మీరూ కావచ్చు ‘వక్త’

వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌’లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత.

Published : 14 Apr 2024 00:16 IST

వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌’లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత... లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్‌ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాసం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ... ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.

శ్రీ

వక్త (ద ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌)
రచన: బాల్‌రెడ్డి దొమ్మాట
పేజీలు: 178; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 8008116606 


నవ్వుల చమక్కులు

గిలిగింతలు పెట్టే హాస్యమూ చురుక్కుమనిపించే వ్యంగ్యమూ కలబోసిన రచనలివి. కార్యాలయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, సాహిత్యవేదికల్లో, ప్రయాణాల్లో... సందర్భం ఏదైనా అతిశయోక్తులనూ, చమక్కులనూ మేళవిస్తూ కథలను తీర్చిదిద్దారు రచయిత. పెంపుడు మార్జాలం ఆత్మకథనం- ‘పిల్లి గారి ఫిలాసఫీ’. లాయర్‌ ఇంట్లో ఉంటూ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ని ఒంటబట్టించుకున్న పిల్లి ప్రొఫెసర్‌ ఇంట్లోకి మారినప్పుడు తత్వవేత్తల సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుంటుంది. జీవహింసకే దూరమవుతుంది. చివరికి జ్ఞానోదయమై ఏం చేసిందన్నది ముగింపు. ఓ సినిమా రచయిత తన విజయవంతమైన కథల ఖజానాకూ, ప్రేరణగా నిలిచినవారికీ కృతజ్ఞతా పురస్కారాలు అందజేయడం ‘సన్మానం మీకే’ కథాంశం. పాఠకులకు
కాలక్షేపాన్ని అందించే సరదా పుస్తకమిది.

సీహెచ్‌. వేణు

సన్మానం మీకే (హాస్య వ్యంగ్య కథలు)
రచన: పోట్లూరు సుబ్రహ్మణ్యం
పేజీలు: 252; వెల: రూ.250/-
ప్రతులకు: ఫోన్‌- 9491128052


అనువాద కథలు

దేశ, విదేశాలకు చెందిన 27 కథల అనువాదాల సంకలనమిది. ఫర్లాంగును సూచించే రాయి దగ్గర ఒకప్పుడు తరచూ ప్రమాదాలు జరిగేవి. అందుకు ఆ రాయే కారణమని తిట్టుకునేవారు. అలాంటిది హఠాత్తుగా దాని దశ తిరిగింది, ‘ఫర్లాంగమ్మ’ జాతర నిర్వహించే స్థాయికి దాని ఖ్యాతి పెరిగింది. ఈ కన్నడ కథ సగటు మనుషుల మనస్తత్వాలపై రచయిత సంధించిన వ్యంగ్యబాణం. బట్టతలపై జుట్టు మొలిపించుకోవాలన్న కోరిక ఏ పరిణామాలకు దారితీసిందో ‘మంత్రకేశాలు’ చెబుతాయి. కార్పొరేట్‌ కార్మికుల కష్టాల కథ ‘ఓ చీమ కథ’. తన భూమికి ‘పట్టా’ సంపాదించడానికి ఒక సామాన్యుడు చేసే త్యాగం నుంచి భవిష్యత్తులో పెట్టుబడిదారుల ‘అంతరిక్షయాత్ర’ల పర్యవసానాల వరకూ విభిన్న కథాంశాలతో సరళమైన అనువాదంతో కథలన్నీ చదివిస్తాయి.

పద్మ

ఫర్లాంగమ్మ (అనువాద కథల సంకలనం)
అనువాదం: కంతేటి చంద్రప్రతాప్‌
పేజీలు: 334; వెల: రూ.300/-
ప్రతులకు: ఫోన్‌- 9908284105


ప్రవాసంలో గృహహింస

పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అమెరికా వెళ్లిన రేఖకు దుర్భరమైన గృహహింస ఎదురవుతుంది. పదిరోజుల పసిపాపతో దేశంకాని దేశంలో ఆమె తప్పించుకుని బయటపడగలిగిందా? అత్యవసర సమయంలో ఆమెకు ఎలాంటి అండ దొరికింది? దీన్ని ప్రధానాంశంగా చేసుకుని రూపొందించిన నవల ఇది. కథలో భాగంగా న్యాయపరమైన అంశాలు, ప్రొటెక్టివ్‌ ఆర్డర్‌ తీసుకోవడం లాంటివి ఆసక్తికరంగా చర్చించారు. మరోపక్క అమెరికాలో పుట్టి పెరిగిన సమీర భారతీయుడిని పెళ్లి చేసుకుని అతడితో పడక విడాకులు తీసుకుంటుంది. తర్వాత వారి జీవితగమనం ఎలా సాగిందో పాఠకుల ఊహకే వదిలేశారు రచయిత. ఆసక్తికరమైన సంఘటనలతో ఆద్యంతం చదివించే నవల.  

నీహారిక

ఎక్కవలసిన రైలు (నవల)
రచన: సత్యం మందపాటి
పేజీలు: 160; వెల: రూ. 200/-
ప్రతులకు: వాట్సాప్‌: 8558899478



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..