సిసింద్రీ

ఒకసారి అక్బర్‌ చక్రవర్తికి ఏదో విషయంలో బీర్బల్‌ మీద చాలా కోపం వచ్చింది. తన ఆస్థానం నుంచి వెళ్లిపోమనీ, ఇంకెప్పుడూ తన కంటికి కనిపించవద్దనీ ఆజ్ఞాపించాడు.

Updated : 07 Apr 2024 00:58 IST

బీర్బల్‌ ఆచూకీ!

ఒకసారి అక్బర్‌ చక్రవర్తికి ఏదో విషయంలో బీర్బల్‌ మీద చాలా కోపం వచ్చింది. తన ఆస్థానం నుంచి వెళ్లిపోమనీ, ఇంకెప్పుడూ తన కంటికి కనిపించవద్దనీ ఆజ్ఞాపించాడు. అప్పుడు బీర్బల్‌ అదే రాజ్యంలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లిపోయి, అజ్ఞాతవాసిగా తలదాచుకున్నాడు. కానీ కొన్నాళ్లకే అక్బర్‌కు బీర్బల్‌ను చూడాలన్న కోరిక కలిగింది. అతడి కోసం రాజ్యమంతా వెతికించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. బీర్బల్‌ ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలనుకున్న అక్బర్‌కు ఓ ఆలోచన వచ్చింది. తన రాజ్యంలోని ప్రతి ఊరి వాళ్లూ నెల రోజుల్లోగా ఒక కుండ నిండా తెలివిని నింపి తనకు పంపించాలన్నాడు. ఒకవేళ అలా పంపించడం వీలుకాకపోతే ఆ కుండ నిండా బంగారం, వజ్రాలూ నింపి పంపాలని గ్రామపెద్దలకు కబురు పంపాడు. ‘తెలివిని కుండలో ఎలా నింపుతారు. అయినా అది వస్తువు కాదు కదా! ఇప్పుడు దాన్ని వజ్రాలూ, బంగారంతో నింపాలంటే మాటలా?!’ అని గ్రామాల ప్రజలంతా దిగులు పడ్డారు.

ఆ విషయం తెలిసిన బీర్బల్‌... ‘మీరు నాకు ఒక కుండను ఇవ్వండి. నేను ఒక నెలరోజుల్లోగా దానిలో తెలివిని నింపి తీసుకువస్తాను’ అని తాను ఉంటున్న ఊరి పెద్దకు చెప్పాడు. ఊరికి కొత్తగా వచ్చిన ఈ వ్యక్తి అసలేం చేస్తాడో చూద్దాం అనుకున్న ఊరి పెద్ద అతనికి ఓ కుండను ఇచ్చాడు. బీర్బల్‌ ఓ పుచ్చకాయ తోటలోకి వెళ్లాడు. చిన్న పుచ్చకాయ పిందెను పాదు నుంచి కొయ్యకుండానే తీగతో సహా కుండలో వేశాడు. ఆ పాదుకు నీళ్లు, ఎరువులు వేసి జాగ్రత్తగా పెంచాడు. సరిగ్గా నెలరోజులకు ఆ పుచ్చకాయ కుండలోంచి బయటకు తీయలేనంత పెద్దగా పెరిగిపోయింది. అప్పుడిక దాన్ని తెంచి, కాయతో సహా ఉన్న కుండను గ్రామపెద్దకు ఇచ్చి, అక్బర్‌కు అప్పగించమన్నాడు. అక్బర్‌ చక్రవర్తి కుండనూ, దాని లోపల పెరిగిన పుచ్చకాయనూ పరిశీలించాడు. అలా తెలివిగా ఆలోచించగలిగేది ఒక్క బీర్బల్‌ మాత్రమే అని గ్రహించాడు. వెంటనే ఆ గ్రామానికి తన పరివారంతో వెళ్లి, బీర్బల్‌ను తిరిగి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..