సిసింద్రీ

సిసింద్రీ

Published : 25 Feb 2024 00:42 IST

అవ్వ పెట్టిన వేడివేడి బువ్వ!

పూర్వం కుంతల రాజ్యాన్ని సురేంద్రుడు పాలించేవాడు. మంత్రి మహేంద్ర రాజుకు తల్లో నాలుకలా మెలిగేవాడు. రాజు కూడా మంత్రి సలహా లేనిదే... ఎలాంటి నిర్ణయాలూ తీసుకునేవాడు కాదు. రాజ్యవిస్తరణలోనూ రాజుకు మంత్రి తన ఉపాయాలతో ఎంతో సాయం చేశాడు. కానీ ఒకసారి సురేంద్రుడు పొరుగు రాజ్యం మీద దండెత్తాడు. అది అనుకున్న దానికన్నా బలమైన రాజ్యం కావడంతో మహేంద్ర ఎత్తులు ఫలించలేదు. దీంతో సురేంద్రుడు ఓడిపోయాడు. తన సలహా ఫలించనందుకు మహేంద్ర చింతించాడు. ఒక రకమైన నైరాశ్యానికి లోనయ్యాడు. ఒక్కడే తన ఇంటిబాట పట్టాడు. అది వేసవి కావడంతో దారిలో కాస్త అలసటకు గురయ్యాడు. ఓ ఇంటి అరుగు మీద కూర్చుండిపోయాడు. అదే సమయంలో అవ్వ తన మనవలకు అన్నం పెడుతోంది. ఇంతలో ఒక మనవడు పెద్దగా కేక పెట్టాడు. ఏమైందంటూ... కంగారుగా వచ్చింది అవ్వ. ‘అన్నంలో చేయి పెట్టాను. కాలింది’ అని చెప్పాడు ఆ అబ్బాయి. ‘నీ తెలివి తెల్లారినట్లే ఉంది. నేరుగా అన్నం మధ్యలో ఎవరైనా చేయి పెడతారా? నెమ్మదిగా ఉఫ్‌... ఉఫ్‌మని ఊదుకుంటూ పక్క నుంచి తింటూ వెళ్లాలి కానీ..’ అంటూ హెచ్చరించింది. అది విన్న మహేంద్రకు తాను చేసిన పొరపాటు ఏంటో అర్థమైంది! ఆ తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకుని రాజును మళ్లీ దండయాత్ర చేయమన్నాడు. కానీ ఈ సారి నేరుగా ఆ పెద్ద రాజ్యం మీద కాకుండా... చుట్టుపక్కల ఉండే దాని సామంత రాజ్యాలపై దండెత్తమన్నాడు. రాజు ఒక్కో రాజ్యాన్నీ గెలుచుకుంటూ... పెద్దరాజ్యాన్ని ఒంటరి చేశాడు. సామంత రాజుల నుంచి ఎటువంటి సాయం అందకుండా చేసి, అప్పుడు శత్రురాజ్యం మీద సురేంద్రుడు దండెత్తేలా చేశాడు. ఆ పెద్దరాజ్యం ఈ సారి ఓడిపోయింది. మహేంద్రుడి తెలివితేటలతోనే ఇదంతా సాధ్యమైందని రాజు పొగిడాడు. ‘కాదు ప్రభూ...! ఇదంతా అవ్వ పెట్టిన వేడి వేడి బువ్వ వల్లే’ అని మనసులోనే మంత్రి అనుకున్నాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..