వహ్వా... వడ!

సాయంత్రం కాగానే  స్నాక్స్‌ తినాలనిపించడం సహజమే కదూ. కానీ ఏం చేయాలనేదే పెద్ద సమస్య అనుకునేవారు... ఈ వడల్ని ప్రయత్నిస్తే సరి. అప్పటికప్పుడు చేసుకోగలిగే ఈ వడల్ని వేడివేడిగా తింటుంటే భలే ఉంటాయి సుమండీ...

Published : 25 Feb 2024 00:19 IST

సాయంత్రం కాగానే  స్నాక్స్‌ తినాలనిపించడం సహజమే కదూ. కానీ ఏం చేయాలనేదే పెద్ద సమస్య అనుకునేవారు... ఈ వడల్ని ప్రయత్నిస్తే సరి. అప్పటికప్పుడు చేసుకోగలిగే ఈ వడల్ని వేడివేడిగా తింటుంటే భలే ఉంటాయి సుమండీ...


పప్పులతో...

కావలసినవి: సెనగపప్పు: అరకప్పు, కందిపప్పు: పావుకప్పు, పెసరపప్పు: పావుకప్పు, మినప్పప్పు: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, నెయ్యి: చెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పుదీనా ఆకులు: పావుకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: పప్పుల్ని రెండుగంటలసేపు నానబెట్టుకోవాలి. తరువాత నీటిని పూర్తిగా వంపేసి రెండు చెంచాల పప్పుల్ని విడిగా పెట్టుకుని... మిగిలినవాటిని మిక్సీలో వేసుకుని అల్లంతో కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తరుగుతోపాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలను కలపాలి. చివరగా విడిగా తీసిన పప్పుల్ని కూడా కలిపి వడల్లా తట్టుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే భలే ఉంటాయి.  


బ్రెడ్‌తో...

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: నాలుగు, బియ్యప్పిండి: అరకప్పు, బొంబాయి రవ్వ: పావుకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, పెరుగు: ముప్పావుకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి, జీలకర్ర: అరచెంచా, చాట్‌మసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ముందుగా బ్రెడ్‌స్లైసుల్ని మిక్సీలో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని బాగా కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మరీ పల్చగా లేదా మరీ గట్టిగా కాకుండా పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని ప్లాస్టిక్‌ కవరుమీద వడల్లా అద్దుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటికి టొమాటో కెచప్‌ మంచి కాంబినేషన్‌.


మెంతికూర-మరమరాలతో...

కావలసినవి: మెంతికూర: మూడు కప్పులు, కొత్తిమీర తరుగు: అరకప్పు, మరమరాలు: రెండు కప్పులు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, జీలకర్ర: చెంచా, దనియాలు: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, నువ్వులు: రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, కారం: చెంచా, ఆమ్‌చూర్‌పొడి: చెంచా, సెనగపిండి: కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దనియాలు మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. అలాగే మరమరాలను ఓ గిన్నెలో వేసుకుని అవి మునిగేలా నీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక మరమరాలను గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో సెనగపిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు సెనగపిండి, చెంచా నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక చేతికి నూనె రాసుకుంటూ చిన్నచిన్న వడల్లా అద్దుకుని కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


అరటికాయతో...

కావలసినవి: అరటికాయలు: రెండు, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, అటుకులు: పావుకప్పు, కారం: చెంచా, గరంమసాలా: అరచెంచా, పసుపు: పావుచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.  

తయారీ విధానం: అరటికాయల్ని మధ్యకు కోసి కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్లు పోసి మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. తరువాత వీటి చెక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో- పది నిమిషాలు నానబెట్టుకుని నీళ్లు పిండేసిన అటుకులతోపాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని గట్టి పిండిలా చేసుకోవాలి. తరువాత చిన్నచిన్న ఉండల్లా చేసుకుని... వడల్లా అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే చాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..