అవిసె గింజలు... ఒక్క చెంచా చాలు!

‘పాలల్లో లేదా పెరుగులో చెంచా అవిసెగింజలపొడి వేసుకుని తీసుకుంటే ఒంటికి ఎంత మంచిదో తెలుసా...’ ‘వేడివేడి అన్నంలో కాస్త అవిసెగింజల కారప్పొడీ నెయ్యీ వేసుకుని తిని చూడండి...’,  ‘వారానికోసారి అవిసెగింజల జెల్‌ను తలకు రాస్తే జుట్టురాలడం బాగా తగ్గుతుంది...’

Updated : 18 Feb 2024 11:46 IST

‘పాలల్లో లేదా పెరుగులో చెంచా అవిసెగింజలపొడి వేసుకుని తీసుకుంటే ఒంటికి ఎంత మంచిదో తెలుసా...’ ‘వేడివేడి అన్నంలో కాస్త అవిసెగింజల కారప్పొడీ నెయ్యీ వేసుకుని తిని చూడండి...’,  ‘వారానికోసారి అవిసెగింజల జెల్‌ను తలకు రాస్తే జుట్టురాలడం బాగా తగ్గుతుంది...’ అంటూ ఆరోగ్యానికీ అందానికీ ప్రాధాన్యమిచ్చేవారే కాకుండా వంటకాల్లో వెరైటీలు కోరుకునేవారూ అవిసెగింజల్ని తెగ వాడేస్తున్నారిప్పుడు. దానికి తగినట్లుగా వాటితో చేసిన ఉత్పత్తులూ రకరకాలుగా వచ్చేయడంతో ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు వీటి వాడకం బాగా పెరిగిందనే చెప్పొచ్చు. ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటో చూసేద్దామా మరి.

నెలవారీ నిత్యావసర సరకుల జాబితాలో పోపు దినుసులతోపాటు నువ్వులూ పల్లీలూ పుట్నాలూ పెసలూ... అంటూ రకరకాలను చేర్చేస్తుంటాం. ఈ మధ్య ఆ జాబితాలో అవిసెగింజల పేరూ
రాసేస్తున్నారు చాలామంది గృహిణులు. నిజానికి ఇవి ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా వీటి వాడకంపైన బోలెడు సందేహాలూ అపోహలూ ఉండడంతో ఈ గింజల్ని పక్కన పెట్టేసినవారే ఎక్కువ. అయితే... కొంతకాలంగా పోషకాహార నిపుణులు అవిసెగింజల వల్ల కలిగే ప్రయోజనాలను తరచూ తెలియజేయడం, తయారీదారులూ వీటితో రకరకాల పదార్థాలను తీసుకురావడంతో... ఈ మధ్య అవిసెల వాడకం బాగా పెరిగిందనే చెప్పొచ్చు. విదేశాల్లో పుట్టిన ఈ గింజలకు ఇక్కడా ఇంతటి గుర్తింపు లభించడం వెనుక వీటివల్ల ఒనగూడే  ఆరోగ్య ప్రయోజనాలే ప్రధాన కారణం మరి.

అసలేంటీ మొక్క...

గోధుమవర్ణంలో ఉండి, నువ్వుల్లా కనిపించే అవిసెగింజల్ని ఆంగ్లంలో ఫ్లాక్స్‌సీడ్స్‌ అని పిలుస్తారు. ఈ గింజల శాస్త్రీయ నామం లినమ్‌ ఉసిటాటిసిమమ్‌ (ఉసిటాటిసిమమ్‌ అంటే లాటిన్‌లో ‘చాలా ఉపయోగకరం’ అని అర్థం). ఈజిప్టులో ఈ మొక్కను దాదాపు ముప్ఫైవేల సంవత్సరాల క్రితం నుంచీ పెంచుతుంటే... మనదేశంలో అయిదువేల సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చిందట. ప్రారంభంలో ఈ మొక్కల నుంచి నారను సేకరించి దుస్తుల తయారీకోసం ఉపయోగించేవారట. మనం ఇప్పుడు వాడుతున్న లినెన్‌ వస్త్రం ఈ అవిసెగింజల నారనుంచే వచ్చింది. మొదట్లో ఆ నారతో దుప్పట్లూ, లోదుస్తులూ, కర్టెన్లూ తదితరాలనే తయారుచేసినా... ఫ్యాషన్‌ ప్రపంచంలో ఇప్పుడు లినెన్‌కి ఎంతో డిమాండు ఉంది. రోజులు మారేకొద్దీ వాటి నుంచి అందే పోషకాలూ, కలిగే ఆరోగ్య ప్రయోజనాలపైన అవగాహన పెరగడంతో ఈ గింజల్నీ, నూనెనూ వంటకాల్లో వాడే వారి సంఖ్యా పెరిగింది. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తులో ఉండే ఈ మొక్కలకు వచ్చే పూలు సాధారణంగా నీలంరంగులోనే ఉన్నా... కొన్నిచోట్ల తెలుపు, పసుపు, ఎరుపు వర్ణాల్లోనూ పూస్తాయి. మొక్కలకు గుత్తులుగుత్తులుగా పూసే చిన్నచిన్న మొగ్గల్లోనే అవిసెగింజలు ఉంటాయి. ఆ మొగ్గల్ని ఎండబెట్టి గింజల్ని వేరుచేస్తారు.

ఎన్నెన్నో పోషకాలు...

సాధారణంగా అవిసెగింజలు గోధుమ, పసుపు రంగుల్లో ఉంటాయి. వీటిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలతోపాటు పీచు, విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌, మాంసకృత్తులు, కాపర్‌.. వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి.

  • అవిసెగింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువశాతం ఉంటాయి. ప్రతిరోజూ టేబుల్‌స్పూను అవిసెగింజల పొడిని తీసుకోవడం వల్ల సుమారు 1.8 గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరానికి అందుతాయి. ఈ గింజల్ని కానీ, నూనెను కానీ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధం కావడంతోపాటూ హృద్రోగాలూ అదుపులో ఉంటాయని పరిశోధకులు తేల్చారు. అందుకే మొదట్లో వీటిని కేవలం గుండె ఆరోగ్యంకోసమే వాడేవారట. క్రమంగా పరిశోధనలు జరిగేకొద్దీ... మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని తేలడంతోపాటూ ఇతర అనారోగ్యాలూ నయమవుతాయని నిరూపితమైందని చెబుతారు పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతాశశి.
  • అవిసెగింజల్లో పీచు- సాల్యుబుల్‌(కరిగే), ఇన్‌సాల్యుబుల్‌(కరగని) రకాల్లో ఉండటం విశేషం. ఈ పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, జీర్ణసంబంధ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అవిసెగింజల్లోని సాల్యుబుల్‌ ఫైబర్‌ చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి తద్వారా గుండె జబ్బులతోపాటూ స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చేస్తుంది. బరువూ తగ్గుతారు. దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా పొట్ట నిండిన భావన కలగడమే అందుకు కారణం.
  • ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే అవిసెగింజల్లో లిగ్నాన్లు 75 నుంచి 800 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ లిగ్నాన్లు ఆస్టియోపోరోసిస్‌ను నివారించి మెనోపాజ్‌ లక్షణాలనూ తగ్గిస్తాయని అంటారు. అదేవిధంగా రొమ్ము, ప్రొస్టేట్‌, కొలొన్‌, ఊపిరితిత్తులు.. తదితర క్యాన్సర్‌ కారకాలను నియంత్రించడంలో అవిసెగింజలు కీలకంగా పనిచేస్తాయి. అందుకే మెనోపాజ్‌ దశకు చేరుతున్న మహిళలు అవిసెగింజల్ని తరచూ తీసుకోవాలని సూచిస్తారు వైద్యులు.
  • అవిసెగింజల్లోని పాలిఫెనాల్స్‌ కణాలకు రక్షణకవచాల్లా పనిచేసి...ఎన్నోరకాల ఆనారోగ్యాలను దరిచేరకుండా కాపాడతాయి. అలాగే వీటిల్లోని థయామిన్‌ మనం తీసుకునే ఇతర పోషకాలను శక్తిగా మార్చేందుకు తోడ్పడితే మెగ్నీషియం నాడీవ్యవస్థకూ, కండరాల వృద్ధికీ, రోగనిరోధకశక్తికీ ఉపయోగపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఇనుముతో ఎర్రరక్తకణాలూ వృద్ధి చెందుతాయి. 

అందానికీ మేలుచేస్తాయి

ఈ మధ్య ఇన్‌స్టాలో జుట్టు బలంగా పెరగడానికి చిట్కాలు అంటూ కొన్ని రీల్స్‌ తెగ కనిపిస్తున్నాయి. వాటిల్లో జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు ఎక్కువమంది అవిసెగింజలతో చేసిన జెల్‌ను వాడటం చూస్తూనే ఉన్నాం.  ఒకటిరెండు చెంచాల అవిసెగింజల్ని ఉడికించి జెల్‌లా తయారుచేసి కాస్త కొబ్బరినూనె, కలబంద గుజ్జు వంటివి కలిపి తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేయడం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ గింజల్లో ఉండే విటమిన్‌ - ఇ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టు రాలే సమస్యను నివారిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అంత సమయం లేనివారికి ఆ జెల్‌ రెడీమేడ్‌గానూ  దొరుకుతోంది. తలనూనె, షాంపూ, హెయిర్‌స్ప్రే వంటి సౌందర్య ఉత్పత్తులూ వచ్చాయి. స్పా చికిత్సల్లోనూ ఈ ఉత్పత్తులను వాడుతున్నారిప్పుడు. ఇక, ఈ ఫ్లాక్స్‌ సీడ్స్‌లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్లు మొటిమల్నీ, మచ్చల్నీ నివారిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచుతాయి. ఈ గింజల్లో లభించే లిగ్నాన్లూ యాంటీఆక్సిడెంట్లూ చర్మం ముడతలు పడకుండా చేసి వార్థక్యపు ఛాయల్ని నివారిస్తాయి. అవిసెగింజల్ని తింటున్నా లేదా ముఖానికి వేసుకునే ప్యాక్‌ల తయారీలో కొద్దిగా వాడుతున్నా మంచిదేనట. అలా చేయడం వల్ల చర్మంపైన పేరుకొన్న మురికీ, మృతకణాలూ పోయి.. ముఖం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ గింజల్లో ఉండే విటమిన్‌ - ఇ వల్ల చర్మంలో కొలాజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా చర్మం సాగినట్లు కనిపించడం, మృదుత్వాన్నీ మెరుపునూ కోల్పోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా అవిసెగింజలతో లాభాలు చాలానే ఉన్నాయి కాబట్టే వీటిని ఆహారంగా తీసుకుంటూనే పైపూతల్లానూ వాడమని సూచిస్తున్నారు. దానికి తగినట్లుగా ఈ గింజలతో ఫేస్‌వాష్‌, బాడీక్రీమ్‌ వంటి చాలా రకాల ఉత్పత్తులే వస్తున్నాయిప్పుడు.

ఎలా తీసుకోవచ్చంటే...

అవిసెగింజల్ని నేరుగానే వాడుకోవచ్చు కానీ వాటికి ఉండే జిగురు స్వభావం కారణంగా అవి జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే పొడి రూపంలో తీసుకోవాలని చెబుతారు. ఆ గింజల్ని దోరగా వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకుని భద్రపరుచుకుంటే... పాలు, మిల్క్‌షేక్‌, స్మూతీ, జావ, చపాతీలు, బ్రెడ్‌, కూరలు, సూప్‌లు.. ఇలా ఎందులోనైనా ఒకటి రెండు చెంచాలు వేసుకోవచ్చు. ఒకవేళ అచ్చంగా పొడి రూపంలో తీసుకుంటుంటే గనుక.. మంచినీటిని ఎక్కువగా తాగడం అవసరం. లేదంటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌, డయేరియా వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. ఇక, గర్భిణులూ, బాలింతలూ, రక్తాన్ని పల్చబరిచేందుకు మాత్రలు వాడుతున్నవారు వైద్యుల సలహాను తీసుకున్నాకే వీటిని ఎంచుకోవాలి. అలాగే పోషకాలు అందుతున్నాయి కదాని... అవసరానికి మించి వాడితే...  విరేచనాలు, గ్యాస్‌, వికారం, పొట్టనొప్పి వంటి సమస్యలూ ఎదురుకావొచ్చు. అందుకే రెండు టేబుల్‌స్పూన్లకు మించకుండా చూసుకోవాలి. 

కోరుకున్న రూపాల్లో...

నిన్నమొన్నటివరకూ మార్కెట్లో అవిసెగింజలు మాత్రమే దొరికేవి. కానీ ఇప్పుడు రోస్టెడ్‌ ఫ్లాక్స్‌ సీడ్స్‌ (వేయించినవి), ఫ్లాక్స్‌సీడ్స్‌ మీల్‌ పేరుతో పొడి, లడ్డూలూ, చిక్కీలూ, క్రాకర్స్‌, కారప్పొడి, బ్రెడ్‌... తదితరాలు అందుబాటులో ఉన్నాయి.

అవిసెలతో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, ఛియాసీడ్స్‌, పుచ్చకాయ గింజలు.. కలిపి చేసిన మిక్స్‌డ్‌ రకమూ దొరుకుతోంది. వీటిల్లో నచ్చినవాటిని ఎంచుకుని రోజూ తినేయొచ్చు. అదండీ సంగతి... పరిమితంగానే వాడుతూ ఎక్కువ పోషకాలను పొందాలనుకున్నవారికి అవిసెగింజల్ని మించిన ప్రత్యామ్నాయం ఉండదని అర్థమైందిగా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..