సమీక్ష

ఇటీవలికాలంలో ఒక ఆత్మకథ పలుభాషల్లోకి అనువాదమవడం బహుశా ఈ పుస్తకం విషయంలోనే జరిగివుంటుంది. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పేరుతో లాభాపేక్షలేని ప్రచురణ సంస్థను నిర్వహిస్తున్న గీతా రామస్వామి ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని రైతుకూలీల సంఘంతో కలిసి పనిచేసినప్పటి అనుభవాల సారం ఈ పుస్తకం.

Updated : 18 Feb 2024 05:29 IST

ప్రజాజీవితంలో పోరాటాల ఆత్మకథ

ఇటీవలికాలంలో ఒక ఆత్మకథ పలుభాషల్లోకి అనువాదమవడం బహుశా ఈ పుస్తకం విషయంలోనే జరిగివుంటుంది. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పేరుతో లాభాపేక్షలేని ప్రచురణ సంస్థను నిర్వహిస్తున్న గీతా రామస్వామి ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని రైతుకూలీల సంఘంతో కలిసి పనిచేసినప్పటి అనుభవాల సారం ఈ పుస్తకం. కేరళ మూలాలున్న తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నవయసు నుంచే తిరుగుబాటు ధోరణి ప్రదర్శించారు. 1970వ దశకంలోనే నక్సలైట్‌ ఉద్యమం వైపు మొగ్గారు. 1984లో మొదటిసారి ఇబ్రహీంపట్నం వెళ్లిన ఈ బ్రాహ్మణ మహిళ అక్కడ మాదిగలతో కలిసి ఎలా జీవించగలిగారూ, నాటి గడీల దాష్టీకాలు ఎలా ఉండేవీ, భర్త సిరిల్‌ రెడ్డి సహకారంతో సంఘంతో కలిసి ఎటువంటి పోరాటాలు చేశారూ, ఆ పోరాటాలకు ఎవరు అండగా నిలిచారూ... లాంటి విషయాలన్నీ చదువుతుంటే పాఠకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది.

పద్మ

అడుగడుగున తిరుగుబాటు;
రచన: గీతా రామస్వామి
అనువాదం: ప్రభాకర్‌ మందార;
పేజీలు: 459; వెల: రూ.499/-
ప్రతులకు: హెచ్‌బీటీ ఫోన్‌- 9381559238  


కవిత్వం లాంటి వ్యాసాలు

‘వాన తర్వాత వాన. నేలంతా మెత్తబడి అప్పుడే పుట్టి పైకిలేచే పసి ఆకులకు మృదువుగా దారి యిస్తుంది. ఎన్నాళ్లుగానో ఊపిరి పోసుకోవడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలు కళ్లు నులుముకుని లోకాన్ని చూస్తాయి. వర్షఋతువు మొదలవుతూనే భూమిపొర అంతా నిండు గర్భిణిగా మారుతుందేమో!’ - అడవిలో స్మగ్లర్లతో పోరాడటానికి నిత్యం సిద్ధంగా ఉండే అటవీ శాఖాధికారి నుంచి ఇటువంటి భావుకతని ఊహించగలమా! ఇలాంటి కవితాత్మక వాక్యాలూ, దృశ్యాలూ, భావోద్వేగాలూ ప్రతి పేజీలోనూ పలకరిస్తూ ఉంటాయీ పుస్తకంలో. వ్యాసాలనే కథలంత చక్కగా అందించిన పుస్తకం ఇది! అడవిని ఆధారంగా చేసుకుని రచయిత్రి చెప్పేది పర్యావరణ ప్రేమ గురించే అయినా- అందులో చరిత్ర, ఆంత్రపాలజీ, ఆంగ్ల, తెలుగు సాహిత్యాలకు సంబంధించిన ఎన్నో అంశాలు
అలవోకగా దొర్లుతాయి. ఆసక్తిగా చదివిస్తాయి.

అంకిత

ధరణీరుహ;
రచన: దేవనపల్లి వీణావాణి
పేజీలు: 168; వెల: రూ.250/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు    


వైవిధ్య కథనం

చిన్నాపెద్దా కలిసి ఈ పుస్తకంలోని పాతిక కథలూ శైలిపరంగానూ వస్తుపరంగానూ వైవిధ్యంగా ఉంటాయి. తన పెళ్లికి తానే పూనుకున్న ఆమె మ్యారేజ్‌బ్యూరోలో ఉద్యోగానికి కుదురుకుని
ఒకరితో పరిచయం పెంచుకుంది. ఫొటోలు చూసుకున్నారు. చెప్పకుండా వెళ్లి అతడిని ఆశ్చర్యపరచాలనుకున్న ఆమెకు ఎలాంటి అనుభవం ఎదురైందో చెప్పే కథ ‘పూలకు కాళ్లొస్తే’. ఒక వయసుడిగిన ఒంటరి పురుషుడి ‘చివరిపేజీలు’ ఊహకందనివేం కాదు కానీ ఆసక్తిగా చదివిస్తాయి. కథ రాసి ఇంట్లోవాళ్లను సన్నద్ధం చేసి ఆ కథలో హీరోయిన్‌ తానైపోయిన రచయిత్రి కథ ‘ది రైటర్‌’. ‘ప్రియదర్శిని పార్క్‌’ నేపథ్యంలో సాగే మూడు జంటల ప్రేమకథ, ‘వినాశాయచ దుష్కృతాం’ రెండూ పెద్ద కథలు. కథకులే కథలో పాత్రలై కథనాన్ని నడిపించడం పలు కథల్లో కనిపిస్తుంది. కథలన్నీ చదివిస్తాయి.

సుశీల

చిన్నా పెద్దా కహానీలు;
రచన: డా.జి.సురేష్‌బాబు
పేజీలు: 436; వెల: రూ.500/-
ప్రతులకు: ఫోన్‌- 7382310257  


మంచి పుస్తకాల పరిచయం

పుస్తకాలు చదవాలనుకునేవారికి ఏది మంచి పుస్తకమో తెలిసేదెలా? ఎవరైనా ఆ పుస్తకం గురించి నాలుగుమాటలు చెబితే ఎంచుకోవడం తేలిక కదూ. ఈ రచయిత ఆ పనే చేశారు.
123 తెలుగు పుస్తకాలపై తాను రాసిన సమీక్షలను పుస్తకంగా ప్రచురించి ఏ పుస్తకాన్ని ఎందుకు చదవాలో సూచించారు. కథో కవితో రాయాలనుకునే ప్రతి ఒక్కరూ ముద్దుకృష్ణ సంకలనం చేసిన ‘వైతాళికులు’ తప్పనిసరిగా చదవాలంటారు. తెలుగు పదాలతో శివతాండవం ఆడించిన పుట్టపర్తి ‘అగ్నివీణ’, సరోజినీనాయుడు కవితల్ని తెనిగించి సినారె అందించిన ‘ముత్యాల కోకిల’, కాలానికి సంకెళ్లు వేసిన ‘నీలిమేఘాలు’, చదివిన కొన్నాళ్ల తర్వాత కూడా వెంటాడే పాత్రల ‘తిలక్‌ కథలు’, కష్టజీవుల వ్యథల్ని చెప్పే ‘మా గోఖలే కథలు’, అమెరికా నుంచి వీస్తున్న ‘ఈ నేలా... ఆ గాలీ...’ ఇలాంటి ఎన్నో పుస్తకాల గురించి చక్కటి విశ్లేషణలు ఇందులో ఉన్నాయి.

శ్రీ

చదివి చూద్దాం;
రచన: చీకోలు సుందరయ్య
పేజీలు: 546; వెల: రూ.240/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలుTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..