రాగిపిండితో... నోరూరించేలా!

వేసవిలో రాగిపిండిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిదని తెలిసినా దాంతో జావ, దోశ, చపాతీ వంటివే చేసుకుని తినాలంటే ఎవరికైనా విసుగే కదూ... అందుకే  ఈసారి ఇలాంటివి చేసేం దుకు ప్రయత్నిస్తే సరి. పిల్లలూ ఇష్టంగా తింటారు.

Updated : 10 Mar 2024 00:20 IST

వేసవిలో రాగిపిండిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిదని తెలిసినా దాంతో జావ, దోశ, చపాతీ వంటివే చేసుకుని తినాలంటే ఎవరికైనా విసుగే కదూ... అందుకే  ఈసారి ఇలాంటివి చేసేం దుకు ప్రయత్నిస్తే సరి. పిల్లలూ ఇష్టంగా తింటారు.


ఉప్మా

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, రాగిపిండి: కప్పు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, సెనగపప్పు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, ఉల్లిపాయముక్కలు: అర కప్పు, పచ్చిమిర్చి: రెండు, క్యారెట్‌: ఒకటి, టొమాటో: ఒకటి, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, తాజా కొబ్బరితురుము: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, జీడిపప్పు వేయించుకుని కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయముక్కలు, క్యారెట్‌ తురుము, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. టొమాటో ముక్కలు మెత్తగా అవుతున్నప్పుడు రవ్వను వేసి దోరగా వేయించాలి. నిమిషమయ్యాక రాగిపిండిని కూడా వేసి వేయించి నాలుగున్నర కప్పుల వేడినీళ్లు, తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. రవ్వ ఉడికి ఉప్మా  దగ్గరకు అవుతున్నప్పుడు నెయ్యి, కొబ్బరి తురుమును వేసి కలిపి దింపేయాలి.


గుంట పొంగనాలు

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, రాగిపిండి: అరకప్పు, ఓట్స్‌: అరకప్పు, పెరుగు: ఒకటిన్నరకప్పు, వంటసోడా: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: చెంచా, మినప్పప్పు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర తరుగు: చెంచా, ఉల్లిపాయముక్కలు: కప్పు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, అల్లం తరుగు: చెంచా.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి ఓట్స్‌ను దోరగా వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పెరుగు, వంటసోడా, రాగిపిండి,  బొంబాయిరవ్వ, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లంతరుగు, సన్నగా కోసిన కరివేపాకు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి చెంచా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయించుకుని పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌మీద గుంటపొంగనాల పాన్‌ను పెట్టి కొద్దిగా నూనె రాసి ఈ పిండిని సగం వరకూ వేసి మూత పెట్టి... రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకుంటే చాలు.  కొబ్బరిచట్నీతో తింటే ఇవి భలే ఉంటాయి.


వెజిటబుల్‌ రాగి జావ

కావలసినవి: రాగిపిండి: అరకప్పు, నీళ్లు: అయిదుకప్పులు, నూనె: రెండు చెంచాలు, దాల్చినచెక్క: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: అయిదు, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, క్యారెట్‌ ముక్కలు: అరకప్పు, బీన్స్‌: అయిదు (సన్నగా తరగాలి), పచ్చిబఠాణీ: పావుకప్పు, స్వీట్‌కార్న్‌: రెండు టేబుల్‌స్పూన్లు, క్యాబేజీ తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: అరచెంచా, నిమ్మరసం: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లికాడల తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.  

తయారీ విధానం: రాగిపిండిలో కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి... నూనె వేసి దాల్చినచెక్క, వెల్లుల్లి తరుగు, సన్నగా కోసిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత కూరగాయ ముక్కలన్నీ వేసి వేయించుకుని మిగిలిన నీళ్లు, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేయాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేసి మరోసారి కలపాలి. ఇది ఉడుకుతున్నప్పుడు నిమ్మరసం, ఉల్లికాడల తరుగు వేసి దింపేస్తే సరి.


ఊతప్పం

కావలసినవి: రాగులు: కప్పు, మినప్పప్పు: పావుకప్పు, మెంతులు: అరచెంచా, అన్నం: రెండ[ు టేబుల్‌స్పూన్లు, క్యాప్సికం: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.

తయారీ విధానం: రాగులు, మినప్పప్పు, మెంతుల్ని ముందురోజు నానబెట్టుకోవాలి. మర్నాడు అన్నింటినీ శుభ్రంగా కడిగి... అన్నంతో కలిపి మెత్తగా దోశపిండి మాదిరి రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి. అరగంటయ్యాక స్టవ్‌మీద పెనం పెట్టి.. ఈ పిండిని ఊతప్పం మాదిరి మందంగా వేసి పైన సన్నగా తరిగిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర చల్లి... చుట్టూ నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..