మనకు తెలియని చంద్రబాబు

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా పనిచేసిన రచయిత అప్పటి అనుభవాల్నీ వాటినుంచి ఏర్పడిన తన అభిప్రాయాల్నీ పంచుకున్నారు.

Published : 30 Mar 2024 23:27 IST

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా పనిచేసిన రచయిత అప్పటి అనుభవాల్నీ వాటినుంచి ఏర్పడిన తన అభిప్రాయాల్నీ పంచుకున్నారు. తలచుకుంటేనే ఉత్సాహం వచ్చే చంద్రబాబు పనితీరూ నాయకత్వ లక్షణాలే తననీ పుస్తకం రాసేలా చేశాయంటారు. ఏం చేసినా అద్భుతంగా చేయాలన్న భావనే చంద్రబాబు బలమూ బలహీనతా కూడానని అంటూ రాజమండ్రి హావ్‌లాక్‌ బ్రిడ్జి కథ చెబుతారు. హుద్‌హుద్‌ సమయంలో ఆయన పనిచేసిన విధానాన్ని వివరిస్తూ ఎంత పెద్ద పనినైనా నాలుగు ‘ఎం’ల సింగిల్‌ స్ట్రాటజీతో ఎలా సులభంగా చేస్తారో చెప్పారు. ఆయన పరిపాలన తపస్సును భగ్నం చేసే మేనకగా ‘టెక్నాలజీ’ని వర్ణిస్తారు. హీరో, కియా లాంటి కంపెనీలు తేవడానికి ఆయనలోని పట్టుదలగా పోరాడేతత్త్వం ఎలా పనిచేసిందీ ఆసక్తికరంగా వివరించారు. అనుభవజ్ఞులతో మేధోమథనం, ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలచుకోవడం, స్పష్టమైన విజన్‌, దాన్ని సాకారం చేసుకోవడానికి తగిన ప్రణాళిక... నాయకత్వ లక్షణాలలో అతి ముఖ్యమైనవనీ, ఏ రంగంలో నాయకులు కావాలనుకుంటున్న వారికైనా చంద్రబాబు వ్యక్తిత్వం స్ఫూర్తినిస్తుందనీ అనే రచయిత ఆయా అంశాల గురించి చెప్పిన తీరు ఆపకుండా చదివిస్తుంది.

డీకోడింగ్‌ ద లీడర్‌

రచన: డా.పెద్ది రామారావు
పేజీలు: 164; వెల: రూ.150/-
ప్రతులకు: ఎమెస్కోబుక్స్‌

శ్రీ


స్వాభిమానం

స్త్రీ చదువూ స్వాభిమానం కేంద్రబిందువుగా సాగే ఈ నవలలు ఒకదానికొకటి కొనసాగింపే. మహాలక్ష్మికి అనుకోకుండా పెద్దింటి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. పెళ్లయ్యాక చదివిస్తామనడంతో ఆనందంగా కాపురానికెళ్లిన మహాలక్ష్మికి అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అప్పనంగా పెద్దింటి కోడలివయ్యావని చీటికీ మాటికీ దెప్పే అత్తగారు ఆమెను ఇరుగుపొరుగుతోనూ మాట్లాడనివ్వదు. మరొకరిపైన మనసున్న భర్త ఆమె జోలికే రాడు. ఇల్లు తప్ప మనసులు విశాలంగా లేని ఆ ఇంటినుంచి ఆమె ఎలా బయటపడిందీ, చదువు కొనసాగించడానికి ఆమెకెవరు అండగా నిలిచారూ... అన్నది కథ.

బాపుబొమ్మ మరియు హేమంత తుషారం

రచన: గోగినేని మణి
పేజీలు: 260; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 9490753335

పద్మ


చదివించే కథలు

మెరికాలో స్థిరపడిన రచయిత తన జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్న కోనసీమ జీవనచిత్రాలను ఈ కథల్లో కళ్లకు కట్టారు. నాది వృత్తి కాదు వ్యాపారం అన్న లాయరు తనకు ఫీజు ఇచ్చిన వ్యక్తి తరఫునే వాదించి ఓడిపోయేలా చేసినందుకు శిక్ష ఎవరికి పడిందో చెబుతుంది ‘న్యాయవాదం’. పిసినారి పేరయ్య అనిపించుకున్న వ్యక్తి మరణించాక గొప్ప దాత అని తెలియడమే ‘వామనుడు’ కథాంశం. ప్రవాసుల జీవితాల్లోని వివిధ కోణాల్ని పరిచయం చేసే కథల సంపుటి క్విల్ట్‌. కోడళ్లకు అత్తామామలు పడకపోవడం ఎక్కడైనా సాధారణమేనంటుంది ఇండియా భర్త, అమెరికా భార్యల కథ ‘క్విల్ట్‌’.

కోనసీమ కథలు

పేజీలు: 124; వెల: రూ.150/-
క్విల్ట్‌ (కథలు); పేజీలు: 278; వెల: రూ. 300/-
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
ప్రతులకు: అనల్ప- 7093800303

సుశీల


రచయిత ఆత్మకథ

లు కథలూ నవలలూ రాసిన రచయిత తాను రచయిత ఎలా అయిందీ చెప్పడానికి నవల లాగా రాసిన ఆత్మకథ ఇది. మూడో తరగతిలో ఉండగా కిటికీ దగ్గర కూర్చుని కురుస్తున్న వానని చూస్తూంటే ఏవో ఆలోచనలు, ఏదో చెయ్యాలి కానీ అదేమిటో తెలియని స్థితిని అనుభవించాననీ దానినే ప్రారంభావస్థ అంటారని తర్వాత తెలిసిందనీ చెబుతారు. తాను కమర్షియల్‌ రైటర్‌ కాకపోవడం వెనుక కారణాన్ని వివరించారు. రచయిత కావాలని కోరుకోవడానికీ, రచయిత అవడానికీ మధ్యనుండే అంతర్మథనాన్ని వివరించే పుస్తకమిది.

మేకింగ్‌ ఆఫ్‌ ఎ రైటర్‌

రచన: పి.చంద్రశేఖర అజాద్‌
పేజీలు: 157; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌-9160003371

జ్యోతిTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..