బ్రెడ్‌తో భలే స్నాక్స్‌!

పిల్లలు ఇంట్లో ఉండే ఈ సెలవుల్లో సాయంత్రం పూట ఏవో ఒక స్నాక్స్‌ అడగడం మామూలే. అవి కూడా వెరైటీగా ఉండాలంటూ డిమాండు చేస్తారు.

Published : 25 May 2024 23:51 IST

పిల్లలు ఇంట్లో ఉండే ఈ సెలవుల్లో సాయంత్రం పూట ఏవో ఒక స్నాక్స్‌ అడగడం మామూలే. అవి కూడా వెరైటీగా ఉండాలంటూ డిమాండు చేస్తారు. అలాంటి చిన్నారులకు బ్రెడ్‌తో ఈ స్నాక్స్‌ను చేసిపెట్టి చూడండి. మళ్లీమళ్లీ కావాలని అడగడం ఖాయం.


శాండ్‌విచ్‌

కావలసినవి: గుడ్లు: మూడు, బ్రెడ్‌స్లైసులు: ఎనిమిది, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, నూనె: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరచెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు: అరచెంచా, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, గరంమసాలా: అరచెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, మయొనైజ్‌: నాలుగు చెంచాలు, వెన్న: పావుకప్పు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్రను వేయించి ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగుతున్నప్పుడు... అల్లంవెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేయించాలి. తరువాత పసుపు, కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అవి కాస్త మగ్గాక గుడ్ల సొనను వేసి కలుపుతూ ఉండి బుర్జీలా తయారయ్యాక దింపేయాలి. ఇప్పుడు నాలుగు బ్రెడ్‌స్లైసులకు ఓ వైపు వెన్న రాయాలి. మరో నాలుగింటిపైన మయొనైజ్‌ను రాయాలి. వెన్న రాసిన స్లైసులపైన ఎగ్‌బుర్జీ మిశ్రమాన్ని పరిచి పైన మయొనైజ్‌ రాసిన స్లైసును ఉంచాలి. వీటిని శాండ్‌విచ్‌ మేకర్‌లో ఉంచి గ్రిల్‌ చేసుకుని తీసుకోవాలి. 


వడ

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: నాలుగు, బియ్యప్పిండి: పావుకప్పు, బొంబాయిరవ్వ: మూడు టేబుల్‌స్పూన్లు, పెరుగు: కప్పు, క్యారెట్‌ తురుము: అరకప్పు, ఉల్లిపాయ తరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంపేస్టు: పావుచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు,
కొత్తిమీర: కట్ట, మిరియాలపొడి: పావుచెంచా, జీలకర్ర: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: బ్రెడ్‌స్లైసుల్ని ముక్కల్లా చేసి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, బొంబాయిరవ్వ, పెరుగు వేసుకుని బాగా కలపాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మరోసారి కలిపి.. అవసరం అనుకుంటే చాలా కొద్దిగా నీళ్లు చల్లి ముద్దలా చేసుకుని మూత పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక కొద్దిగా తీసుకుని వడలా అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన మిశ్రమాన్ని చేసుకోవాలి. ఈ వడలకు టొమాటోసాస్‌ మంచి కాంబినేషన్‌. 


బోండా

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: పన్నెండు, బంగాళాదుంపలు: మూడు, బఠాణీ: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: చెంచా, కారం: చెంచా, గరంమసాలా: అరచెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: బంగాళాదుంపల్నీ, బఠాణీలనూ కలిపి ఉడికించుకుని ఆ తరువాత ముద్దలా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. అవి వేగాక ఆలూ మిశ్రమం, కారం, గరంమసాలా, పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌స్లైసుల అంచుల్ని తీసేసి ఒకసారి నీటిలో ముంచి తీసి  బంగాళాదుంప ఉండను ఉంచి... గుండ్రంగా వచ్చేలా చేసుకోవాలి. వీటిని రెండుమూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే చాలు.  


చిల్లీ బ్రెడ్‌

కావలసినవి: బ్రెడ్‌ స్లైసులు: అయిదు, నూనె: పావుకప్పు, ఎండుమిర్చి: పది, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, అల్లం తరుగు: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: అరచెంచా, వినెగర్‌: చెంచా, సోయాసాస్‌: రెండు చెంచాలు, టొమాటో కెచప్‌: రెండు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను (నీళ్లతో పేస్టులా చేసుకోవాలి), ఉల్లికాడల తరుగు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: ఓ గిన్నెలో ఎండుమిర్చిని వేసి అవి మునిగేలా నీళ్లు పోసి... స్టవ్‌మీద పెట్టి పావుగంటయ్యాక దింపేయాలి. నీటిని పూర్తిగా వంపేసి మిక్సీలో మెత్తగా చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా బ్రెడ్‌స్లైసుల అంచుల్ని తీసేసి ఒక్కోదాన్ని నాలుగుముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేసి బ్రెడ్‌ముక్కల్ని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయముక్కలు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికం, ఉల్లికాడల తరుగు, తగినంత ఉప్పు, మిరియాలపొడి, వినెగర్‌, సోయాసాస్‌, చేసిపెట్టుకున్న ఎండుమిర్చి పేస్టు టేబుల్‌స్పూను, టొమాటో కెచప్‌, అరకప్పు నీళ్లు, మొక్కజొన్న పిండి మిశ్రమం వేసి అన్నింటినీ కలపాలి. చివరగా బ్రెడ్‌ముక్కల్ని కూడా వేసి వాటికి మసాలా పట్టేవరకూ కలిపి దింపేముందు కొత్తిమీర చల్లాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..