చిక్కని కథలు

అన్నీ చిన్న కథలే. చిట్టిపొట్టి జ్ఞాపకాలే. రచయిత గుజ్జు చెన్నారెడ్డి తనకు జన్మనిచ్చిన టెక్కలిదరి గూడెం సంగతులకు ’సిక్కోలు కథలు’గా అక్షర రూపం ఇచ్చారు.

Published : 25 May 2024 23:43 IST

న్నీ చిన్న కథలే. చిట్టిపొట్టి జ్ఞాపకాలే. రచయిత గుజ్జు చెన్నారెడ్డి తనకు జన్మనిచ్చిన టెక్కలిదరి గూడెం సంగతులకు ’సిక్కోలు కథలు’గా అక్షర రూపం ఇచ్చారు. చదువుతూ చదువుతూ మనమూ బాల్యంలోకి వెళ్లిపోతాం. కొండలెక్కుతాం. చెరువులు ఈదుతాం. భుజాన పుస్తకాల సంచి తగిలించుకుని బడికెళ్తాం. బెత్తం దెబ్బలు తింటాం.పెదకేదారిపల్లె తేనె రుచి చూస్తాం. స్కూల్లో వినాయకుడి భజన పాటలు వింటాం. మేస్టారు ఇంట్లో మిట్టల పులుసు ఘుమఘుమల్ని ఆఘ్రాణిస్తాం. అమ్మ రాసుకునే అమృతాంజనం ఘాటుకు ఉక్కిరిబిక్కిరై పోతాం. టెక్కలి థియేటర్‌లో కమల్‌హాసన్‌ సినిమా చూస్తాం. రచ్చబండ దగ్గర పంచాయతీలో పాల్గొంటాం. సంక్రాంతికి సవరకిల్లి గిరిజనుల వెయ్యి గుర్రం ఆటను ఆస్వాదిస్తాం. స్నేహాల వేడుక ‘నేస్తరికం’ గురించి తెలుసుకుంటాం. ఈ పుస్తకం ద్వారా సిక్కోలు వెనుక బాటుతనాన్నే కాదు, చిక్కని అనుబంధా లనూ పరిచయం చేస్తారు రచయిత.

సిక్కోలు కథలు
రచన: గుజ్జు చెన్నారెడ్డి
పేజీలు: 213; వెల: రూ.140/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు.  


తాళ్లపాక సాహితీ సంపద

న్నమాచార్యుల సంకీర్తనతోనే శ్రీనివాసుని అర్చన పరిపూర్ణం అవుతుంది. నిరంతర నిర్నిద్రుడిని నిద్రపుచ్చడానికైనా, నిత్య చైతన్యమూర్తిని మేల్కొలపడానికైనా తాళ్లపాకవారి సాహిత్యాన్ని ఆశ్రయించాల్సిందే. పేరుకు ముప్ఫైరెండువేల కీర్తనలని చెబుతున్నా.. అందులో సగమైనా అందుబాటులో లేవిప్పుడు. తంజావూరు సరస్వతీ మహల్‌లో ఓ మూలన పడున్న అజ్ఞాత కీర్తనలను జిజ్ఞాసతో సేకరించి.. ప్రపత్తితో పరిష్కరించి.. పరమాత్మ సేవగా ప్రచురణకు తీసుకొచ్చారు వాగ్గేయ పరిశోధకులు గంధం బసవ శంకరరావు. ఈ గ్రంథం ఎనభై తొమ్మిది కొత్త సంకీర్తనల సమాహారం. ఇందులో ఇతర తాళ్లపాక కవుల రచనలూ ఉన్నాయి. అన్నీ ఆణిముత్యాలే.

శ్రీ వేంకటేశ పదములు

సంపాదకులు: గంధం బసవ శంకరరావు, వేటూరి ఆనందమూర్తి
పేజీలు: 176; వెల: రూ. 65/-
ప్రతులకు: తితిదే ప్రచురణల విభాగం


వెండితెరకు జై బోలో!

స్వాతంత్య్రోద్యమం, తెలుగు సినిమా.. కలిసి కదంతొక్కాయి. మహాత్మాగాంధీ అహింసా నినాదం, సుభాష్‌ చంద్రబోస్‌ పోరాట పటిమ, అల్లూరి సీతారామరాజు ఉద్యమస్ఫూర్తి, ఆంధ్రకేసరి ఉగ్రరూపం.. వెండితెర కథలకు ముడిసరుకు అయ్యాయి. చిత్తూరు నాగయ్య, బీఎన్‌ రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం తదితరులు.. ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నారు. ఘంటసాలవారు ఊచల వెనుక నుంచే ఉద్యమగీతాలు ఆలపించారు. క్విట్‌ ఇండియా సమయంలో అల్ల్లు రామలింగయ్య అనుభవించిన కష్టాలు అన్నీయిన్నీ కావు. ఆ కథలు, గాథలు, చిత్రాలు, గీతాలు.. ఏర్చికూర్చిన పుస్తకమిది. రచయిత  కృషిని అభినందించాల్సిందే.

స్వాతంత్య్రోద్యమం- తెలుగు సినిమా ప్రముఖులు

రచన: సంజయ్‌ కిషోర్‌
పేజీలు: 185; వెల: రూ. 500/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.


గతాలూ స్వగతాలూ!

దో ఓ దృశ్యాన్ని జంపఖానాలా పరిచేస్తారు రచయిత. అందులోంచి పాఠకుడ[ు కథను ఏరుకోవాలి. మెరుపుల్ని వెతుక్కోవాలి. పూడూరి రాజిరెడ్డి తీర్చిదిద్దే పాత్రలు మేధావితనాన్ని మేకప్‌లా అద్దుకున్న మిడిల్‌క్లాస్‌కు ప్రతినిధుల్లా అనిపిస్తాయి. ‘జీవగంజి‘లో ‘అన్నీ ఎరిగే జీవితానికి వినయంగా లొంగిపోయిన’ సామాన్యుడు తారసపడతాడు. ‘బోర్లించిన చెప్పు’ పైకి చెప్పుకోలేని స్వల్పకాలపు ఆకర్షణ చుట్టూ తిరుగుతుంది. ‘గంగరాజం బిడ్డ’ గుండెల్ని మెలితిప్పే విషాదాంతం. పుత్తడి బొమ్మ పూర్ణను.. పుస్తకం మూసేసిన తర్వాతా మర్చిపోలేం. మొత్తం పన్నెండు కథల సంకలనమిది.

గంగరాజం బిడ్డ (మరిన్ని కథలు)

రచన: పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 114; వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు