీసి దాని కేస్‌లో పెడితే చాలు... ఛార్జింగ్‌ అవుతుంది.


ఇన్‌ఫెక్షన్‌ గుట్టు కుట్లు విప్పుతాయి..!

శస్త్రచికిత్స చేశాక కుట్లు వేయడం మామూలే. ఇన్‌ఫెక్షన్‌తో ఆ కుట్లు చీము పట్టకుండా ఉండాలని వైద్యులు గమనిస్తూ ఉండడమూ తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఇంటికి వెళ్లిపోయిన పేషెంట్లు డాక్టరు రమ్మన్న సమయానికి రాక నిర్లక్ష్యం చేయడమూ, కుట్లలో ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించలేక సమస్యను తీవ్రం చేసుకోవడమూ జరుగుతుంది. ప్రతి పదిమంది పేషెంట్లలోనూ ఒకరికి కుట్లు చీము పడతాయట. ముఖ్యంగా సిజేరియన్‌ కేసుల్లో ఈ ప్రమాదం చాలా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఈ సమస్యని తేలిగ్గా కనిపెట్టే మార్గం గురించి ఆలోచించింది ఒక పదిహేడేళ్ల విద్యార్థిని. తన కెమిస్ట్రీ టీచరుతో కలిసి ప్రయోగాలు చేసి మొత్తానికి విజయం సాధించింది. అమెరికాలోని అయోవా సిటీకి చెందిన డాసియా టేలర్‌- చర్మంలో ఇన్‌ఫెక్షన్‌ మొదలవగానే కుట్లు రంగు మారే విధానాన్ని కనిపెట్టింది. మన చర్మం సహజంగా ఎసిడిక్‌గా ఉంటుంది. దాని పీహెచ్‌ విలువ ఐదుకి అటూఇటూగా ఉంటుంది. చర్మంలో ఇన్‌ఫెక్షన్‌ మొదలైనప్పుడు పీహెచ్‌ స్థాయి పెరుగుతుంది. టేలర్‌ తన పరిశోధనల్లో కొన్ని కూరగాయలు యాసిడ్‌తో కలిసినప్పుడు  యాసిడ్‌ పరిమాణాన్ని బట్టి అవి రంగు మారడాన్ని గమనించింది. ఉదాహరణకి పీహెచ్‌ 9కి చేరినప్పుడు బీట్‌రూట్‌ దుంప ఎర్రటి ఎరుపు నుంచి ముదురు ఊదారంగుకి మారుతుంది. దాంతో ఆమె కుట్లకు వాడే దారాన్ని బీట్‌రూట్‌ రసంలో ముంచింది. తర్వాత దాంతో కుట్లు వేసినప్పుడు అవి చక్కగా మానిపోతే దారం రంగు మారలేదు. ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు కుట్ల దగ్గర దారం రంగు మారింది. దీనివల్ల తొలిదశలోనే తెలిసిపోతుంది కాబట్టి వెంటనే యాంటిబయోటిక్స్‌ ఇచ్చి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రం కాకుండా నివారించవచ్చు. తీవ్రమైన నొప్పినీ అసౌకర్యాన్నీ ఎక్కువ మందులు వాడే అవసరాన్నీ అధిగమించవచ్చు ఈ విధానంతో. టేలర్‌ తన ఆవిష్కరణకి పేటెంట్‌ పొందే ప్రయత్నాల్లో ఉంది.


పారదర్శకంగా సౌరఫలకం

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో సౌరశక్తిదే మొదటి స్థానం. భవనాల మీదా, షెడ్‌ల పైకప్పుగానూ, కిటికీ అద్దాల స్థానంలోనూ సౌరఫలకాలను అమర్చడం ఇప్పటివరకూ చూశాం. తాజాగా ఇన్‌క్యూస్‌ అనే సంస్థ సౌర సాంకేతికతలో పారదర్శకతను తెచ్చి సంచలనం సృష్టించింది. సాధారణంగా సౌరఫలకాలు ముదురు నీలం రంగులో ఉంటాయి. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ట్రాన్స్‌పరెంట్‌ సోలార్‌ ప్యానల్స్‌ వల్ల అందం విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కిటికీలకు స్టెయిన్డ్‌ గ్లాస్‌ అద్దాలు అమర్చుకుని కూడా కరెంటును ఉత్పత్తి చేయవచ్చు. దీనికున్న మరో ప్రత్యేకత- రెండు పక్కలనుంచీ కాంతిని గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేయగల శక్తి. నేరుగా సూర్యకిరణాల అవసరం లేకుండా బయటినుంచి సాధారణ కాంతినీ, ఇంటి లోపలి వెలుతుర్లనూ, పరావర్తనం చెందిన వెలుగుల్నీ గ్రహించి శక్తిని పుట్టించగల సత్తా వీటికి ఉంది. సాధారణంగా సౌరశక్తిని వినియోగించుకోవాలంటే భవన నిర్మాణం విషయంలో ఆర్కిటెక్టులు ఎంతో కొంత రాజీ పడాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేకుండా అందమైన రంగు రంగుల అద్దాల్ని ఉపయోగించుకుంటూ బిల్డింగ్‌ డిజైన్‌కి తగినట్లుగా సోలార్‌ పానెల్స్‌ని సృజనాత్మకంగా అమర్చుకోవచ్చు. ఈ వెసులుబాటు నిర్మాణ రంగంలోనూ సౌరశక్తి వినియోగంలోనూ పెద్ద మార్పు తేగలదని భావిస్తున్నారు.


సముద్రాల్లో చెత్తని పట్టేస్తుంది!

భూమి మీద ఉన్న నీటి వనరులే కాదు, సముద్రాలూ మనిషి అరాచకాలకు బలవుతున్నాయన్నది తెలిసిన సత్యమే. సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ చెత్త జలచరాలకు ప్రాణగండంగా పరిణమిస్తోంది. కొన్ని అరుదైన ప్రాణులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదమూ పొంచి ఉండటంతో సముద్రాలను శుభ్రం చేయడం ఎలా అన్నది కొన్నేళ్లుగా పరిశోధకులను వేధిస్తోంది. ఈ దిశగా డచ్‌ శాస్త్రవేత్తలు డిజైన్‌ చేసిన ‘ట్రాష్‌ బూమ్‌’ ఈ పనిని విజయవంతంగా చేస్తోంది. ఆంగ్ల అక్షరం ‘సి’ ఆకృతిలో దాదాపు 600 మీటర్ల పొడవుతో రబ్బరు బంతులతో చేసిన గొట్టం నీటిపైన తేలుతూ ఉంటుంది. దానినుంచి కిందికి నీటిలో ఒక వలలాంటిది వేలాడుతూ ఉంటుంది. గాలికి పైన గొట్టం నీటిలో కొంతదూరం అటూ ఇటూ కదిలినప్పుడల్లా కిందనున్న వల ఆ ప్రాంతంలోని చెత్తనంతా అడ్డుకుని అదంతా ఒకచోట పోగుపడేలా చేస్తుంది. కొద్దిరోజులకు ఒకసారి సిబ్బంది వెళ్లి పోగుపడ్డ చెత్తనంతా ఒక ప్రత్యేక ఓడలో తరలించుకువచ్చి రీసైక్లింగ్‌కి అప్పగిస్తారు. వేర్వేరు సముద్రాల్లో ఉండే భిన్నమైన వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా మార్పులూ చేర్పులూ చేస్తూ ఐదారేళ్లుగా ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూస్తున్నారు. కనీసం ఏడాది పాటు అది చెత్తను సేకరించి ఉంచేలా దృఢంగా తయారుచేస్తున్నారు. అప్పుడు చెత్తను తరచుగా కాకుండా ఒకేసారి పెద్దమొత్తంలో తరలించవచ్చు. ఈ పరికరం డిజైన్‌ సాంకేతికతను ఓపెన్‌సోర్స్‌లో ఉంచడంతో పలు కంపెనీలు సొంతంగా తయారుచేసుకుంటున్నాయి. ఇండొనేషియాతో పాటు మనదేశమూ సముద్రాల్లో దీన్ని ఉపయోగించి చూశాక నదుల్ని శుభ్రంచేసేందుకు కూడా వాడే ఆలోచనలో ఉన్నాయి.


గాఢ నిద్రకి... ఒక పిల్లో..!

మంచి నిద్ర అనేది ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ప్రస్తుతం సుమారు 16 బిలియన్లు ఉన్న నిద్రకు ఉపకరించే పరికరాల గ్లోబల్‌ మార్కెట్‌ విలువ మరో పదేళ్లలో ఏకంగా 95 బిలియన్లకు చేరుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌ డేటా లాంటి సాంకేతికతలన్నీ వాడి రకరకాల పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. నిద్రలేమి వ్యక్తి ఆరోగ్యంమీద తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టే దీనికింత ప్రాధాన్యం అంటున్న పరిశోధకులు నిద్రని డిస్టర్బ్‌ చేసే ప్రధాన కారణంగా గురకని పేర్కొంటున్నారు. శ్వాసకి అవరోధం కలగడం వల్ల వచ్చే ఈ గురక అది పెట్టేవారికే కాక పక్కనున్నవారికీ నిద్ర పట్టకుండా చేస్తుంది. అలాంటి వారికోసమే తయారైంది ఈ ‘మోషన్‌ పిల్లో’. ఇందులో దిండుకి అనుసంధానమై మరో చిన్న పరికరం ఉంటుంది. ఈ దిండు తలకింద పెట్టుకుని పడుకున్న వ్యక్తి గురక పెట్టడాన్ని పరికరం గుర్తిస్తుంది. తొలి దశలో ఎప్పుడెప్పుడు, తల ఏ పొజిషన్‌లో ఉంటే ఏయే స్థాయుల్లో గురకపెడుతున్నదీ గమనిస్తూ సమాచారమంతా భద్రపరుస్తుంది. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా పనిచేయడం మొదలెడుతుంది. వ్యక్తి తల వెల్లకిలా పడుకున్నట్లుగా ఉంటే పక్కకి తిరిగేలా, అవసరాన్ని బట్టి నెమ్మదిగా దిండు ఎత్తు పెంచుతూ తగ్గిస్తూ అతడికి మెలకువ రాకుండా సౌకర్యంగా నిద్రపోయేలా చేస్తుంది. దిండు అమరికలో వచ్చే ఈ మార్పుల వల్ల శ్వాస ద్వారాలు తెరుచుకుని గురక తగ్గిపోతుంది. ఉపయోగించే వ్యక్తి నిద్ర అలవాట్లను దృష్టిలో ఉంచుకుని కస్టమైజ్‌ చేసినట్లుగా పనిచేసే నైపుణ్యం ఈ పరికరానికి ఉంది. దిండు తలకింద పెట్టుకుని పక్కన పరికరం మీదున్న బటన్‌ ఆన్‌ చేస్తే చాలు. దీని నుంచి ఎలాంటి శబ్దమూ రాదు. గురక శబ్దాన్ని ఇతర శబ్దాలనుంచి విడదీసి చూస్తుంది. దిండులో ఎలాంటి విద్యుత్‌ పరికరాలూ ఉండవు కాబట్టి నిస్సంకోచంగా ఉపయోగించవచ్చు.


గ్రాఫీన్‌ కుకర్‌... వచ్చేసింది!

అత్యంత పలచగా ఉండి కూడా శక్తిమంతమైనదిగా పేరొందిన సరికొత్త పదార్థం- గ్రాఫీన్‌ ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తోంది. స్టీలు కన్నా రెండువందల రెట్లు బలమైన ఈ పదార్థం మంచి ఉష్ణ, విద్యుత్‌ వాహకంగా పనిచేస్తుంది. ఆ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ కొరియాకు చెందిన గ్రాఫీన్‌ స్క్వేర్‌ కంపెనీ దీన్ని వంటగదిలోకి తెచ్చింది. ఈ సంస్థ తయారుచేసిన కుకర్‌ ఈ ఏడాది వినియోగ వస్తువుల ప్రదర్శనలో సందర్శకులను ఆకట్టుకుంది. కార్డ్‌లెస్‌, రీఛార్జబుల్‌, ట్రాన్స్‌పరెంట్‌... కుకర్‌- వంటకు సంబంధించి పర్యావరణ మిత్ర సాంకేతికతలో కొత్త శకానికి నాంది పలుకుతుందంటున్నారు పరిశోధకులు. మొదట ఎంతో నాజూకుగా కన్పించే గ్రాఫీన్‌ కిచెన్‌ స్టైలర్‌(టోస్టర్‌ లాంటిది)ని తెచ్చిన ఈ కంపెనీ ఆ సాంకేతికతను మరింతగా అభివృద్ధిచేసి ఈసారి కుకర్‌ని తెచ్చింది. పెట్టె లాగా ఉండే ఈ కుకర్‌లో పైనా కిందా గ్రాఫీన్‌ పొరలు పరుస్తారు. గాజు గిన్నెలో పదార్థాలను పెట్టి వండుకోవచ్చు. పెట్టె పారదర్శకంగా ఉండడంతో పదార్థాలు ఉడికిందీ లేనిదీ తెలిసిపోతుంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ వేడితో పదార్థాలు త్వరగానూ రంగు మారకుండానూ ఉడికిపోతాయి. నేరుగా కరెంటు కనెక్షన్‌ అవసరం లేదు, లిథియం అయాన్‌ బ్యాటరీలతో ఈ కుకర్‌ పనిచేస్తుంది. మామూలు విద్యుత్‌ కుకర్లతో పోలిస్తే చాలా తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉందీ కంపెనీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..