డెలివర్రీ బాయ్స్‌!

భోజనం ఇంటికొస్తుంది. ఫలహారం చేతికందుతుంది. ఔషధాలు తలుపుతడతాయి. సరుకులు  కాలింగ్‌బెల్‌ నొక్కుతాయి. అది కూడా పదీపదిహేను నిమిషాల్లోపే. ఈ క్విక్‌ డెలివరీ సర్వీసుల కోసం, ఎంతోమంది కష్టజీవులు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు.

Updated : 28 Apr 2024 13:14 IST

భోజనం ఇంటికొస్తుంది. ఫలహారం చేతికందుతుంది. ఔషధాలు తలుపుతడతాయి. సరుకులు  కాలింగ్‌బెల్‌ నొక్కుతాయి. అది కూడా పదీపదిహేను నిమిషాల్లోపే. ఈ క్విక్‌ డెలివరీ సర్వీసుల కోసం, ఎంతోమంది కష్టజీవులు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లంతా పరుగెడుతున్నారు కాబట్టే, మనం నింపాదిగా కూర్చుంటున్నాం. వాళ్లంతా ఆకలిదప్పికల్ని పట్టించుకోవడం లేదు కాబట్టే, మనం నచ్చిన రుచులు ఆరగిస్తున్నాం. వాళ్లంతా ఆరోగ్యాన్నీ లెక్కచేయడం లేదు కాబట్టే, మనకు సకాలంలో ఔషధాలు అందుతున్నాయి.

కటి.. రెండు..  మూడు.. ఎన్ని కిక్కులు కొట్టినా స్టార్ట్‌ కాదు. ఉన్న బలమంతా ఉపయోగించి ఒకసారి. లేనిశక్తిని కూడగట్టుకుని ఒకసారి. ఇంకో దెబ్బ. దెబ్బ మీద దెబ్బ.
మొత్తానికి బండి కదులుతుంది. అంతలోనే, ఫోను మోగుతుంది. అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యం. ఇంకా నాలుగు కిలోమీటర్లు వెళ్లాలి. ఎగుడుదిగుడు రహదారులు.
వీఐపీ కాన్వాయ్‌లు.   రాంగ్‌రూట్‌ వాహనాలు. చిన్నాచితకా యాక్సిడెంట్లు. తిట్లాటలు. కొట్లాటలు. గండాలన్నీ దాటుకుని.. గమ్యాన్ని చేరుకోవడం.. యుద్ధాన్ని గెలిచినంత పెద్దపని.
‘ఎక్కడున్నావ్‌? ఇంకెంతసేపు? బైక్‌ నడుపుతున్నావా, ఎడ్లబండి తోలుతున్నావా? రేటింగ్‌ తగ్గిస్తా. ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేస్తా’

..రకరకాల హెచ్చరికలు. వింతవింత బెదిరింపులు. చిరునవ్వుతో భరించాలి. ఓపిగ్గా సమాధానం చెప్పాలి. ఎప్పుడో ఒకసారైతే ఫర్వాలేదు. రోజూ సమరమే. నిత్యం నరకమే. లాగిన్‌కూ, లాగాఫ్‌కూ మధ్యలో.. క్షణక్షణం పోరాటమే.

గిగ్‌ వర్కర్‌, డెలివరీ బాయ్‌, డెలివరీ పార్ట్‌నర్‌, కెప్టెన్‌.. పేరు ఏదైతేనేం. మహానగరాల నుంచి ఓ మోస్తరు పట్టణాల వరకూ విస్తరించిన క్విక్‌ డెలివరీ నెట్‌వర్క్‌లో అతనొక భాగం. అరవై సెకన్లకు ఒకసారి కదిలే నిమిషాల ముల్లు.. ప్రతి అరవై ఒకటో సెకనుకూ నేరుగా అతని గుండెలకు గుచ్చుకుంటుంది.

ప్రతి డెలివరీ ఓ సవాలే. చాలాసార్లు సకాలంలోనే వచ్చేస్తారు. ఎప్పుడైనా కొంత ఆలస్యమూ కావచ్చు. రావడమంటూ పక్కా. కాలింగ్‌బెల్‌ మోగడమంటూ ఖాయం. స్విగ్గీ, జెప్టో, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌, డంజో.. ఇలా రకరకాల క్విక్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా సేవలు అందిస్తున్నవారు కోటిమంది. రెండేళ్లలో ఆ సంఖ్య మూడున్నర కోట్లు దాటుతుందని అంచనా. గిగ్‌ అంటే ప్లాట్‌ఫామ్‌ అనే అర్థం ఉంది. వీధులే వారి కార్యక్షేత్రాలు కాబట్టి, ఆ పేరు స్థిరపడి ఉండొచ్చు. చాలా వ్యాపారాలు గిగ్‌ వర్కర్స్‌పైన ఆధారపడే నడుస్తున్నాయి. వీళ్లను నమ్ముకుని ప్రారంభమైన స్టార్టప్స్‌ ఇట్టే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి, ఐపీవోల వరకూ వెళ్తున్నాయి. అయినా, ఆ శ్రామికుల బతుకులు మాత్రం మారడం లేదు.

కదిలిస్తే చాలు. ప్రతి జీవితం ఒక కథే. ప్రతి కథలో ఉద్వేగాల ఊటే. పంచభక్ష్యాలు భుజాన వేలాడుతున్నా, ఆకలి కష్టాన్ని భరిస్తూ కస్టమర్‌ కాలింగ్‌బెల్‌ నొక్కాల్సిందే. కోరిన సరుకుల్ని గడప దగ్గరే అందిస్తున్నా.. చాలీచాలని సంపాదనతో ఏ అర్ధరాత్రో ఇంటి గడప తొక్కే సందర్భాలూ అనేకం. హైదరాబాద్‌లోని దాసారం బస్తీలో ఉంటున్న వెంకట్‌ ఓ ఫుడ్‌ డెలివరీ సంస్థలో కెప్టెన్‌. రాత్రిపూట పెద్దగా ట్రాఫిక్‌ ఉండదు. వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. టార్గెట్‌ పూర్తి చేసుకుని ఇన్సెంటివ్స్‌ అందుకోవచ్చు. ఆ ఒక్క కారణంతోనే, చీకటిపడగానే లాగిన్‌ అవుతాడు. తెల్లారే వరకూ పనిచేస్తాడు. నిన్నమొన్నటి దాకా అంతా సాఫీగానే సాగేది. సంపాదనా బావుండేది. ఓ చీకటి రాత్రి ఫుడ్‌ డెలివరీ కోసం శివార్లలోని  కాలనీకి వెళ్తున్నప్పుడు ముగ్గురు యువకులు బండి ఆపారు. బ్యాగు లాక్కున్నారు. పర్సు, ఫోను తీసుకున్నారు. పిడిగుద్దులు గుద్ది.. చీకట్లో కలిసిపోయారు. బిక్కమొహం వేసుకుని, బైక్‌ స్టార్ట్‌ చేస్తూ.. ‘దురదృష్టంలో అదృష్టం అంటే ఇదే. తాగుబోతు వెధవలు నా బండి జోలికి రాలేదు’ అనుకుంటూ ఇంటిదారి పట్టాడు వెంకట్. ఆ రెండు చక్రాల వాహనమే అతని కుటుంబానికి మూడుపూటలా భోజనం.

షఫీకి వీధికుక్కలంటే భయం. ఎక్కడైనా కనిపిస్తే.. దూరం నుంచే యూటర్న్‌ చేసుకుంటాడు. కానీ, డెలివరీ బాయ్‌గా మారిన తర్వాత.. అలా తప్పించుకోవడం కుదరడం లేదు. ఈ మధ్య తను కోకాపేట లోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఫుడ్‌ డెలివరీకి వెళ్లాడు. నాలుగో అంతస్తులో ఉంటారు కస్టమర్‌. లిఫ్ట్‌ ఎక్కాడు. ఫ్లాట్‌ తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ అలికిడికి... అంతెత్తు ఆల్సేషియన్‌ ఊగిపోతూ బయటికొచ్చింది. దీంతో షఫీలో భయం మొదలైంది. ఆ కంగారులో కనిపించిన కిటికీలోంచి దూకేశాడు. ఒళ్లంతా గాయాలు. మొత్తానికి ప్రాణాపాయం తప్పింది. ఒకట్రెండు ఫ్రాక్చర్లతో బయటపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలు కుంటున్నాడు.

పుణెలో ఓ పెద్దమనిషి అయితే.. పది నిమిషాలు ఆలస్యమైందని పిజ్జా డెలివరీ బాయ్‌ని తుపాకీతో బెదిరించాడు. కోపంతో ఊగిపోతూ గాల్లో కాల్పులు జరిపాడు.
ఆ చేదు అనుభవం తర్వాత, కొత్త ఉద్యోగం వెతుక్కున్నాడు ఆ కుర్రాడు. ఇలాంటి సందర్భాల్లో కంపెనీల మద్దతూ పెద్దగా లభించదు. ‘చూసీ చూడనట్టు వెళ్లాలి మనం’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు.

బెంగళూరులోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో జరిగిన సంఘటన ఇది. ఆడుకోడానికి వెళ్లిన చిన్నారి చీకటి పడుతున్నా ఇంటికి రాలేదు. కన్నవాళ్లు వెతకగా వెతకగా టెర్రస్‌ మీద కనిపించింది. ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ బలవంతంగా తనను అక్కడికి తీసుకొచ్చాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పార్కింగ్‌ ఏరియాలో ఉన్న డెలివరీ బాయ్‌ని చుట్టుముట్టారు. తనకే పాపమూ తెలియని మొత్తుకున్నా వినకుండా.. పోలీసుల్ని పిలిపించారు. ఇన్‌స్పెక్టర్‌కు ఎందుకో అనుమానం వచ్చింది. ఆవరణలోని నిఘా కెమెరాల్ని పరిశీలించాడు. ఆ బాలిక చెప్పింది అబద్ధమని తేలిపోయింది. హోమ్‌ వర్క్‌ చేయడం ఇష్టం లేక.. అరగంట క్రితం ఒంటరిగానే టెర్రస్‌ ఎక్కింది. ఆ డెలివరీ బాయ్‌ అక్కడికొచ్చి పది నిమిషాలు కూడా కాలేదు. కన్నవాళ్లు మందలిస్తారనే భయంతో కట్టుకథ అల్లింది. ఎదురుగా కనిపించిన డెలివరీ బాయ్‌ని అందులో పాత్రను చేసింది. బాలిక తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. షాక్‌ నుంచి తేరుకోలేక పోయాడు ఆ డెలివరీ బాయ్‌.

..మనచుట్టూ ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొంతమంది అయితే డెలివరీలో ఆలస్యం జరిగినా, ఆహారంలో నాణ్యత లోపించినా ఆ కోపం మరోలా చూపుతారు. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి ’మీ వాడు మందుకొట్టి వచ్చాడు. అసభ్యంగా ప్రవర్తించాడు’ అంటూ ఫిర్యాదు చేస్తారు. ‘‘మా బిర్యానీలో సగానికి సగం డెలివరీ బాయే తినేసినట్టున్నాడు- అంటూ అర్థంలేని ఆరోపణలు చేసేవారు ఉన్నారు. రెండు బిర్యానీలు ఆర్డర్‌ చేసి.. తాము ఒకటి తీసుకుని, మాకొకటి ఇచ్చేవారూ ఉన్నారు’’ అంటూ గత అనుభవాలను గుర్తుచేసు కుంటాడు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ విఘ్నేశ్‌.

తీపి‡ జ్ఞాపకాలూ..

కొన్ని డెలివరీలు జీవితాల్నే మార్చేస్తాయి. గత ఏడాది ఓ అమ్మాయికి కేక్‌ అందించడానికి వెళ్లాడు పవన్‌. ఈ ఏడాది కూడా అదే ఇంట్లో, అదే అమ్మాయికి కేక్‌ తీసుకెళ్లాడు. అప్పుడు డెలివరీ బాయ్‌గా. ఇప్పుడు లవర్‌ బాయ్‌గా. అంతే తేడా! ఏడాది తిరిగేలోపు చిన్నపాటి పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారిపోయింది. ఈమధ్యే బంజారాహిల్స్‌లోని పంచవటి కాలనీలో ఔషధాలు డెలివరీ చేయడానికి వెళ్లాడు జాన్సన్‌. ఆ ఇంటి యజమాని ఒంటరి. వయోధికురాలు. ఆస్తమా రోగి.

ఆ సమయానికి ఊపిరి పీల్చుకోడానికి కష్టపడుతోంది. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి.. హాస్పిటల్‌లో చేర్పించాడు జాన్సన్‌. అంతలోనే విజయవాడ నుంచి ఆమె పిల్లలు వచ్చారు. జాన్సన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. పదివేల రూపాయలు చేతిలో పెట్టబోయారు. సున్నితంగా తిరస్కరించాడు జాన్సన్‌. ‘ఇలాంటి చిన్నచిన్న అనుభూతులే పెద్దపెద్ద అవమానాల్ని తట్టుకునే శక్తినిస్తాయి’ అంటాడా యువకుడు.

గుప్తా ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడంతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ రాలేదు. దీంతో, ఫుడ్‌ డెలివరీ సంస్థలో చేరాడు.

ఓ వర్షాకాలపు రాత్రి పదిన్నర ప్రాంతంలో ఆర్డర్‌ వచ్చింది. రెస్టారెంట్‌లో పార్సిల్‌ అందుకునేలోపు వాన మొదలైంది. పది నిమిషాల్లో కుండపోతగా మారింది. రహదారులు కాలువల్ని తలపించాయి. అయినా, గుప్తా తన బాధ్యతను మరిచి పోలేదు. బైక్‌ను ఓ ఎత్తయిన ప్రాంతంలో పార్క్‌ చేసి.. అడ్రస్‌ ప్రకారం వెళ్లి తలుపు తట్టాడు. స్పందన లేకపోవడంతో కాలింగ్‌బెల్‌ నొక్కాడు. ఒక నిమిషం తర్వాత ద్వారాలు తెరుచున్నాయి. ఎదురుగా ఓ నడివయసు వ్యక్తి. అతని మొహంలో ఆశ్చర్యం, ఆనందం. కళ్లలో మెచ్చుకోలు. ‘ఈ పూటకు ఉపవాసమే అనుకున్నా. థ్యాంక్స్‌’ అంటూ తడిసి ముద్దయిపోయిన గుప్తాను లోపలికి పిలిచాడు. తువ్వాలు ఇచ్చాడు. వేడివేడి కాఫీ అందించాడు. తిరిగి వెళ్తున్నప్పుడు ‘ఏం చదువుకున్నావు బాబూ?’ అని అడిగాడు. పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. మరుసటి రోజు గుప్తాకు ఏదో కొత్త నంబరు నుంచి కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి ఓ పెద్ద కార్పొరేట్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌. ఓ గంటలో వచ్చి తనను కలవమని చెప్పాడు. అడ్రస్‌ వాట్సాప్‌ చేశాడు. పది నిమిషాల్లో ఇంటర్వ్యూ పూర్తయిపోయింది. మరో అయిదు నిమిషాల్లో సీఈవో సంతకంతో ఆఫర్‌ లెటర్‌ చేతికొచ్చింది. ఆ సంతకం కింద ఉన్న పేరు.. గత రాత్రి తాను ఫుడ్‌ డెలివరీ చేసిన వ్యక్తిదే.

త్రిశంకు నరకం..

చేతిలో బండి, జేబులో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే చాలు. ఉపాధి సిద్ధం. గిగ్‌ కల్చర్‌ ప్రత్యేకత అదే. అప్పటికే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అదనపు సంపాదన అవుతుంది. నిరుద్యోగులకూ, విద్యార్థులకూ పాకెట్‌ మనీ అందిస్తుంది. కాకపోతే, దీని పరిమితులు దీనికున్నాయి. పదేళ్లుగా పనిచేస్తున్నవారైనా, వారానికి ఏడు రోజులూ, రోజుకు పన్నెండు గంటలూ కష్టపడుతున్నా.. ‘అవును. ఇది నా ఉద్యోగం’ అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, నియామక పత్రాలు ఇవ్వరు. ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉండదు. జీవిత బీమా, ఆరోగ్య బీమా నామమాత్రమే. కస్టమర్‌ రేటింగ్‌ మీదే బతుకు ఆధారపడి ఉంటుంది. రోజుల తరబడి లాగిన్‌ కాకపోయినా, క్యాన్సిలేషన్లు ఎక్కువైనా ఐడీ బ్లాక్‌ చేస్తారు. ఇక చచ్చినా ఆర్డర్లు రావు.

షల్‌ మీడియాలోనూ ఒళ్లు దగ్గర పెట్టుకుని కామెంట్లు చేయాలి. అటు పూర్తిస్థాయి కార్మికులూ కాదు, ఇటు నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులూ కాదు. దీంతో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.

గిగ్‌ వర్కర్లకూ, కొవిడ్‌ సంక్షోభానికీ ప్రత్యక్ష సంబంధం ఉంది. కరోనాలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో సరుకులూ, ఆహారం గడప దగ్గరికే తీసుకొచ్చే డెలివరీ కంపెనీలు ఊపందుకున్నాయి. దీంతో, గూడు కోల్పోయిన పక్షులు కొత్త కొమ్మల్ని వెతుక్కు న్నట్టు, వాళ్లంతా గిగ్‌ వర్కర్స్‌గా మారి పోయారు. నిజానికి, తొలిదశలో ఆకర్షణీయమైన పారితోషికాలే ఉండేవి. భారీ ప్రోత్సాహకాలూ ఇచ్చేవారు. క్రమంగా పోటీ పెరిగింది. పెద్దగా నైపుణ్యం అవసరంలేని పనులు కాబట్టి.. చిరుద్యోగులూ, నిరుద్యోగులూ ఆకర్షితులయ్యారు. అవకాశాల కోసం ఎగబడ్డారు. డబ్బు మనిషి బలహీనత, అంతకు మించిన అవసరం కూడా. దీంతో, రూపాయలను ఎరగా వేసి శ్రమను పిండుకుంటున్నారు. పది ఆర్డర్లకు ఇంత, పదిహేను ఆర్డర్లకు ఇంత, పాతికైతే ఇంకొంత.. అంటూ ఆశ చూపుతారు. లక్ష్యాల వెంట పరుగు తీయిస్తారు.

ఆ ఉరుకు కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది. తీవ్ర ఒత్తిడికి కారణం అవుతుంది. కడుపునిండా తినరు. గొంతెండుతున్నా నీళ్లు తాగరు. ఫలితంగా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా ప్రతినిధులు దిల్లీ, లఖ్‌నవూ, జైపూర్‌, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోని గిగ్‌ వర్కర్స్‌ మీద ఓ అధ్యయనం చేశారు.
ఆ లెక్కల ప్రకారం దాదాపు అరవైశాతం మంది రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేస్తున్నారు. సగటు సంపాదన పదిహేను వేలు. బండి ఈఎమ్‌ఐ, పెట్రోలు, రిపేర్లు, సర్వీసింగ్‌, సెల్‌ఫోన్‌ బిల్లు.. అన్నీ అందులోనే. రోజూ శ్మశాన వైరాగ్యాన్ని తలపించే మానసిక స్థితిలో ఇంటికి బయల్దేరతారు గిగ్‌ వర్కర్లు. ‘ఇక మనవల్ల కాదు’ అని తీర్మానించుకుని నిద్రలోకి జారుకుంటారు. తెల్లారేసరికి ఎవరో కీ ఇచ్చినట్టు బైకు తుడుచుకుని, కంపెనీ లోగో ఉన్న టీషర్ట్‌ వేసుకుని.. లాగిన్‌ అవుతారు. ఆర్డర్‌ కోసం ఆశగా ఎదురుచూస్తారు. కాల్‌ రాగానే గొంతుకలో కొత్త ఉత్సాహం.

‘హలో మేడమ్‌.

వచ్చేస్తున్నా. ఫైవ్‌ మినిట్స్‌’.  

*           *           *

వర్షం కురుస్తూ ఉంటుంది. రెస్టారెంట్‌కు వెళ్లలేం. అదే వర్షంలో డెలివరీ బాయ్‌ మాత్రం నిమిషాల్లో ఆహారం అందించాలని కోరుకుంటాం.

ఎండలకు భయపడి కాలు బయటపెట్టం. అదే ఎండలో డెలివరీ బాయ్‌ మాత్రం మనకిష్టమైన ఐస్‌క్రీమ్‌ తీసుకురావాలని ఆశిస్తాం. తేడావస్తే తీవ్రంగా స్పందిస్తాం. వాళ్లేం మనల్ని ఆస్తులు రాసివ్వమని అడగడం లేదు. టిప్పు ఇవ్వకపోయినా చిన్నబుచ్చుకోరు. నాలుగైదు నిమిషాల ఆలస్యానికి తప్పు పట్టకపోతే చాలంటున్నారు. వాళ్లేం శాలువా కప్పి సన్మానం చేయమని కోరడం లేదు.

చిన్న చిరునవ్వు.

పొడిపొడిగా ఓ ‘థ్యాంక్స్‌’.

వీలైతే ఓ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌. అంతే.

తదుపరి డెలివరీకి అదే చోదకశక్తి.

గిగిఫికేషన్‌

ప్పటి వరకూ సరుకుల డెలివరీకే పరిమితమైన గిగ్‌ వ్యవస్థ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, యానిమేషన్‌ తదితర రంగాలకూ విస్తరించనుంది. ‘టెక్‌ గిగ్స్‌’దే భవిష్యత్తు. భారత్‌ గిగ్‌ వర్కర్ల రాజధానిగా మారనుంది. ప్రపంచ మానవ వనరుల అవసరాలలో నలభైశాతం మనమే తీర్చబోతున్నాం. కంపెనీల యాజమాన్యాలు సైతం గిగ్‌ వర్కర్స్‌ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నాయి. పని ఒత్తిడి తగ్గిస్తున్నాయి. విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తున్నాయి. స్టాక్‌ ఆప్షన్‌ స్కీమ్‌ కింద వాటాలు ఇస్తున్న సంస్థలూ లేకపోలేదు. రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలు గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమం కోసం ప్రత్యేకంగా చట్టాలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ లావాదేవీలపై అదనపు పన్ను విధించి ఆ మొత్తాన్ని వారి సంక్షేమానికి వినియోగించే ఆలోచనలో ఉంది కర్ణాటక. తెలంగాణ సర్కారు సైతం ఐదులక్షల విలువైన ఆరోగ్య బీమా ప్రకటించింది.

ఓ సినిమాగా...

ప్రసిద్ధ నటి, దర్శకురాలు నందితాదాస్‌ గిగ్‌ వర్కర్ల జీవితాల్ని హృద్యంగా తెరకెక్కించారు. సినిమా పేరు.. ‘జ్విగాటో’. రెండు క్విక్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థల పేర్లను కలగలిపి టైటిల్‌గా మార్చేశారు. కపిల్‌ శర్మ కథానాయకుడు. అప్పటిదాకా హాయిగా సాగిపోతున్న హీరో జీవితంలో కరోనా అతిపెద్ద కుదుపు. అతను పనిచేస్తున్న కార్ఖానా మూతపడుతుంది. ఉద్యోగం ఊడిపోతుంది. దీంతో, ప్రొడక్షన్‌ మేనేజర్‌ కాస్తా.. ఫుడ్‌ డెలివరీ పార్ట్‌నర్‌గా మారిపోతాడు. ఆ రేటింగ్‌ వ్యవస్థ, ఆ తాయిలాలు, హెచ్చరికలు, బుజ్జగింపులు.. ఇలా గిగ్‌ వర్కర్ల జీవితాలతో ముడిపడిన అనేక అంశాలను కథా కథనాలలో భాగం చేశారు. భువనేశ్వర్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది. థియేటర్‌ నుంచి బయటికి వచ్చే సమయానికి... సరుకులతోనో, స్వీట్‌బాక్స్‌తోనో తరచూ మన తలుపుతట్టే డెలివరీ బాయ్స్‌ పట్ల అభిప్రాయం మారుతుంది. ఇక నుంచీ భుజాన సంచితో ఎవరొచ్చినా మంచిగా పలకరిస్తాం. మంచినీళ్ల గ్లాసు అందిస్తాం.

తొలిమెట్టుగా...

నిజమే. సమస్యలున్నాయి. సవాళ్లూ ఎదురవుతాయి. అంతమాత్రాన ఆగిపోతామా? జీవితంతో రాజీపడతామా? ఏ సంపాదనా లేనివారికి క్విక్‌ డెలివరీ కంపెనీలు తక్షణ ఉపాధిని అందిస్తున్నాయి. బతకడానికి సరిపడా భరోసా ఇస్తున్నాయి.

ఆ పునాదుల మీద కెరీర్‌ నిర్మించుకోవచ్చు. తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతానికి చెందిన బల్వంత్‌ రావు.. డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యాడు. వరుసగా మూడు ప్రభుత్వ కొలువులు సాధించాడు. తమిళనాడుకు చెందిన ఇళంగోవన్‌ బెంజిమెన్‌.. పదేళ్లక్రితం చదువుకోడానికి ఆస్ట్రేలియా వెళ్లాడు. సంపాదన కోసం గిగ్‌ వర్కర్‌గా పనిచేశాడు. ఆ అనుభవాన్నే పెట్టుబడిగా మార్చి.. తాజాగా అక్కడే ‘మైగిగ్‌స్టర్స్‌’ అనే స్టార్టప్‌ ప్రారంభించాడు. చాలామంది గిగ్‌వర్కర్స్‌కు ఆర్థిక అక్షరాస్యత ఉండదు. దీంతో పొదుపు-మదుపు గురించి పట్టించుకోరు. ’మైగిగ్‌స్టర్స్‌’ ఆ బాధ్యత తీసుకుంటుంది. ‘గిగ్‌ఇండియా’ అంకుర సంస్థ వెనుక కూడా ఇలాంటి కథే ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..