సిసింద్రీ

త్రిపురకు చెందిన పుహాబీ చక్రవర్తి ‘అథ్లెటెక్స్‌ ఫర్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌’ అనే ఆప్‌ను రూపొందించింది. కొంతకాలం క్రితం గుజరాత్‌లో నిర్వహించిన ‘డిజిటల్‌ ఇండియా వీక్‌’లో ఇది ప్రదర్శితమైంది.

Published : 19 Mar 2023 00:00 IST

సిసింద్రీ

‘ఆప్‌... ఆప్‌...’ హుర్రే!

త్రిపురకు చెందిన పుహాబీ చక్రవర్తి ‘అథ్లెటెక్స్‌ ఫర్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌’ అనే ఆప్‌ను రూపొందించింది. కొంతకాలం క్రితం గుజరాత్‌లో నిర్వహించిన ‘డిజిటల్‌ ఇండియా వీక్‌’లో ఇది ప్రదర్శితమైంది. ప్రస్తుతం ఈ ఆప్‌ అథ్లెట్లకు ఉపయోగపడేలా పుహాబీ రూపొందించింది. స్వతహాగా ఈ చిన్నారికి కిక్‌బాక్సింగ్‌, కరాటే తెలుసు. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ కూడా ఉంది. పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలూ సాధించింది. పేద, మధ్యతరగతి క్రీడాకారులకు చేయూత ఇచ్చేలా, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పుహాబీ ఈ ఆప్‌ను తయారుచేసింది. ఏకంగా ప్రధాని నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఈ ఆప్‌ను మరింత అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకూ అందుబాటులోకి వచ్చేలా మార్పులు చేయమని ప్రధాని మోదీ పుహాబీ చక్రవర్తికి సూచనలూ ఇచ్చారు.


ఎలుక సాయం!

అనగనగా ఓ అడవి. జంతువులన్నీ కలివిడిగా జీవిస్తుండేవి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఓ పెద్దపులి మాత్రం వీటిని బాగా ఇబ్బంది పెడుతుండేది. ఆకలేసినా వేయకున్నా... వేటాడేది. కొన్నిసార్లు వినోదం కోసం కూడా ఇతర జీవుల ప్రాణాలు తీస్తుండేది. ఎంతో హాయిగా జీవనం సాగిస్తున్న జంతువులకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేసేది. రోజూ ఇదంతా గమనిస్తున్న ఓ ఎలుక ఎలాగైనా సరే పెద్దపులికి బుద్ధి చెప్పాలనుకుంది. ‘ఓ పెద్దపులీ... నువ్వు బలమైన జంతువని నీకు తలపొగరు. అన్ని జీవులు నిన్ను చూసి భయపడుతున్నాయని నువ్వు విర్రవీగుతున్నావు. నువ్వంటే నాకు అస్సలు భయం లేదు. దమ్ముంటే నన్ను పట్టుకో చూద్దాం’ అని ఎలుక సవాలు విసిరింది. దీంతో పెద్దపులికి విపరీతమైన కోపం వచ్చింది. ‘నా పంజాకున్న గోరంత కూడా లేవు. నువ్వు నాకే సవాలు విసురుతున్నావా? నీ సంగతి చెబుతా చూడు’ అంటూ పెద్దపులి ఎలుక వెంటపడింది. ఎలుక వేగంగా పరుగెత్తింది. పొదల్లో దూరుతూ, బయటకు వస్తూ... గెంతుతూ, దూకుతూ పులిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. చివరకు కొండపైకి పెద్దపులిని తీసుకెళ్లింది. జంతువులన్నీ తననే చూస్తున్నాయి. ఎలుక తనకు దొరకడం లేదు. పరువుపోతోంది అన్న ఉక్రోషంతో పెద్దపులి మరింత వేగంగా ఎలుకను వెంబడించింది. కొండ అంచు వరకూ వెళ్లిన ఎలుక అకస్మాత్తుగా వెనక్కు మళ్లింది. పెద్దపులి మాత్రం లోయలో దూకి తన ప్రాణాలు కోల్పోయింది. మిగతా జంతువులన్నీ కేరింతలు కొడుతూ ఎలుకను మెచ్చుకున్నాయి. పెద్దపులి బారి నుంచి తమను కాపాడినందుకు ఎలుకకు కృతజ్ఞతలు చెప్పాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..