చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా!

ఎండాకాలం వచ్చిందంటే మొదటగా మనకు గుర్తొచ్చేవి... కమ్మకమ్మని మామిడి పండ్లూ, చల్లచల్లని పుచ్చకాయలూ. కానీ వాటి వెంటే వేసవిలో తీయని రుచితో పాటూ ఆరోగ్యాన్నీ ఇచ్చే మరో పండే- కర్బూజా.

Updated : 10 Mar 2024 00:16 IST

ఎండాకాలం వచ్చిందంటే మొదటగా మనకు గుర్తొచ్చేవి... కమ్మకమ్మని మామిడి పండ్లూ, చల్లచల్లని పుచ్చకాయలూ. కానీ వాటి వెంటే వేసవిలో తీయని రుచితో పాటూ ఆరోగ్యాన్నీ ఇచ్చే మరో పండే- కర్బూజా. లేత పీచ్‌ రంగులో తియ్యని వాసనతో ఆకట్టుకునే ఈ పండు సంగతులూ, దానిలో ఉన్న ఔషధగుణాలూ తెలిస్తే... వద్దని పక్కన పెట్టేసిన వాళ్లూ... ఒక్కసారైనా రుచి చూస్తారు మరి!

కరికి ఎర్రని నిగారింపుతో మెరిసే ఆపిల్‌ రుచి నచ్చితే, మరొకరు మన ఇంటి పండులా అనిపించే బొప్పాయి తీపిని ఇష్టపడతారు, ఇంకొకరు చూస్తేనే తినాలనిపించే నారింజ పులుపును ఆస్వాదిస్తుంటారు. ప్రతి పండూ ప్రత్యేకమైందే, దేని రుచి దానిదే అయినా తమ తమ అభిరుచుల్ని బట్టి ఇలా ఒక్కొక్కరు ఒక్కో పండును ఎంచుకుంటారు. కర్బూజా పండు విషయంలోనూ సరిగ్గా ఇదే మాట వర్తిస్తుంది. దీని రంగూ రుచీ ఇష్టపడే వాళ్లు... ‘అబ్బ పండు పేరు వింటేనే తినాలనిపిస్తుంది’ అంటే... ‘ఎక్కువగా తియ్యగానో, కాస్త చప్పగానో ఉండే ఈ పండు వాసనే నచ్చదంటూ’ కనీసం చిన్న ముక్కైనా నోట్లో పెట్టుకోరు మరికొందరు. మన ఈ ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా... కచ్చితంగా కర్బూజా మాత్రం వేసవి అద్భుతమనే చెప్పాలి.

రంగు రంగుల్లో...

కర్బూజా... అనగానే బయట వలలాంటి నిర్మాణంతో ఉన్న గరుకు తోలూ, లోపల లేత నారింజ రంగు గుజ్జుతో ఉన్న పండే మన దగ్గర ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు పసుపు రంగులో దోసకాయంత సైజు ఉన్న సన్‌ మెలన్‌, ఆకుపచ్చ రంగులో ఉండే హనీ డ్యూ, చారలతో తీయగా ఉండే స్ట్రైప్డ్‌ మస్క్‌మెలన్‌లాంటి రకాలూ దొరుకుతున్నాయి. ఈ కర్బూజాల్లో వివిధ దేశాల్లో వేరు వేరు వెరైటీల్ని చూడొచ్చు. తెల్లగా ఉండే వైట్‌ హనీ డ్యూ, ఆకుపచ్చని గాలియా, పసుపు రంగులోని పర్షియన్‌, కోలగా ఉండే శాంటా క్లాజ్‌, పియర్‌ పండు ఆకారంలో ఉండే క్రెన్షాలాంటివి చాలానే ఉన్నాయి. ఇవేకాదు, చక్కెర శాతాన్ని తగ్గించి సిట్రస్‌ని పెంచిన హైబ్రిడ్‌ నిమ్మరుచి లెమన్‌ డ్రాప్‌, చాలా తీయగా ఉండే హైబ్రిడ్‌ గ్రీన్‌ ఫ్లెష్‌ మస్క్‌ మెలన్లలాంటివీ వచ్చాయి. జ్యూసు తీసుకోవడంతో పాటు, ఫ్రూట్‌ సలాడ్లలోనూ వేసుకునే ఈ పండ్లలో కొన్నింటిని ఏడాదంతా పండిస్తున్నారు. మన దేశంలో కర్బూజా సాగుకు మంచి పేరున్న ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లతో పాటూ తెలుగు రాష్ట్రాల్లోని రైతులూ చాలామంది కర్బూజాలోని వెరైటీ రకాల్ని పండిస్తూ ఈమధ్య చక్కని ఫలితాలు పొందుతున్నారు. పంట దిగుబడికి సరైన పద్ధతులు పాటిస్తూ వేల రూపాయల పెట్టుబడితో లక్షల రూపాయలూ సంపాదిస్తున్నారు.

ఎక్కడిదీ పండు...

ప్రస్తుతం అత్యధికంగా కర్బూజా పంటను పండిస్తున్న దేశాల్లో వరసగా చైనా, టర్కీ లాంటివి ఉన్నా... ఈ పండు మాత్రం ఇరాన్‌కి చెందినదని చెబుతారు. భారత్‌లోని కశ్మీర్‌లోనూ, అఫ్గనిస్థాన్‌లోనూ ఎప్పటి నుంచో కర్బూజాని సాగు చేసేవారట. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో గ్రీసు దేశంలో కర్బూజాని ఎక్కువగా పండించేవారట. కర్బూజాలోని ఔషధ గుణాల్ని తెలుసుకున్న గ్రీకులూ, రోమన్లూ ఈ పండును ఆహారంలో భాగం చేసుకున్నారట. మంచి చేస్తుందంటే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా...  అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండు ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. కర్బూజా శాస్త్రీయ నామం కుకుమిస్‌ మెలో. రూపునీ, రుచినీ బట్టి కర్బూజాకి మస్క్‌ మెలన్‌ అనే పేరొచ్చింది. పర్షియన్‌ భాషలో మస్క్‌ అంటే సువాసన అనీ, ఫ్రెంచ్‌ పదం మెలన్‌ అంటే యాపిల్‌ లాంటి ఆకారం అనీ అర్థమట. అలా ఈ రెండు పదాల్ని కలిపి మస్క్‌ మెలన్‌ అన్న పేరు పెట్టారన్నమాట.

ఎన్ని పోషకాలో...

  • కర్బూజా ఎక్కువశాతం నీటితో ఉండటం వల్ల ఈ పండును తింటే దాహం తీరడమే కాకుండా, ఇందులోని ఎలక్ట్రోలైట్ల వల్ల అలసట తగ్గి తక్షణ శక్తి వస్తుంది. దీంట్లోని అధిక నీరు- జీర్ణాశయాన్ని తేమగా ఉంచుతూ టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.
  • ఈ పండులో విటమిన్‌-ఎ, విటమిన్‌- సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా తెల్లరక్తకణాల వృద్ధికి తోడ్పడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లను దరిచేరనివ్వదు. విటమిన్‌ ఎ కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుందట. ఈ పండు ఎక్కువగా తినేవారిలో కంటి శుక్లాలు వచ్చే అవకాశం చాలా తక్కువ.
  • దీంట్లో సమృద్ధిగా ఉండే కెరోటినాయిడ్లూ, కుకుర్బి టాసిన్లూ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రకరకాల క్యాన్సర్లనీ, నరాల వ్యాధుల్నీ తగ్గిస్తాయట.
  • తక్కువ క్యాలరీలూ, ఎక్కువ పీచూ ఉంటాయి కాబట్టి... ఇది బరువు తగ్గడానికి ఎంతో సాయపడుతుంది.
  • ఈ పండులోని ప్రోటీన్లూ, కొల్లాజెన్‌ పదార్థాలూ- కణాల పునర్నిర్మాణానికి సాయపడతాయి. దాంతో చర్మం త్వరగా వడలిపోకుండా నిగనిగలాడుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టుకీ దీంట్లోని విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయట.
  • కర్బూజాలోని ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు మేలు చేస్తుంది. ఇంకా దీంట్లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించే శక్తీ ఈ పండుకి ఉందట.
  • దీంట్లోని కొన్ని పదార్థాలు- కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. ఒత్తిడిని తగ్గించి నిద్రపోయేలా చేస్తాయి, ఇంకా మధుమేహాన్నీ నియంత్రిస్తాయి.
  • రోజూ ఈ పండ్ల రసాన్ని తాగితే ఎగ్జిమా లాంటి చర్మసంబంధ వ్యాధులు త్వరగా నయమవుతాయట. అజీర్తి, పోషకాల లేమి, తరచూ నీరసంతో బాధపడే వాళ్లకు ఈ పండు మంచి ఆహారం.

ఎండల్లో చల్లదనాన్నే కాదు, మరెన్నో రకాలుగా ఉపయోగపడే కర్బూజా పండు విరివిగా దొరికే సమయం ఇదే. మరెందుకాలస్యం... ఈ వేసవి అంతా కర్బూజాని నోరారా తింటూ కడుపు చల్లగా ఉంచుకుందామా!

కర్బూజా కోసం ఓ రోజు!

తుర్క్‌మెనిస్థాన్‌ దేశంలో ఏటా ఆగస్టు నెలలో రెండో ఆదివారం ‘మెలన్‌ డే’ని జరుపుతారు. కర్బూజా గొప్పతనాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి 1994లో ఈ రోజును కేటాయించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఒకటిగా చేర్చిన ఈరోజున రకరకాల సంగీతనృత్య కార్యక్రమాలూ,  రకరకాల మెలన్‌ పండ్ల ప్రదర్శనలూ జరుగుతాయి.

ఉత్పత్తులు...

పండును పండుగానే తింటే తృప్తి తీరక- మిగతా పండ్లలాగే ఈ కర్బూజా పండుతోనూ ఎన్నో ఆహారపదార్థాల్ని తయారుచేస్తున్నారు. ఒమేగా-త్రీ అత్యధికంగా ఉండే ఈ పండులోని గింజల్ని నేరుగానూ ఇతర పదార్థాలతోనూ కలిపి తింటున్నారు. పండ్లరసాలూ, సలాడ్లూ, స్మూతీలూ, ఐస్‌క్రీముల్లోనూ ఈ పండ్ల ముక్కల్ని వాడుతున్నారు. కర్బూజాతోనే తయారు చేసిన ఐస్‌క్రీమ్సూ ఉన్నాయండోయ్‌. ఎలాంటి ఆహారంలోనైనా కలిపి వాడుకునేలా మస్క్‌మెలన్‌ పొడులూ వచ్చాయి. ఇంకా, నచ్చినప్పుడు తినేలా ఎండు కర్బూజా ముక్కలూ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, చర్మానికీ, జుత్తుకీ వాడే సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఈ కర్బూజాని చేర్చుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..