చికెన్‌ కూర... ఇలా కూడా!

వేడివేడి అన్నంలోకి చికెన్‌కూర ఉంటే చాలు... ఇంకేం వద్దు అనేస్తుంటారు చికెన్‌ ప్రియులు. అది కూడా ఎప్పటికప్పుడు కొత్త రుచిలోనూ ఉండాలని కోరు కుంటారు కదూ. అలాంటివారి కోసమే ఈ చికెన్‌ వెరైటీలు. చూసేయండి మరి.

Published : 17 Feb 2024 23:45 IST

వేడివేడి అన్నంలోకి చికెన్‌కూర ఉంటే చాలు... ఇంకేం వద్దు అనేస్తుంటారు చికెన్‌ ప్రియులు. అది కూడా ఎప్పటికప్పుడు కొత్త రుచిలోనూ ఉండాలని కోరు కుంటారు కదూ. అలాంటివారి కోసమే ఈ చికెన్‌ వెరైటీలు. చూసేయండి మరి.


పంజాబీ చికెన్‌ అచార్‌

కావలసినవి: చికెన్‌ ముక్కలు: అరకేజీ, ఆవనూనె: రెండు కప్పులు, అల్లం- వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉల్లిపాయముద్ద: పావుకప్పు, కారం: పావుకప్పు, జీలకర్రపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, వినెగర్‌: రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: చెంచా, నిమ్మరసం: చెంచా, కచ్చాపచ్చాగా దంచిన ఎండుమిర్చి పొడి: చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: చికెన్‌ ముక్కలపైన ఎండుమిర్చి పొడి, చెంచా ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక స్టవ్‌ని మీడియంలో పెట్టి చికెన్‌ ముక్కల్ని వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇదే నూనెలో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేయించి ఉల్లిపాయముద్ద వేయాలి. నిమిషమయ్యాక కారం, ఇంకొంచెం ఉప్పు, జీలకర్రపొడి, దనియాలపొడి, చికెన్‌ ముక్కలు వేసి కలపాలి. దింపేముందు గరంమసాలా, వినెగర్‌ వేసి ఓసారి కలిపితే చాలు.


మేథీ ముర్గ్‌ మసాలా

కావలసినవి: మెంతికూర కట్టలు: మూడు, ఎముకల్లేని చికెన్‌ ముక్కలు: కేజీ, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, అల్లం: చిన్న ముక్క, జీలకర్ర: చెంచా, కారం: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, క్రీమ్‌: అరకప్పు, పెరుగు: పావుకప్పు, నూనె: పావుకప్పు, గరంమసాలా: చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్రను వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి తరుగు వేసి మరోసారి వేయించుకోవాలి. తరవాత చికెన్‌ ముక్కలు, టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక స్టవ్‌ని సిమ్‌లో పెట్టి గిలకొట్టిన పెరుగు, మెంతికూర తరుగు వేయాలి. చికెన్‌ పూర్తిగా ఉడికాక క్రీమ్‌ కూడా వేసి బాగా కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు స్టవ్‌ని కట్టేయాలి.


కొబ్బరి-కొత్తిమీర కర్రీ

కావలసినవి: చికెన్‌ ముక్కలు (ఎముకలతో సహా): అరకేజీ, నూనె: పావుకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, టొమాటోలు: రెండు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత.

మసాలాకోసం: మిరియాలు: చెంచా, సోంపు: అరచెంచా, దనియాలు: చెంచా, లవంగాలు: ఆరు, దాల్చినచెక్క: చిన్నముక్క, మెంతులు: నాలుగైదు గింజలు, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, పచ్చిమిర్చి: పది, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: పది, తాజా కొబ్బరితురుము: అరకప్పు, కొత్తిమీర తరుగు: అరకప్పు.

తయారీ విధానం: ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి చెంచా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకుని... కొబ్బరి తురుము వేసి ఓసారి కలిపి విడిగా పెట్టుకోవాలి. అదే కడాయిలో మిగిలిన మసాలా దినుసుల్ని వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ అరకప్పు నీళ్లతో మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, టొమాటో ముక్కలు వేయించుకుని తగినంత ఉప్పు, పసుపు వేయాలి. తరవాత చికెన్‌ ముక్కలు, చేసిపెట్టుకున్న మసాలా వేసి, కప్పు నీళ్లు పోసి మూత పెట్టి కూర దగ్గరకు అవుతున్నప్పుడు దింపేస్తే సరి.


చికెన్‌ గార్లిక్‌ రోస్ట్‌

కావలసినవి: ఎముకల్లేని చికెన్‌: అరకేజీ, పసుపు: అరచెంచా, అల్లంపేస్టు: రెండు చెంచాలు, వెల్లుల్లి పేస్టు: రెండు చెంచాలు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, కరివేపాకు రెబ్బలు: అయిదు, పచ్చిమిర్చి: రెండు.

మసాలాకోసం: దనియాలు: చెంచా, మిరియాలు: చెంచా, జీలకర్ర: అరచెంచా, సోంపు: అరచెంచా, దాల్చినచెక్క: చిన్నముక్క, యాలకులు: మూడు, లవంగాలు: మూడు, కారం: రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు: పదిహేను, నూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత. 

తయారీ విధానం: చికెన్‌ ముక్కలపైన పసుపు, అల్లంపేస్టు, వెల్లుల్లిపేస్టు, నిమ్మరసం వేసి మారినేట్‌ చేసుకుని అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కల్ని వేయించుకుని చికెన్‌ ముక్కలు వేయాలి. చికెన్‌ మెత్తగా అవుతున్నప్పుడు వెల్లుల్లి మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి కూర పొడిపొడిగా అవుతున్నప్పుడు దింపేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..