చిట్టిపొట్టి మిఠాయిలొచ్చాయ్‌!

నాలుగు గులాబ్‌జామున్లు ఒకేసారి నోట్లో వేసుకోగలరా... అరిసెను తుంచకుండా అమాంతం నమిలి మింగేయగలరా... భోజనంతో పాటు ఒకటికి నాలుగు బొబ్బట్లు తింటారా...

Published : 18 Feb 2024 00:14 IST

నాలుగు గులాబ్‌జామున్లు ఒకేసారి నోట్లో వేసుకోగలరా... అరిసెను తుంచకుండా అమాంతం నమిలి మింగేయగలరా... భోజనంతో పాటు ఒకటికి నాలుగు బొబ్బట్లు తింటారా...  ఇదివరకేమో కానీ ఇప్పుడైతే వాటన్నింటికీ ‘యస్‌’ చెప్పేయొచ్చు... ఎందుకంటే ఈ మిఠాయిలన్నీ చిట్టిసైజుల్లో వచ్చేశాయి మరి!

‘మిఠాయి’... ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరిపోతాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇది తాయిలమే. అంతేనా... ఉద్యోగం వచ్చినా, పెళ్లి కుదిరినా, పాపాయి పుట్టినా, ఇల్లు కొన్నా... ఇలా జీవితంలో జరిగే ఆనందకరమైన సందర్భాలన్నింటినీ తీపితోనే పంచుకుంటాం. పండుగలన్నింటినీ స్వీట్లతోనే చేసుకుంటాం. శుభకార్యాలకు సూచిక లాంటిది కాబట్టే అన్ని వేడుకల్లోనూ రకరకాల మిఠాయిల్నీ చేర్చుతాం. కానీ ప్రస్తుతం- ఆరోగ్యపరంగా పాటిస్తున్న డైట్ల వల్లనో, లావు పెరగకూడదనో చాలా వరకూ మిఠాయిల్ని తినడం తగ్గించేస్తున్నారు. ‘అమ్మో అంత తినలేం అంటూ’ అరిసెలు, కజ్జికాయలు, బొబ్బట్ల లాంటి సంప్రదాయ స్వీట్ల జోలికే వెళ్లడం లేదు. ఇంటికొచ్చిన అతిథులు కూడా ఒకటి పూర్తిగా తినలేక, కాస్త తుంచేసి వదిలేయడం ఇష్టం లేక తినాలని అనిపించినా ముట్టుకోరు. మరి వీటన్నింటికీ పరిష్కారమే లేదా అంటే... కచ్చితంగా ఉందంటూ ఈ మినీ స్వీట్లకు రూపమిచ్చారు మిఠాయిల తయారీదారులు. ఇప్పటి వరకూ రుచుల్లోనే బోలెడన్ని వెరైటీల్ని తీసుకొస్తే... ఈమధ్య ఆకారాన్ని మార్చేసి చిట్టి మిఠాయిల్ని తయారుచేస్తున్నారు.

ఎన్ని రకాలో...

కొంతమంది గృహిణులు- పిల్లల కోసమనో, తినడానికి సులువుగా ఉంటుందనో చెక్కలూ బొబ్బట్లూ లాంటి పిండివంటల్ని మామూలు వాటికన్నా చిన్న సైజులో చేస్తుంటారు. సౌకర్యంగా ఉండే ఆ పద్ధతినే పాటిస్తూ ఇప్పుడు అన్ని రకాల మిఠాయిల్నీ మరింత చిన్నగా మినీ స్వీట్లలా మారుస్తున్నారు. నిమ్మకాయంత ఉండే గులాబ్‌జామ్‌ ద్రాక్ష పండు సైజులో, పూరీ అంత ఉండే బొబ్బట్లు, అరిసెలు... రూపాయి నాణెమంత పరిమాణంలో ఉంటాయి. ఇంకా పూతరేకులు, కజ్జికాయలు, కాజాల్లాంటివెన్నో అంగుళం సైజులో వస్తున్నాయి. అంతేనా, చిట్టి పరిమాణాల్లో బటన్‌ బాదుషా, బటన్‌ జాంగ్రీలూ వచ్చాయి. ఈ స్వీట్లే కాదు, చెక్కల్లాంటి కొన్ని పిండివంటలూ రూపాయి బిళ్ళల్లా పది ఇరవై కలిపితే గుప్పెడు నిండేలా దొరుకుతున్నాయి. స్వీట్‌ షాపుల్లోఇలా రెడీమేడ్‌గా అందుబాటులో ఉన్న చిట్టి మిఠాయిలతోపాటు మనకు కావాల్సిన పిండివంటల్నీ నచ్చినట్టు మినీ సైజుల్లో ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించుకోవచ్చు. వీటిని తయారుచేయడం కాస్త శ్రమే కావొచ్చు కానీ మొత్తం ఒక్కసారే నోట్లో పెట్టుకునేలా ఉండే వీటి సైజు వల్ల లాభాలు మాత్రం చాలానే ఉన్నాయి. స్వీట్లు తినాలనిపించినప్పుడు పూర్తిగా నోరు కట్టేసుకోకుండా వీటిని ట్రై చేయొచ్చు. పైగా ఈ చిట్టి మిఠాయితో వృథా అవుతుందన్న ఇబ్బందితో ఎక్కువ తినాల్సిన అవసరమే రాదు. ముఖ్యంగా పిల్లలు కూడా కాస్త తింటూ కాస్త వదిలేస్తూ మిఠాయిని చెత్తబుట్టలో పారేయరు. సౌకర్యంతోపాటూ చూడ్డానికీ ముచ్చటగా కనిపించే ఈ మినియేచర్‌ మిఠాయిలు వేడుకల్లోనూ సరికొత్తగా కనిపిస్తాయి. ‘నో చెప్పకుండా చటుక్కున తినేలా ఉన్న ఈ చిట్టి మిఠాయిల ఐడియా అదిరిపోయిందే’ అంటూ అతిథుల నుంచి ప్రశంసలూ అందిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..