మామిడితో మజా రుచులు!

మామిడికాయలు ఇప్పుడిప్పుడే మార్కెట్లో కనిపిస్తున్నాయి కాబట్టి... వాటితో పప్పు, ఇన్‌స్టంట్‌ పచ్చళ్లు అంటూ రకరకాలు చేసేస్తాం కదూ. ఈసారి ఆ వంటకాలతోపాటు వీటినీ ట్రై చేసి చూడండి మరి.

Updated : 30 Mar 2024 23:13 IST

మామిడికాయలు ఇప్పుడిప్పుడే మార్కెట్లో కనిపిస్తున్నాయి కాబట్టి... వాటితో పప్పు, ఇన్‌స్టంట్‌ పచ్చళ్లు అంటూ రకరకాలు చేసేస్తాం కదూ. ఈసారి ఆ వంటకాలతోపాటు వీటినీ ట్రై చేసి చూడండి మరి.


పచ్చిపులుసు

కావలసినవి: మామిడికాయ: ఒకటి, పచ్చిమిర్చి: మూడు, మెంతులు: పావుచెంచా, దనియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, నువ్వులు: అరచెంచా, ఎండుమిర్చి: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా, నూనె: టేబుల్‌స్పూను, ఆవాలు: అరచెంచా, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, కరివేపాకు రెబ్బలు: రెండు.  
తయారీ విధానం: ముందుగా మామిడికాయను, పచ్చిమిర్చిని విడివిడిగా నిప్పులమీద కాల్చుకుని పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి మెంతులు, దనియాలు, సగం చెంచా జీలకర్ర, నువ్వులు, రెండు ఎండుమిర్చి వేసి వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకుని పెట్టుకోవాలి. అదే మిక్సీలో చెక్కుతీసిన మామిడికాయముక్కలు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో చేసుకున్న నువ్వులపొడి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు వేసుకుని కప్పు నీళ్లు కలపాలి. చివరగా
స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి మిగిలిన ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకుని పులుసులో కలిపితే చాలు.


మసాలా కూర

కావలసినవి: పచ్చిమామిడికాయ పెద్దది: ఒకటి, తాజా కొబ్బరితురుము: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, జీలకర్రపొడి: చెంచా, దనియాలపొడి: చెంచా, కారం: చెంచా, పసుపు: చెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, మెంతులు: పావుచెంచా, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బలు: రెండు, చిక్కని కొబ్బరిపాలు: కప్పు, బెల్లం తరుగు: చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: మామిడికాయ చెక్కు తీసి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. కొబ్బరితురుము, పచ్చిమిర్చి, జీలకర్రపొడి, దనియాలపొడి, కారం, పసుపు, తగినంత ఉప్పు మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకుని ఈ మిశ్రమాన్ని మామిడిముక్కలపైన వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఇరవై నిమిషాలయ్యాక స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకును వేయించి... మామిడి ముక్కలు వేసి మరోసారి వేయించాలి. ఇందులో కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. మామిడి ముక్కలు మెత్తగా అయ్యాక అవసరాన్ని బట్టి మరికొంచెం ఉప్పు, బెల్లం తరుగు వేసి... కొబ్బరిపాలు పోసి ఓసారి కలిపి స్టవ్‌ని కట్టేయాలి.


మ్యాంగో స్వీట్‌ చట్నీ

కావలసినవి: పచ్చిమామిడికాయలు: నాలుగు, నూనె: అరకప్పు, జీలకర్ర: చెంచా, కలోంజీ గింజలు: చెంచా, లవంగాలు: మూడు, వెల్లుల్లి రెబ్బలు: అయిదు, యాలకులు: మూడు, అల్లం తరుగు: చెంచా, ఎండుమిర్చి గింజలు: చెంచా, కారం: అరకప్పు, పసుపు: అరచెంచా, బెల్లం తరుగు: కప్పు, ఎండుమిర్చి: రెండు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, యాలకులు, లవంగాలు వేయించుకుని కలోంజీ గింజలు వేయాలి. తరువాత ఇందులో అల్లం తరుగు, వెల్లుల్లి, మామిడి ముక్కలు, ఎండుమిర్చి గింజలు, కారం, పసుపు, బెల్లం, తగినంత ఉప్పు వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. బెల్లం కరిగి మామిడి ముక్కలు ఉడికి చట్నీ దగ్గరకు అయ్యాక దింపేయాలి. టిఫిన్లు, అన్నం.. దేనికైనా బాగుంటుందీ చట్నీ.


పెసరపప్పు మామిడికాయ పచ్చడి

కావలసినవి: పెసరపప్పు: అరకప్పు, మామిడికాయ: ఒకటి, ఎండుమిర్చి: పది, ఉప్పు: తగినంత, జీలకర్ర: చెంచా, ఆవాలు: చెంచా, నూనె: టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు: మూడు.

తయారీ విధానం: ముందుగా పెసరపప్పు, ఎనిమిది ఎండుమిర్చిని కలిపి నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు పూర్తిగా వంపేసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో చెక్కుతీసిన మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని ఈ తాలింపును పచ్చడిపైన వేసి కలిపితే చాలు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకుని తింటే భలే ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు