మంచిచెడుల పోరాటం

సాంఘిక దురాచారమైన సతీ సహగమనం నేపథ్యంలో మహిళామూర్తుల దుస్థితికీ, వితంతువుల దైన్యానికీ, వరకట్న బాధితుల వేదనకూ అద్దం పట్టిన నవల ‘సతి మంటలు’. ఓ యువతి సజీవ దహనం వెనక నిజాలను వెలికితీయడానికి దివ్య అనే జర్నలిస్టు సాగించిన పరిశోధనా, ఆమెకు ఎదురైన సవాళ్లూ ప్రధాన ఇతివృత్తం. 

Updated : 28 Apr 2024 06:22 IST

సాంఘిక దురాచారమైన సతీ సహగమనం నేపథ్యంలో మహిళామూర్తుల దుస్థితికీ, వితంతువుల దైన్యానికీ, వరకట్న బాధితుల వేదనకూ అద్దం పట్టిన నవల ‘సతి మంటలు’. ఓ యువతి సజీవ దహనం వెనక నిజాలను వెలికితీయడానికి దివ్య అనే జర్నలిస్టు సాగించిన పరిశోధనా, ఆమెకు ఎదురైన సవాళ్లూ ప్రధాన ఇతివృత్తం.  నారీ శక్తికి నివాళులర్పిస్తూ వారి మేటి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన ‘స్త్రీ పర్వం’ నవలను కూడా ఈ పుస్తకంలో చేర్చారు. ఇదే రచయిత సృష్టించిన మరో నవల ‘అరచేతిలో స్వర్గం’. సశరీరంగా చరాస్తులతో పాటు స్వర్గానికి వెళ్లాలనేది వస్త్ర వ్యాపారి చక్రధరయ్య వింత వాంఛ. దాంతో అతడు తన చర్యలతో భార్యాబిడ్డలకు భూమ్మీదే నరకం చూపిస్తాడు. అతడి నమ్మినబంటు భగవాన్లు, బావమరిది కోదండం, చిన్నస్వామీజీ ..ఇలా విభిన్న పాత్రల వైకుంఠపాళి చివరికెలా పరిణ మించిందో హాస్య వ్యంగ్యభరితంగా చిత్రీకరించారు.

సతిమంటలు, స్త్రీ పర్వం

పేజీలు: 126, వెల: రూ.300
ప్రతులకు: ఫోన్‌: 9908284105

అరచేతిలో స్వర్గం

పేజీలు: 193, వెల: రూ.150
రచన: సింహప్రసాద్‌  
ప్రతులకు: ఫోన్‌: 9550146514

సీహెచ్‌.వేణు


జీవితమే ఇతివృత్తం

లీబాబా అనేక దొంగలు’ కథా సంకలనం మధ్యతరగతి బతుకుల్లోని అనేకానేక ఉద్వేగాల సమాహారం. పెను కుదుపుతో పెద్ద అలజడి, ఆ అలజడితోనే తీవ్ర ఆవేదన, అంతిమంగా ఓ మార్పు.. అంటూ ‘కుదుపు’ కథలో సరికొత్త పరిణామ సిద్ధాంతాన్ని పరిచయం చేస్తారు రచయిత దేశరాజు. పిల్లల సెల్‌ఫోన్‌ వ్యసనం గురించి లోతుగా చర్చించిందీ కథ. పదహారణాల పల్లెటూరి పిల్లను పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడే ఓ కార్పొరేట్‌ వరుడి కథ ‘అంతా మీ కోసం!’. సంకలనంలోని పదమూడు కథలూ జీవితంలోని ఏదో ఓ కఠిన వాస్తవాన్ని కళ్లముందు ఉంచేవే.

ఆలీబాబా అనేక దొంగలు

రచన: దేశరాజు
పేజీలు: 120; వెల: రూ.200
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు


సినిమా ప్రపంచం

పుస్తకం చదువుతున్నప్పుడు అక్షరాల్లో సినిమా చూస్తాం. సినిమా చూస్తున్నప్పుడు తెరమీద పుస్తకం చదువుతాం. ఒకచోట నేత్రాలూ ఇంకోచోట అంతర్నేత్రాలూ చురుగ్గా పనిచేస్తాయి. అంతే తేడా. చాలా సినిమాల్ని పాప్‌కార్న్‌ తింటూ కులాసాగా చూసేయొచ్చు. కొన్నింటిని మాత్రం.. ఏకాగ్రతతో చూడాలి. పుస్తక పఠనాన్ని పోలిన బౌద్ధికమైన కసరత్తు ఇది. కాబట్టే, తన సినిమా వ్యాసాల పుస్తకానికి ‘సినిమా చదవటమెలా?’ అని పేరు పెట్టారు వంశీకృష్ణ. సాంకేతిక కోణం దగ్గరే ఆగిపోకుండా సమాజం కళ్లతో సినిమాను వీక్షిస్తారు రచయిత. పనిలో పనిగా గ్లోబలైజేషన్‌ ప్రభావాల్నీ విశ్లేషిస్తారు.

సినిమా చదవటమెలా?

రచన: వంశీకృష్ణ
పేజీలు: 400; వెల రూ.300
ప్రతులకు: ఫోన్‌: 9848787284


విస్మృత వీరులు

భారత స్వాతంత్య్ర సంగ్రామం అనగానే ఐదారు పేర్లే గుర్తుకొస్తాయి. ఆ కొద్దిమంది త్యాగాల కథలే చదువుకుంటాం. చరిత్రకెక్కని యోధులు ఎంతోమంది. ఆ అజ్ఞాత వీరులను పరిచయం చేస్తుంది ‘ఆఖరి యోధులు’. సుప్రసిద్ధ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ పరిశోధనాత్మక రచన ఇది. విద్యార్థి దశలోనే బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించిన శంకరయ్య, ఒడిశాలో భూదానోద్యమ నేత బాజీ మహమ్మద్‌, ఆత్మగౌరవ నినాదంతో తుపాకీ పట్టిన గిరిజన మహిళ దేమతి దోయి.. ఇలా ఉద్యమమే జీవితమని నమ్మిన ఎందరో విస్మృత సమరవీరులను పరిచయం చేస్తారు రచయిత.  

ఆఖరి యోధులు

రచన: పి.సాయినాథ్‌
అనువాదం: ఎస్‌. వినయకుమార్‌
పేజీలు: 256; వెల: రూ.275
ప్రతులకు: నవతెలంగాణ పుస్తక కేంద్రాలు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..