సిసింద్రీ

అనగనగా ఒక చిట్టడవి. అందులో ఒక నక్క ఉండేది. దానికి ఆ రోజు మధ్యాహ్నం వరకు గాలించినా ఆహారం దొరకలేదు. అప్పటికే తిని రెండు రోజులవుతోంది.

Updated : 10 Mar 2024 00:28 IST


 

 


కుందేళ్ల తెలివి!

నగనగా ఒక చిట్టడవి. అందులో ఒక నక్క ఉండేది. దానికి ఆ రోజు మధ్యాహ్నం వరకు గాలించినా ఆహారం దొరకలేదు. అప్పటికే తిని రెండు రోజులవుతోంది. ఓ వైపు ఆకలి బాధ, మరో వైపు ఎండ తీవ్రతతో దానికి, వేటాడే ఓపిక లేకుండా పోయింది. అప్పుడే నక్కకు ఓ పెద్ద చెట్టు తొర్ర కనిపించడంతో, వెంటనే ఓ ఆలోచన వచ్చి, నెమ్మదిగా అందులోకి దూరింది. ‘ఈ తొర్రలో కుందేళ్ల బొచ్చు ఉందంటే.. కచ్చితంగా ఇది వాటి ఆవాసమే. మేతకు వెళ్లిన అవి సాయంత్రంలోగా తిరిగి వస్తాయి. ఈ తొర్రలోకి వచ్చీ రావడంతోనే అమాంతం వాటి మీద దాడి చేసి తినేస్తా. అప్పుడు నా ఆకలి తీరిపోతుంది. ఇందులో విశాలంగా ఉంది. ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోయి.. తెల్లవారగానే వెళ్లిపోతాను’ అనుకుంది. సాయంత్రం కాగానే కుందేళ్ల జంట కబుర్లు చెప్పుకుంటూ తొర్ర దగ్గరకు వచ్చింది. వాటికి ఎందుకో ఏదో తేడాగా అనిపించడంతో.. లోపలికి వెళ్ళకుండా చుట్టూ పరిశీలించాయి. నక్క కాలి గుర్తులు గుహలోకి వెళ్లినట్లున్నాయి. కానీ, బయటకు వచ్చినట్లు లేవు. కచ్చితంగా ఈ తొర్రలో నక్క ఉందని అనుకున్నాయవి. వెంటనే కుందేళ్లు.. ‘తొర్రా... ఓ చెట్టు తొర్రా..! మమ్మల్ని లోపలికి రమ్మంటావా? నువ్వు అనుమతి ఇవ్వకుండా... మేము ఎప్పుడైనా లోపలకు వచ్చామా? ఈ రోజు ఎందుకిలా మౌనంగా ఉన్నావు? నువ్వు రమ్మని పిలిచేంత వరకూ లోపలికి రాము’ అన్నాయి. ‘ఓహ్‌... నేను ఈ తొర్రలో ఉన్నాను కదా.. అందుకే ఇది  కుందేళ్లకు రమ్మని అనుమతి ఇవ్వడం లేదేమో. నేను ఇప్పుడు వాటిని పిలవకపోతే... వెళ్లిపోతాయేమో. అసలే నాకు చాలా ఆకలిగా ఉంది’ అనుకుంది నక్క. వెంటనే... ‘రండి కుందేళ్లూ... రండి... మీకిదే నా స్వాగతం. తొర్రలో ఎవరూ లేరు. మీరు రావొచ్చు’ అంది నక్క గొంతును మార్చి. బయట నుంచి ఏ స్పందనా లేకపోవడంతో... మరోసారి ఇలాగే పిలిచింది. అయినా కుందేళ్లు తొర్ర లోపలకు రాలేదు. ‘ప్చ్‌... అవి లోపలకు రావడం లేదు... నేనే బయటకువెళ్లి దాడి చేస్తా’ అని కోపంతో బయటకు వచ్చి చుట్టూ చూసింది. కనుచూపుమేర ఏ జంతువూ లేకపోవడంతో... నిరాశపడిందది. నక్క గొంతు వినగానే కుందేళ్లు వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి. ఆ రాత్రికి సమీపంలోని కొండపై రాళ్ల సందుల్లో తలదాచుకున్నాయి. తర్వాత భద్రమైన మరో కొత్త నివాసాన్ని వెతుక్కున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు