పెద్దాయన పెట్టిన పరీక్ష!

ఓ గ్రామంలో రమేష్‌, సురేష్‌ అనే ఇద్దరు యువకులు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఉద్యోగం కోసం చూస్తున్నారు. దగ్గర్లోని నగరంలో ఓ పేరు మోసిన వస్త్ర దుకాణంలో ఉన్నతస్థాయి ఉద్యోగం ఒకటి ఖాళీ ఉందని దినపత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా తెలుసుకున్నారు.

Published : 09 Jun 2024 00:11 IST

ఓ గ్రామంలో రమేష్‌, సురేష్‌ అనే ఇద్దరు యువకులు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఉద్యోగం కోసం చూస్తున్నారు. దగ్గర్లోని నగరంలో ఓ పేరు మోసిన వస్త్ర దుకాణంలో ఉన్నతస్థాయి ఉద్యోగం ఒకటి ఖాళీ ఉందని దినపత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా తెలుసుకున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలని ఆ ప్రకటనలో చెప్పిన చిరునామాకు వెళ్లారు.  వీళ్లు వెళ్లేటప్పటికే అక్కడ వందల సంఖ్యలో జనాలున్నారు. సాయంత్రం వరకు వీళ్లను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. చాలామంది మధ్యలోనే వెళ్లిపోయారు. కాసేపటికి ఓ పెద్దాయన వచ్చి... ‘మీరంతా ఉద్యోగం కోసం వచ్చినట్లున్నారు. మా యజమాని పని మీద బయటకు వెళ్లారు. రేపు ఉదయాన్నే రండి’ అని చెప్పాడు. నిరాశతో అంతా వెళ్లిపోయారు. మరుసటి రోజు అందులో సగం మంది కూడా రాలేదు. మళ్లీ ఆ పెద్దాయన... ‘అయ్యో! మీరంతా అప్పుడే వచ్చేశారా?! యజమాని ఇంకా రాలేదు. మధ్యాహ్నం వస్తారు, మీరు కూర్చోండి’ అని చెప్పి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం కాస్తా సాయంత్రమైంది. అయినా కూడా యజమాని రాలేదు. ఇలా మరో మూడు రోజులు ఏవేవో సాకులు చెబుతూ ఉన్నాడు ఆ పెద్దాయన. ఆరో రోజు రమేష్‌, సురేష్‌ మాత్రమే వచ్చారు. మునుపటిలానే సాయంత్రం వరకు ఎదురుచూసి, ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది. మరో రెండురోజులూ ఇదే తంతు. ఇక ఓపిక నశించి.. ‘నాకు ఈ ఉద్యోగం వద్దూ.. పాడూ వద్దూ...!’ అంటూ అక్కడ నుంచి సురేష్‌ కోపంగా వెళ్లిపోయాడు. కానీ రమేష్‌ మాత్రం ఉద్యోగం కోసం వెళ్తూనే ఉన్నాడు. ఇలా నాలుగు రోజులు పూర్తయ్యాయి. షాపులోని పెద్దాయన పిలిచి ‘రేపు వచ్చి ఉద్యోగంలో చేరిపో’ అన్నాడు రమేష్‌తో! ఆ మాటలకు ఆశ్చర్యపోయి... ‘అదేంటి మీ యజమాని ఇంకా రాలేదు కదా! మీరెలా ఉద్యోగం ఇస్తారు’ అన్నాడు. అప్పుడతను నవ్వి... ‘నేనే యజమానిని. నాకు చాలా వస్త్ర దుకాణాలున్నాయి. వాటి లెక్కలన్నీ చూసేందుకు చాలా ఓపిక, సహనం అవసరం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఈ పరీక్ష. ఇందులో నువ్వు నెగ్గావు’ అన్నాడు. రమేష్‌ సంతోషంగా ఉద్యోగంలో చేరిపోయాడు.













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..