గోదా కల్యాణం

పరమాత్మను కొలిచి, వలచి, మనువాడిన మానవమాత్రురాలి కథ ఇది. గజేంద్రమోక్షంలో శిష్ట రక్షణ కోసం... సిరికిన్‌ జెప్పక బయల్దేరిన శ్రీమహావిష్ణువు.. గోదా ఘట్టంలో పడతి ప్రేమకు పరవశుడై పరుగుపరుగున భూలోకానికొచ్చాడు.

Published : 08 Jun 2024 23:50 IST

రమాత్మను కొలిచి, వలచి, మనువాడిన మానవమాత్రురాలి కథ ఇది. గజేంద్రమోక్షంలో శిష్ట రక్షణ కోసం... సిరికిన్‌ జెప్పక బయల్దేరిన శ్రీమహావిష్ణువు.. గోదా ఘట్టంలో పడతి ప్రేమకు పరవశుడై పరుగుపరుగున భూలోకానికొచ్చాడు. రంగనాయకిని హృదయ నాయకిని చేసుకున్నాడు. తనలో ఐక్యమూ చేసుకున్నాడు. శ్రీదేవీమురళీధరన్‌ ‘గోదాదేవి’ ఆ ఐతిహ్యానికి అక్షరరూపం. తిరుప్పావై పరిచయం, పాశురాల విశ్లేషణ, దివ్యదేశ సంకేతాల వివరణ.. ఆసక్తికరం. రామానుజులవారిని ఆండాళ్‌ ఆత్మీయంగా ‘అన్నా..’ అని పిలిచిన ఘట్టం అబ్బురంగా తోస్తుంది. ముఖచిత్రం, లోపలి బొమ్మలతో పుస్తకానికి గోదాకల్యాణ కళ వచ్చేసింది. 

గోదాదేవి (చరితం, సాహిత్యం)
రచన: శ్రీదేవీమురళీధరన్‌; పేజీలు: 184; వెల: రూ. 300/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.


చీకటి బతుకులు

స్రీన్‌ ఖాన్‌ ‘దాస్తాన్‌’ కథా సంకలనంలో.. కొన్ని వాక్యాల దగ్గర ఇష్టంగా ఆగిపోతాం. బంధాలలోని గొప్పతనమది. కొన్ని సంఘటనల దగ్గర భయంతో ఆగిపోతాం. వ్యవస్థలోని దుర్మార్గపు ప్రభావమిది. ‘లాపతా’ కథలోని రఫీకా అమ్మప్రేమకు ప్రతిరూపం. హఠాత్తుగా ఓ సాయంత్రం ‘అమ్మీ మై ఆగయా’ అనే పిలుపు ఆగిపోతుంది. బిడ్డ గాయబ్‌ అవుతాడు. మామూలుగా అయితే ఆ తల్లి గుండె ఆగిపోవాలి. కానీ అలా జరగలేదు. రచయిత్రి ఆ పాత్రను అందరి అమ్మగా మలిచారు. కొన్నిసార్లు నావ పెను గాలికి దారితప్పుతుంది. అంతలోనే దిశ మార్చుకుని గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది. ఈ ప్రతీకాత్మక వాక్యాలు ‘దిశ మార్చుకున్న గాలి’లోని జైనబ్‌కు వర్తిస్తాయి. కథ చివర్లో ‘ఇజ్జత్‌ పోతదని నన్ను నేను చంపుకోవాల్నా పప్పా?’ అని నిలదీస్తున్నది జైనబ్‌ ఒక్కతే కాదని మనకు అర్థమైపోతుంది. ముస్లిం మహిళల జీవితాలకు అక్షరరూపం ఈ సంకలనం. 

దాస్తాన్‌ రచన: నస్రీన్‌ ఖాన్‌
పేజీలు: 167; వెల: రూ.200/-;
ప్రతులకు: ఫోన్‌: 7013904074


చదివించే కథలు

ముప్పై రెండు కథల సంపుటి ఇది. సంప్రదాయాల సంకెళ్లను వదిలించుకుని వ్యక్తిత్వంతో స్త్రీలు ముందుకుసాగాలని సూచిస్తాయి. రైలు ప్రయాణంలో తారసపడిన యువతికి పెళ్లి విషయంలో ఓ ఉచిత సలహా ఇచ్చిన వ్యక్తి చివరికి పెళ్లికొడుకు ఎవరో తెలిసి అవాక్కవుతాడు. ఆదర్శాలు వల్లించటం వేరు, ఆంతర్యం వేరు అనేది అతడికే తెలిసివస్తుంది ‘మలుపు’ కథలో. భర్త ఆత్మహత్యతో నెలరోజులకే వైవాహిక జీవితం ముగిసిపోయిన సుగుణ.. కుటుంబం, సమాజం తనపై మోపాలని చూసిన వైధవ్య సంప్రదాయాన్ని తిరస్కరిస్తూ ‘నిర్ణయం’ తీసుకుంటుంది మరో కథలో. వివాహాల తంతు, ఆ  సందర్భంగా భోజనాల ప్రహసనంపై వ్యంగ్యాస్త్రం- ‘పెళ్లి కథ’. కొంటె కొస మెరుపులున్న కొన్ని మినీ రచనలను కూడా ఈ పుస్తకంలో చేర్చారు.

సీహెచ్‌.వేణు

మలుపు (కథల సంపుటి)
రచన: డా. కొప్పరపు నారాయణమూర్తి; పేజీలు: 219; వెల: రూ.225/-
ప్రతులకు: ఫోన్‌: 7093800303  


కథా ప్రపంచం

ప్రపంచ ప్రసిద్ధ కథకుల కలాల్ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ సంకలనం. ఆల్బేనియన్‌ కథకుడు ఫత్‌మీర్‌ గజాత ‘అజ్ఞాత యోధుడు‘తో మొదలుపెట్టి.. హంగేరియన్‌ రచయిత జిగ్మోంద్‌ మోరిత్స్‌ శైలిని పరామర్శించి, ఆఫ్రికా అక్షరశిల్పి చినువా అచెబె కలంలోని పదునును రుచి చూపించి... మున్ముందుకు సాగిపోతారు అనుసృజన కర్త. ఫ్రెంచ్‌, రష్యన్‌, మయన్మార్‌.. ఏ గడ్డ బతుకులు ఆ గడ్డవే. ఏ నేల సంక్షోభం ఆ నేలదే. ప్రతి కథా ఓ సంఘర్షణకు సాక్ష్యంగా నిలిచేదే. పాలస్తీనా కథ ‘బాంబులు-బాజాలు’ ఓ భయానక వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. అదే సమయంలో అనివార్యమైన జీవన సమరాన్నీ గుర్తు చేస్తుంది. జర్మన్‌ కథ ‘దాగుడుమూతలు’ అహాలూ అహంభావాలూ ప్రేమాభిమానాల్ని ఎలా మింగేస్తాయో వివరిస్తుంది. ‘జంఖానా’ సొంతింటి చుట్టూ అల్లుకున్న హృద్యమైన అఫ్గాన్‌ కథ.

అజ్ఞాత యోధుడు (ప్రపంచ ప్రసిద్ధ కథకుల కథలు)
అనుసృజన: రంగనాథ రామచంద్రరావు
పేజీలు: 170; వెల రూ.200/-
ప్రతులకు: ఫోన్‌: 9866115655Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..