ఆకులతో చిలుక.. పూలతో పులి!

అందంగా పూల మాల కట్టడాన్నే ఓ కళగా చెబితే... పువ్వులూ ఆకులూ వాడుతూ ముచ్చటైన బొమ్మలు చేయడాన్ని ఏమని చెప్పాలి... ఆ కళను ఇంకెంత అద్భుతమని పొగడాలి.

Published : 16 Mar 2024 23:35 IST

అందంగా పూల మాల కట్టడాన్నే ఓ కళగా చెబితే... పువ్వులూ ఆకులూ వాడుతూ ముచ్చటైన బొమ్మలు చేయడాన్ని ఏమని చెప్పాలి... ఆ కళను ఇంకెంత అద్భుతమని పొగడాలి. ఇదిగో ఇక్కడున్న పిట్ట, పులి... ప్రతిదీ అలా పూలతో తీర్చిదిద్దిన చిత్రమే. కెనడాలో ఉండే రాకు ఇనౌయే అనే కళాకారుడు చేసిన పూల బొమ్మలే ఇవన్నీ. సరదాగా ఓసారి గులాబీ పువ్వుల రెక్కలతో ఓ బొమ్మ రూపాన్ని చేశాడట. అది ఎంతగానో నచ్చి, ఆ తర్వాత పువ్వులతో పాటు రకరకాల ఆకులూ, కొమ్మలూ ఇతర మొక్కల భాగాల్నీ వాడుతూ చిన్న చిన్న కీటకాలూ, సీతాకోకచిలుకల్లాంటి బొమ్మల్నీ తయారుచేశాడు. వాటిని సోషల్‌ మీడియాలో పెడితే- ‘వావ్‌... ఎంత అద్భుతం’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారట. దాంతో తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని అద్భుతమైన పూల శిల్పాల్ని రూపొందిస్తున్నాడు. ముందుగా ఫోమ్‌తో బొమ్మ ఆకారాన్ని మలుచుకుని దాని మీద పువ్వులరెక్కలూ ఆకులూ అతికిస్తూ నిజమైన జీవుల రూపం తీసుకొస్తున్నాడు. ఏదిఏమైనా... ఈ ఫ్లోరల్‌ జీవులు మాత్రం భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..