ఉగాది విందు... ఊరించేలా!

తెలుగు సంవత్సరాదిని షడ్రుచుల పచ్చడితో స్వాగతించేవేళ... చేసే ఇతర వంటకాలూ కాస్త ప్రత్యేకంగా ఉంటేనే ఉగాది విందుకు నిండుదనం కదూ. ఆలస్యమెందుకు వీటినీ చూసేయండి మరి.

Updated : 07 Apr 2024 06:57 IST

తెలుగు సంవత్సరాదిని షడ్రుచుల పచ్చడితో స్వాగతించేవేళ... చేసే ఇతర వంటకాలూ కాస్త ప్రత్యేకంగా ఉంటేనే ఉగాది విందుకు నిండుదనం కదూ. ఆలస్యమెందుకు వీటినీ చూసేయండి మరి.


మామిడికాయ చిత్రాన్నం

కావలసినవి: పొడిపొడిగా వండిన అన్నం: రెండుకప్పులు, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు, తాజా కొబ్బరి తురుము: అరకప్పు, మామిడికాయ ముక్కలు: కప్పు, ఎండుమిర్చి: మూడు, పచ్చిమిర్చి: మూడు, నువ్వులు: చెంచా, పల్లీలు: అయిదు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, ఇంగువ: చిటికెడు, పసుపు: పావుచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు.

తయారీ విధానం: ముందుగా స్టవ్‌మీద కడాయిని పెట్టి... నువ్వులు, రెండు టేబుల్‌స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, రెండు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేయించిన నువ్వులు, పల్లీలు, కొబ్బరితురుము వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి.. మిగిలిన పల్లీలు, ఎండుమిర్చి, ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, చేసిపెట్టుకున్న మామిడికాయ మిశ్రమం, తగినంత ఉప్పు, పసుపు వేసుకుని మరోసారి వేయించి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంపైన వేసి అన్నింటినీ కలిపితే చాలు.  


హల్వా బొబ్బట్లు

కావలసినవి: మైదా: కప్పు, బొంబాయిరవ్వ: పావుకప్పు, ఉప్పు: చిటికెడు, నూనె: పావుకప్పు.

పూర్ణం కోసం: బొంబాయిరవ్వ: కప్పు, కొబ్బరి తురుము: అరకప్పు, నీళ్లు: ఒకటింబావు కప్పు, పాలు: ఒకటింబావుకప్పు, చక్కెర: ఒకటిన్నరకప్పు, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, నెయ్యి: కప్పు.

తయారీ విధానం: ముందుగా మైదా, బొంబాయిరవ్వ, ఉప్పు వేసుకుని నీళ్లతో కాస్త పల్చని పిండిలా కలపాలి. దీనిపైన నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి... చెంచా నెయ్యిని వేసి రవ్వను దోరగా వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రవ్వలోనే కొబ్బరితురుమును కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద ఓ గిన్నెను పెట్టి పాలు, నీళ్లు పోయాలి. ఇవి మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి, రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రవ్వ ఉడికాక చక్కెరను కలపాలి. చక్కెర కరిగి హల్వా దగ్గరపడుతున్నప్పుడు రెండు చెంచాల నెయ్యి వేసి దింపేసి చల్లారనిచ్చి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉండే ప్లాస్టిక్‌ కవరుమీద కొద్దిగా మైదా మిశ్రమాన్ని ఉంచి.. వెడల్పుగా చేసుకుని అందులో హల్వాను ఉంచి అంచుల్ని మూసేయాలి. దీన్ని ఇంకాస్త వెడల్పుగా బొబ్బట్టు మాదిరి చేసుకుని వేడిపెనంపైన వేయాలి. కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చుకుని తీసుకుంటే చాలు.


క్యాబేజీ మసాలావడ

కావలసినవి: సెనగపప్పు: కప్పు, కందిపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, సన్నగా తరిగిన క్యాబేజీ: కప్పు, ఎండుమిర్చి: మూడు, అల్లం: చిన్నముక్క, పుదీనా ఆకులు: అర కప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: సెనగపప్పు, కందిపప్పు, ఎండుమిర్చిని రెండు గంటలముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీటిని పూర్తిగా వంపేసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో కడిగిన పుదీనా ఆకులు, అల్లం, కరివేపాకు వేసుకుని బరకగా గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో క్యాబేజీ తరుగు, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు కలిపి చిన్నచిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే చాలు.


పైనాపిల్‌ ఖీర్‌

కావలసినవి: పైనాపిల్‌ ముక్కలు: కప్పు, కొబ్బరి తురుము: పావుకప్పు, నీళ్లు: అరకప్పు, బెల్లం: కప్పు, యాలకులపొడి: అరచెంచా, చిక్కని కొబ్బరిపాలు: కప్పు, జీడిపప్పు పలుకులు: కొన్ని, కిస్‌మిస్‌: కొన్ని, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నీళ్లు పోసి బెల్లం వేయాలి. బెల్లం కరిగాక దింపేసి వడకట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద మరో కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నెయ్యివేయాలి. అది వేడెక్కాక పైనాపిల్‌ ముక్కలు, కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాలు వేయించి బెల్లం పాకం పోయాలి. పైనాపిల్‌ ముక్కలు మెత్తగా అవుతున్నప్పుడు చిక్కని కొబ్బరిపాలు, యాలకులపొడి వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. చివరగా మిగిలిననెయ్యిలో జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించి పాయసంలో కలపాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..