పెళ్లిసందడి!

‘ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ అనుకుంటున్న ఈతరం- పెళ్లిని ఎంతో వైభవంగా చేసుకుంటోంది. పెళ్లిబట్టల దగ్గర్నుంచి అతిథులకు అందించే రిటర్న్‌ గిఫ్టుల వరకూ ప్రతిదాంట్లోనూ కొత్తదనం కనిపించాలంటూ మార్కెట్‌ అంతా జల్లెడ పట్టేస్తోంది

Updated : 25 Feb 2024 09:59 IST

ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ అనుకుంటున్న ఈతరం- పెళ్లిని ఎంతో వైభవంగా చేసుకుంటోంది. పెళ్లిబట్టల దగ్గర్నుంచి అతిథులకు అందించే రిటర్న్‌ గిఫ్టుల వరకూ ప్రతిదాంట్లోనూ కొత్తదనం కనిపించాలంటూ మార్కెట్‌ అంతా జల్లెడ పట్టేస్తోంది. ఎక్కడ ఏమాత్రం వైవిధ్యం ఉన్నా తమ వేడుకలో భాగం చేసుకుంటోంది. అలాంటివారిని అలరిస్తూ పెళ్లి సందడిని మరింత మెరిపిస్తున్న సరికొత్త పెళ్లి ట్రెండ్స్‌ ఇవి!


పట్టు అంచుకు ఎంబ్రాయిడరీ బార్డర్‌!

పట్టుచీరకట్టి బంగారు నగలు పెట్టి మండపంలో అడుగుపెట్టే వధువు మీదనే అతిథులందరి కళ్లూ ఉంటాయి. అందుకే తలమీద అలంకరించిన పాపిట బిళ్ల దగ్గర్నుంచి కాలికి చుట్టిన పట్టీల వరకూ అన్నింటిపైనా ఎంతో శ్రద్ధ చూపిస్తూ ముస్తాబవుతుంది పెళ్లికూతురు.
అది తెలిసే డిజైనర్లు కూడా అన్నింట్లోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లను సృష్టిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈమధ్య పుట్టుకొచ్చింది పట్టుచీర అంచుకు జతగా ఎంబ్రాయిడరీ బార్డర్‌. పట్టుచీరల్లో బోలెడు రకాలు వచ్చాయి, బ్లౌజుల్లోనూ ఎన్నెన్నో వెరైటీలు అలరించాయి. కానీ అంతకు మించి ఇంకేదో కొత్తదనాన్ని తీసుకొచ్చేయాలనుకున్న ఫ్యాషన్‌ నిపుణులు... ఈసారి పట్టుచీరలకూ అంచులు కుట్టేస్తున్నారు. బ్లౌజు డిజైన్‌ అందాన్ని చీరపైనా చేర్చేసి నయా లుక్కును తెప్పిస్తున్నారు. వేసుకున్న బంగారూ రత్నాల ఆభరణాలతో పాటూ చూడగానే మెరిసేలా ఉంటాయీ ఎంబ్రాయిడరీ అంచులన్నీ. పట్టుచీర రంగుకు తగ్గట్టు చక్కని బార్డర్‌ను వేసుకున్నారంటే ప్రత్యేకంగా కనిపించడమే కాదు, ‘వారెవ్వా, అంచుపైన అంచు భలే ఉందే’ అంటూ ప్రశంసలూ అందుకుంటారు!


పూల సప్తపది!

మాంగల్యధారణ తర్వాత పెళ్లిలో కనిపించే ముఖ్యమైన ఘట్టం సప్తపది. అన్నవృద్ధికి తొలి అడుగు, రెండో అడుగు బలవృద్ధికి... ఇలా ధనవృద్ధికీ, సుఖవృద్ధికీ, ప్రజాపాలనకీ, దాంపత్య జీవితానికీ, సంతాన సమృద్ధికీ అంటూ ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం చెబుతూ భార్యాభర్తల్ని ఏడడుగులు వేయిస్తారు. నవదంపతులు స్నేహంగా ఉంటూ, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే ఈ సప్తపదిలోని అంతరార్థం. అయితే ఆ ఏడడుగులూ ఇప్పుడు పూల సప్తపదిగా మారిపోయాయి. పువ్వులతో సప్తపది వేసి వధూవరుల్ని దానిమీద సరదాగా నడిపిస్తున్నారు. పెళ్లి పద్ధతులు... అందమైన ఫొటో సంప్రదాయాలుగా మారిపోవడంతో పుట్టుకొచ్చిందే ఈ పూల సప్తపది కూడా!


రత్నాల తలంబ్రాలు!

వధువును ధాన్యలక్ష్మిగా భావిస్తూ జరిపే కార్యక్రమమే తలంబ్రాల సంప్రదాయం. సంపద సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ వధూవరులిరువురూ ఒకరిపైన ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. ఒకప్పుడు\ పసుపు రాసిన బియ్యమే తలంబ్రాలు. తర్వాత రంగుల థర్మాకోల్‌ బంతులూ తలంబ్రాల్లో భాగమయ్యాయి. తరాలు మారుతున్నకొద్దీ ఆ అక్షింతల్లోనే చమ్కీలూ, ముత్యాలూ చేరాయి. పోటీపడుతూ పెళ్లికూతురూ పెళ్లికొడుకే కాదు, వేదికమీదున్న బంధువులూ సరదాపడే ఈ తలంబ్రాల తంతును మరింత ఆకట్టుకునేలా చేయడానికి ఇప్పుడు నవరత్నాలే తలంబ్రాల్లా వచ్చాయి. ‘నవరత్నాలంటే ఎంతో విలువైనవి కదా’ అనుకుంటున్నారేమో... ఇవి నిజమైన రత్నాల్ని పోలిన రాళ్లు అంతే. కెంపులూ, పచ్చలూ, నీలాలూ, ముత్యాలూ... ఇలా అచ్చం నవరత్నాల్లా అనిపించే మెరుపుల రంగుల రాళ్లన్నమాట. ఈ రత్నాల తలంబ్రాలతో వధువును చూసినవారెవరికైనా ‘పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు’ అన్న పాట మదిలో మెదలకుండా ఉంటుందా!


అందమైన సన్నికల్లు!

‘మనసు మనసు కలపటమే మంత్రం పరమార్థం’ అంటూ ఇతర తంతులతోపాటు వధూవరులతో సన్నికల్లు మీద కాలు తొక్కిస్తుంటారు. రుబ్బురోలూ, పొత్రంలా ఒకరికొకరై కలిసి ఉండాలని దీని సంకేతం. పెద్దగా ఉండే రుబ్బురోలుని తీసుకురావడం కష్టం కాబట్టి దాని స్థానంలో సన్నికల్లు రాయి వచ్చింది. ఒకటా రెండా, పెళ్లికి వాడే వస్తువులెన్నో వేదికపైన మెరుస్తూ ఉంటే... పెళ్లిలో ముఖ్యమైన ఘట్టంగా చెప్పే ఈ సన్నికల్లు మాత్రం సాదాగా ఉంటే ఏం బాగుంటుంది. అందుకే అన్నింటితో పాటూ ఇప్పుడు సన్నికల్లునూ చక్కగా అలంకరిస్తున్నారు. రంగులూ మెరుపుల రాళ్లూ వాడుతూ అందంగా ముస్తాబు చేస్తున్నారు.


పెళ్లి జ్ఞాపకాల ఫ్రేములివి!

పెళ్లంటేనే ఓ మధుర జ్ఞాపకం. అందుకే ఆ వేడుక తాలూకు తీపి గుర్తుల్ని పదికాలాలపాటు దాచుకోవడానికి ఫొటోలూ వీడియోలూ తీసుకుంటాం. అదంతా పాత ముచ్చట. అయితే ఇప్పటి కొత్త సంగతేంటో తెలుసా... పెళ్లి ఘట్టాల్ని చూపించే ఫొటోలతో పాటు పెళ్లితంతుల్లో వధూవరులు మార్చుకున్న వరమాలల్నీ, మూడుముళ్లతో పెళ్లికూతురు మెడలోకి చేరిన మంగళసూత్రాన్నీ భద్రంగా దాచి అందమైన ఫ్రేముల్లా మలుస్తున్నారు. నిజానికి పెళ్లి వేడుకలో పూలదండలకూ, పసుపు తాడుకూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ వివాహం జరిగాక వాడిపోయిన ఆ పూలదండల్నీ, బంగారు గొలుసు వేసుకుని పసుపుతాడునీ పక్కనపెట్టేస్తాం. ఇద్దరినీ ఒకటిగా చేస్తూ పవిత్రబంధానికి కారణమైన ఆ వస్తువుల్ని అలా ఉంచేస్తే ఎలా అనుకున్నారేమో- ఇప్పుడు వాటినే అందమైన కానుకల్లా తీర్చిదిద్దుతున్నారు. వరమాలల్లోని పూల రేకుల్నీ, పసుపుతాడునీ రెజిన్‌ సాయంతో గడియారాలూ ఫొటో ఫ్రేముల్లా తయారుచేస్తున్నారు. అంతేకాదు... పెళ్లి సన్నివేశాల బొమ్మల్నీ దంపతుల ఫొటోల్నీ కలిపి కల్యాణమండపం మొత్తాన్నీ త్రీడీ రూపంలో చూపిస్తున్నారు. ఇంట్లో గోడకు ఉంచే
ఈ ఫ్రేములు- కళ్లముందు కనిపిస్తూ నిత్యం పెళ్లి వేడుకను గుర్తుకు చేస్తూనే ఉంటాయి మరి!


పెళ్లి టాటూలండోయ్‌!

కాబోయే జంట ఫొటోలు... పెళ్లి పత్రికల మీదనో, పెళ్లివారి వాహనాలపైనో, పెళ్లివేడుకలో ఆహ్వానం పలికే బోర్డులమీదో కనిపిస్తాయంతే. కానీ ఇప్పుడు పెళ్లికొచ్చిన అతిథుల చేతులపైనా చూడొచ్చు. అవునండీ... పెళ్లంటే అందమైన అలంకరణలూ కమ్మని విందుభోజనాలేనా.... ఆటపాటలూ, సరదాలూ ఉంటేనే మజా అంతా అనే ఈతరం- కపుల్‌ టాటూ ట్రెండ్‌ను ఫాలో అయిపోతోంది. పెళ్లికూతురూ, పెళ్లికొడుకూ ఫొటోలతో సరదాగా వచ్చిన బంధువులూ, స్నేహితులూ టాటూ వేయించుకుంటున్నారు. ఒకటిరెండు రోజులు నిలిచి ఉండే ఈ టెంపరరీ టాటూ స్టిక్కర్లు రకరకాల ఆన్‌లైన్‌ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. కావాలనుకున్నవాళ్లు పెళ్లి పత్రికల్లానే వీటినీ ఫొటోలూ, వివరాలూ ఇచ్చి ప్రత్యేకంగా చేయించుకోవచ్చు.


వేడుకకో కానుక!

ఒకప్పుడు ఏదో ఒక వస్తువును రిటర్న్‌ గిఫ్ట్‌గా ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు పెళ్లి అలంకరణ కోసమే కాదు, ఇచ్చిన కానుక గురించీ అతిథులు మాట్లాడుకోవాల్సిందే అనుకుంటున్నారు. అందుకే వచ్చినవారికి అందించే రిటర్న్‌ గిఫ్టుల్లోనూ తమ అభిరుచిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక్క పెళ్లి వేడుకకే కాకుండా పెళ్లికూతుర్ని చేసే ఫంక్షన్‌ మొదలు హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకల వరకూ అన్నింటికీ వేరు వేరు బహుమతులు ఇస్తున్నారు. మెహందీ కోన్లూ, గాజులూ, చెవిపోగులూ లాంటి జ్యువెలరీ, పెళ్లివేడుక కనిపించేలా చాక్లెట్లూ, స్వీట్లూ... ఇలా ఒక్కో వేడుకకు ఒక్కో రకమైన వాటిని రిటర్న్‌ గిఫ్టుగా ఇస్తున్నారు. పైగా ఇచ్చే ఆ చిన్న వస్తువుల్నే అందమైన ప్యాకుల్లా అందిస్తున్నారు. ఫంక్షన్‌తో పాటూ ప్రతిదాంట్లోనూ కల్యాణ శోభను తెచ్చేస్తున్నారన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..