కోదండంలో కోవెల!

శ్రీరామచంద్రుడి జీవితం... మనకు మార్గదర్శకం. మనిషిగా పుట్టి మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసిన ఆ రామయ్య కథను అందరూ తెలుసుకోవాల్సిందే.

Updated : 14 Apr 2024 13:39 IST

శ్రీరామచంద్రుడి జీవితం... మనకు మార్గదర్శకం. మనిషిగా పుట్టి మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసిన ఆ రామయ్య కథను అందరూ తెలుసుకోవాల్సిందే. అందుకే రామతత్వం భావి తరాలకూ అర్థమవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం పట్టణంలో ‘రామనారాయణం శ్రీమద్రామాయణ ప్రాంగణం’ పేరుతో రాముడి గుడిని 2014లో నిర్మించారు. విజయనగరానికి చెందిన భక్తుడు నారాయణం నర్సింహ మూర్తి మొదలుపెట్టిన ఈ ఆలయ పనుల్ని వారసులు పూర్తిచేసి తండ్రి కోరికను తీర్చారు. పట్టణానికి సమీపంలోని కోరుకొండ రహదారిలో పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గుడి రామబాణం ఆకృతిలో కనిపిస్తుంది. ఒక చివర శ్రీరామాలయమూ మరో చివర విష్ణుమూర్తి ఆలయమూ నిర్మించి.. ఆ రెండింటినీ కలుపుతూ కట్టిన కారిడార్‌ లోపల- చూడచక్కని దృశ్యాలతో రామాయణ గాథ కళ్లకు కట్టారు. రామలక్ష్మణభరతశత్రుఘ్నుల జననం మొదలు శ్రీరామపట్టాభిషేకం వరకూ 72 శిల్పాలు దర్శనమిస్తాయి. ఇంకా ఈ ప్రాంగణంలో 60 అడుగుల ఆంజనేయుడి విగ్రహం మీద వేసే లేజర్‌ షో రామాయణం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అమ్మవార్ల విగ్రహాలూ, వాటర్‌ ఫౌంటెన్లు కనులవిందు చేస్తాయి. ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు బారులు తీరతారు. ఆ ముచ్చటైన జంటను చూస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోతారు.

ఫొటోలు: కనకల రాజేష్‌, న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..