చీమ పరుగు!

ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరుగెడుతోంది. దాన్ని ఒక కుందేలు ఆపి, ‘చీమా... చీమా... ఎందుకలా పరుగెడుతున్నావు?’ అని అడిగింది. ‘ఒక పెద్ద జీవిని చూశాను.

Published : 28 Apr 2024 00:54 IST

అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరుగెడుతోంది. దాన్ని ఒక కుందేలు ఆపి, ‘చీమా... చీమా... ఎందుకలా పరుగెడుతున్నావు?’ అని అడిగింది. ‘ఒక పెద్ద జీవిని చూశాను. అది నాకన్నా చాలా పెద్దది. నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను’ అంది. ‘అమ్మో, అంత పెద్దదా... దాని వల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో’ అనుకుంటూ చీమతోపాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ జింక... ‘ఎందుకలా పరుగెడుతున్నారు’ అని ప్రశ్నించింది. విషయం చెప్పింది చీమ. ‘అవునవును..’ అంటూ కుందేలు వంతపాడింది. దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏంటని అడిగింది. ఆయాసపడుతూనే చెప్పి... చీమ, కుందేలు, జింక మళ్లీ పరుగు లంకించుకున్నాయి. ‘అమ్మో... ఆ పెద్దజీవితో నాక్కూడా ప్రమాదమేమో’ అనుకుంటూ గుర్రమూ పరుగు అందుకుంది. ఇలా చాలా జంతువులు వీటితోపాటే పరుగెత్తడం ప్రారంభించాయి. ఆఖరుకు ఈ జీవులు ఓ ఏనుగు కంటపడ్డాయి. ‘ఎందుకలా పరుగెడుతున్నారు’ అని అది వాటిని అడిగింది. అన్ని జంతువులూ చీమవైపే చూపించాయి. మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకూ చెప్పింది చీమ. దాంతో అది కూడా మిగతా జంతువులతోపాటే పరుగెత్తడం ప్రారంభించింది. కొంతదూరం వెళ్లగానే... ‘అవునూ అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువును చూశావు?’ అని చీమను అడిగింది. ‘అది పే..ద్ద గండుచీమ. నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపే వేగంగా వస్తోంది. అందుకే భయమేసి, ఇలా పరుగెత్తడం ప్రారంభించాను’ అంది. అంతే, అక్కడున్న కుందేలు, జింక, ఏనుగు, ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయి. ‘అసలు నీకు బుద్ధి, జ్ఞానం ఉందా... గండుచీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు’ అన్నాయి. ‘అది నన్ను తింటుందేమో అన్నాను. కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడ చెప్పాను. మీరే నాతోపాటు పరుగెత్తారు’ అంది చీమ. ‘అవును... నిజమేగా?..’ అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ. అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా, తెలివి తక్కువగా పరుగెత్తినందుకు సిగ్గుపడ్డాయి. తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి. చీమ మాత్రం మళ్లీ పరుగందుకుంది.













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు