లంచ్‌ బాక్సులోకి పిల్లలు కోరినట్లుగా!

దాదాపు రెండునెలలు సెలవుల పేరుతో ఇంట్లో ఉన్న పిల్లల్ని మళ్లీ స్కూళ్లకు పంపించే క్రమంలో తల్లులకు ఎదురయ్యే పెద్ద సవాలు బాక్సుల్లో ఏం పెట్టాలీ అనేదే.

Published : 08 Jun 2024 23:55 IST

దాదాపు రెండునెలలు సెలవుల పేరుతో ఇంట్లో ఉన్న పిల్లల్ని మళ్లీ స్కూళ్లకు పంపించే క్రమంలో తల్లులకు ఎదురయ్యే పెద్ద సవాలు బాక్సుల్లో ఏం పెట్టాలీ అనేదే. ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ... బోర్‌ అంటూ పేచీ పెట్టే వాళ్లచేత బాక్సులు ఖాళీ చేయించాలంటే కాస్త వెరైటీలే వండాలి గనుక అప్పుడప్పుడూ ఇలాంటివి ట్రై చేసి చూస్తే సరి.


పొటాటో పాన్‌కేక్‌

కావలసినవి: బంగాళాదుంపలు: మూడు పెద్దవి, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, మిరియాలపొడి: అరచెంచా, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: కప్పు.

తయారీ విధానం: బంగాళాదుంపల చెక్కు తీసి తురుముకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఈ తురుము మునిగేలా చన్నీళ్లు పోసి.. అయిదు నిమిషాలయ్యాక గట్టిగా పిండి విడిగా మరో గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. స్టవ్‌మీద పెనంపెట్టి ఈ మిశ్రమాన్ని ఓ పెద్ద చెంచా వేసి కాస్త వెడల్పుగా చేసుకుని నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకుంటే నోరూరించే పొటాటో పాన్‌కేక్స్‌ రెడీ.


మాకరోనీ

కావలసినవి: మాకరోనీ: కప్పు (ఉడికించుకుని పెట్టుకోవాలి), నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: అరచెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, అల్లం తరుగు: అరచెంచా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, క్యారెట్‌: చిన్నది, బీన్స్‌: నాలుగైదు, టొమాటోలు: రెండు (పేస్టులా చేసుకోవాలి), ఉప్పు: తగినంత, కారం: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, చాట్‌మసాలా: అరచెంచా, మిరియాలపొడి: అరచెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఇప్పుడు మిగిలిన కూరగాయముక్కలు, తగినంత ఉప్పు, కారం, గరం
మసాలా, చాట్‌మసాలా వేసుకుని మరోసారి వేయించి... టొమాటో పేస్టు కలపాలి. అయిదు నిమిషాలయ్యాక ఉడికించిపెట్టుకున్న పాస్తా, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి అన్నింటినీ కలిపి దింపేస్తే పాస్తా సిద్ధం.


చపాతీ శాండ్‌విచ్‌

కావలసినవి: చపాతీలు: రెండు, ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, క్యారెట్‌ తరుగు: పావుకప్పు, క్యాప్సికం తరుగు: పావుకప్పు, ఉల్లి పాయముక్కలు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు, కారం: అరచెంచా, మిరియాలపొడి: అరచెంచా, చాట్‌మసాలా: పావుచెంచా, ఉప్పు: తగినంత, చీజ్‌ తురుము: పావుకప్పు, వెన్న: పావుకప్పు, టొమాటోసాస్‌: రెండు పెద్ద చెంచాలు.

తయారీ విధానం: ఓ గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపల తురుము వేసుకోవాలి. దీనిపైన క్యారెట్‌ తరుగు, క్యాప్సికం తరుగు, ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర తరుగు, కారం, మిరియాలపొడి, చాట్‌మసాలా, తగినంత ఉప్పు వేసుకుని  కలపాలి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని దానిపైన సగం వరకూ బంగాళాదుంప మిశ్రమాన్ని కాస్త మందంగా పరిచి కొద్దిగా చీజ్‌తరుమును వేయాలి. మిగిలిన భాగంపైన టొమాటోసాస్‌ రాసి చపాతీని మధ్యకు మడవాలి. ఇప్పుడు దీన్ని వేడి పెనంపైన ఉంచి.. వెన్నతో రెండువైపులా కాల్చుకుని తీసుకుని ఆ తరువాత ముక్కల్లా కోయాలి. ఇదేవిధంగా మిగిలిన చపాతీని చేసుకోవాలి.


మసాలా వెజిటబుల్‌ కిచిడీ

కావలసినవి: బియ్యం: అరకప్పు, పెసరపప్పు: అరకప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, బిర్యానీఆకు: ఒకటి, యాలకులు: రెండు, దాల్చినచెక్క: చిన్నముక్క, లవంగాలు: మూడు, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, బఠాణీ: అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా, టొమాటో: ఒకటి, క్యారెట్‌ ముక్కలు: పావుకప్పు, పసుపు: పావుచెంచా, కారం: అరచెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కుక్కర్‌ను పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బిర్యానీఆకు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర వేయించుకుని ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, బఠాణీ, టొమాటో తరుగు వేసి మరోసారి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక పసుపు, కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు, కడిగిన బియ్యం, పెసరపప్పు కూడా వేసి వేయించి మూడున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక స్టవ్‌ని కట్టేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..