చల్లగా... హాయిగా!

వేసవిలో పెరుగును ఎక్కువగా తినడంతోపాటూ... దాంతో మజ్జిగ చారు, పెరుగు పచ్చడి అంటూ చేయడం మామూలే. మరి ఆ పెరుగు వంటకాలనే ఈ రుచుల్లోనూ వండి చూడండి. కాస్త మార్పుగా ఉంటుంది. పిల్లలూ ఇష్టంగా తినేస్తారు.

Published : 28 Apr 2024 00:10 IST

వేసవిలో పెరుగును ఎక్కువగా తినడంతోపాటూ... దాంతో మజ్జిగ చారు, పెరుగు పచ్చడి అంటూ చేయడం మామూలే. మరి ఆ పెరుగు వంటకాలనే ఈ రుచుల్లోనూ వండి చూడండి. కాస్త మార్పుగా ఉంటుంది. పిల్లలూ ఇష్టంగా తినేస్తారు.


మూంగ్‌దాల్‌ కడీ

కావలసినవి: పెసరపప్పు: కప్పు, పెరుగు: రెండున్నర కప్పులు, నూనె: వేయించేందుకు సరిపడా, పసుపు: చెంచా, కారం: చెంచా, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, మెంతులు: పావుచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, ఎండుమిర్చి: రెండు.  

తయారీ విధానం: పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకుని ఆ తరువాత నీటిని పూర్తిగా వంపేసి మిక్సీలో మెత్తగా చేసుకుని ఇందులోంచి పావుకప్పు పేస్టును విడిగా తీసి పెట్టుకోవాలి. మిగిలిన పిండిలో తగినంత ఉప్పు కలిపి కాగుతున్న నూనెలో చిన్నచిన్న పకోడీల్లా వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని గిలకొట్టిన పెరుగులో కలిపి కప్పు నీళ్లు పోయాలి. ఇందులో పసుపు, కారం, తగినంత ఉప్పు కలపాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి రెండు చెంచాల నూనె వేసి... ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుని మజ్జిగ వేయాలి. ఇది మరుగుతున్నప్పుడు చేసిపెట్టుకున్న పెసర పకోడీలు వేసి... మరోసారి మరగనిచ్చి దింపేయాలి.


బెండకాయ పెరుగు పచ్చడి

కావలసినవి: బెండకాయలు: పదిహేను, తాజా పెరుగు: రెండు కప్పులు, కొబ్బరితురుము: పావుకప్పు, పచ్చిమిర్చి: మూడు, జీలకర్ర: చెంచా, ఆవాలు: అరచెంచా, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: నాలుగు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: ముందుగా కొబ్బరితురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పును మిక్సీలో వేసుకుని కాసిని నీళ్లతో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలుపుకోవాలి. బెండకాయల్ని కడిగి తుడిచి చిన్నచిన్న ముక్కల్లా కోయాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి బెండకాయల్ని కరకరలాడేలా వేయించుకుని స్టవ్‌ని కట్టేయాలి. ఇందులో పెరుగు మిశ్రమం వేసి కలిపితే సరిపోతుంది. చివరగా మిగిలిన నూనెను కడాయిలో వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుని పెరుగులో వేస్తే సరిపోతుంది.


పాలక్‌ రైతా

కావలసినవి: పాలకూర తరుగు: ఒకటిన్నర కప్పు, పెరుగు: పెద్ద కప్పు, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి తరుగు: పెద్ద చెంచా, నూనె: రెండు చెంచాలు, జీలకర్రపొడి: చెంచా, వేయించిన నువ్వులు: అరచెంచా, ఎండుమిర్చి గింజలు: పావుచెంచా, పసుపు: పావు చెంచా.  

తయారీ విధానం: పాలకూరను కడిగి నీళ్లల్లో అయిదు నిమిషాలు ఉడికించుకుని ఆ తరువాత విడిగా తీసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి... నూనె వేసి వెల్లుల్లి తరుగు, సన్నగా కోసిన పచ్చిమిర్చి, ఉడికించిన పాలకూర వేసి వేయించి... రెండు నిమిషాలయ్యాక పసుపు, జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసి పాలకూర బాగా వేగాక స్టవ్‌ని కట్టేయాలి. వేడి కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలిపి నువ్వులు, ఎండుమిర్చి గింజలు చల్లితే సరిపోతుంది.


మసాలా మెంతి మజ్జిగ

కావలసినవి: పెరుగు: రెండు కప్పులు, బియ్యప్పిండి: పెద్ద చెంచా, ఉప్పు: తగినంత, దనియాలు: రెండు టేబుల్‌స్పూన్లు, కందిపప్పు: టేబుల్‌స్పూను, మెంతులు: చెంచా, ఎండుమిర్చి: నాలుగైదు, నూనె: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, ఆవాలు: అరచెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు.

తయారీ విధానం: పెరుగును గిలకొట్టి కప్పు నీళ్లు కలపాలి. బియ్యప్పిండిలో రెండు టేబుల్‌స్పూన్ల నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని పెరుగులో వేయాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి దనియాలు, కందిపప్పు, మెంతులు, మూడు ఎండుమిర్చిని నూనె లేకుండా వేయించుకుని వేడి చల్లారాక మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులోంచి రెండు టేబుల్‌స్పూన్ల పొడిని గిలకొట్టిన పెరుగులో కలిపి స్టవ్‌మీద పెట్టి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. అదే స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి మిగిలిన ఎండుమిర్చి, ఆవాలు వేయాలి. అవి వేగాక... ఉల్లిపాయుక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించి మజ్జిగలో కలపాలి. చివరగా పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలిపితే సరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..