సోలార్‌... కరెంటు తయార్‌

మీకు సొంతిల్లు ఉందా? దాని పైకప్పు ఖాళీగానే ఉందా? పైకప్పు ఖాళీగా ఉండక దాన్నెవరు అద్దెకు తీసుకుంటారూ... అంటారా? తీసుకునేవారు ఉన్నారండీ...

Updated : 07 Apr 2024 07:25 IST

మీకు సొంతిల్లు ఉందా? దాని పైకప్పు ఖాళీగానే ఉందా? పైకప్పు ఖాళీగా ఉండక దాన్నెవరు అద్దెకు తీసుకుంటారూ... అంటారా? తీసుకునేవారు ఉన్నారండీ... అయినా అసలు ఎవరికో ఎందుకు అద్దెకివ్వాలి, దాన్ని ఉపయోగించుకుని మీరే అదనపు ఆదాయం పొందే వీలున్నప్పుడు..? అదెలాగంటారా... అయితే ఇది చదవండి!

మిత్‌సింగ్‌ యాదవ్‌ డాక్టరు. కాస్త పొలం కూడా ఉంది. కాకపోతే రాజస్థాన్‌లోని కన్వర్‌పురా అనే ఆ పల్లెకి నీటి వసతి లేక పంటలు పండడం లేదు. అమిత్‌సింగ్‌కి మొదటినుంచీ సౌరశక్తి పట్ల ఆసక్తి ఎక్కువ. తన క్లినిక్‌ ఉన్న భవనం పై కప్పు మీద 12 కిలోవాట్ల సోలార్‌ సిస్టమ్‌ని పెట్టుకున్నాడు. ఒక్కసారి పెట్టుబడి పెట్టినందుకు దానివల్ల తనకు నెలకు 15 వేలు ఆదా అవుతోందట. ఖాళీగా ఉన్న పొలంలోనూ అలాంటిదే ఏదైనా చేయాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే కేంద్రప్రభుత్వం పీఎం కుసుమ్‌(ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా సురక్షా ఎవం ఉత్థాన్‌ మహాభియాన్‌- క్లుప్తంగా కెయుఎస్‌యుఎం) అనే పథకాన్ని ప్రారంభించింది. దాని తొలి లబ్ధిదారుగా అతడు తన రెండెకరాల పొలంలో 1.1 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసే సోలార్‌ ప్రాజెక్టు నెలకొల్పాడు. తయారైన కరెంటు దగ్గరలోనే ఉన్న సబ్‌ స్టేషన్‌కి అందేలా ఏర్పాటుచేశాడు. అలా అమ్మిన కరెంటుకు యూనిట్‌కు ఇంత అని ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. అమిత్‌సింగ్‌కి ఇప్పుడా రెండెకరాల బంజరు భూమి నుంచి నెలకు నాలుగు నుంచి ఆరు లక్షలవరకు ఆదాయం వస్తోంది. కరెంటును కొనుక్కునేలా ప్రభుత్వంతో పాతికేళ్లకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే ప్రాజెక్టు పెట్టుబడి మూడున్నర కోట్లు. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పోను అతడు పెట్టిన ఖర్చు నాలుగైదేళ్లలో తిరిగి వచ్చేస్తుంది. ఆ పైన ఇరవయ్యేళ్లూ వచ్చేదంతా తనకు లాభమేనంటున్నాడు. వైద్యుడిగా పనిచేస్తూనే సరికొత్త వ్యాపారవేత్తగా మారిన అతడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఇతర రైతులూ ఇలాంటి ప్రాజెక్టులు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. పెట్టుబడి పెట్టలేని వాళ్లు పెట్టే స్తోమత ఉన్నవారికి తమ స్థలాన్ని లీజుకు ఇచ్చి మరో రకంగా ఆదాయం పొందుతున్నారు.

ఇలాంటి ప్రాజెక్టులు ఎవరైనా పెట్టుకోవచ్చా అంటే- రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో సబ్‌స్టేషన్‌ ఉంటే చాలు- బంజరు భూముల్ని వినియోగించుకోవడానికి అద్భుతమైన అవకాశమిది... అంటున్నాడు అమిత్‌సింగ్‌. ఈ పథకం కింద కోట్ల పెట్టుబడితో పెట్టే ప్రాజెక్టులే కాదు, సాధారణ పంపుసెట్లూ కొనుక్కోవచ్చు. చిన్న తరహా రైతులు కొన్ని లక్షలమంది ఇప్పటికే సోలార్‌ పంపు సెట్లు పెట్టుకుని డీజిల్‌ వాడడం మానేశారు. అలాగని ఇది అచ్చంగా రైతులకోసమే అనుకుంటే పొరపాటే. పట్టణాల్లో, నగరాల్లో ఇంటి పై కప్పు మీద సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుచేసుకుని కరెంటు ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారికీ ఈ పథకం కింద సబ్సిడీ వస్తుంది. చాలాకాలం పాటు స్తబ్దుగా ఉన్న సౌరశక్తి రంగం గత కొన్నేళ్లుగా ఊపందుకుంది. 2015-16లో భారతప్రభుత్వం 2022 నాటికి రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టుల ద్వారా 40 గిగావాట్ల కరెంటును తయారుచేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగేళ్ల తర్వాత చూస్తే అది రెండు గిగావాట్లకు కూడా చేరలేదు. అంతలో కొవిడ్‌ వచ్చింది. కానీ ఆ తర్వాతే ఊహించని పరిణామం నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం రెండేళ్లలో పైకప్పుల మీద ఏర్పాటుచేసిన సోలార్‌ ప్రాజెక్టుల ద్వారా నాలుగున్నర గిగావాట్ల కరెంటు తయారవుతోందని తెలిసి, ఆ ఊపును అలాగే కొనసాగించేలా ఈ ఏడాది మరో కోటి ఇళ్లకు సౌరవిద్యుత్తు వెలుగులు అందాలన్న లక్ష్యం పెట్టుకుంది. ఎందుకింతగా సౌరశక్తిని ప్రోత్సహిస్తున్నారూ అంటే- అది నేటి ప్రపంచం ముందున్న తక్షణావసరం కాబట్టి.

తరగని గని

ఒకటీ రెండూ కాదు, సౌరవిద్యుత్తు మంచిదీ అనడానికి చాలా కారణాలున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల్లో ప్రపంచంలో ఇప్పటివరకూ జల విద్యుత్తు తర్వాత పవన విద్యుత్తు పాత్ర ఎక్కువగా ఉండేది. గతేడాది దాన్ని దాటి రెండో స్థానంలోకి వచ్చింది సౌరవిద్యుత్తు. భవిష్యత్తులో ఇదే ప్రథమ స్థానం కొట్టేస్తుందనడానికి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే... దీనివల్ల భూతాపాన్ని పెంచే కర్బనవాయువుల విడుదల చాలా తక్కువ. 2021లో వెలువరించిన గ్లోబల్‌ కార్బన్‌ ఎమిషన్స్‌ డేటా ప్రకారం బొగ్గు వల్ల 8204.6 మెట్రిక్‌ టన్నులు, సహజవాయువువల్ల 2973.52 మెట్రిక్‌ టన్నులు కార్బన్‌డై ఆక్సైడ్‌ వెలువడింది. అదే సోలార్‌ ఎనర్జీ వల్ల కేవలం 49 మెట్రిక్‌ టన్నులు విడుదలైంది. పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు కాబట్టే దీన్ని గ్రీన్‌ ఎనర్జీ అంటారు. ఇంకా...

  • పెట్రోలియం లాగా తవ్వి తీసే పనిలేదు. సూర్యుడు నిరంతరం వెలిగే నక్షత్రం కాబట్టి సౌర విద్యుత్తు తయారీకి అవసరమైన ముడిసరకు- సూర్యకాంతి అయిపోతుందన్న భయం లేదు.
  • పరికరాలకు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు కనీసం పాతికేళ్ల వరకూ ఢోకా ఉండదు. నిర్వహణ ఖర్చూ తక్కువే.
  • ఎవరి ఇంటికి వారే సౌర విద్యుత్తు ఏర్పాటుచేసుకుంటే కరెంటు విషయంలో స్వావలంబన సాధించినట్లవుతుంది.
  • ఎందుకూ పనికిరాని భూమినీ, వృథాగా ఉండే ఇళ్ల పై కప్పుల్నీ కూడా ఆదాయం పొందడానికి ఉపయోగించుకునేందుకు ఇది చక్కటి మార్గం.
  • ప్రభుత్వం సరఫరా చేసే విద్యుత్తు పవర్‌ ప్లాంట్‌ నుంచి వినియోగదారుని చేరేవరకూ సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది కాబట్టి ట్రాన్స్‌మిషన్‌ లాస్‌ ఎక్కువ. కానీ సౌరవిద్యుత్తు ఎక్కడికక్కడే తయారవుతుంది కాబట్టి ఆ నష్టం ఉండదు.
  • అభివృద్ధి చెందుతున్న రంగం కనుక సరికొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

రెండు వందల ఏళ్లు

సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చవచ్చన్న ఆలోచన దాదాపు రెండు వందల ఏళ్లనాటిది. 1839లో ఫ్రెంచ్‌ భౌతిక శాస్త్రవేత్త ఎడ్మండ్‌ బెకరల్‌ దాన్ని గుర్తించాడు. మొట్టమొదట 1883లో సెలెనియంతో తయారుచేసిన తొలి సోలార్‌సెల్‌ సామర్థ్యం రెండు శాతమే. అంటే దానిమీద పడిన సూర్యకాంతిలో రెండు శాతాన్ని మాత్రమే అది ఉపయోగించుకోగలిగేది. కాబట్టి తక్కువ కరెంటు తయారీకి ఎక్కువ సమయం పట్టేది. అప్పటినుంచి సాగిన ప్రయత్నాల ఫలితంగా- 1954 నాటికి సిలికాన్‌ సోలార్‌ సెల్‌తో ఆరు శాతానికీ ఆ తర్వాత నాలుగేళ్లకే పదకొండు శాతానికీ సామర్థ్యం పెరిగింది. 1960 దశాబ్దం నుంచి ఈ రంగంలో పెనువేగంతో అభివృద్ధి చోటు చేసుకుంది. ప్రస్తుతం పాతికకు అటూ ఇటూగా ఉన్న సోలార్‌ సెల్‌ సామర్థ్యం ఈ దశాబ్దం చివరికల్లా 40కి చేరుతుందని అంచనా. కృత్రిమమేధ ఈ రంగాన్నీ మేలిమలుపు తిప్పుతోంది. తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ ఎక్కువ విద్యుత్తును తయారు చేసేలా సోలార్‌ ప్యానెల్స్‌ సామర్థ్యాన్ని పెంచడంలో ఇది కీలకపాత్ర పోషించనుంది. పైగా ఒకప్పటిలా అడ్డంగా పరిచేలానే కాదు, గోడలకీ కిటికీలకీ- ఎక్కడ కావాలంటే అక్కడ బిగించడానికి వీలుగా సోలార్‌ ప్యానెల్స్‌ తయారవుతున్నాయి. నేరుగా ఎండ లేక పోయినా పరోక్ష వెలుతురుతోనూ, ప్యానెల్‌కి రెండువైపులనుంచీ వెలుతురుని గ్రహించి కూడా ఇవి పని చేయగలుగుతున్నాయి.

కాదేదీ సోలార్‌కి అనర్హం

లోక రక్షామణీ దైవ చూడామణీ అని మనం స్తుతించే సూర్యనారాయణుడు తన కిరణాలను కరెంటుగా మార్చి మనకి ఎన్ని రంగాల్లో ఏయే పరికరాల్లో ఉపయోగపడుతున్నాడో తెలుసా..!

ఇంట్లో: ఇంటిపైన సోలార్‌ప్యానెల్‌ అమర్చుకుని కరెంటు తయారుచేసుకుంటే దాంతో లైట్లూ ఫ్యాన్లే కాదు, టీవీ నుంచి ఏసీ వరకూ అన్ని విద్యుత్‌ ఉపకరణాలనూ బిల్లు పెరిగిపోతుందేమోనన్న చింత లేకుండా వాడుకోవచ్చు. రాత్రిళ్లు వాడుకోవడానికి సోలార్‌ బ్యాటరీలలో ఇంధనాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఉష్ణ ప్రాంతాల్లో ఏసీలూ కూలర్లూ వాడినట్లు చలిప్రాంతాల్లో నీటిని కాచుకోడానికీ, ఇంటిని వెచ్చగా ఉంచుకోడానికీ, ఈతకొలనులో నీటిని వేడి చేయడానికీ... సోలార్‌ పరికరాలు వాడుతున్నారు. ఇంటికి సోలార్‌ పవర్‌ పెట్టించుకునే స్తోమత లేనివారికోసం సోలార్‌ అటిక్‌ ఫ్యాన్స్‌ వచ్చాయి. వీటిని పై కప్పుకి దగ్గరగా ఎండ పడే చోట బిగించుకుంటే సూర్యకాంతితో పనిచేస్తూ ఇంట్లోని వేడి గాలిని బయటకు పంపి ఇల్లు చల్లగా ఉండేటట్లు చూస్తాయి. 

లైటింగ్‌: వీధి దీపాలే కాదు లైట్‌షోలో వాడేవీ, అలంకరణ దీపాలూ అన్నీ సౌరశక్తితో వెలుగుతాయి. సోలార్‌ లాంతర్లు గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నింపు తున్నాయి. బస్‌షెల్టర్లు, పార్కింగ్‌ ప్రదేశాల పైకప్పులకు సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చితే అవి పగలు నీడనిస్తూ రాత్రిళ్లు వెలుగునిస్తాయి.

రవాణా రంగంలో: ఇప్పటికే పలు కార్గో ఓడలూ ప్రయాణికుల విహారనౌకలూ మత్స్యకార్మికుల పడవలూ సౌరశక్తితో నడుస్తూ జలమార్గాల్లో శబ్ద కాలుష్యాన్నీ, కర్బనవాయువుల్నీ తగ్గిస్తున్నాయి. సోలార్‌ కార్లను కూడా తయారుచేశారు కానీ వాటిని ఇంకా వాడుకలోకి తేలేదు. అయితే విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కి సోలార్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు పనిచేస్తున్నాయి. గ్లోబల్‌ సోలార్‌ ఈవీ ఛార్జింగ్‌ మార్కెట్‌ వచ్చే పదేళ్లలో 8.1 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా. సోలార్‌ జెనరేటర్లు: వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి అప్పటికప్పుడు కరెంటు తయారుచేసి వాడుకోవచ్చు. క్యాంపింగ్‌, బోటింగ్‌ లాంటి సందర్భాల్లో, కరెంటు సౌకర్యం లేని మారుమూల అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

వైద్యరంగం: సౌరశక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఆస్పత్రులు తమ కరెంటు ఖర్చుని 40 శాతం తగ్గించుకోవచ్చు. సరఫరాలో అంతరాయం సమస్య ఉండదు. నిర్వహణ ఖర్చు తక్కువ. చాలాకాలం పనిచేస్తాయి. తమిళనాడు, యూపీ, పంజాబ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో పలు ఆస్పత్రులు సౌరశక్తిని వినియోగించుకుంటున్నాయి.

వ్యవసాయం: బోర్లూ బావుల నుంచి నీటిని తోడే మోటార్లకు డీజిల్‌ వాడేవారు. ఇప్పుడు సోలార్‌ వాటర్‌ పంప్‌సెట్స్‌ వచ్చాయి. వాటికి బ్యాటరీని కూడా అమర్చుకుంటే రాత్రిళ్లు కూడా పనిచేస్తాయి. ఆధునిక సాగులో వాడే పలు పరికరాలు సౌరశక్తితో పనిచేసేవి తయారవుతున్నాయి.

పరిశ్రమలు: విద్యుత్తు వాడకం ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో సౌరశక్తి వినియోగం కీలకపాత్ర పోషిస్తోంది. నీటి శుద్ధి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రసాయనాల ఉత్పత్తి, ఖనిజాల ప్రాసెసింగ్‌ లాంటి పెద్ద పరిశ్రమల్లో సౌరశక్తిని వినియోగిస్తున్నారు. గాలినుంచి నీటిని తయారుచేసే యంత్రాలను కూడా సౌరశక్తితో పనిచేసేలా తయారుచేశారు. సోలార్‌పవర్‌తో పనిచేస్తున్న సినిమా హాలు, ఇంటర్నెట్‌ కెఫె లాంటివి పలుచోట్ల సేవలు అందిస్తున్నాయి.

ఎన్నెన్నో పరికరాలు: పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌, కాలిక్యులేటర్స్‌, వైర్లెస్‌ సోలార్‌ కీబోర్డ్‌, బ్యాటరీ ఛార్జర్లు, సెక్యూరిటీ కెమెరాలు, ఆఖరికి నీటిని చల్లగా ఉంచే వాటర్‌ బాటిల్స్‌... కూడా సౌరశక్తితో పనిచేసేవి మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని దేశాల్లో స్మార్ట్‌ చెత్త కుండీలను వైఫై స్టేషన్లుగా మార్చారు. చుట్టుపక్కల ఉన్నవారికి ఉచితంగా వైఫై సేవల్ని అందిస్తాయివి. పగలు నీడనీ రాత్రిళ్లు వెలుగునీ ఇచ్చే సోలార్‌ అంబ్రెల్లాస్‌ని వీధుల్లో ఏర్పాటు చేస్తున్నారు.

వేరబుల్స్‌: వాచీలు, బ్యాక్‌ప్యాక్‌లు, బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌, హెడ్‌సెట్‌, హెల్మెట్‌... లాంటివన్నీ సోలార్‌ పవర్‌తో పనిచేస్తున్నాయి.

దుస్తులు: చిన్ని సోలార్‌ ప్యానెల్‌తో మొబైల్స్‌ లాంటివి చార్జ్‌ చేసుకునేలా దుస్తుల్ని, కారు సీట్లనీ, కర్టెన్లనీ, టెంట్లనీ తయారుచేసేందుకు ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. 2022లో ట్రెంట్‌ యూనివర్సిటీ నిపుణులు అలాంటి వస్త్రాన్ని రూపొందించి చరిత్ర సృష్టించారు.

ఏమిటిదీ... ఇంటి నుంచి ఒంటి వరకూ సర్వం సౌరశక్తిమయం అయిపోతోందే అనుకుంటున్నారా? లేదు, ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది. ఒక గంట భూమి మీద పడే సూర్యకాంతిని పూర్తిగా ఉపయోగించుకుంటే ప్రపంచానికి ఏడాదికి సరిపడా ఇంధనం లభిస్తుందట. అంతటి శక్తిమంతుడైన సూర్యుణ్ణి ఎదురుగా ఉంచుకుని కూడా ఇన్నాళ్లూ ఉపయోగించుకోకుండా బొగ్గూ పెట్రోలియాలను తవ్వుకుంటూ కర్బన ఉద్గారాలనూ భూతాపాన్నీ పెంచుకున్నాం. దాంతో రుతుపవనాలు గతి తప్పి పెనుతుపాన్లూ కార్చిచ్చులూ మండుటెండలూ పిడుగుపాట్లతో వాతావరణ మార్పులు భయపెడుతోంటే- దాహమేసినాక బావి తవ్వడం మొదలెట్టినట్లు ప్రపంచం ఇప్పుడే కళ్లు తెరిచి, సౌరశక్తికి జైకొడుతోంది.

మనదేశంలో...

మనదేశంలో వృథాగా ఉన్న మూడు శాతం భూముల్ని ఉపయోగించుకుంటే 748 గిగావాట్ల సౌరశక్తిని తయారుచేసుకోవచ్చని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ అంచనా వేసింది. కానీ గతేడాది డిసెంబరు నాటికి 73.32 గిగావాట్ల సౌరశక్తిని మాత్రమే తయారుచేసుకోగలిగాం. ఏడాదిలో 300లకు పైగా రోజులు మంచి ఎండ ఉండే దేశంలో ఇది చాలా తక్కువ. వాతావరణ మార్పులకు సంబంధించి జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2010లో ప్రారంభించిన నేషనల్‌ సోలార్‌ మిషన్‌ ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2030 నాటికి కర్బన వాయువుల విడుదలను లక్ష్యం మేరకు తగ్గించాలన్న ఆశయంతో ఈ మిషన్‌ కింద పలు పథకాలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 42 సోలార్‌ పార్కుల్ని ఏర్పాటు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతివ్వడం లాంటి విధానాలను తెచ్చింది. 

అంతటితో ఊరుకోకుండా స్థానిక వినియోగం మీద దృష్టి పెట్టింది. అందుకే ఎక్కడ తయారైన కరెంటును అక్కడే వాడుకునే రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టుల్ని ప్రోత్సహిస్తోంది. గ్రిడ్‌ మీద భారం తగ్గించే ఈ ప్రాజెక్టులకు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు సబ్సిడీలు ఇస్తున్నాయి. సొంత, ఇండిపెండెంట్‌ ఇళ్లు మాత్రమే కాదు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సులపైన కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వినియోగించగా మిగిలిన కరెంటును గ్రిడ్‌కి అమ్మి ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ నుంచి వివరాలు పొందవచ్చు.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లు మండే ఎండలకూ ఆ ఎండల ద్వారా తయారు చేసుకుంటున్న కరెంటుతోనే చెక్‌ పెట్టే అవకాశాన్ని సూర్యుడే ఇస్తున్నప్పుడు అందిపుచ్చుకోకపోతే ఎలా..!


ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టులు మనవే!

రాజస్థాన్‌లోని భాద్లా సోలార్‌ పార్క్‌... ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్‌ ప్లాంట్‌. 2.25 గిగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసి లక్షా 30వేల ఇళ్లకు సరఫరా చేయగలదు. థార్‌ ఎడారిలో 14 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్‌ని పదివేల కోట్ల పెట్టుబడితో నిర్మించారు. సాయంత్రం అయ్యేసరికి ఎడారి ఇసుకతో కప్పడిపోయిన ప్యానెల్స్‌ని అత్యాధునిక రోబోట్లు శుభ్రం చేసేస్తాయి. 13వేల ఎకరాల్లో నిర్మించిన కర్ణాటకలోని పావగడ సోలార్‌ పార్కు ప్రపంచంలో రెండో అతి పెద్దది.

తెలంగాణలోని రామగుండంలో నీటిమీద ఏర్పాటుచేసిన అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ ఉంది. 100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసే ఈ ప్లాంటుకు పెట్టుబడి రూ.423 కోట్లు. రిజర్వాయర్‌ మీద 500 ఎకరాల మేర విస్తరించిన పార్క్‌ వల్ల 32.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. నర్మదా కెనాల్‌ మీద కూడా ఇలాంటి ప్రాజెక్టే కట్టారు. టాటా పవర్‌ సోలార్‌ సంస్థ కేరళలో బ్యాక్‌ వాటర్స్‌ మీద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును నిర్మించింది. గతేడాది జూన్‌ నాటికి దేశంలో 70వేల మెగావాట్ల సౌరవిద్యుత్తు తయారవుతుండగా అందులో రాజస్థాన్‌(17839 మెగావాట్లు), గుజరాత్‌(10133), కర్ణాటక(9050), తమిళనాడు(6892), మహారాష్ట్ర(4870) తొలి ఐదు స్థానాల్లో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో తెలంగాణ(4695), ఆంధ్రప్రదేశ్‌(4552)లు ఉన్నాయి.


ఈ గ్రామాలు ఆదర్శం!

రిగ్గా పదేళ్ల క్రితం గ్రీన్‌పీస్‌ సంస్థ బిహార్‌లోని ధర్నయి గ్రామంలో మూడుకోట్ల రూపాయల పెట్టుబడితో వందకిలోవాట్ల సోలార్‌ ప్రాజెక్టును నెలకొల్పింది. ఇళ్లూ వీధి దీపాలతో సహా బడులూ ఆస్పత్రీ... అన్నింటికీ విద్యుత్తును సరఫరా చేసి సౌరవిద్యుత్తుతో లబ్ధి పొందుతున్న తొలి గ్రామంగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత పలు గ్రామాలు ఈ దిశగా దృష్టి సారించాయి. సూర్యదేవాలయానికి పేరొందిన గుజరాత్‌లోని మొధేరా గ్రామం పూర్తిగా సౌరశక్తినే ఉపయోగిస్తోంది. ఆలయంలో త్రీడీ లైట్‌ షో, పరిసరాల్లో సెన్సార్‌లతో పనిచేసే స్మార్ట్‌ వీధి దీపాలూ అన్నీ దాంతోనే. ఆ ఊళ్లో ఉన్న 1300 ఇళ్లూ పాఠశాలలూ ప్రభుత్వ కార్యాలయాలూ బస్‌స్టాండ్లూ పార్కింగ్‌ స్థలాలూ... అన్నిటి పైకప్పుల మీదా సౌర ఫలకాలు అమర్చడంతో మొత్తం ఆరు మెగావాట్ల కరెంటు తయారవుతోంది. అందులో రెండు మెగావాట్లను మాత్రం గ్రామంలో వాడుకుని మిగిలింది గ్రిడ్‌కి అమ్ముతున్నారు. ఆ  ఆదాయంతో గ్రామాభివృద్ధి పనులు చేపడుతున్నారు. దుధాల అనే మరో గ్రామంలో శ్రీరామకృష్ణా నాలెడ్జ్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల మీద రూఫ్‌టాప్‌ ప్రాజెక్టుల ద్వారా 450 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి గ్రామాన్ని స్వావలంబన సాధించేలా చేసింది. మన్‌దేశీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో మూడు గ్రామాలు సౌరవిద్యుత్తు వెలుగుల్ని అందుకున్నాయి. గుజరాత్‌లో గాంధీనగర్‌నీ, అయోధ్యలో రామమందిర పరిసరాలను కూడా సౌరవిద్యుత్తుతో తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..